సంజీవని

వేళాపాళా లేని నిద్రాహారాలు.. అసలుకే మోసం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: సెక్యూరిటీగా పనిచేస్తున్నాను. రాత్రిపూట మాత్రమే నాకు డ్యూటీలు ఉంటాయి. రోజూ ఇలా మేల్కోవాల్సి వచ్చినందువలన ఏమైనా చెడు ఉన్నదా? ఎలా నివారించుకోవాలి?
కిలారు శ్రీనివాస్, గుంటూరు
జ: పగలు పని పాటలు చూసుకోవటం, గూట్లో దీపం, నోట్లో ముద్ద.. రాత్రి అయ్యేసరికి కమ్మగా నిద్రపోవటం ఇది మానవ జీవితానికి ఆదినుండీ ఉన్న అలవాటు. ఇది జాతి లక్షణంకూడా! పూర్వపు రోజుల్లో కూడా చాలామంది మనుషులకి అహరహం అంటే రాత్రీ పగలు కూడా పనిచేయాల్సిన వ్యాపకాలుండేవి. ఇపుడు అలాంటి ఉద్యోగ ధర్మాలు ఎక్కువయ్యాయి. అమెరికావాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి, వాళ్ళకు పగలు సమయంలో మనం రాత్రి పూట అలసట కనిపించకుండా పనిచేయాల్సిన పరిస్థితి. మనిషి కష్టపడి ఉద్యోగాలు చేసేది పొట్టకూటి కోసమే! కానీ, ఇలా వేళాపాళా లేని నిద్రాహారాల వలన అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
పత్రికా రంగం, పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వారికి రాత్రి డ్యూటీలు ఎక్కువ. పోలీసు వారికయితే నిలువుకాళ్ళ జీతం, అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా పనివేళలుంటాయి. చాలా ఉద్యోగాలలో పగలు తగినంత విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉండదు కూడా! నిజానికి కూలీ పనికన్నా వైట్ కాలర్ ఉద్యోగాలు ఎక్కువ శ్రమదాయకం అవుతాయి. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశం.
మనిషి సహజంగా రాత్రి పడుకొని పగలు పనిచేయటానికి అలవాటుపడిన జీవి. రాత్రిపూట మేల్కొని పగలు నిద్రపోవటం ప్రకృతి విరుద్ధం. పగలు నిద్రపోకుండా రాత్రిపూట పెందరాళే పడుకొని తెల్లవారు జామున లేచి పనులు ప్రారంభించుకోవటం శాస్త్ర సమ్మతం. ఆరోగ్యదాయకం.
రాత్రి జాగరణలు శరీరాన్ని శుష్కింపచేసి, శరీరంలో వాతం పెరిగేలా చేస్తాయి. అందుకని కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, ఎలెర్జీ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టకూటికోసం రాత్రి డ్యూటీలు చేయక తప్పని పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి.. నిద్రాలేమి వలన కలిగే నష్టాలను నివారించుకోగలుగుతారు. అందుకే ఈ జాగ్రత్తలు
రాత్రి 10 నుండి ఉదయం 6 గంటలవరకూ 8 గంటలపాటు నిద్రపోయే సాధారణ సమయం అనుకుంటే, రాత్రి ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయం ఉదయానే్న పడుకుంటే నిద్ర నష్టం తూకానికి సరిపోతుందని ఆచార్య సుశ్రుతుడు సూచించాడు. తెల్లవారు జామున 3 గంటలకు డ్యూటీ దిగి ఇంటికివచ్చి పడుకొన్నారనుకోండి.. అంటే రాత్రి 10 గంటలనుండి 5 గంటలసేపు జాగరణ చేసినట్టు. ఈ 5 గంటల నిద్రానష్టాన్ని సుశ్రుతుడు చెప్పిన పద్ధతిలో ఇలా పూడ్చుకోండి.
రాత్రి 3 గంటలకు ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి పడుకుంటే, ఉదయం 6 గంటలకే యథాప్రకారం లేచి కాలకృత్యాలు తీర్చుకొని మేల్కొన్న 5 గంటల సమయంలో సగం అంటే 2-30 గంటలపాటు అపుడు నిద్రపోతే నిద్రానష్టం భర్తీ అవుతుంది. అంటే, 8-30 లేదా 9 వరకూ పడుకుంటే నిద్ర సరిపోతుందన్నమాట. అలా పడుకొని నిద్రలేచిన తరువాత బ్రేక్‌ఫాస్ట్ చేయండి. ఆహారం తీసుకున్నాక పడుకోవద్దని సూచన.
నైట్ డ్యూటీల్లో ఉన్న రోజుల్లో రాత్రి భోజనాన్ని సాంత్రం 7 గంటలకే తినేస్తే మంచిది. ప్రమాదకరమైన మిషన్ల దగ్గర పనిచేసేవారు, లారీ, బస్సు, కార్ల డ్రైవర్లు ముఖ్యంగా ఈ నియమం పాటించాలి. ఆలస్యంగానూ అధికంగానూ భోజనం చేస్తే మత్తు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి పూట తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. పళ్లు, స్వీట్లు, జీడిపప్పు, బాదం లాంటి పోషక పదార్థాల్ని యాజమాన్యాలు రాత్రి డ్యూటీ చేసే సమయంలో ఉద్యోగులకు అందించే విధంగా కార్మిక చట్టం రావాలి. కనీసం గ్లూకోజ్ బిస్కట్లైనా డ్యూటీ సమయంలో తీసుకోవటం వలన పనిలో అలసట కలగకుండా ఉంటుంది. మత్తులో జోగుతూ పనిలో నాణ్యత తేవాలంటే కష్టం అవుతుంది. ఈ సూక్ష్మాన్ని యాజమాన్యాలు కూడా గమనించాలి. విద్యార్థుల పరీక్షల సమయంలో నైట్‌ఔట్లు చేస్తుంటారు. వాళ్ళకి ఈ జాగ్రత్తలు అవసరం.
రాత్రి జాగరణ వలన కడుపులో ఎసిడిటీ త్వరగా పెరుగుతుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. అజీర్తి సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. పేగు పూత లాంటి వ్యాధులు త్వరగా వస్తాయి. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి త్వరగా వస్తాయి. రాత్రి భోజనంలో పులుసు కూరలు, మసాలా కూరలు, వేపుడు కూరలకన్నా ఇగురు కూరలు తినడంవలన పొట్ట చెడకుండా ఉంటుంది. అన్నం తింటే హెవీ అవుతుందని, హోటల్లో చపాతీ కుర్మాలు లైట్ ఫుడ్ అనీ కొందరిలో ఒక అపోహ ఉంది. చపాతీ కూర్మా పేగుల్ని దెబ్బతీస్తుంది. కొద్దిగా అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే మేలు కలుగుతుంది. ఊరగాయలకన్నా చింతపండు వెయ్యకుండా చేసిన రోటి పచ్చళ్ళకు ప్రాధాన్యత ఇవ్వండి.. మజ్జిగ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.
చాలామంది నైట్ డ్యూటీ సమయంలో కాఫీ, టీలు ఆరగా ఆరగా తాగుతుంటారు. అది జీర్ణకోశాన్ని దెబ్బతీసే అలవాటే! ధనియాలు, జీలకఱ్ఱ, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచి తగినంత ఉప్పు కలిపిన పొడి ఒక చెంచా మోతాదులో వేసుకుని గ్లాసు మజ్జిగ తాగితే పొట్టలో యాసిడ్ పెరుగకుండా, జీర్ణాశయం చెడకుండా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. నైట్ డ్యూటీలు తప్పనిసరిగా చేయాల్సిన ఉద్యోగులు లేదా వృత్తి వ్యాపారులు తేలికగా అరిగే ఆహార పదార్థాలను తినటానికి అలవాటుపడితే నిద్రాలేమి వలన కలిగే చెడునుండి బయటపడగలుగుతారు.
జాగారం చేసిన వ్యక్తులు రాత్రిపూట పాలు, పాల పదార్థాలను తీసుకోవటం మంచిది కాదు. పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా మజ్జిగ శ్రేష్ఠతరంగా ఉంటాయి. నిద్ర మేల్కోవటంవలన శరీరంలో ఎక్కువగా వేడి పెరుగుతుంది. అందుకని తరచూ బార్లీ సగ్గుబియ్యం జావ లాంటివి తీసుకుంటూ ఉండాలి. బూడిదగుమ్మడితో సొరకాయ లాగానే అన్ని రకాల వంటకాలూ చేసుకోవచ్చు. ఇది చలవనివ్వటమే కాదు, శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. రెండు చెంచాల సబ్జాగింజల్ని నీళ్ళలో కాసేపు నానబెట్టి తాగితే చలవ. వేడి అలసటపోయి ఉత్సాహంగా పని చేయగలుగుతారు.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com