సంపాదకీయం

విదేశంలో విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ క్రీడలకు తెరపడింది. భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ విజయ కేతనాన్ని ఎగురవేయగలని భారత క్రీడాబృందం నిరూపించింది. పతకాల పట్టికలో మూడో స్థానానికే ఇంతగా మురిసిపోవాలా? అదే అత్యుత్తమమని కేరింతలు కొట్టాలా? ఏదో ఘన కార్యాన్ని సాధించామని భుజాలు చరచుకోవాలా? నిజమే.. 2010 ఢిల్లీ కామనె్వల్త్‌లో ఇంతకంటే మెరుగ్గా, రెండో స్థానంలో నిలిచాం. అప్పుడు ఏకంగా 101 పతకాలు వచ్చాయి. 2002లో 69 పతకాలు లభిస్తే, ఈసారి మన దేశం గెల్చుకున్నవి 66 పతకాలే. ఈ గణాంకాల గవాక్షం నుంచి చూస్తే, తాజాగా గోల్డ్‌కోస్ట్ కామనె్వల్త్‌లో భారత బృందం అద్భుతాలను ఆవిష్కరించలేదు. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచలేదు. కానీ, స్వదేశంలో రెండో స్థానాన్ని ఆక్రమించడం కంటే, విదేశంలో మూడో స్థానమే గొప్ప. పతకాల పరంగా మూడో ఉత్తమ ప్రదర్శన అయినప్పటికీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తర్వాత మనమే గొప్ప అని నిరూపించుకోవడం సామాన్యమేమీ కాదు. టీనేజర్లు అనీష్ బన్వాల్, మానికా బాత్రా స్వర్ణ పతకాలు షూటింగ్‌లో అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ వారసులు వచ్చారనడానికి నిదర్శనాలు. ఉత్ప్రేరకాలను వాడకుండా, డోప్ దోషులుగా తలదించుకోకుండా వెయిట్ లిఫ్టర్లు పతకాలను కొల్లగొట్టడం అద్భుతమే. రెజ్లింగ్, బాక్సింగ్‌లోనూ భారత్ అద్వితీయ ప్రతిభ కనబరచడం శుభసూచకం. 2020 ఒలింపిక్స్‌లో పతకాల వేట కొనసాగుతుందనే భరోసా వచ్చింది కాబట్టే గోల్డ్‌కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌కు ఇంత ప్రాధాన్యం లభించింది. ఇది ముమ్మాటికీ భారత క్రీడా రంగంలో ఒక మైలురాయే.
ఆనందంతో పొంగిపోయే సమయంలోనే, కళ్లముందు కనిపిస్తున్న లోపాలను సరిదిద్దుకొని, భవిష్యత్తుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పతకాల్లో మూడో స్థానం దక్కినా, అథ్లెటిక్స్ విభాగంలో ఎదురైన వైఫల్యం ఈ దిశగా ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ పేలవమైన ప్రదర్శన కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. ‘్ఫ్లయింగ్ శిఖ్’ మిల్కా సింగ్, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ పీటీ ఉష, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఏకైక పతకాన్ని కాంస్యం రూపంలో సాధించిన లాంగ్ జంపర్ అంజూ బి జార్జి వంటి కొంతమంది పేర్లను మాత్రమే పదేపదే తలచుకుంటూ, ప్రస్తుత పరిస్థితిని చూసి బాధపడడం అభిమానుల వంతైంది. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న చందంగా, అంతర్జాతీయ రంగంలో భారత అథ్లెట్లు ఘోర వైఫల్యాలను ఎదుర్కోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకుల జోక్యం నుంచి క్రికెట్‌కు తప్ప మరో క్రీడను పట్టించుకోని అభిమానుల వరకూ ప్రతి ఒక్కరూ అథ్లెటిక్స్‌లో వైఫల్యాలకు బాధ్యత వహించాల్సిందే. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం, మహిళల డిస్కస్ త్రోలో సీమా ఆంటిల్ రజతం, నవ్‌నీత్ ధిల్లాన్ కాంస్యం మాత్రమే అథ్లెటిక్స్‌లో భారత్‌కు దక్కిన పతకాలు. నిజంగా ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా భారత అథ్లెట్లు నీరుగారిపోయారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేక నీరసపడ్డారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వైఫల్యాలను పునరావృతం చేస్తూ, కామనె్వల్త్ గేమ్స్‌లోనూ ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందం ముఖాలు వేలాడేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ వైఫల్యాలు వ్యవస్థాగత లోపాలే. రాజకీయాల జోక్యం క్రీడారంగాన్ని భ్రష్టు పట్టించింది. జాతీయ సమాఖ్యల్లో వర్గ పోరాటాలు, ఆధిపత్య కుమ్ములాటలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. దేశంలో క్రీడాకారులకు అవసరమైన వౌలిక