రాష్ట్రీయం

లింగ వివక్ష లేని ప్రపంచాన్ని సృష్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్ర్తి, పురుష లింగ వివక్ష లేని ప్రపంచాన్ని సృష్టించాలని, విద్యతో పాటు ఆర్థిక స్వావలంబన, సాధికారత కల్పించిన నాడే మహిళలకు సమాజంలో సమానత్వం దక్కుతుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని, వారికి మంచి విద్యాబుద్ధులను నేర్పించాలని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతలో మహిళలు మంచి పురోభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు. అయినా వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని చెప్పారు.
రాజకీయంగా, సామాజికంగా మహిళలను ముందుకు తీసుకువెళ్లేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు ఆయన హైదరాబాద్‌లో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ సొసైటీ ఆధ్వర్యంలోని ఏఎంఎస్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లోనూ, అనంతరం హోటల్ దసపల్లాలో జరిగిన వేర్వేరు కార్యక్రమాలకు ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు చూడగలిగినపుడే మనం అభివృద్ధి చెందినట్టుగా చెప్పారు.
పని కేంద్రాల్లో మహిళలు క్రియాశీలకంగా ఉన్నపుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని అన్నారు. మన దేశంలో చాలాచోట్ల ఆడవారిని వంటింటి కుందేళ్లు మాదిరి చూసే పరిస్థితి ఉందని, ఇది వారికి ఆర్థిక అవకాశాల పరిధిని పరిమితం చేసిందని అన్నారు. ఈ విధానంలో మార్పు తీసుకువచ్చి వారికి విద్య, ఉద్యోగంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సమానత్వం కల్పించినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలతో సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని అన్నారు. మహిళల సాధికారతను అనేక కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాలని అన్నారు. దీనికోసం ముందు సమాజం ఆలోచన ధోరణిలో మార్పు రావాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకూ సాధికారత చాలా అవసరమని, దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న మహిళలకు సరైన అవకాశాలు కల్పించి వారి శక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.
దేశాభివృద్ధిలోనూ మహిళా సాధికారత ఎంతో ముఖ్యమని, భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అన్ని శాఖల్లోనూ మనవాళ్లు మహిళలకు కేటాయించారని, అందులో ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా లక్ష్మీదేవి, రక్షణ మంత్రిగా పార్వతీదేవి, విద్యామంత్రిగా సరస్వతీదేవిని నిలిపారని, ఇలా అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. మహిళలు సృష్టిలో సగభాగమని, మంచి చేసిన వాళ్లను గుర్తుపెట్టుకుని సత్కరించడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. స్ర్తి లేకపోతే సృష్టి లేదని చెప్పారు. సమస్త జగత్తును నడిపించేది మహిళలేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఓబుల్‌రెడ్డి విద్యాసంస్థ చైర్మన్ ఎన్‌వీ రావు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారెడ్డి, కార్యదర్శి నర్సింహారావు, ప్రధానోపాధ్యాయురాలు లతాశంకర్ పాల్గొన్నారు. దసపల్లాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు కరుణా గోపాల్, వివిధ రంగాలకు చెందిన మహిళలు, యువతులు పాల్గొన్నారు.
*చిత్రాలు...అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
*హోటల్ దసపల్లాలో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్