రాష్ట్రీయం

కర్నూలులో హైకోర్టుకు అనుకూలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 12: కర్నూలులో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందని, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రీతిబాయిపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి కోట్ల సర్కిల్ వరకు జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అయితే తాను హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచే ఆరుగురు ముఖ్యమంత్రులు పనిచేసినా సీమకు చేసిందేమీ లేదన్నారు. ఏళ్ల తరబడి అన్యాయానికి గురవుతోందే తప్ప అభివృద్ది శూన్యమన్నారు. హంద్రినీవా ద్వారా చెరువులకు నీళ్లను నింపి ఎందుకు కరువును నివారించటం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం రూ.250 కోట్లు పెట్టి కర్నూలుకు శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా ఎందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. పై నుంచి నీటి వాటాను ఎందుకు రాబట్ట లేకపోతున్నారని నిలదీశారు. చుట్టూ నీళ్లున్నా తాగటానికి చుక్కనీరు కరువైపోయిందని, వాటిని ఎందుకు సక్రమంగా వినియోగించలేక పోతున్నారన్నారు. ఈ ప్రాంతపు వాసులే ముఖ్యమంత్రులుగా పని చేసినా అభివృద్ది మాత్రం చేయరన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కేనకపోతే సీమకు న్యాయం జరగదని వెల్లడించారు. తనకు అధికార దాహాం లేదని, ఒకవేళ ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రీతిబాయి లాంటి సంఘటనలు జరగకుండ చూసుకుంటానని పవన్ కల్యాణ్ అన్నారు.
2017లో కర్నూలులోని ఒక రెసిడెన్సియల్ పాఠశాల యాజమాన్యం ప్రీతిబాయిపై అత్యాచారం చేసి దారుణంగా చంపిందన్నారు. ఇది అమానుష చర్య అని అన్నారు. ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పజెప్పి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు. దిశ నిందితులను శిక్షించినట్లుగా ప్రీతిబాయిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. పీతిబాయి కేసును సీబీఐకి అప్పగించకపోతే నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. మనది లౌకిక రాజ్యమని, అన్ని మతాలు కలిసి భారతీయులుగా ఉన్నామని జనసేనాని అన్నారు. ఎన్‌ఆర్‌సీ వల్ల దేశంలో మత కలహాలు సృష్టించి ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అపోహను విడనాడాలన్నారు. ముస్లింలను భారత దేశం నుండి ఎవ్వరూ విడదీయలేరన్నారు.
*చిత్రం...కర్నూలు నగరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్