సదుపాయాలు ఉండవు. మద్దతు లభించదు. ఆర్థిక ప్రోత్సాహాలూ అంతంత మాత్రమే. అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటూ వివిధ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది అథ్లెట్లు ఆ తర్వాతి కాలంలో ఉపాధి దొరక్క రోజు కూలీలుగా, చిరు వ్యాపారులుగా మారిన సంఘటనలు కోకొల్లలు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది కాబట్టే, అథ్లెటిక్స్‌ను వృత్తిగా స్వీకరించడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. కొంతమంది అథ్లెటిక్స్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా, ఉద్యోగం లేదా ఉపాధి లభించిన మరుక్షణం కెరీర్‌ను పక్కకు పడేస్తున్నారు. అభద్రతాభావం పెరగడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. నిజానికి అథ్లెటిక్స్‌లో రాణించడం ఆషామాషీ వ్యవహారం కాదు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. నిరంతరం సాధన చేయాలి. ఆ పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? అన్నదే ప్రశ్న. అథ్లెట్ల కెరీర్ కొద్దికాలమే ఉంటుంది. పైగా ప్రోత్సాహించే వారే ఉండరు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక అథ్లెట్ కంటే రంజీ స్థాయి క్రికెటర్ పది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడనం అతిశయోక్తి కాదు. క్రికెటర్లకే క్రేజ్ ఉంది. వద్దన్నా వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు, అండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లు వచ్చిపడతాయి. ఇక జాతీయ క్రికెట్ జట్టులో ఆడితే కోటీశ్వరుడైపోతాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక సీజన్‌లో ఆడే క్రికెటర్ ఆదాయం ఓ అథ్లెట్ కెరీర్ మొత్తం కష్టపడినా సంపాదించే మొత్తానికి ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ కారణాలే యువతను అథ్లెటిక్స్‌కు దూరం చేస్తున్నాయి. క్రీడల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా క్రికెట్ వెంట పడుతున్నారే తప్ప ఇతర క్రీడల జోలికి వెళ్లడం లేదు. అథ్లెటిక్స్ పేరు వింటేనే భయంతో ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని క్రీడా సమాఖ్యలు బెదరగొడుతున్నాయి. క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కూడా వారికి అండగా నిలవడం లేదు. క్రీడల్లో రాజకీయాల జోక్యమే ఇందుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. కొన ఊపిరితో ఉన్న ఉత్సాహానికి- క్రికెట్‌కు పెద్దపీట వేస్తున్న అభిమానులు నిలువుపాతర వేస్తున్నారు. ముప్పేట దాడుల నుంచి బయటపడలేక అల్లాడుతున్న అథ్లెటిక్స్ విభాగంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సమర్థులు పుట్టుకొస్తారని అనుకోవడం అత్యాశే. గోల్డ్ కోస్ట్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ బృందం వైఫల్యాలతోనైనా భారత క్రీడా సంఘాలు, సమాఖ్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఉత్తమ అథ్లెట్లను ప్రపంచానికి అందించలేం. సరికొత్త క్రీడా భారతాన్ని నిర్మించలేం.
అథ్లెటిక్స్‌లో వైఫల్యాలు, దేశంలోని జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో నెలకొన్న పరిస్థితులు ఆశాజనకంగా లేవన్నది నిజం. అదే సమయంలో యువతరం క్రీడల్లో దూసుకురావడం భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతున్న వాస్తవం. క్రీడల్లో జయాపజయాలు సహజం. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రస్థానాన్ని కొనసాగించాలి. దక్కిన విజయాలను పదేపదే నెమరువేసుకునే కంటే, మరింత నైపుణ్యాన్ని పెంచుకునేలా కృషి జరగాలి. అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారులను గుర్తింపు, శిక్షణనిప్పించి, ప్రోత్సహించి, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి. ఈ దిశగా అడుగులు వేస్తేనే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలను ఆశించగలుగుతాం, సాధించగలుగుతాం.