సంజీవని

సరిపడని వాటితో సహజీవనం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: మోకాళ్ళనుండి పాదాల దాకా నల్ల మచ్చలు వచ్చాయి. రసి కారుతోంది. ఎగ్జీమా అన్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గటంలేదు. నివారణ చెప్పగలరు.
-కె.వై. నెల్లూరు
జ: మనకు సరిపడే వ్యక్తులతో మనం వ్యవహరించే తీరుకు, సరిపడని వారితో మనం వ్యవహరించే తీరుకీ ఎంతో తేడా వుంటుంది. ఈ సరిపడటానికి, సరిపడకపోవటానికి గొప్ప కారణాలేమీ అక్కరలేదు. ‘‘మీ ఇద్దరికీ ఎందుకు సరిపోవటం లేదు..’’ అనే ప్రశ్నకు సూటైన సమాధానం ఆ ఇద్దరి వద్దా వుండనట్టే, ఫలానా వస్తువు ఎందుకు పడలేదో చెప్పటం కష్టం.
ఎటోపిక్ ఎగ్జీమా లేదా డెర్మటైటిస్ అనేది శరీరానికి సరిపడని వాటికి వ్యతిరేకంగా శరీర ప్రతిఘటన వలన కలిగే ఒక చర్మవ్యాధి. దీన్ని కాంటాక్ట్ అలెర్జిక్ డెర్మటైటిస్ (విచ్చరిక) అంటారు. సాధారణంగా ఇవి చర్మానికి పడనివస్తువులతో పాటు, కడుపునకు తీసుకున్న ఆహార పదార్థాలుగానీ, కొన్ని రకాల ఔషధాలుగానీ సరిపడనప్పుడు వస్తుంది. ఒక్కోసారి ఘాటైన ఆమ్లాలు, రసాయనాలు చర్మంమీద ఉద్రేకాన్ని (ఇరిటేషన్) కలిగించవచ్చు. చర్మం అడుగున ఉండే కొవ్వు నుండి వెలువడే జిడ్డువలన, సూర్యకాంతి వలన, చర్మం పూర్తిగా జిడ్డు కోల్పోయి ఎండినట్లు అవటంవలన, రక్తసరఫరా సరిగా జరగక చెడు రక్తం ఒకే చోట దిగబడటం వలన కూడా నల్లమచ్చలు ఏర్పడవచ్చు. చర్మవ్యాధి నిపుణుడికి చూపించుకుని వ్యాధి నిర్థారణ చేసుకోవాలి.
మన శరీరంలో రక్షణ యంత్రాంగం (ఇమ్మ్యూన్ సిస్టం) ఉంటుంది. పోలీసు డ్యూటీ చేసే కణజాలం వలన శరీరానికి ఈ రక్షణ కలుగుతోంది. పోలీసులు అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరించే వ్యక్తుల్ని పట్టుకుని నేర నిరూపణ చేస్తారు. మన శరీర రక్షణ యంత్రాం గం కూడా ఇలా కొన్నింటి ని అనుమానాస్పదమైనవిగా భావించి వాటి మీద దాడి చేస్తాయి. ఆ దాడిలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఎలర్జీకి కారణం అవుతున్నాయి.
శరీరంలో ఒక విధమైన గగుర్పాటు కలగటాన్ని విచర్షణం అంటారు. విచలితం కావటం అని కూడా అంటారు. అలా విచర్షణం లేదా విచలితాన్ని కలిగిస్తుంది కాబట్టి దీన్ని విచర్చికా (కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్) అని పిలిచారు. ఈ విచర్చికా అనే వ్యాధి ఇరిటేషన్ కారణంగా వచ్చిందా లేక సరిపడని వస్తువుల వాడకం (ఎలర్జీ) వలన వచ్చిందా అనేది వైద్యుడు నిర్ణయిం చాల్సి వుంటుంది. ఎక్కువసార్లు రెండూ కారణమే అవుతుంటాయి. కడుపులోకి తీసుకున్న ఆహార పదార్థాలు వగైరా సరిపడనపుడు అంతర్గతంగా జరిగే రసాయన చర్యలు చర్మంమీద వచ్చే నల్లమచ్చల్ని తెస్తాయి.
ముఖంమీద మచ్చలకు: ముఖానికి పట్టించే పౌడర్లు, స్నోలు
నుదురు మీద మచ్చలకు: కుంకుమ, విబూది లాంటివి
చేతులమీద మచ్చలకు: నికెలుతో తయారైన గాజులు, వాచీ స్ట్ఫ్రాలు వంటివి
ఉరోభాగంలో మచ్చలకు: నగలు, కొన్ని రకాల వస్త్రాలు, పాదాలకు చెప్పులు, బూట్లు, సాక్సులు
అరచేతులు, వ్రేళ్ళకు: రెండు చక్రాల బండి హ్యాండిల్‌కు, కారు స్టీరింగులకు వాడే ప్లాస్టిక్ గ్రిప్పులు, డిటర్జెంటు పౌడర్లు, అంట్లు తోమే సబ్బులు ఇలాంటివాటిలో బలమైన కాష్టిక్ సోడా లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ తీక్షణమైన ఆమ్లాలు కలిసిన నీళ్ళలో కాళ్ళు, చేతులు ఎక్కువ నానినప్పుడు ఇరిటేషన్ కలిగి నల్లమచ్చలు ఏర్పడవచ్చు.
ముఖానికి, అరచేతులకూ: సెల్‌ఫోన్లు నికెల్ లాంటి లోహాలతో తయారైనవి సరిపడనపుడు ఇలా మనం వాడే అనేక వస్తువులు ఎలర్జీకి కారణం అవుతుంటాయి. మిథైల్ ఐసోథైజోలైన్ లాంటి రసాయనాలను కాస్మటిక్స్, ఆహార ద్రవ్యాలు, పానీయాలు బూజుపట్టకుండా కలుపుతుంటారు. ఇవే ఎలర్జీకి ప్రధాన కారణం అవుతాయి. ఇలా కాంటాక్ట్‌వలన కలిగే రియాక్షన్ని పరిశోధించి పట్టుకోవాలి. దొంగని ఒక డిటెక్టివ్ ఎలా పరిశోధించి పట్టుకుని నేరం నిరూపిస్తాడో అలా సరిపడని వస్తువుని పట్టుకోవాలి. ఇది వైద్యుడి ఒక్కడి వలన మాత్రమే అయ్యే పని కాదు. రోగి తన శరీర తత్వానికి ఏది సరిపోతుందో, ఏది సరిపడట్లేదో కనిపెట్టే ప్రయత్నం శాస్ర్తియంగా చేయాలి. ఒక్కోసారి సరిపడేవన్నీ పడనివిగానూ, పడనివి సరిపడేవిగానూ అపోహ పడే అవకాశాలూ ఉన్నాయి. ఎక్కువమంది విషయంలో ఇలాగే జరగటం వలన అత్యంత తేలికగా తగ్గిపోయే ఈ డెర్మటైటిస్ వ్యాధి దీర్ఘవ్యాధిగా మనతో సహజీవనం చేస్తుంది.
ఏది పడదో తేల్చేందుకు ఎలర్జీ ప్యాచ్ టెస్టుల్లాంటివి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, రోగి స్వీయానుభవంతో నిర్థారించుకోవటమే ఉత్తమ మార్గం. సరిపడని వాటివలన వచ్చే ఈ వ్యాధి ఎవరికైనా కలగవచ్చు. ఒకర్నుండి ఇంకొకరికి సోకే అంటువ్యాధి కాదిది. ఒక వస్తువు పడటమో పడకపోవటమో అనేది ఆ వ్యక్తి స్వంత విషయం. వంకాయ, గోంగూర లాంటివి సరిపడి, బెండకాయ దొండకాయ పడని వాళ్ళు ఉండవచ్చు.
నల్లని మచ్చలు, దురద, గోకినందువలన గోరు గీట్లకు పుళ్ళు పడి, అవి రసి కారుతూ ఉండే పరిస్థితి, సగం కాలిన తుమ్మ మొద్దులా చర్మం నల్లగా అయిపోయి, పనసకాయ మీద చర్మంలా గరుకుగా అయిపోవటం. ఇలా ఈ విచర్చికా అనే కాంటాక్ట్ ఎలర్జిట్ డెర్మటైటిస్ చర్మవ్యాధి దీర్ఘకాలం పాటు బాధపెడుతుంటుంది. ఇది బయటనుండి వాడిన వస్తువుల వలనే వచ్చినా కాలక్రమంలో కడుపులోకి తీసుకున్న వాటి వలన కూడా రావచ్చు.
సరిపడని వస్తువుని లేదా పదార్థాన్ని సరిపడేలా చేయటానికి మందులు ఉండవు. నా మాత్ర వేసుకుని మోపెడు గోంగూర తినండి, బుట్టెడు వంకాయలు తినండీ ఏమీ కాదు.. అనే వైద్యం ఎక్కడా లేదు. ఆయుర్వేద శాస్త్రం నిదాన పరిమార్జనం అంటే రోగ కారకం అయిన ఆ ద్రవ్యాన్ని వదిలేయటమే మొదటి చికిత్సా సూత్రంగా భావించింది.
సాధ్యమైనంత వరకూ రసాయనాలతో తయారైన ద్రవ్యాలను ముఖానికి పులమకండి. సాధ్యమైనంతవరకూ కుంకుళ్ళు, సీకాకాయ్ లాంటి సహజ ద్రవ్యాలమీద ఆధారపడండి. అవి కూడా రెడీమేడ్‌గా తయారైనవైతే వాటిలో నిలవ ఉండేందుకు రసాయనాలు కలిపే ప్రమాదం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు పురుగు మందుల్లో తడిసి ముద్దైనవే మనం ఎక్కువగా తింటున్నాం. ఇంత అతిగా పురుగు మందులు, ఎరువులు వేయటంవలన జనం శరీరాలు విషపూరితవౌతున్న విషయాన్ని అటు రైతాంగంగానీ, ఇటు ప్రభుత్వంగానీ, దేశంలో మేధావులు గానీ పట్టించుకోవటంలేదు.
కల్తీ లేని నూనె లేదా వెన్నని రాసుకుని ఇంట్లో మిక్సీ పట్టుకున్న పెసర పిండి లేదా శెనగపిండితో స్నానం చేస్తే చర్మానికి మృదుత్వం కలుగుతుంది. దురద పెడ్తుంటే మొదట గోళ్ళు అంట కత్తిరించుకోవాలి. చాకులు, స్కేళ్ళు, దువ్వెనల్ని గోకటానికి ఉపయోగించకండి. ఎగ్జీమాలో గోకుడు పుళ్ళే ఎక్కువ హాని చేస్తాయి. మెత్తటి తుండు గుడ్డలతో తుడుచుకోండి. గరుకు వాటివలన చర్మం రేగుతుంది.
చాల్‌మోగ్రా తైలం అనే ఔషధం ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని ఎగ్జీమా మచ్చలమీద రెండు పూటలా రోజూ మృదువుగా మర్దన చేయండి. ఆయుర్వేదంలో ఎగ్జీమాని తగ్గించే మంచి ఔషధాలున్నాయి. సూర్యకాంతరసం అనే ఔషధం త్వరగా చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకురావటంలో వేగంగా పనిచేస్తోంది. సరిపడని వాటిని గుర్తించటమే అసలు చికిత్స. అందుకు మీరు అనుసరించాల్సిన శాస్ర్తియ పద్ధతులను తెలుసుకోవటం ముఖ్యం.
**
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com