సంజీవని

అకారణంగా వచ్చే నడుం నొప్పి ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ లేదంటున్నారు. నడుము నొప్పి మాత్రం వదలటంలేదు. ఏం చేయాలో సలహా చెప్పండి.
-కె.ప్రసాదరావు, జగిత్యాల
జ: మానవాళికి సంబంధించి అత్యంత ప్రాచీనమైన ఐదు బాధల్లో నడుం నొప్పి ఒకటి. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి జీవితంలో నడుమునొప్పి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. అందులో ఐదుగురికి తప్పనిసరిగా ప్రతి ఏడాదీ తిరగబెడుతూనే వుంటుంది.
నడుంనొప్పిని వైద్యపరంగా లుంబాగో అని పిలుస్తారు. వచ్చిన నొప్పి ఒక నెలలోపు తగ్గితే అది ముంచుకొచ్చిన (అక్యూట్) నొప్పి అని, వచ్చిన నడుం నొప్పి మూడు నెలలపాటు తగ్గపోతే అది దీర్ఘవ్యాధిగా మారిందనీ అర్థం. ఇందుకు నడుం లోపల కండరాలు, నరాలు ఎముకల్లో తేడాలు ఏర్పడటం ఒక కారణం అయి ఉండవచ్చు. మామూలుగా మొదలయ్యే నడుం నొప్పిని అశ్రద్ధ చేసి దీర్ఘవ్యాధిగా మార్చుకొనేది మనమే. మన ఆహార విహారాలు కూడా అందుకు దోహదపడుతుంటాయి.
ఎముకల్లో ఎముక పదార్థం తగ్గి ఒక్కోసారి ఎముకలు గోగుపుల్లల్లా తయారౌతాయి. నడుముమీద ఒత్తిడి వలన చిట్లి నొప్పి కలుగుతూ ఉండవచ్చు. ఎక్కువమందికి నడుంనొప్పి కేవలం వెన్నుపూసల లోపల ఏర్పడే తేడాలవలనే కలుగుతున్నప్పటికీ, నడుము లోపల ఏ కారణమూ ఏ తేడాలూ లేకుండానే నొప్పి ఏర్పడుతోంది. అందుకు వారి ఆహారం, వారి విహారాలు, వారి ఆలోచనా సరళి కూడా కారణం అవుతున్నాయి. ఉద్యోగ ఒత్తిడులు, ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం- ఇవన్నీ నడుం నొప్పికి తగిన కారణాలే!
అవసరానికి మించి రిఫ్రిజిరేటర్లలో ఆహార పదార్థాలను నిలవుంచుకొని తినటం, వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు, అర్థరాత్రిదాకా టీవీలు చూస్తూ జాగరణ చేయటం, ఆందోళనలు, దిగుళ్లు, వత్తిళ్లు, చింతా శోక భయ దుఃఖాదులన్నీ నడుంనొప్పిని అకారణంగానే తెస్తాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలినీ, మానసిక ప్రశాంతతనీ అలవరచుకోండి. వేళకు భోజనం, వేళకు నిద్ర, ప్రాతఃకాలంలోనే లేవటం, తగినంత వ్యాయామం- ఇలాంటి అలవాట్లు నడుంనొప్పిని అదుపులో ఉంచుతాయి.
కాల విరేచనం అయ్యేలా చూసుకోండి. అందుకోసం విరేచనాల బిళ్ళలు వాడాలని చూడకండి. అందుకని ఆహారంలోనే మార్పులు చేసుకొని విరేచనం ఫ్రీగా అయ్యేలా చూసుకోండి.
మీరు స్థూలకాయులైతే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. బరువు తగ్గాలన్నా ఆహారంలో మార్పు అవసరం. బరువు తగ్గించే ఆహారం, అజీర్తిని తగ్గించే ఆహారం, కీళ్ళవాతాన్ని తగ్గించే ఆహారం, గ్యాసుని తగ్గించే ఆహారం, నడుమునొప్పిని తగ్గించే ఆహారం ఇవన్నీ ఒక్కటే! ఒక్కదానికి జాగ్రత్త తీసుకొంటే అన్ని వ్యాధి లక్షణాలకూ ఉపయోగపడతాయి. పలుపు రుచి ఎక్కువగా ఉన్న పదార్థాలు, నూనె పదార్థాలు, శనగపిండి లాంటి కఠినంగా అరిగే పదార్థాలు- ఇవి గ్యాసునీ, మలబద్ధతనీ, స్థూలకాయాలనే కాదు, నడుమునొప్పిని కూడా పెంచుతాయన్నమాట! బెల్లం, శెనగపిండితో వండిన తీపి పదార్థాలు, పాలు, ఫ్రిజ్జులో పెరుగు నడుము నొప్పిని పెంచుతాయి.
