సంజీవని

దురద వ్యాధికి నివారణ (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నాకు చర్మంమీద మచ్చలు లేవు. కానీ ఒళ్ళంతా విపరీతంగా దురద. ఇంట్లో అందరికీ ఉంది. కారణం ఏమిటీ ? నివారణ చెప్పగలరు?
-జనమంచి వి.జె.రావు, జగిత్యాల
జ: దురద ఎంత శారీరక సమస్యో అంత మానసిక సమస్య కూడా! గోకి తీరాలనే కోరికని పుట్టించేది. నాడీవ్యవస్థకు సంబంధించిన ఒక మానసిక ప్రక్రియ. దేని కారణాలు దానివి అయినప్పటికీ నొప్పి ఎలా పుడుతుందో దురద కూడా అలానే పుడుతోంది. నాడీవ్యవస్థ బలంగా కలిగిన జీవరాసులన్నింటికీ నొప్పితోపాటు దురద కూడా వుంటుంది. నొప్పినీ, దురదని కూడా తెలియచెప్పేవి నరాలే!
వెంటనే బాధలోంచి బయటపడాలనే భావనని నొప్పి కలిగిస్తుంది. కానీ, ఎంత గోకినా ఆ దురద తీరదు, ఇంకా ఇంకా గోకాలనే కోరికని దురద కలిగిస్తుంది. బాదే సౌఖ్యమనే భావన లాంటిదే ఇది. అలా తగ్గకుండా దీర్ఘకాలం కొనసాగినపుడు దురద అనేది ఒక వ్యాధి అవుతుంది. దురద అనేది కేవలం చర్మవ్యాధి మాత్రమే కావాలని లేదు.
చర్మంమీద ఎలాంటి మచ్చలు లేకుండా కూడా దురద కలగవచ్చు. శరీరానికి సరిపడని వస్తువులతో శరీరం చేసే మహాపోరాటంలో హిస్టమిన్లనే విష రసాయనాలు విడుదలవుతాయి. ఇవే దురదనీ, జలుబని, ఆయాసాన్ని ఇతర ఎలెర్జీ లక్షణాలను తెచ్చిపెడుతున్నాయి. ఇవి చర్మంపై పొరలకు సరఫరా అయ్యే నాడుల కొనల్ని ఉద్రేకపరచటంవలన గోకాలనే కోరిక పుడుతుంది. దానే్న దురద (ఫ్రూరయిటిస్) అంటారు. ఇలా చర్మంపై పొరలకు సరఫరా అయ్యే నరాల కారణంగా వచ్చే దురదని న్యూరోపతి అనీ, కేంద్ర నాడీ వ్యవస్థవలన వచ్చే దురదని న్యూరోజెనిక్ అనీ, మానసిక కారణాలవలన వచ్చే దురదని సైకోజెనిక్ అని పిలుస్తారు. మానసిక ఆందోభలు, దిగుళ్ల వంటివి ఉన్నవారు దురదని తట్టుకోలేరు. వీళ్ళకు చిన్న దురదే ఎక్కువ దురదగా అనిపించవచ్చు కూడా! దిగులు అనేది దురదని పెంచి పెద్దది చేస్తుంది.
షుగరు వ్యాధి, జీర్ణాశయ వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులు, కేన్సరు, మూత్రపిండాల వ్యాధులు, రక్తవ్యాధులు, లివర్ వ్యాధులతోపాటు కొన్ని రకాల మందులు, ఆహార పదార్థాలు వికటించటంవన కూడా దురద కలగవచ్చు. ఎలికపాములు, కొంకి పురుగులు ఇలాంటివి పేగుల్లో పెరుగుతున్నపుడు వాటి గుడ్లు లివర్ ద్వారా రక్తాన్ని చేరి రక్తప్రసారంతోపాటు శరీరం అంతా సంచరించటం కారణంగా ఒళ్ళంతా దురద కలగవచ్చు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. పెద్దల్లో కూడా జరగవచ్చు.
కొంతమందికి, తన కడుపులో పురుగులున్నాయి కాబట్టి దురద వస్తోంది లాంటి కొన్ని అపనమ్మకాలు బలంగా ఉండిపోయి దురదతోపాటు శరీరంపైన మంట పుట్టడం, జీర్ణశక్తి లేకపోవడం లాంటి బాధలు కలుగుతుంటాయి. చివరికి వీళ్ళలో దరద అనేది ఒక మానసిక వ్యాధిగా పరిణమించవచ్చు కూడా!
సూర్యరశ్మి మన చర్మంపైన కొన్ని రసాయన చర్యల్ని కలిగించి దురుదను ప్రేరేపించవచ్చు. పెంపుడు జంతువులతో పూసుకుతిరగటం వలన అంటుకొనే ఇతర పరాన్న జీవులు అలాగే, దోమలు, తేనెటీగల వంటి కీటకాలు కుట్టడం, తలలో పేలు, ఈపి ఇవన్నీ కూడా దురదకు కారణం అవుతాయి.
చర్మంమీద జిడ్డు లేకుండా పొడిగా ఉన్నప్పుడు దురద ఎక్కువగా ఉంటుంది. అతిగా సబ్బుతో రుద్ది అదేపనిగా స్నానాలు చేసే వ్యక్తుల చర్మంమీద సహజమైన నూనె పదార్థాలు నశించిపోయి దురద ఏర్పడుతుంది. వయోవృద్ధుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించవచ్చు. తాతకు దగ్గు ఎంత సహజమో దురద కూడా అంతే సహజం.
గోచిన చోట పుళ్ళు పడి చీముపోయటం, ఆ పుండు తగ్గటానికి వాడే ఆయింట్‌మెంట్లు సరిపడక అక్కడ నల్లమచ్చలు ఏర్పడటం, చివరికి ఎగ్జిమా అనే చర్మవ్యాధి పరిణమించటం చాలామందిలో కనిపిస్తుంటుంది. దురద రాగానే మొదట గోళ్లు కత్తిరిస్తే అది ఎగ్జిమా దాకా వెళ్లకుండా ఉంటుంది.
సరిపడని ఆహార విహారాల కారణంగా ఏర్పడే ఎలెర్జిక్ రియాక్షన్లు కూడా దురదను తెచ్చిపెడుతున్నాయి. సరిపడని ఆహార పానీయాలను గుర్తించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కల్తీ ఆహార పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్లో చెలామణిలో వున్నప్పుడు సరిపడని ఆహార పదార్థాలను గుర్తించటం కష్టం అవుతుంది. నూనె, నెయ్యి, కారం, నిత్య జీవితంలో మనం వాడుకొనే అనేక పదార్థాలలో విషపూరితమైన కల్తీలు జరుగుతున్నాయి. రంగు రసాయనాలు కలిపిన పదార్థాలు, కల్తీలకు అవకాశం వున్న పదార్థాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎలెర్జీ వ్యాధుల్ని మనమే ఎక్కువగా ఆహ్వానిస్తున్నాం. సబ్బులు, షాంపూలు, పౌడర్లు, షేవింగ్ క్రీములూ, ఒకటేమిటి మనం వాడుకొనే సమస్త విషయాలలోనూ విష రసాయనాలు కలుస్తాయి. ఇవన్నీ ఎలెర్జీలకు దారితీసేవే! ప్రకృతి సహజమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ వాటి వాడకాన్ని ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది.

విరేచనాల వ్యాధిలోనూ, మొలల వ్యాధిలోనూ, విరేచన మార్గం చుట్టూ దురద విపరీతంగా పుట్టవచ్చు. ‘ప్రూరయిటిస్ యానై’ అంటారు ఆ లక్షణాన్ని. పిల్లల్లో ముఖ్యంగా అక్కడ దురద కలగటానికి నులిపురుగులు ఆ మర్గం ద్వారా బైటకు వచ్చి అక్కడ సంచరించటం కారణం కావచ్చు. కాండిడ్‌యాసిస్ అనే వ్యాధి సూక్ష్మజీవుల కారణంగా ఏర్పడి, స్ర్తిల జననాంగం దగ్గర దురద కలగవచ్చు. ఇలా దురద అనేక ఇతర కారణాలవలన కూడా ఏర్పడవచ్చు.
లూప్ వేయించుకున్న స్ర్తిలకు, పేస్‌మేకర్ లాంటివి అమర్చిన వ్యక్తులకు, కట్టుడుపళ్ళు లాంటివి వాడుతున్న వ్యక్తులకూ, శరీరంలోపల వేరే ఒక వస్తువు (్ఫరిన్‌బోడి) ఉండటం కారణంగా దురదలు కలగవచ్చు. జీడిపప్పు, శెనగపిండి, గేదెపాలు, కొన్ని రకాల చేపలు, పుట్టగొడుగులు లాంటి కొన్ని ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు సరిపడకపోయినా దురద వస్తుంది. దురుదని కలిగించే చర్మవ్యాధుల్లో గజ్జి, తామర, డెర్మటైటిస్, ఎగ్జిమా, సొరియాసిస్, హెర్పిస్, లైకేన్ ప్లేనస్, లైకేన్ సింప్లెక్స్ వగైరా ముఖ్యమైనవి. ఈ వ్యాధులన్నింటినీ గమనించి, వాటికి దూరంగా ఉండగలగమే మొదటి చికిత్స.
గోంగూర, చుక్కకూర తప్ప మిగిలిన ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వండి. చింతపండు, ఇతర పులుపు పదార్థాలకు ప్రాధాన్యత తగ్గించండి. పులిసిన పెరుగు, మజ్జిగలు కూడా రియాక్షన్ తేవచ్చు. పులిస్తే ఏదైనా ఇబ్బంది పెడుతుంది. పెసర, మినప, శనగ మొదలైన పిండి పదార్థాలకన్నా రాగి, జొన్న, సజ్జ, గోధుమ లాంటి ధాన్యాలను పిండి పట్టించి వాటితో వివిధ ఆహార పదార్థాలు తయారుచేసుకోవటం మంచిది.
రోజూ ఒక కేరట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ జ్యూసు తీసుకుని ఒక గ్లాసు మోతాదులో తాగండి. వాతాన్ని వేడినీ పెంచేవాటిని వదిలేసి, బార్లీ, సగ్గుబియ్యం లంటి చలవ చేసేవి తీసుకుంటూ ఉంటే దురదని ప్రేరేపించే అంశాలు తగ్గుతాయి. దురద అదుపులోనికి వస్తుంది.
దురద రావటానికి ఎవరి కారణాలు వారివి. శరీరానికి సరిపడని వాటిని తీసుకోవటం అనేది ముఖ్య కారణం. ఎవరికి వారు తమ ఆహార విహారాలను అజమయిషీ చేసుకుని తమకు పడకుండా పోతున్న ఆహార పదార్థాలను, ఇతర అంశాలను గుర్తించి మానుకోవటం అవసరం.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com