సంజీవని

సూక్ష్మ జీవులూ ప్రాణాల్ని తీస్తాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో మనమీద దాడిచేసి, చంపేసే క్రూరమృగాల గురించి మనకు తెలుసు. అందుకని వాటికి దూరంగా ఉంటూ ప్రాణాల్ని కాపాడుకోగలుగుతున్నాం. కానీ, అతి చిన్న... సూక్ష్మ జీవులవల్లా, మనకి ప్రాణాపాయముంది. ఆ విషయం తెలీక వాటి బారిన పడి, ప్రాణాపాయం తెచ్చుకుంటున్నాం.
తమ ఆహారంకోసం ఇతరుల మీద ఆధారపడే పరాన్నభుక్కులు మనుషులలోనే కాదు కంటికి కనిపించని సూక్ష్మజీవులలోనూ ఉన్నాయి. బాక్టీరియా, వైరస్, పేగుల్లో ఉండే పాములు, ఫంగస్ లాంటి వాటివల్ల క్రిమి దోషాలు కలుగుతుంటాయి. వీటివల్ల క్షయ, న్యుమోనియా, టైఫాయిడ్, కలరా, గ్రహణ వ్యాధి, మశూచికం లాంటి వ్యాధులు కలుగుతుంటాయి. కొన్ని క్రిమిదోషాలు హఠాత్తుగా ప్రారంభమై జనసమూహంలో చాలా దూరం వరకూ వ్యాపిస్తాయి. వీటినే ‘ఎపిడమిక్’లంటారు. ఈ శాస్త్ర విభాగాన్ని ఎపిడెమియాలజీ అంటారు.
బాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు అనారోగ్యాలు కలిగించినట్లే- వేడిమి, శీతలత్వం, ఎక్స్‌రేలు, ఏక్టినిక్ కిరణాలు, అత్యున్నత ప్రదేశాలు, వివిధ రసాయన వస్తువులు, విషాలు లాంటి భౌతిక రసాయనిక వస్తువుల వల్లా కూడా అనారోగ్యాలు కలుగుతాయి. కొన్ని కొన్ని అపాయాలవల్ల దెబ్బలు తగిలి ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి.
మనం ఆహారాన్ని శారీరక శక్తికోసం తీసుకొంటుంటాం. కానీ ఆహారంవల్ల కొన్ని అనారోగ్యాలూ కలుగుతున్నాయని ఎందరికి తెలుసు? మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు తగిన పరిమాణంలో ఉండాలి. అలా ఉంటే సమతులాహారం లేక స్వస్థాహారం అంటారు. వీటిలో ఏవి లోపించినా శరీర ప్రకృతి సరిగా ఉండకపోడమే కాకుండా అనేక ఆహార లోప జనిత రోగాలు వస్తాయి. ఆహార పదార్థాల లోపంవల్ల లివరు రోగగ్రస్థమవుతుంది. ఇనుము లోపిస్తే రక్తక్షీణత ఏర్పడుతుంది. విటమిన్లు లోపిస్తే స్కర్వి, రికేట్స్, రేచీకటి, బెరిబెరి లాంటి రోగాలు కలుగుతాయి.
వయసు పెరుగుతుండడంవల్ల జీర్ణప్రక్రియలో మార్పులొచ్చి వృద్ధుల అర్టెరీలు పెళుసెక్కుతాయి. చర్మం ముడుతలు పడుతుంది. కంట్లో పువ్వు, ఆస్ట్రోస్లెరోసిస్... వృద్ధాప్యంవల్ల కలిగే ఆరోగ్యానికి ఇబ్బందులలో ఇవి కొన్ని మాత్రమే! వినికిడి, చూపులోపం లాంటి ఇబ్బందులతో కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి.
శరీరంలోని కణాల అస్తవ్యస్థ పెరుగుదలవల్ల ‘కేన్సర్’లాంటి అనారోగ్యాలు కలగవచ్చు. మన శరీరంలోని కణాలు ప్రతీ ఆరు నెలలకీ చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆ కొత్త కణాలలో ‘మ్యుటేషన్స్’వల్ల మార్పులొచ్చి భిన్న పెరుగుదల కలుగుతుంది. ఇలా ఎందుకు కలుగుతోందో? వీటినెలా అరికట్టాలో తెలుసుకోవడానికి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. జీవకణాల వృద్ధి ధర్మనిర్వహణ ఒక క్రమపద్ధతిలో నడుస్తుంటుంది. ఈ క్రమవృద్ధిని రక్షించడానికి శరీరంలో కొన్ని యంత్రాంగాలున్నాయి. వాటిని దెబ్బతీసే విషయాలు చాలా ఉన్నాయని పరిశోధనల్లో తేటతెల్లమైంది.
