రాష్ట్రీయం

దేశాభివృద్ధికి యువత కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, ఫిబ్రవరి 27: దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకుపోడానికి యువత చిత్తశుద్ధితో కృషి చెయ్యాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు ఇచ్చారు. ఆచార్య నాగార్జున వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో గురువారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఉన్నత విద్యను అభ్యసించిన యువత సారథ్యం వహించాలని కోరారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావటం వల్ల దేశీయ విద్యావిధానంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. అధ్యాపకుల కొరత అన్నది విద్యారంగానికి సమస్యగా మారిందని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీనివల్ల విద్యా సంస్థల్లో బోధనా ప్రమాణాలు ప్రభావితమవుతున్నాయన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోడానికి వారి జీవితాలను వెచ్చించిన తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలని గవర్నర్ ఉద్బోధించారు. విశ్వవిద్యాలయాల్లో పట్ట్భద్రులైన విద్యాధికులంతా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఉన్నత విద్యావంతులైన యువత భుజస్కంధాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారతదేశంలో నివసిస్తున్న వారి సగటు వయస్సు 2020 నాటికి 29 సంవత్సరాలుగా నిర్ధారించారని, ఇది చైనా, అమెరికాలోని వారి సగటు వయస్సు కన్నా చాలా తక్కువన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలను పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, వివక్షలను రూపుమాపటానికి పరిశోధకులు దృష్టి సారించాలని కోరారు. దేశస్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతో మంది నాయకులు త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధికి కృషి చెయ్యాలని ఆయన కోరారు. అనంతరం తెలుగు జర్నలిజంలో విశేష క్షృషి చేసిన సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌కి గవర్నర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పిహెచ్‌డి పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, వర్సిటీ వీసీ ఆచార్య పీ రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కే రోశయ్య, వివిధ విభాగాలకు చెందిన డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
నాగార్జున వర్సిటీ స్నాతకోత్సవంలో సీనియర్ పాత్రికేయుడు
*చిత్రం...ఏబీకేకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్