రాష్ట్రీయం

హిందూత్వ రాజ్య నిర్మాణమే బీజేపీ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 9: దేశంలో హిందూత్వ రాజ్య స్థాపనే ప్రధాన అజెండాగా కేంద్రంలోని బీజేపీ మత ప్రాతిపదికన విభజించేందుకు కుట్ర పన్నుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. అనంతపురం నగరంలో సోమవారం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా లౌకికరాజ్య పరిరక్షణ-యునైటెడ్ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని, సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం కొనసాగింపుగా అనంతపురంలో ఉద్యమం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ప్రస్తుతం మనం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నామని, దేశంలో లౌకికవాదం, రాజ్యాంగస్ఫూర్తిపై తీవ్రదాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా విద్యార్థులు, యూనివర్సిటీలకు ఈ దుష్టవిధానం పాకిందన్నారు. రాజ్యాంగానికి, లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు కేంద్రంలోని పాలకవర్గాల నుంచి ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వ్యాప్తి కారణంగా ప్రజల మధ్య చిచ్చురేగుతోందన్నారు. కనుక దేశప్రజలు ఐక్యత, లౌకకవిధానం, రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించారని, పార్లమెంట్‌లో ప్రజలకు సంబంధించి కాకుండా, ఇతరత్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చూశామని, ఈ పరిస్థితులే అనేక విచ్ఛిన్నకర ఘటనలకు తావిస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఇందులో రాజ్యాంగ పరిరక్షకులు, మేధావులే కాదు.. జర్నలిస్టులు కూడా మినహాయింపు కాదని చెబుతూ, కేరళలో రెండు టీవీ ఛానళ్లపై నిర్బంధం విధించారని ఉదహరించారు. మన రాజ్యాంగం లౌకిక, ప్రజాస్వామిక, సాంస్కృతిక విధానాలతో కూడుకున్నదని, స్వాతంత్య్రోద్యమంలో ఇలాంటి జాతీయ భావాలతో రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూ వస్తున్నామని అన్నారు. భారతదేశం మతరాజ్యం రాదు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడానికి, ప్రజల హక్కులు సంరక్షించుకోవడానికి మతప్రమేయం లేని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామన్నారు.
బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకించే ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నిర్మించాల్సిన కర్తవ్యం మన ముందుందన్నారు. ఈ ఉద్యమాన్ని నిలువరించే ఎలాంటి శక్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొందామని సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు. వారి నిర్ణయాల వల్ల లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ హిందూరాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయని, ఒకే దేశం, ఒకే విధానం, ఒకే పన్ను వంటి వాటి ముసుగులో తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. సీఏఏతో వీరి విధానం అమలు కాలేదని, అంతకుముందే ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి తెచ్చారన్నారు. భారత రాజ్యాంగంలోని వౌలిక విధానాలను మార్చే హక్కు పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, కేశవభారతి కేసులో కూడా తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏ ఒక్క వ్యక్తికీ కులం, మతం, ప్రాంతం, ఇతర భేదాలతో పౌరసత్వం నిరాకరించరాదని, ఆర్టికల్ 13లో కూడా చట్టపరమైన అంశాలు వర్తింపజేయడంలో మతం ప్రాతిపదిక కాదని చెబుతున్నాయని అన్నారు. అయితే మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని బీజేపీ తెచ్చిందన్నారు.
*చిత్రం...అనంతపురం నగరంలో సోమవారం జరిగిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వ్యతిరేక సభలో ప్రసంగిస్తున్న కేరళ ముఖ్యమంత్రి విజయన్