ప్రతీ దుర్మాంసవృద్ధీ మారడానికి కారణం కాదు. కొన్ని రకాల పెరుగుదలలు అవి ప్రారంభమైన ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. వాటిని ‘బినైన్ ట్యూమర్స్’ అంటారు. కణాలలో ఇతర, ప్రాంతాలకీ వ్యాపించే వాటిని ‘మాలిగ్నెంట్ ట్యూమర్స్’ అంటాం. ఇవి ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి.
కొన్ని రకాల రోగాలకు ‘ఎలర్జీ’ ముఖ్యం. ‘ఎలర్జీ’ అంటే సరిపడని పరాయి వస్తువులు ముఖ్యంగా, చెప్పుకోవలసినవి- ప్రొటీనులకు శరీరము ‘సున్నితమై’నందువల్ల ఏర్పడేవి. కొన్ని వస్తువులకు శరీరము ముందొకమాటు సున్నితమైతే రసాయనికంగా సంక్లిష్టాలైన ‘ఏంటిబాడీలు’ అనే సూక్ష్మ రేణువులు శరీరంలో తయారవుతాయి. ఇవి పరాయి ప్రొటీన్ తారసపడితే ‘ఏంటిజెన్- ఏంటి బాడి’ ప్రతీకారాన్ని కలిగిస్తాయి. ఆ ప్రతీకార ఫలితంగా రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. ఉబ్బసం, రుమేటిక్ జ్వరం, కొన్ని మూత్రాంగ వ్యాధులు కొన్ని ఉదాహరణలు మాత్రమే! శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంపొందించే ‘యాంటీబాడీ’లే శరీరంలో ఉండే ప్రొటీన్లకి విరుద్ధాలైన కొత్త ప్రొటీన్లని కల్పించి, ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తాయి. ఇలా ఆరోగ్యాన్ని కాపాడవలసినవే అనారోగ్యాలకు కారణం కావడాన్ని ‘ఆటో ఇమ్యూన్‌రోగాలు’ అంటారు.
కొన్ని రోగాలు పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వస్తాయి. మధుమేహం, ఉబ్బసం, మానసిక జబ్బులు, రేచీకటి, హీమోఫీలియా లాంటి కొన్ని వ్యాధులు అందుకు కొన్ని ఉదాహరణలు.
సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించి మన కణాల్ని దెబ్బతీయడాన్ని ‘ఇన్‌ఫెక్షన్’ అంటారు. ఈ ఇన్‌ఫెక్షన్స్ రకరకాలు. శరీరంలోని అన్ని ప్రాంతాలలో రావచ్చు. ఒక ప్రాంతంలో వచ్చి ఇతర ప్రాంతాలకీ వ్యాపించవచ్చు. రోగ నిరోధకశక్తి తక్కువ కావడం కూడా ఇన్‌ఫెక్షన్స్ రావడానికి కారణాలు. మన శరీరంలోకి ప్రవేశించి సూక్ష్మజీవులు కణాలను దెబ్బతీస్తుంటే తెల్లకణాలు పెద్దసంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని నాశనం చేయడానికి ఇలా యుద్ధం జరిగేప్పుడు రక్తంలో తెల్లకణాల సంఖ్య పెరగడంతో ‘ఇన్‌ఫెక్షన్స్’ని గుర్తించవచ్చు. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్లకణాల సమూహమే ‘చీము’. సూక్ష్మజీవులు, రోగ నిరోధకశక్తి పెనుగులాటలో కొన్ని ప్రాంతాలు ఎర్రబారతాయి. దానినే ‘ఇన్‌ఫమేషన్’ అంటారు.
వీటికి కారణాలు తెలుసుకోవడానికి రకరకాల రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, రేడియో ఏక్టివ్ ఐసోటోపులు, జీవ రసాయన పరీక్షలు, మైక్రోస్కోప్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ గుండె స్కాన్, ఇసిజి, ఇఇయుజి, స్ట్రెస్‌టెస్ట్, కలర్ డాప్లర్, ఎండోస్కోప్, కొలనో స్కోప్‌లాంటి సంబంధిత పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణకు కొన్ని పరీక్షలు అవసరం. అందుకని ఏ పరీక్షలు ఎందుకు అవసరమో తెలుసుకుని ఉండడం అవసరం. తెలియకపోతే వైద్యుల్ని ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవడం అవసరం. పెరుగుతున్న వైద్య విధానంలో ఎన్నో కొత్త కొత్త పరీక్షలూ వస్తున్నాయి.
పరీక్షలవల్ల కేవలం అనారోగ్యాల్ని, పసిగట్టడమే కాదు, చికిత్స ఎలా సాగుతుందో కూడా తెలుస్తోంది. అందుకే అందరిలో వైద్య విధానం పట్ల అవగాహనా పెరగాల్సిన అవసరం ఉంది.

డా.కె.వలీపాషా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి యోగి వేమన విశ్వవిద్యాలయం.. 98492 16278