సంజీవని

షుగరు వ్యాధి... సులభంగా నియంత్రణ (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:ఈ మధ్యే షుగరు కనిపించింది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు డాక్టర్‌గారు. స్థూలకాయం కూడా ఉంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుపగలరు?
-డి.కె.ప్రసాద్, జంగారెడ్డిగూడెం
జ:‘‘రాజభోజనాలు శవపేటికలను నింపటానికే’’ (Large dinners fill coffins) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది.
ఆహార వ్యామోహం అసలుకే మోసం తెస్తుంది. ఇతర వ్యామోహాలు ఎంత ప్రమాదకరమో ఆహార వ్యామోహం అంతకన్నా ప్రమాదకరమైంది.
కంప్యూటర్లో వైరస్ చేరినపుడు అనవసర యాపులన్నింటినీ డౌన్‌లోడ్ చేసుకోమని అడ్డుపడుతూ ఉంటుంది. స్థూలకాయుల పేగుల్లో కూడా ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవి కంప్యూటర్ వైరస్‌లానే ఏది కనిపిస్తే అది తినాలని కోరికని ప్రేరేపిస్తుందని కొత్త పరిశోధనాంశం ఒకటి ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. శరీర యంత్రాంగాన్ని చెడగొట్టడమే ఈ క్రిమి లక్ష్యం. అనారోగ్యకర వంటకాలను చూడగానే కొవ్వు కణాలను ప్రేరేపించి, ఎక్కువ ఆహారం కోసం మెదడుకు సిగ్నల్స్ పంపేలా చేస్తుంది. ఇంకో ముద్ద అదనంగా తినాలనే కోరికని పెంచుతుంది. స్థూలకాయుల్లోనూ, షుగర్ వ్యాధి వచ్చిన వారిలోనూ అతిగా తినే అలవాటును తెచ్చిపెడుతుందని ఆ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
దీనికి నివారణ ఏమిటీ? మనోబలమే యాంటీ వైరస్‌లా పనిచేస్తుంది. నెరుూ్య, నూనె, పులుపు, తీపి, ఉప్పు ఇవే ఆహార పదార్థాలపట్ల మనలో ఎక్కడలేని వ్యామోహాన్నీ రేకెత్తించే అంశాలు? తక్కువ పోషక విలువలున్న ఈ నాలుగింటిపైనా అదుపు ఉండాలి. ఆ అదుపుని ఎవరికివారు ఆహార విహారాల నియంత్రణ ద్వారా కల్పించుకోగలగాలి.
శరీరానికి శక్తికోసమే ఎవరైనా ఏదైనా తింటారు. కానీ, షుగర్ వ్యాధిలో తింటున్నకొద్దీ శక్తి ఉత్పత్తి పడిపోతుంది. జీవకణాలలో మైటోఖాండ్రియా అనే శక్తి కర్మాగారాలుంటాయి. ఇవి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. పొయ్యిలో పిల్లి లేస్తే కడుపులో ఎలుకలు పారిపోతాయాన్నట్టు, జీవకణాల లోపల శక్తి ఉత్పాదక యంత్రాంగం సమర్థవంతంగా ఉన్నంతకాలం ఏది ఎంత తిన్నా బండి చక్రాలు ఆగవు. ఈ ఉత్పాదక యంత్రాంగం దెబ్బతిని, షుగర్‌వ్యాధి వచ్చాక, శరీరం శక్తిహీనం కావటం మొదలౌతుంది. గుండు సూది మోపినంత మేరక్కూడా శక్తి సరఫరా జరగాలి. తక్కువ ఉత్పత్తి కారణంగా తక్కువ శక్తి సరఫరా జరిగి శరీర అవయవాలన్నీ శక్తిహీనం కావటం మొదలౌతాయి.
షుగర్ వ్యాధి వౌలికంగా వంశ పారంపర్య వ్యాధి. మనుషులకు ఇది రాసిపెట్టి ఉన్న వ్యాధి. ఎప్పటికైనా ఎవరికైనా తప్పకపోవచ్చు. నేటి కాలపు మనిషి జీవన విధానం, ఆహార విహారాలు, మనసుకు సంతోషం కాని ఆలోచనలు ఇవన్నీ జోడు కూడి ఎప్పుడో వచ్చే ఈ వ్యాధి ఇప్పుడే వచ్చేలా చేస్తాయి.
మెదడు అనేది శరీరం మొత్తం బరువులో 2 శాతం మాత్రమే ఉండగా అది గుండె నుంచి బయటకు వచ్చే శుద్ధ రక్తంలో 15 శాతాన్ని, శరీరం మొత్తం తీసుకునే ఆక్సిజన్‌లో 20 శాతాన్నీ, అలాగే శరీరం మొత్తం వినియోగించుకొనే గ్లూకోజ్‌లో 25 శాతాన్నీ ఉపయోగించుకుంటోంది. శరీరంతో చేసే వ్యాయామం కన్నా మెదడు శ్రమకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. మెదుడుకి మనం పని చెప్పేకొద్దీ అది శరీరంలో శక్తిని తీసుకుని ఖర్చు చేస్తుంది. ఆ విధంగా చురుకైన ఆలోచనా శక్తి మధుమేహాన్ని అదుపులో పెట్టేందుకే తోడ్పడుతుంది.
ఆందోళనలు దిగుళ్ళు మెదడు శక్తిని హరిస్తాయి. షుగరు, స్థూలకాయం పెరగటానికి కారణం అవుతాయి. చింతాశోక భయం, దుఃఖాదులన్నీ తక్షణ వాతాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెప్తుంది. మనసుకు సంతోషం, సంతృప్తీ కలిగించని అంశాలన్నీ ఈ వ్యాధిని పెంచుతాయనే దీని అర్థం. మనసుదే ఇందులో ప్రముఖ పాత్ర. దాన్ని వ్యాధి నివారణకు అనుకూలంగా సన్నద్ధం చేసుకోవాలి.
షుగర్ వ్యాధి వచ్చినవారు ఆఫీసరయితే ముఖానికి నవ్వు పులుముకొని చాకచక్యంగా పనులు సానుకూల పరచుకోగలగాలి. కింది ఉద్యోగైతే తానొవ్వక నొప్పించక తప్పించుకు తిరగాలి. వ్యాపారైతే, ప్రణాళికాబద్ధంగా పనిచేయటం ప్రారంభించాలి. సంతృప్తిని పొందడం అనేది చాలా అవసరం. విశ్రాంత జీవైతే, బుర్రని ఖాళీగా ఉండనీయకుండా ఏదో ఒక వ్యాపకం కల్పించుకోండి. వాడకుండా వదిలేస్తే ఎంతటి యంత్రమైనా బిగుసుకుపోతుంది. మెదడూ అంతే! జడంగా మారుతుంది. ఏ వ్యాపకం లేకపోతే పేపర్లలో వచ్చే క్విజ్జులైనా పూర్తిచేయటం అలవాటు చేసుకోండి. మీరు చదువుకున్న వారయితే రాజాజీ రామాయణాన్నో లేక మీకు ఇష్టమైన గ్రంథాన్నో తెలుగులో దొరికితే ఇంగ్లీషులోకి, ఇంగ్లీషులో దొరికితే తెలుగులోకీ అనువాదం చేయటం మొదలుపెట్టండి. పుణ్యమూ పురుషార్థమూ రెండూ దక్కుతాయి. మేత మెదడుకు వేస్తే షుగరు తగ్గుతుంది. శరీరానికి వేస్తే షుగరు, స్థూలకాయం రెండూ పెరుగుతాయి.
ఒక సగటు మనిషి రోజుకు 2,500 కేలరీల ఆహారం తీసుకుంటాడు. వీటిని ద్రవరూపంలోగానీ, ఘన రూపంలోగానీ ఎలా తీసుకున్నా కేలరీలు ఒకే రకంగా పెరుగుతాయి. అన్నం మానేసి ఇడ్లీ తింటే కేలరీలలు పెరగవనేది అపోహ. అలాగే అన్నం మానేసి వివిధ ధాన్యాలతో కాచిన జావలు కూడా కేలరీలను సమకూర్చటంలో ఏ మాత్రం మొహమాటపడవు. ద్రవాహారం కన్నా తక్కువ కేలరీలు కలిగిన ధాన్యంతో వండిన ఘనాహారమే షుగరు వ్యాధిలో కొంత మేలు చేసేదిగా ఉంటుంది. కేలరీలు శరీరంలోకి చేరడం తగ్గి, శరీరానికి శ్రమ పెరిగితే, అప్పుడు శరీరం తనకు కావలసిన శక్తిని కొవ్వులోంచి తీసుకుంటుంది. ఆ విధంగా స్థూలకాయం కూడా తగ్గుతుంది. అందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు కీలకమైన లివరు, స్ప్లీన్, పాంక్రియాజ్ మొదలైన అవయవాలమీద ఒత్తిడి తగ్గుతుంది. షుగరునీ, స్థూలకాయాన్నీ ఒకేసారి ఎదుర్కొనే విధంగా మన ఆహార విహారాలు సాగాలి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు,