సంజీవని

రక్తస్రావం-ఆహార జాగ్రత్తలు ( మీకు మీరే డాక్టర్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: రక్తస్రావం అవుతున్నపుడు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు?
-ప్రసాద్, జగిత్యాల
జ: రక్తస్రావం అనేది ఆకస్మికంగా ముంచుకొచ్చే వ్యాధి. కార్చిచ్చు అడవినంతా చుట్టబెట్టినట్టు శరీరం మొత్తాన్ని దెబ్బతీసే వ్యాధి ఇది. ఏ కారణం వలన రక్తస్రావం అవుతున్నా అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే, దీన్ని సీరియస్ వ్యాధుల్లో ఒకటిగా ఆయుర్వేదంలో ‘మహాగదం’ అని పిలిచారు. గదం అంటే వ్యాధి. అగ్నివత్ శీఘ్రకారి.. అని దీని గురించి చెప్పారు. ఇది అగ్నిలా మహావేగంగా వ్యాపించే వ్యాధి అని! ఒక్కోసారి అసాధ్య వ్యాధిగా కూడా పరిణమించవచ్చు. కాబట్టి అశ్రద్ధ తగదని చెప్పటమే ఇక్కడ ముఖ్యోద్దేశం.
ఆయుర్వేద పరిభాషలో దీన్ని రక్తపిత్తం అంటారు. వేడి శరీర తత్వం కలిగినవారిని, వేడిచేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తినేవారినీ రక్తస్రావం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మహిళల్లో నెలసరి సమస్యల్లోనూ, స్ర్తి పురుషుల్లో మొలలు లాంటి వ్యాధుల్లోనూ, అమీబియాసిస్ లాంటి వ్యాధుల్లోనూ రక్తస్రావాన్ని అశ్రద్ధ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తస్రావం చిన్నదైనా పెద్దదైనా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన నివారణ పొందాలి. ఇది తప్పనిసరి. ఇవికాక, పేగులోపల అల్సర్లు, లివర్ వ్యాధులు, చర్మం మొద్దుబారి స్పర్శ తెలీకుండా ఉండే వ్యాధుల్లో రక్తస్రావం ఒక పెద్ద సమస్య కావచ్చు. కారణం ఏదైనా సరే, శరీరంలో ఏ భాగం నుండి రక్తస్రావం అవుతున్నా సరే, చికిత్స విషయాన్ని వైద్యునికి వదిలేద్దాం. రక్తస్రావాన్ని గుర్తించగానే రోగి తీసుకోవలసిన జాగ్రత్తలే ముఖ్యం.
రక్తప్రసార వ్యవస్థలోంచి రక్తం దారితప్పి రక్తనాళంలోంచి బయటకు స్రవించటాన్ని హెమరేజి అంటారు. అది ఒక్కోసారి శరీరం లోపలి అవయవాల్లో అంతర్గతంగా కూడా జరగవచ్చు. రోగి రక్తహీనతతో కళ్లు తేలేసేంతవరకూ ఒక్కోసారి లోపల్లోపల రక్తస్రావం జరిగిపోతున్న సంగతి తెలుసుకోలేకపోవచ్చు.
రక్తస్రావాన్ని అరికట్టడాన్ని హీమోస్టాసిస్ అంటారు. రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నంలో ఆహార విహారాలు కూడా ముఖ్యమైనవి.
రోగి నీరసించకుండా బలాన్ని కాపాడుకోవాలి. బరువులు ఎత్తకుండా ఉండాలి. ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడేవారికి ఇది మరీ ముఖ్యమైన జాగ్రత్త. రక్తస్రావం అవుతున్నవారు ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఎక్కువ దూరం నడవటం రెండూ చేయకూడదు. రక్తస్రావం అయ్యేవారు వగరు, చేదు, తీపి పదార్థాలు మేలు చేస్తాయి. పులుపు, కారం, ఉప్పు హాని చేస్తాయి. ఈ సమయంలో కటిక ఉపవాసాలు చేయకూడదు. తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. పేగుల్లో పుళ్లు కారణంగా రక్తస్రావం అవుతున్న వారికి చిక్కని గంజి లేదా పలుచని జావలు రోజుకు నాలుగైదుసార్లు ఇస్తుంటే రక్తస్రావం నెమ్మదిస్తుంది. నూనెకన్నా నెయ్యి (నమ్మకమైనది, కల్తీలేనిది) ఎక్కువ మేలు చేస్తుంది.
మజ్జిగమీద తేరిన నీరు రక్తస్రావాన్ని బాగా అరికడుతుంది. నీళ్ళు కలిపిన తరువాత కనీసం నాలుగు గంటలు అయ్యాక పలుచని మజ్జిగ గాని, మజ్జిగమీద తేరిన నీటినిగానీ త్రాగటం మంచిది. ఏలకులు వేసి కాచిన పాలుగానీ నీరుగాని త్రాగితే రక్తస్రావంలో వేడి, దప్పిక తీరి స్రావం ఉపశమిస్తుంది.
అరటి పువ్వులోపలి కేసరాలు, అరటి కాండం లోపలి దూట, కలువ దుంప, తామర దుంప, చామదుంపల యొక్క ఆకు కాడలతో కూర వీటిని ప్రయత్నంమీద సంపాదించుకుని ఆహార పదార్థాలుగా తయారుచేసుకోవచ్చు. లేదా నీళ్లల్లో వేసి బాగా మరిగించి తీపి కలుపుకుని టీలాగా తాగవచ్చు. పాలలో కూడా ఉడికించి త్రాగవచ్చు.
అరటి పువ్వులాగానే, కొబ్బరి పువ్వుకూడా రక్తస్రావాన్ని తెచ్చిపెట్టే రక్తపిత్త దోషాన్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కొబ్బరిపూలు ఒకపట్టాన నలగవు. అందుకని పైపైన మిక్సీ పట్టి రెండు చెంచాల పొడిని గ్లాసు నీటిలో వేసి టీలాగా మరిగించి త్రాగవచ్చు. ఎర్రగా ఉంటుందీ కషాయం.
సుగంధిపాల వేళ్ళపైన బెరడు, తుంగముస్తలు, వట్టివేళ్ళు, నాగకేసరాలు ఇవి నాలుగూ మూలికలమ్మే షాపుల్లో దొరుకుతాయి. ప్రయత్నించండి. వీటిలో దొరికినవాటిని సమానంగా తీసుకుని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఏ కారణం చేత రక్తస్రావం అవుతున్నా ఈ పొడిని ఒక చెంచా మోతాదులో గ్లాసు నీళ్లలో గానీ, పాలలోగానీ వేసుకుని టీలాగా కాచుకుని తాగండి. పొడిని వడగట్టాలనే నియమం లేదు. పొడితో సహా త్రాగవచ్చు కూడా! త్వరగా రక్తస్రావం ఆగుతుంది. ముఖ్యంగా నెలసరి సమయంలో అతిగా ఋతుస్రావం అయ్యేవారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.
ఆహారంలో తోటకూర, పాలకూర, మెంతికూర, గంగపావిలి కూర, బచ్చలికూర రక్తస్రావాన్ని అణిచే గుణాన్ని కలిగివుంటాయి. నెలసరి సమయంలో వండుకునే ఓపిక లేక పచ్చళ్ళు వేసుకుని తిని ఆ మూడు రోజులు గడిపేద్దామనుకునేవారికి ఋతుస్రావం పెరుగుతుంది.
కరుబూజ లేక తరుబూజ పండు, బూడిదగుమ్మడికాయ, బాగా పండిన బొప్పాయి, నిమ్మకాయ షర్బత్తు, బత్తాయి రక్తస్రావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కోడిగుడ్డు రక్తస్రావాన్ని ఆపేందుకే సహకరిస్తుంది.
దర్భమొక్క వ్రేళ్ళు సేకరించి, కడిగి ఎండించి దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. రక్తస్రావం ఏ కారణంవలన అవుతున్నా సరే ఈ దర్భ వేళ్ళ పొడిని చెంచా మోతాదులో గ్లాసు నీళ్లలో వేసి మరిగించి త్రాగండి. రోజూ రెండుసార్లు ఇలా తాగవచ్చు.
రక్తస్రావం, గాయాలు, ప్రమాదాల వంటి కారణాలవలన వచ్చినా, శరీరంలోపల వ్యాధి కారణంగా వచ్చినా రోగి తక్షణం తీసుకునే జాగ్రత్తలు ముఖ్యమైనవి. రక్తస్రావం జరిగే అవయవాన్ని బట్టి జాగ్రత్తలు ఆధారపడి వుంటాయి.
పైన మనం చెప్పుకున్న సాధారణ జాగ్రత్తలు ఏ కారణంవలన వస్తున్న రక్తస్రావానికైనా ముఖ్యమైనవి. రక్తస్రావం ఒక వ్యాధిగా ఉన్నవారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన.. వేడిచేసే ఆహార పదార్థాలు హానిచేస్తాయి. రక్తస్రావం అవుతున్నప్పుడు చలవ చేసే ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com