అలచందలు, బఠాణీలు, శెనగలు, బొబ్బర్లు, అధిక ప్రొటీన్లు కలిగిన పప్పు్ధన్యాలన్నీ వాతపు నొప్పుల్ని, నడుము నొప్పినీ పెంచేవిగానే వుంటాయి. చన్నీళ్ళ స్నానం, చల్లగాలులలో తిరగటం నడుమునొప్పి ఉన్నవారికి చెడుని కలిగిస్తాయి.
బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, బెండ, దొండ, వంకాయ, ఇవన్నీ లేతవిగా ఉంటే ఎలాంటి అపకారమూ చెయ్యవు. ముదిరిన వంకాయ నడుమునొప్పిని పెంచుతుంది. కూరగాయల రసాన్ని తీసి అందులో చింతపండు వేయకుండా చారు కాచుకొని రోజూ తాగుతూ ఉంటే నడుము నొప్పి దరికిరాదు.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నడుము లోపల వెన్నుపూసల్లో తేడాలు స్థిరంగా ఉన్నప్పటికీ, నొప్పిలో పెరుగుదల తగ్గుదలలు ఏర్పడుతున్నాయంటే నొప్పిని పెంచేవీ లేదా తగ్గించేవీ ఇతర అంశాలు అనేకం ఉన్నాయని అర్థం. వాటిని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. నడుము నొప్పితో బాధపడేవారు మానవలసినవీ, లేదా మార్పు చేసుకోవాల్సినవీ ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్లనే! నడుము నొప్పికి చేసే చికిత్సలో మూడొంతుల చికిత్స ఈ జాగ్రత్తలు తీసుకోవటమే. వీటిని అశ్రద్ధ చేసి కేవలం మందులమీద ఆధారపడితే ఒక వంతు చికిత్స మాత్రమే తీసుకున్నట్టు లెక్క.
బార్లీ, సగ్గుబియ్యం, సబ్జాగింజల్లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. రాగులు, సజ్జలూ ఎక్కువ ఉపయోగపడతాయి. ముఖ్యంగా నలభై వయసు దాటిన వారందరూ విధిగా రాగులు సజ్జలూ తినితీరాలని నియమం పెట్టుకోవాలి. బూడిదగుమ్మడి, సొరకాయ, బీరకాయ లాంటి చలవనిచ్చే కూరగాయల తురుములో పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగుపచ్చడి మంచిది. రాగి, జొన్న, సజ్జ వీటిని మొలకెత్తించి వేటికదే మరపట్టించుకోండి. కొంచెం గోధుమ పిండిలో రాగి లేదా జొన్న లేదా సజ్జ పిండి కలిపి పుల్కాలు చేసుకొని ఈ పెరుగు పచ్చడితో నంజుకొని తినండి.
ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా లాంటి టిఫిన్లన్నీ నడుము నొప్పి పెరిగేందుకే తోడ్పడతాయి. వాటిని వదిలేస్తేనే నొప్పి తగ్గుతుంది. టిఫిన్లు మనకు తెలీకుండానే చాలా అపకారం చేస్తున్నాయి. ప్రొద్దున్న పూట పెరుగన్నం మన వాతావరణానికి చక్కగా సరిపోయే ఆహారం. తెలుగువారిది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయం పూట పెరుగన్నం లేదా చల్లన్నం తినేవారికి ఎలాంటి అనారోగ్యాలూ కలగకుండా ఉంటాయి. చద్దన్నం అంటే నిన్నటి పాచిపోయిన అన్నం అనేది అపోహ. చలిదన్నం (చద్దన్నం) అంటే చల్లన్నం లేదా పెరుగన్నం అని అర్థం. వేడన్నంలో కూడా మజ్జిగ లేదా పెరుగు కలుపుకు తినవచ్చు. ప్రొద్దునే్న టిఫిన్ చేయకుండా చద్దన్నం తినడానికి నామోషీ అనుకుంటున్నాం. మినప్పప్పు, శెనగపిండి, మైదా పిండి అతిగా వాడటంవలన జీర్ణశక్తి దెబ్బతిని కడుపులో వాతం పెరుగుతోంది. వాతంవలన నడుం నొప్పి, కీళ్ళనొప్పులు, మోకాళ్ళనొప్పులూ వస్తున్నాయి. ఎలర్జీ వ్యాధులక్కూడా ఈ వాతమే కారణం అవుతోంది. వాతానికి ఆహార విహారాల కారణాన్ని అశ్రద్ధ చేసి నొప్పి తగ్గేందుకు నొప్పి బిళ్ళలు వేసుకోవటం వలన ఒనగూరే ప్రయోజనం తక్కువ. అందువలన చివరికి కొత్త సమస్యలను తెచ్చిపెట్టుకోవడమే అవుతుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు