సంజీవని

జలుబు-నివారణ (మీకు మీరే డాక్టర్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: తరచూ జలుబు తిరగబెడుతోంది. నివారణ చెప్పగలరు?
-కె.వి.ఎస్.మణ్యం, చీరాల
జ: జలుబు వైరస్‌వల్ల రావచ్చు. ఇది ఒకరినుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉన్నవ్యాధి. రెండోది ఎలెర్జీవల్ల వచ్చేది. ఇది కేవలం స్వయం కృతం. తరచూ తిరగబెడుతోందంటున్నారు. అది సరిపడని ఆహార విహారాలవలన వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
శరీరంలోకి వైరస్‌గాని, సరిపడని వస్తువుగానీ ప్రవేశించినపుడు శరీరం వెంటనే దాన్ని ఎదుర్కోవటానికి శరీరంలో ఉన్న రక్షణ యంత్రాంగాన్ని ప్రేరేపిస్తుంది. మన రక్షక కణాలు వాటితో భీకరంగా పోరాడతాయి. ఆ పోరాట సమయంలో కొన్ని హిష్టమిన్లనే విషాలు పుడతాయి. ఈ విషాలు ఎలర్జీని కలిగిస్తాయి. జలుబూ, తుమ్ములూ, ముక్కు దిబ్బడ, కళ్ళె తెగకపోవడం, దగ్గులాంటి బాధలు కలుగుతాయి.
వైరస్‌వలన వచ్చే జలుబుని కోల్డ్ అనీ, పడని పదార్థాలవలన వచ్చే జలుబుని ఎలెర్జీ అనీ పిలుస్తారు. కోల్డ్ అనేది సాధారణంగా మూడ్రోజులు ఉండి తగ్గిపోతుంది. తీవ్రమైన సందర్భాలలో పది పదిహేను రోజులు కూడా ఉండవచ్చు. ఎలర్జీవలన కలిగే జలుబు ఆ పడని పదార్థాన్ని తీసుకుంటున్నంతకాలమూ ఉంటుంది. దాన్ని ఆపితేనే తగ్గుతుంది. సరిపడని పదార్థాలు అంటే, ఆ ఫలానా వ్యక్తికి సరిపడనివి అని మాత్రమే అర్థం. ఏ పదార్థమైనా, ఎవరికైనా సరిపడకపోవచ్చు. అది వ్యక్తిగతంగా సరిపడుతోందో లేదో చూసుకోవాల్సిన విషయం. ఒకరికి పడనిది అందరికీ పడనిది కావాలని లేదు. ఫలానా వస్తువు తనకు సరిపడినదా లేదా అని ఎవరికివారు గమనించుకోవటంలోనే అసలు చికిత్స ఉంది.
విషం తిన్నపుడు విష లక్షణాలు కలగటం ఎలర్జీ కాదు. విషం విషమే! కానీ మంచి చేసే పదార్థాలను తిన్నపుడు, తాగినపుడు కూడా శరీరంమీద ఇలా విష లక్షణాలు కనిపించటాన్ని ఎలర్జీ అంటారు. ఈ చిన్న తేడాని అర్థం చేసుకోండి. ఇంటి దుమ్ము, పువ్వులలో ఉండే పరాగరేణువులు, పెంపుడు జంతువుల జుట్టుపైన ఉండే ఫంగస్ సూక్ష్మజీవులు- ఇలాంటివి కూడా ఎలర్జీలకు కారణం అయి, జలుబు, దగ్గు, తుమ్ములు, దురదలు, దద్దుర్లవంటి బాధలు కలిగిస్తుంటాయి. జలుబువలన శరీరంలో బాక్టీరియా దోషాలు ఏర్పడి (సెకండరీ ఇన్‌ఫెక్షన్లు) జ్వరం వగైరా తిరగబెట్టవచ్చు.
జలుబు ఏ కారణం చేత వస్తున్నా సరిపడని వస్తువులను గుర్తించటం మొదలుపెట్టాలి. మనం తింటున్న ఆహార పదార్థాలలోనూ, తాగుతున్న పానీయాలలోనూ, గాలితో కలిసి పీలుస్తున్న వాటిలోనూ ఎలర్జీలను కలిగించేవి ఉన్నాయేమో ఒక కంట గమనించాలి. మస్కిటో కాయిల్స్, సెంట్లూ, రసాయనాల స్ప్రేలూ కూడా జలుబుకు కారణం కావచ్చు.
జలుబు రాగానే జీర్ణశక్తిని కాపాడుకోవటం ముందు జరగాలి. కఠినంగా అరిగే పులుపు పదార్థాలు, నూనె పదార్థాలు, కొబ్బరి, శెనగపిండి, ఊరుగాయలు, రంగులు, రసాయనాలూ కలిసిన ఆహార పదార్థాలు, కూల్‌డ్రింకులు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఆమ్లాలు కలిసిన పదార్థాలు ఇవన్నీ జలుబును పిలవకుండానే తెచ్చి పెడతాయి. వాటిని తిరస్కరించడమే జలుబుకు చికిత్సా సూత్రం. మన జాగ్రత్తల్లో మనం ఉంటూ ఆయుర్వేద ఔషధాలు వాడితే జలుబు తీవ్రతని తగ్గించగలుగుతాము.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు