రాష్ట్రీయం

ఆలోచనా ధోరణి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: విధానాల రూపొందిస్తే చాలదని, వాటి అమలు కూడా చాలా ముఖ్యమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. అందుకోసం అధికారుల పనితీరు, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంత్యోదయ నినాదాన్ని అమలు చేయాలని, పథకాలను ప్రజా ఉద్యమాలుగా మలచాలని ఆయన స్పష్టం చేశారు. అపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలుగుతామని ఉప రాష్ట్రపతి చెప్పారు. శనివారం నాడు ఆస్కిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో చక్కని విధానాలను కొరత లేదని అయితే వీటిని సమర్ధంగా అమలు చేయాల్సిన అవసరముందని అన్నారు. అధికారుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, ఆ దిశగా అధికారులకు అవసరమైన
శిక్షణ అందించాలని సూచించారు. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థలో మార్పులు రావాలని అపుడే సమాజంలో చివరి వ్యక్తికి కూడా లబ్ది చేకూరుతుందని అన్నారు. 70 ఏళ్లుగా భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిందని, అయితే సమగ్రాభివృద్ధి జరుగుతోందా అనే విషయంపై దృష్టి సారించాలని అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల,మత, లింగ వివక్ష వంటి అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్తేనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోలుగుతామని అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, నైతికత , విలువలను నేర్చుకుని అమలు చేసేందుకు ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోందని అన్నారు. భారతీయ సంస్కృతి, మన సామర్ధ్యం, మన వంటకాలు, మన సినిమాలు అంటే విదేశీయులకు చాలా ఇష్టమని అన్నారు. అందుకే మన దగ్గర సామర్ధ్యం నిర్మాణం కోసం విదేశాలు తమ ప్రతినిధులను భారత్‌కు పంపిస్తున్నాయని అన్నారు. వీరితో పాటు ఇక్కడున్న మండల స్థాయి అధికారుల వరకూ శిక్షణ ఇచ్చి ప్రజాసేవల వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చడంలో ఆస్కి వంటి సంస్థలు కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ఉన్న వివిధ దేశాల్లో అమలు అవుతున్న అత్యుత్తమ పద్ధతులను అవలంభించేందుకు ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదని అన్నారు. సంక్షేమ పథకాల తుది లక్ష్యం అంత్యోదయమేనని, ఇది చేరుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వచ్ఛ భారత్, భేటీ బచావో- భేటీ పడావో, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చాలని చెప్పారు. డిజిటలీకరణ, ఆన్‌లైన్ వంటి వాటి ద్వారా వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చవచ్చని చెప్పారు. ప్రధాన మంత్రి సూచించిన సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే నినాదాన్ని సరిగా అర్ధం చేసుకుని అధికారులు వ్యవహరించాలని అన్నారు. అంతకుముందు ఉప రాష్టప్రతి ఆస్కిలోని వివిధ విభాగాలను సందర్శించారు. శిక్షణార్థులతో ముఖాముఖి మాట్లాడి దిశానిర్దేశనం చేశారు. చైర్మన్ పద్మనాభయ్య అధ్యక్షత వహించారు.

*చిత్రం...ఆస్కిలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు