సంజీవని

వేదన పుట్టించే పునరావృత గర్భస్రావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఇద్దరు స్ర్తిలలో ఒకరికి ఒక గర్భస్రావమవడం సాధారణం. యధాలాపంగా, కోరుకోనప్పుడు వచ్చిన గర్భాన్ని కోల్పోయినపుడు అంత విచారపడరేమో కాని కోరుకున్నప్పుడు వచ్చిన గర్భం పోతే ఒక్కసారి అయినా తల్లి, కుటుంబ సభ్యులు బాధపడతారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలో, సూక్ష్మ కుటుంబాల్లో, స్ర్తిలు కూడా ఏదో ఒక స్థాయి వృత్తి, ఉద్యోగాలలో నిమగ్నమై ఉన్న తరుణంలో సమయాన్ని, డబ్బును, మనుషుల సహాయాన్ని ఎంతో ప్లాన్ చేసుకుని బిడ్డను కంటున్నపుడు, ఒక్కసారి గర్భస్రావం అవడం కూడా ఎంతో విచారాన్ని కలిగిస్తుంది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్సెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ నిర్వచనం ప్రకారం వరుసగా 2 లేక 3 లేక అంతకంటే ఎక్కువ గర్భస్రావాలైతే పునరావృత గర్భ నష్టం లేక రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటారు. ఇలా వరసగా అనేక గర్భస్రావాలవుతున్నపుడు ఆ శోకాన్ని అంచనా వెయ్యడం కష్టం. దాదాపు 50 శాతం కేసుల్లో దీనికి కారణాన్ని తెలుసుకోవడం కష్టం. పునరుత్పత్తి వయసులో ఉన్న 1-3 శాతం స్ర్తిలలో వరసగా గర్భస్రావాలయే ప్రమాదం ఉంటుంది. గర్భస్రావాల సంఖ్య పెరిగినకొద్దీ తరవాత గర్భం మళ్లీ పోయే ప్రమాదం పెరుగుతుంది. మూడుసార్లు గర్భస్రావమైన స్ర్తిలకు మామూలుగా గర్భం పెరిగి బిడ్డ పుట్టే అవకాశం 30 శాతం, నాలుగు గర్భస్రావాల తరువాత 20 శాతం, ఐదు గర్భస్రావాల తరువాత 5 శాతం ఉంటుంది. వరస గర్భస్రావాలకు చాలా రకాల కారణాలు ఉంటాయి.
గర్భాశయం ఆకృతిలో లోపాలు
గర్భాశయం ఆకృతిలో లోపాలవలన గర్భం పెరగడానికి చోటు చాలక, పిండానికి రక్తప్రసారణ సజావుగా లేక గర్భస్రావాలవుతాయి. ఈ లోపాలు పుట్టుకతో ఉండొచ్చు లేక పుట్టిన తరువాత రావచ్చు.
పుట్టుకతో వచ్చేవి: బాదంకాయ ఆకారంలో ఉండే గర్భాశయం తలమీద చొట్టలాగా ఉండడం (ఆర్క్యుయేట్ యుటిరస్), గర్భాశయం లోపల ఒక గోడలాగా పొర ఉండడం (సెప్టేట్ యుటిరస్), గర్భాశయం నిర్మాణమయ్యేటపుడు నిలువుగా ఒక సగం మాత్రమే పెరగడం (యూనీ కార్నుయేట్), గర్భాశయం నిలువుగా రెండు చీలికలుగా ఉండటం (బైకర్నుయేట్ యుటిరస్) మొ.
పుట్టిన తరువాత వచ్చేవి
గర్భాశయంలో కణితులు: ఫైబ్రాయిడ్ అనే గట్టిగా ఉండే కణితి గర్భాశయం లోపలి వైపు ఉంటే గర్భం రావటానికి ఆటంకం కలగడమే కాక గర్భస్రావాల ప్రమాదం కూడా ఉంటుంది. గర్భాశయం లోపలి వైపు పెరిగే ‘పాలిప్’ అనే మెత్తటి కణితి, ఇంతకుమునుపు గర్భాలలో అధిక రక్తస్రావమవుతున్నపుడుగాని, అవాంఛిత గర్భాలను తీసేయించుకోవడానికిగాని, ఇతర కారణాలకుగాని డి సి అనే చిన్న ఆపరేషన్ చేస్తే, లేక క్షయ వ్యాధి కారణంగా గర్భాశయం లోపల పొరలు పెరగడంవలన, లోపలి గోడలు కొంత గాయపడి అతుక్కుపోయి పిండానికి రక్తప్రసరణ సజావుగా జరగక గర్భస్రావాలవుతున్నాయి.
సర్విక్స్ వదులవడం...
సర్విక్స్ పుట్టుకతో వదులుగా ఉండొచ్చు.
పుట్టిన తరువాత కూడా సర్విక్స్ వదులుగా అవొచ్చు. అనేకసార్లు గర్భస్రావం అయితే అప్పుడు చేసిన ఆపరేషన్, లేక కష్టపు కాన్పు కారణంగా సర్విక్స్‌కి అయిన గాయాలతో సర్విక్స్ చిరగడంవలన, సర్విక్స్ వదులుగా అయి వరస గర్భస్రావాలవొచ్చు.
ఈ అన్ని కారణాలవల్ల గర్భాశయం లోపలి భాగం ఇరుకుగా అయి, పిండానికి రక్తప్రసరణ సక్రమంగా జరగక గర్భస్రావం అయే ప్రమాదం ఎక్కువవుతుంది.
క్రోమోజోమ్స్ / జెనెటిక్ కారణాలు
వరసగా గర్భస్రావాలయే వారిలో 50 శాతం మందికి క్రోమోజోమ్స్/ జెనెటిక్ లోపాలు కారణం. మానవ శరీరంలో మామూలుగా 22 జతల ఆటోజోమ్స్, ఒక జత సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు లేక పిండంలో ఈ లోపాలు ఉండొచ్చు. వీటి సంఖ్యలోగాని, నిర్మాణంలోగాని తేడాలు ఉంటే గర్భం సజావుగా పెరగదు. పిండం ఏర్పడుతున్నపుడు ఈ తేడాలు వస్తాయి. సాధారణంగా లోపం ఉన్న పిండాన్ని ప్రకృతే పెరగనివ్వదు, జీవాన్ని కోల్పోయిన పిండాన్ని బయటకు నెట్టేస్తుంది. సామాన్యంగా క్రోమోజోమ్స్ సంఖ్యలో తేడాల కారణంగా వరస గర్భస్రావాలవుతాయి.
ఇమ్యూన్ పరమైన సమస్యలు
ఆటో ఇమ్యూన్ సమస్యలు (ఏంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, సిస్టమిక్ లూపస్ ఎరిథొమెటోసిన్) ఏంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్‌లో ఏంటీ ఫాస్ఫోలిపిడ్స్ (ఏంటీ కార్డియోలిపిన్, లూపస్ ఏంటీ కోయాగ్యులెంట్) స్థాయి పెరిగి రక్తం గడ్డకట్టడంలో లోపాలు వచ్చి, పిండం చనిపోయి, గర్భస్రావమవుతుంది. రికరెంట్ ప్రెగెన్సీ లాస్‌కి ఇది చాలా పెద్ద కారణం.
అల్లోఇమ్యూన్ సమస్యలు
వీటివల్ల తల్లి శరీరం పిండాన్ని తిరస్కరించకుండా చేసే ఇమ్యూన్ ప్రతిస్పందనకు ఆటంకం కలిగి గర్భస్రావమవుతుంది.
ఎండోక్రైనల్ లేక హార్మోన్ సంబంధ సమస్యలు
డయాబెటిస్, థైరాయిడ్ హార్మోన్స్ లోపం, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్‌లో హార్మోన్ సంతులనం దెబ్బతినడం వలన గర్భస్రావమవుతుంది.
రక్తం గడ్డకట్టడంలో లోపాలు
జన్యుపరంగా తల్లికి సంక్రమించే థ్రాంబోఫిలియా లాంటి సహజంగా రక్తం గడ్డకట్టడానికి ఆటంకం కలిగించే వ్యాధివలన కూడా గర్భస్రావమవుతుంది. రక్తం గడ్డకట్టడంలో లోపాలు పుట్టిన తరువాత కూడా రావొచ్చు.
ఇన్‌ఫెక్షన్లు: పెల్విక్ ఇన్‌ఫెక్షన్లవలన కూడా గర్భస్రావాలవొచ్చు.
వ్యసనాలు: ధూమపానం, మద్యం వ్యసనాల వలన కూడా గర్భస్రావాలవొచ్చు.
పరీక్షలు
ఇంతకుపూర్వం వచ్చిన గర్భాలు, డయాబెటిస్, థైరాయిడ్ హార్మోన్స్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పుట్టుకతో వచ్చిన లేక పుట్టిన తరువాత వచ్చిన వ్యాధుల వివరాలు. జీవనశైలి గురించిన వివరాలతోపాటు కొన్ని ప్రత్యేక పరీక్షల్ని చెయ్యాలి.
అవసరాన్నిబట్టి హిస్టిరోస్కోపి, 3డి అల్ట్రాసౌండ్, హిస్టిరోసాల్పింగోగ్రఫీ, ఎంఆర్‌ఐ, భార్యాభర్తలిరువురికి కేరియోటైపింగ్, ఏంటీ కార్డియోలిపిన్, లూపస్ ఏంటీ కోయాగ్యులెంట్ ఏంటీ బాడీస్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్ మొదలైన పరీక్షల్ని చెయ్యాలి.
కుటుంబ సభ్యుల ఓదార్పు, మానసిక ఆసరా, ప్రేమాస్పద సంరక్షణ ద్వారా తల్లికి కలిగే ధైర్యం, ఆత్మవిశ్వాసం నిరాశాపూరిత పరిస్థితిని ఆశావహంగా మార్చి సత్ఫలితాలనిస్తుంది. జీవనశైలిని మార్చుకోవడం, మానసిక ప్రశాంతత చాలా అవసరం.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441