సంజీవని

ఆహారపు అలవాట్లు - జన్యు కారణాలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: మా ఇంట్లో అందరికీ తీపి అంటే ఇష్టం. ఇలా ఇష్టాలనేవి వంశపారంపర్యంగా ఉంటాయా? దానివలన నష్టం ఏమైనా ఉంటుందా?
-కె.చిరంజీవి, జగిత్యాల
జ: ఆహారపు అలవాట్లు వంశపారంపర్యంగా ఉండేందుకు అవకాశం వుందని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఒకే ఆహారపు అలవాట్లవలన కొన్ని వ్యాధి లక్షణాలు ఆ కుటుంబంలో అందరిలోనూ కనిపించవచ్చు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండటం ఒక కారణం. జన్యుపరమైన అంశాలు మన ఆహారపు అలవాట్లను ప్రేరేపిస్తున్నాయని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
కొందరికి తీపి అంటే తగని మోజు. ఎక్కువమంది అతి పులుపుని ఇష్టంగా తింటారు. కొవ్వు పదార్థాలు, వేపుడు కూరలు లేకపోతే భోజనం చేసినట్టు ఉండదు చాలామందికి. తీపి, పులుపు, కొవ్వు పదార్థాల పట్ల ఇష్టత లేని వాళ్లు కూడా కొందరున్నారు. ఈ ఇష్టాయిష్టాలే ఆహారపు అలవాట్లను ప్రేరేపిస్తాయి. సాధారణంగా కుటుంబంలో చాలామందికి ఆహార ప్రాధాన్యతలు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో ఆహార పదార్థాల పట్ల ఇష్టత లేదా అయిష్టత కలగటానికి ఒక ముఖ్య జన్యువులో ఏర్పడే మార్పులు కారణం అని కనుగొన్నారు. ఒక జీన్‌లో మార్పు మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తుందనే ఈ పరిశోధన వలన స్థూలకాయానికి మూలాలను వెదకటం తేలిక అవుతుంది.
చాలామందికి ఎక్కువ కొవ్వు, ఎక్కువ తీపి పదార్థాలను చూస్తే ఎక్కడలేని ఆకలీ కలుగుతుంది. ఇందుకు విరుద్ధంగా నూనె పదార్థాలంటే అంతగా ఇష్టం లేని వ్యక్తులకు కాగుతున్న నూనె వాసన వేస్తే చాలు ఆకలి చచ్చిపోతుంది. ఎక్కువమంది మహిళలు వంట చేసి, అందరూ భోజనాలు చేశాక ఆఖరికి తింటారు. అందాకా వాళ్ళకు ఆకలి అనిపించకపోవటానికి ఈ నూనె పదార్థాలపట్ల పెద్దగా ఇష్టత లేకపోవటం ఒక కారణం. కొవ్వు పదార్థాలంటే ఇష్టత లేని ఇలాంటి వ్యక్తులు సన్నగా, బలహీనంగా కనిపిస్తారు. భోజనం చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటారు. తరచూ ఉపవాసాలు, జాగరణలు చేస్తుంటారు. ఎంతదూరం అయినా చలాకీగా నడిచి వెళ్లిపోతుంటారు. ఇందుకు కారణం ఆ జీన్‌లో మార్పులేనని భావిస్తున్నారు.
ఆహార పదార్థం ఘుమఘుమలాడినా, దాన్ని చూసినా, తలచుకున్నా ఇష్టమైనదైతే ఆత్రంగా తినాలనిపించటానికీ, ఇష్టత లేనిదైతే తినబుద్ధి పుట్టకపోవటానికి జన్యు కారణాలున్నాయనేది ఈ పరిశోధన సారాంశం. ఇందుకోసం 20 శాతం కొవ్వు, 40 శాతం కొవ్వు, 60 శాతం కొవ్వు వుండేలా చికెన్ కుర్మాని మూడు రకాలుగా తయారుచేయించారు. సన్నగా ఉండేవారు, లావుగా ఉండేవారు, మధ్యస్థంగా ఉండేవారు ఇలా మూడు రకాల మనుషులకు ఈ మూడింటిలో కావాల్సినదాన్ని తినవలసిందిగా అందించారట. మూడు రకాల కుర్మాల్లో లావుగా ఉన్నవారిని 60 శాతం వున్న కుర్మా ఎక్కువ ఆకర్షించినట్టు ఈ పరిశోధనలో తేలింది. ఇలాగే తీపి మీద కూడా పరిశీలన చేశారు.
మనం ఎంత నిగ్రహం పాటించాలనుకున్నా ఆహారంలోని కొవ్వు, తీపి, పులుపు ఉప్పు, కారం లాంటి రుచికరాలను గుర్తించి వాటినే కోరుకునేలా మెదడు ప్రోత్సహిస్తుందని, కొన్ని నాడీ మార్గాలు (స్పెసిపిక్ బ్రైన్ పాత్‌వేస్) మన ఆహా ఇష్టతని ప్రభావితం చేస్తాయని సదాఫ్ ఫరూకీ అనే ప్రొఫెసర్‌గారి నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన నిరూపించింది.
మనం పూర్తి ఉపవాసం ఉన్నప్పుడు శరీరం తనకు కావలసిన శక్తిని తన నిలవల్లోంచి తీసుకుంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లకన్నా కొవ్వు శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందుకనే కొవ్వుని మెదడు ఎక్కువగా కోరుతుందనీ, ఆ మేరకు ఇష్టాయిష్టాలను ప్రేరేపిస్తుందనీ ఈ పరిశోధన తెలియచెప్తోంది.
మనసు ప్రేరేపణలు ఆహార ప్రాధాన్యతలను మార్చివేస్తుంటాయి. టీవీల్లో ప్రచారాలు, ఆహార పదార్థాలకు సంబంధించిన ప్రకటనల ప్రభావం మనకు తెలీకుండానే మనమీద ఉంటుంది. మామూలు పచారీ షాపునకు వెళ్లినపుడు కచ్చితంగా మన అవసరానికి మాత్రమే పరిమితంగా కొంటాం. అదే, ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి వెళ్లి అక్కడ వస్తువులు కొనేప్పుడు మన ప్రాధామ్యాలను (ప్రిఫరెన్సులు) మనసు ప్రేరేపణలు ప్రభావితం చేయటంవలన మూడు నాలుగు రెట్లు ఎక్కువ కొనుగోలు చేస్తుంటాం. బయట అనేక ఆకర్షణలు మనల్ని లాక్కుపోతుండగా, శరీరం లోపల్నించి నాడీ వ్యవస్థ కూడా మనల్ని ముందుకు తోస్తుంది. ఇలా మనం మనసుకు లొంగిపోతాం అనటానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇంట్లో మనం తిననివాటిని విందు భోజనాల్లో బాగానే తింటాం. మన నిర్ణయాలకన్నా మన మనసు ప్రేరణలు బలవత్తరమైనవి అర్థం. ఇష్టతలాగానే అయిష్టతని కూడా ఈ జన్యు మార్పులు ప్రేరేపిస్తాయి. జన్యు మార్పులే వ్యామోహాలు పెరగటానికీ, అయిష్టతలు ఏర్పడటానికి కారణం అవుతాయి. ఏ ఆహార ద్రవ్యంపైనా అ ఇష్టత, అతి ద్వేషం రెండూ మంచిది కావు. ఏది ఎప్పుడు ఎంత అవసరమో గుర్తెరిగి ఆహార ప్రణాళి రచన ఉండాలన్నమాట.
స్థూలకాయులకు కొవ్వు పదార్థాలమీద వ్యామోహం జన్యుపరమైనది. అది వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు కూడా! కాబట్టి, కేవలం ఆహార నియంత్రణ ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవటం కష్టసాధ్యం. ఈ పరిస్థితిలోంచి బయటపడటం ఎలా?
గురువారాలు, శుక్రవారాలు అంటూ దేవుడి పేరు చెప్పి ఉపవాసాలు పెట్టి కొంతైనా ఆహార జాగ్రత్తలు పాటింపచేయిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. కానీ, మనం గురువారం రాత్రి పూట ఉపవాసం కోసం అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగులు- వీటితోపాటు చట్నీలు, సాంబారులూ లేదా బట్టర్‌నానులూ, మసాలా కర్రీలు తినటంవలన రెండు నష్టాలు. మొదట నష్టం దేవుడికి అపచారం. రెండో నష్టం అన్నానికి రెట్టింపు హానికర పదార్థాలను తినటం.
స్థూలకాయులకు కొవ్వుమీద, షుగరు రోగులకు తీపిమీద, బీపీ రోగులకు ఉప్పు కారాలమీద, పేగుపూత రోగులకు పులుపుమీద తీవ్రమైన వ్యతిరేకత మనసులో కలగాలి. తమకు హాని చేసే పదార్థాలపట్ల మనసా వాచా కర్మణా శతృభావం పెరగాలి. పట్టు సడలింపచేసే ప్రేరణలను అధిగమించటానికి దృఢచిత్తం కావాలి. అది కేవలం నీతివాక్యం కాకూడదు.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు