సంజీవని

మనోబలం ముఖ్యం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: త్రాగుడు అలవాటు మానుకోలేకపోతున్నాను. మానాలనే ఉంది. ఉపాయం చెప్తారా?
-కిలారు రవికుమార్ - మచిలీపట్నం
జ: డిసెంబర్ 31 రాత్రి ప్రపంచంలో అత్యధికంగా మద్యం వరదలై పారుతుంటుంది. ఆ ఒక్క పూట మద్యం తీసుకోకుండా వుండగలిగితే, మద్యపాన వ్యసనానికి స్వస్తి చెప్పేందుకు తగినంత మనోబలం దొరుకుతుంది. ఏ దురలవాటు మానాలన్నా మనోబలం ముఖ్యం. అన్నీ మందులతో పొందవచ్చు. కానీ, మనోబలాన్ని స్వయంగానే సముపార్జించుకోవాలి. జనవరి 1 నుండి మానేస్తా అనకుండా డిసెంబర్ 31నే చివరి గడువుగా పెట్టకోవడం ఉత్తమ పురుషుడి లక్షణం. డిసెంబరు 31 రాత్రిని ‘పొడి రాత్రి’గా ప్రకటించగలిగితే ఇంట్లో భార్యా పిల్లలతో ఎక్కువ సంతోషంగా గడపొచ్చు కూడా!
‘‘బాగా తగ్గించేశాను, ఎక్కువ త్రాగట్లేదు, పెద్దగా తీసుకోవట్లేదు..’’ ఇలాంటి మాటలు మనల్ని మనం మోసం చేసుకోవడానికే గానీ, నమ్మదగినవి కావు. ఇన్ని పెగ్గులు తాగామని ఎగ్గులు లేకుండా, సిగ్గేమాత్రం పడకుండా గొప్పలు చెప్పుకోవటం త్రాగేవారిలో కనిపించే లక్షణం. త్రాగనివాళ్ళని చేతకానివారంటూ ఎన్నోసార్లు ఎంతోమందిని ఈసడించి కూడా ఉండొచ్చు. డిసెంబరు 31ని పొడి రాత్రిగా జరుపుకున్నవాళ్ళు నిస్సందేహంగా త్రాగుడు మానేయటంవలన లాభాల గురించి లెక్చర్లిచ్చే సావకాశం పొందగలుగుతారు.
మద్యాన్ని రోజూ ఆడవాళ్ళు ఒక పెగ్గు, మగవాళ్ళు రెండు పెగ్గుల వరకు తీసుకోవచ్చని అమెరికన్ మార్గదర్శక సూత్రాలు చెప్తున్నాయి. ఇక్కడ మహిళల పట్ల వివక్షణ ఉన్నదంటారా? తాగి పడి ఉండటానికి ఏ దేశంలోనైనా పురుషుడికున్నంత సౌలభ్యం స్ర్తిలకుండదు కాబట్టి, అలా సూచించి ఉంటారు. అయినా, ఈ సూత్రాలేవీ మనకు వర్తించకపోవచ్చు! బ్రాందీ పుట్టిన దేశానికి, గాంధీ పుట్టిన దేశానికీ ఒకే రూల్సు ఎలా వర్తిస్తాయి? మనది హాలికుల దేశం, ఆల్కహాలికుల దేశం కాదు. ఇక్కడి సామాజిక పరిస్థితులకు ఉప్పు, పప్పు, బియ్యంలాగా మద్యం ఒక నిత్యావసర వస్తువు కాదు. అనాదిగా మన దేశంలోనూ మద్యపానం ఉంది. అది వ్యసనమే తప్ప జీవనాధారం కాదు. అది లేకపోతే రోజు గడవదనే పరిస్థితి ఇక్కడ లేదు. వ్యసనానికి బానిసయ్యాక (బిన్జీ డ్రింకింగ్) ఇంక గొప్ప చెప్పుకునేదేముంది..?
అమెరికన్ జాతీయ మద్యం దుర్వినియోగ నిరోధక సంస్థ (ఎన్‌ఐఏఏఏ) 2014 తరువాత సగటు అమెరికన్లు ఆడా మగా కూడా రెండు గంటల సేపట్లో 4-5 పెగ్గులకు మించి త్రాగుతున్నారని హెచ్చరించింది. ఇక్కడ తెలుగు నేలమీద ప్రభుత్వాలే బోర్డులు పెట్టి ‘మద్యం త్రాగండోయ్ బాబూ, సర్వం వదిలేయండోయ్’ అని ప్రోత్సహిస్తున్న కారణంగా, ఆ అమెరికన్ సగటును తెలుగువాడు ఎప్పుడో దాటిపోయి ఉంటాడనుకుంటాను. మద్య మాంసాలకు దూరంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంగానీ, గుజరాతీయులుగానీ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఎలా ఉండగలిగారో అధ్యయనం చేస్తే, తెలుగు ప్రభుత్వాలు కూడా ‘ప్రసాదు’ (ప్రభుత్వ సారాయి దుకాణం)లను వదుల్చుకోగలుగుతాయి.
రోజుల తరబడీ మరో పని లేకుండా త్రాగటంలోనే గడిపే మందు కామందులు అమెరికాలో 6.7 శాతం ఉన్నారని ఒక సర్వే చెప్తోంది. శెలవు రోజు వస్తే గ్లాసు పుచ్చుకోకుండా ఆపటం అసాధ్యం అని ఈ నివేదిక వ్యాఖ్యానించింది. త్రాగటం హోదాకు, సమర్థతకు గుర్తుగా ఎక్కువమంది భావిస్తున్నారని, వారాంతం రోజు త్రాగినదాని వలన మిగిలిన పనిదినాల్లో బాగా పనిచేయటానికి వీలౌతుందని ఎక్కువమంది నమ్ముతున్నారనీ, ఇది అపోహేననీ ఈ నివేదిక చెప్తోంది.
కాఫీ ఎంత ఉత్తేజకారకమో మద్యం కూడా అంతే ఉత్తేజకారకం. కానీ, నిత్యకృత్యంగా మారి, అది అలవాటుగా మిగిలితే కాఫీ, మద్యమూ రెండూ కూడా తమలోని ఉత్తేజకారక గుణాలను కోల్పోయి, విషాలుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా చెరుస్తాయని ఈ నివేదిక హెచ్చరించింది. సరదాగా మొదలు, అలవాటుగా మిగులు, త్రాగుడొక రిమ్మతెగులు.. అంతే!
త్రాగుట మితిమీరితే కలిగే లక్షణాలను (ఆల్కహాలిజమ్) ఆయుర్వేద శాస్త్రంలో ‘మదాత్యయం’ అంటారు. మదం అంటే తీవ్రంగా మద్యపానం చేసిన స్థితి. చరకుడు మద్యాన్ని మందుగా ఎలా వాడుకోవాలో, విషంగా ఎలా వాడుకోకూడదో చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక ఔషధాన్ని ఎలా తీసుకుంటామో, మద్యాన్ని కూడా అలానే తీసుకోవడానికి అనేక విధి విధానాలు చెప్పాడు. మద్యం అనే ఔషధం ఎవరికి ఎంత అవసరమో కూడా నిర్దేశించాడు.
బి కాంప్లెక్సు మాత్రలు బలం ఇస్తాయని రోజూ ఓ డజను మింగటం సరికాదు కదా! మద్యానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. పుట్టిన రోజునుండీ మరణించేవరకూ ప్రతీ మనిషికీ బి కాంప్లెక్సు మింగే తీరాల్సిన అవసరం ఉండనట్టే మద్యం త్రాగే తీరాల్సిన ద్రవ్యం ఎంత మాత్రమూ కాదు. దానిపట్ల వ్యామోహం ఒక బలహీనతేగాని బలం కాదు.
శరీర బలాన్ని ఓజస్సు అంటారు. దానికి గురు (పెద్ద, బరువు), శీత (చలవ చల్లన), స్థూల (మాక్రో), మధుర, స్థిర, మృదు, ఇలాంటి లక్షణాలుంటే మద్యానికి కచ్చితంగా వాటి వ్యతిరేక లక్షణాలుంటాయి. ఉష్ణం, తీక్షణం, సూక్ష్మం, ఆమ్లం, శరీరం అణువణువుల్లోకి విషంలాగా త్వరగా వ్యాపించటం, శరీర ధాతువులు ఎండిపోయేలా చేయటం- ఇవి ఆల్కహాల్ విష లక్షణాలలో కొన్ని! బలానికి మద్యం వ్యతిరేక పదం. మద్యం ఎప్పటికీ బలకరం కాదు. మద్యం సేవించి తెచ్చుకున్న బలంతో జయించగలిగే కార్యం ఏదీ లేదు. మనసూ శరీరాల సంహారకం మద్యం.
మద్యంలో ఇథనాల్ అనే రసాయనం ఉంటుంది. తొలిదశలో అది సైకోయాక్టివ్‌గా పనిచేస్తుంది. అందువలన ఆందోళన, మనసుమీద ఒత్తిడి తగ్గి, శరీర ధాతువులు సక్రమంగా స్రవించటానికి తోడ్పడుతుంది. కానీ ఆల్కహాలుకి మోహనం అనే లక్షణం కూడా వుంది. అది మొదటి గుక్కతో మనల్ని ఆగనీయకుండా, దానికి పూర్తిగా బానిస చేసుకుంటుంది. మితిమీరి త్రాగటం మొదలయ్యాక ‘స్లోపాయిజన్’లాగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తూ పోతుంది.
ఆల్కహాలుకి వ్యవారుూ అనే గుణం కూడా ఉంది. వ్యవాయి అంటే శరీరంలోని జీవకణాల్లోకి చొచ్చుకుపోయే గుణం. ఒక్క చుక్క ఆల్కహాలు రక్తంలోకి చేరిందంటే అది వేగంగా సమస్త ధాతువుల్లోకి ప్రవేశిస్తుంది. ఎక్కువ ప్రవేశించిన కొద్దీ నష్టం పెరుగుతూ వుంటుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లోనూ లివరులోనూ దీని చెడు ప్రభావం ఎక్కువ! పోషకాలు వొంటబట్టకపోవటం, నరాల బలహీనతలు ఏర్పడతాయి. మెదడు మొద్దుబారిపోతుంది.
కవులు, నటులు, ఇతర కళాకారులు తాగితే గొప్ప ప్రతిభ కనబరుస్తారనే అపోహ ప్రమాదకరమైంది. చాలామంది ప్రతిభామూర్తులైన కవులు, కళాకారులు తాగుడు వలన అర్ధాయుష్కులుగా పోతున్నారు. త్రాగగలిగిన వాళ్ళకు ఈ సంగతి బాగానే తెలుసు. తెలిసి చేసే తప్పుల్ని ప్రజ్ఞాపరాధాలంటారు. ఆల్కహాలిజం ఎక్కువమంది విషయంలో ప్రజ్ఞాపరాధమే!
నిలువెల్లా నెగెటివ్ ఆలోచనా విధానం దేవదాసుది. బాధే సౌఖ్యమనే భావన కలిగినవాడతను. త్రాగుడుకు బానిస కావటానికి ఈ రెండు రకాల ఆలోచనా ధోరణులు ముఖ్య కారణం అవుతాయి. భగ్నప్రేమికులంతా దేవదాసులు కావటం లేదు. త్రాగటానికి ఏదో ఒక వంక కావాలి. దేవదాసుకు ప్రేమచెడటం అనే వంక దొరికింది.
‘హేయం దుఃఖం అనాగతాం’ దుఃఖం కలగక మునుపే నివారించాలని శాస్త్రం చెప్తోంది. దాన్ని అర్థం చేసుకోగలగటం విజ్ఞత! పాఠ్యాంశాల్లో మద్యపానం, ధూమపానం లాంటివి చెడు అలవాట్లని పిల్లలకు తెలియచెప్పాలి. దాని అనర్థాలేమిటో వాళ్లకు ముందే తెలియాలి. సినిమాల్లో త్రాగటం గొప్ప అని ఘనంగా చూపించటాన్ని మనం ప్రశ్నించాలి. జీవితంలో త్రాగటం ఒక భాగం అనుకునేలా నేటి తరం పెరుగుతోంది. ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ అనేది ఇప్పుడు ఎక్కువమందిలో కనిపిస్తోంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటం, పక్షవాతం, బీపీ షుగరు వ్యాధుల్ని మద్యం ఎరువేసి పెంచుతుంది. లివరుకి సిర్రోసిస్ ఇంట్లో భార్యాపిల్లలకు ‘సారోసిస్’ (దుఃఖసముద్రం) కలిగించే త్రాగుడు అలవాటుని ఒక ఘనతగానూ, గొప్పగానూ, నాగరికతగానూ భావించుకోవటమే అమాయకత్వం.
త్రాగడం మానేస్తే ఉపసంహరణ లక్షణాలేవో వస్తాయని మానేందుకు జంకుతుంటారు కొందరు. ఆయుర్వేదం వాటిని సమర్థవంతంగా నివారించగలుగుతుంది.
డిసెంబరు 31ని పొడి రాత్రిగా జరుపుకుంటే జనవరి 1 కొత్త జీవితానికి శ్రీకారం అవుతుంది. సినిమా శుభం కార్డుతో ముగిస్తే ముచ్చట!

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com