రాష్ట్రీయం

వైభవంగా ప్రభల ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట: సంక్రాంతి పర్వదినాలలో భాగంగా కనుమ రోజు కోనసీమ ప్రభల ఉత్సవాలతో ప్రభంజనంగా మారింది. రాష్ట్రానికే తలమానికంగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో జరిగే జగ్గన్నతోట, వాకలగరువు ప్రభల ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఉదయం నుండి యువకుల కేరింతలతో ప్రభలు తీర్ధ స్థలికి చేరుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎత్తయిన ప్రభగా వాకలగరువు 52 అడుగుల ప్రభ, తొండవరం 48 అడుగుల ప్రభ వర్ణశోభితంగా భక్తులను అలరించాయి. వాకలగరువుశ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, తొండవరం శ్రీ ఉమా తొండేశ్వరస్వామివార్ల ప్రభలు అమలాపురం గునే్నపల్లి అగ్రహారంలో నిర్వహించిన ఉత్సవంలో పాల్గొన్నాయి. వీటితోపాటు అమలాపురం రూరల్ మండలం గునే్నపల్లి అగ్రహారానికి చెందిన శ్రీ రామేశ్వరస్వామి ప్రభ కూడా ఉత్సవంలో కొలువుదీరింది. అంబాజీపేట మండలం మొసలపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల కొలువు భక్తులందరినీ అలరించాయి. గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి ప్రభలు అప్పర్‌కౌశికను దాటే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు. అత్యంత బరువున్న ప్రభలు భుజంపై మోస్తూ కౌశికను దాటడం భక్తులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రభలు దాటే సమయంలో కేరళ వాయిద్యాలు మరింత వీనులవిందుగావించాయి. జగ్గన్నతోటలో వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, కె పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, వక్కలంక కాశీవిశే్వశ్వరస్వామి, పాలగుమ్మి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామివార్లు తీర్ధంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత భక్తుల తాకిడి ఒకేసారి ఉండటంతో రోడ్లన్నీ జన దిగ్భంధమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. చిరతపూడిలో ప్రభల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబాజీపేట, డి గన్నవరం, కొత్తపేట మండలాలకు చెందిన 50 ప్రభలు ఉత్సవంలో పాల్గొన్నాయి. అమలాపురం డీఎస్పీ మాసూమ్‌బాషా ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
''చిత్రాలు.. రాష్ట్రంలోనే ఎత్తయిన వాకలగరువు 52 అడుగుల ప్రభ, తొండవరంలోని 48 అడుగుల ప్రభ
*జగ్గన్నతోట వద్ద అప్పర్‌కౌశికను దాటుతున్న గంగలకుర్రు అగ్రహారం ప్రభ