ఆటాపోటీ

‘నంబర్ వన్’ సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానియా మీర్జా టెన్నిస్‌లో ‘నంబర్ వన్’గా ఎదిగిన సంవత్సరమిది. మన దేశం తరఫున మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అంతేగాక, మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. ఈ ఏడాది మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్, పురుషుల విభాగంలో నొవాక్ జొకోవిచ్ ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డులను అందుకోగా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్, సానియా నంబర్ వన్ జోడీ అవార్డును సొంతం చేసుకున్నారు. భారత టెన్నిస్ మొత్తం సానియా చుట్టూనే తిరిగింది. హింగిస్‌తో భాగస్వామ్యం ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఇండియన్ వెల్స్ టోర్నీతో మొదలుపెడితే, ఈ సీజన్ చివరిలో కార్ల్‌స్టన్ వరకూ దాదాపు అన్ని టోర్నీల్లోనూ సానియా, హింగిస్ జోడీ విజయపథంలో నడిచారు. అత్యంత ప్రతిష్ఠాత్మక వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సహా ఈ జోడీ తొమ్మిది టైటిళ్లను గెల్చుకుంది. ఏడాది చివరిలో జరిగిన డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నీలోనూ వీరు టైటిల్‌ను అందుకోవడం విశేషం. వీరు ఈ సంవత్సరం 16 ఈవెంట్స్‌లో పోటీపడ్డారు. 62 మ్యాచ్‌లు ఆడారు. 55 విజయాలు సాధించారు. కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే వీరికి పరాజయం ఎదురైంది. కాగా, మొత్తం మీద ఈ సీజన్‌లో సానియా 10 టైటిళ్లను అందుకుంది. తొమ్మిది హింగిస్‌తోకాగా, ఒక టైటిల్‌ను బెథానీ మాటెక్ సాండ్స్‌తో కలిసి కైవసం చేసుకుంది.
సింగిల్స్‌లో రాణించలేక, డబుల్స్‌లో హింగిస్ వంటి ఒకప్పటి ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సహకారంతోనే సానియా టైటిళ్లను సాధిస్తున్నదని, నంబర్ వన్ స్థానం కూడా ఆమె వల్లే దక్కిందని విమర్శలు లేకపోలేదు. అయితే, టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్ నంబర్ వన్ స్థానంలోకి భారతీయులు రావడానికి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టిందనే విషయాన్ని గుర్తుచేసుకోవాలి. లియాండర్ పేస్, మహేష్ భూపతి జోడీ పురుషుల డబుల్స్‌లో ఒకటిన్నర దశాబ్దం క్రితం నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు. ఆతర్వాత ఒక భారత టెన్నిస్ స్టార్‌కు నంబర్ వన్ స్థానం దక్కడం ఇదే మొదటిసారి. వింబుల్డన్‌కు ముందు వరకూ తన ఖాతాలో ఒకే ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీని ఆమె మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అందుకుంది. వింబుల్డన్‌లో మహిళల డబుల్స్‌లో విజయభేరి మోగించింది. యుఎస్ ఓపెన్‌లో గెలిచి, ముచ్చటగా మూడో గ్రాండ్ శ్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది గొప్పగా రాణించడంతో వచ్చే ఏడాది సానియా ముందు సవాళ్లు ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. పలు టోర్నీల్లో ఆమె డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. కాబట్టి, టైటిల్ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒత్తిడికి గురికాక తప్పదు. హైదరాబాద్‌లో అకాడెమీని నెలకొల్పిన సానియా దృష్టి ఆట నుంచి వ్యాపారంవైపు మళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు.
యుకీ ఒక్కడే..
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు సరైన ప్రాతినిథ్యం లేకుండా పోయింది. సింగిల్స్ వైపు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు. దీనితో అంతర్జాతీయ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో యుకీ భంబ్రీ ఒక్కడే ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సాకేత్ మైనేనీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.