సంజీవని

మలబద్ధకం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: మలబద్ధకం నివారణ చర్యలేమిటి?
-కె.జ్ఞానేశ్వరరావు, నెల్లూరు
జ: అసంపూర్తిగానూ, ఆలస్యంగానూ గట్టిపడిపోయిన మలవిసర్జనని మలబద్ధత లేదా కాన్‌స్టిపేషన్ అంటారు. కాన్స్టిపేషన్ అనే మాటకు అవరోధం అని అర్థం. మలం సాఫీగా జారకుండా బంధించబడుతుంది కాబట్టి దీన్ని మలబద్ధత అంటారు. వాడుక భాషలో మలబద్ధకం అంటుంటాం. రోజూ సకాలంలో విరేచనానికి వెళ్లటానికి బద్ధకించటంవలన కూడా విరేచన క్రమంలో మార్పులేర్పడతాయి కాబట్టి మలబద్ధకం కూడా సార్థక నామధేయమే!
సాధారణంగా అయ్యే విరేచనం కన్నా తక్కువసార్లు తక్కువగా అవుతోందంటే మలబద్ధకత ఏర్పడినట్టే లెక్క. దీన్ని చాలామంది సీరియస్‌గా తీసుకోరు. విరేచనం సక్రమంగా అవ్వకపోవటం ఒక అలవాటుగా మారితే అది అనేక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి విరేచనం సాఫీగా అయ్యేలా ముందుగానే జాగ్రత్తపడటం విజ్ఞత.
రోజుకు ఎన్నిసార్లు విరేచనానికి వెళ్లాలి అనే విషయంలో ఒక నిశ్చిత నియమం అంటూ లేదు. ఎక్కువమంది రోజుకు ఒకసారే వెడతారు. కొంతమందికి రోజుకు రెండు లేక మూడుసార్లు కూడా వెళ్ళే అలవాటు ఉండవచ్చు. మరికొంతమందిలో రెండు మూడు రోజులకొకసారి వెళ్ళే అలవాటు కూడా ఉండవచ్చు. సకాలంలో గడియారం ఎంత ఠంచనుగా గంట కొడుతుందో అంత సరిగ్గా రోజూ ప్రాతఃకాలంలో విరేచనం అవటాన్ని మాత్రమే కాల విరేచనం అంటారు.
రెండు మూడు రోజులపాటు విరేచనం అవకపోతే మూడో రోజు ఈ మూడు రోజుల మొత్తం ఒకేసారి అవుతుందనుకోవటం అపోహ. విరేచనం గట్టిగా రాయిలా మారి (హార్డ్ ఆర్ స్మాల్ స్టూల్) చాలా ఇబ్బందిగా వెడుతుంది. తగినంత నీరు తాగకపోవటం, ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు తగినన్ని తీసుకోకపోవటం, విరేచనాన్ని బంధించే గుణం కలిగిన పులుపు పదార్థాలు, నూనె పదార్థాలు, మాంసాహారం, ఆలు, చేమ, కందలాంటి దుంప కూరలు ఎక్కువగా తినటంవలన మలబద్ధత కలగవచ్చు. గ్యాస్, ఎసిడిటీ పెరగటంవలన పేగుల్లో కదిలే శక్తి తగ్గి మలబద్ధత ఏర్పడవచ్చు. ఎసిడిటీని తగ్గించే ఎంటాసిడ్ మందులు, క్యాల్షియం, అల్యూమినియాలకు సంబంధించిన క్షారాలకు అలవాటుపడితే, అవి మలబద్ధతను పెంచుతాయి.
ఈ పూట సరిగా విరేచనం కానంత మాత్రాన ఆందోళన పడకండి. సాయంత్రానికో మర్నాటికో అవుతుంది. కానీ రెండు వారాలుగా విరేచన సమస్య వదలకుండా వున్నపుడు, తరచూ ఇదే పరిస్థితి తిరగబెడుతూంటే వైద్యుణ్ణి సంప్రదించాల్సిందే!
హార్మోన్లు, కడుపులో గ్యాసు లేదా ఇతర కారణాలవలన పేగుల్లో అవరోధం ఏర్పడి మలబద్ధత రావచ్చు కూడా! ఆహారంలో కాయగూరలు, ఆకు కూరలూ ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ ఉండేలా భోజనం చేస్తే విరేచన సమస్య రాదు. కూరల్లో అతిగా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు, శెనగపిండి లాంటివి ఉన్నపుడు కూర తగ్గిపోయి, అన్నం ఎక్కువ తినవలసి వస్తుంది. ఇవి విరేచనాన్ని బంధిస్తాయి. ఆహారంలో మార్పు చేయకుండా విరేచనాల మందు కోసం వెంపర్లాడి ఏం ప్రయోజనం?
సాధ్యమైనంతవరకూ విరేచనాల మందు వేసుకోకుండా ఉండటమే ఉత్తమం. వాటిమీద ఆధారపడితే ఎప్పటికప్పుడు అంతకన్నా పెద్ద మం దు వేయాల్సి వస్తుంది. ఒక దశలో వేయటానికి మందుల్లేని స్థితి వస్తుంది. సహజంగానే విరేచనం అయ్యేలా ఆహారంలో మార్పు చేసుకోవటం అంతకన్నా ఉత్తమం కదా!
సునాముఖి మొక్కలు ఎండించినవి పచారీ షాపుల్లో దొరుకుతాయి. వాటిని దంచి పొడిని నేరుగా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. టీలాగా కాచుకుని తాగవచ్చు. చారు (రసం)లో వేసి కాచుకోవచ్చు. కారప్పొడి చేసుకుని అన్నంలో తినవచ్చు. ఇది సురక్షితమైన విరేచనకర ఔషధం. ఎంత మోతాదు వేసుకుంటే ఒక్క విరేచనం ఫ్రీగా అవుతుందో అనుభవం మీద చూసుకుని మోతాదుని ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అందరికీ ఒకే మోతాదు ఉండదు. రేల గుజ్జు, కరక్కాయ కూడా ఉపయోగపడతాయి. వీటిని అవసరం అయినపుడు విరేచనం కోసం వాడుకోవచ్చు. త్రిఫలా చూర్ణం, స్వాధిష్ట విరేచన చూర్ణం ఇవి మృదు విరేచనకారులు. ఇవి రోజూ వాడుకోదగినవిగా వుంటాయి. పేగులు శక్తిమంతం అవుతాయి. తీక్షణ విరేచనకర ద్రవ్యాలైన నేపాళం లాంటి ద్రవ్యాలు కలిసిన మందులు అత్యవసర స్థితిలో మాత్రమే వాడదగినవి. వాటిని రోజువారీ వాడటంవలన శరీరానికి అలవాటుపడి చివరికి పనిచేయకుండా పోతాయి. ఆకు కూరల్లోనూ, కాయగూరల్లోనూ ఉండే మృదు విరేచనకర గుణాన్ని ఉపయోగించుకోవాలి. ఆహారంలో మార్పుతో మలబద్ధతను జయించండి.
మా పరిశీలనలో మలశోధక చూర్ణం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు పేగులను శోధించి, జీర్ణప్రక్రియను సరి చేయగలుగుతున్నట్టు గమనించాము. ఇవి విరేచన బద్ధతను సరిచేస్తాయి. విరేచనాల మందులు కావు. కడుపులో తేలికగా ఉండి, తిన్నది వంటబట్టి శక్తిమంతంగా ఉంటే అంతకన్నా కావలసింది ఏం ఉంటుంది?