రాష్ట్రీయం

‘నియంత్రణ’ నడుమ నదీ పర్యాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 10: నియంత్రణ, నిబంధనల మధ్య రాష్ట్రంలో మళ్లీ నదీ పర్యాటకం మొదలు కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసుకుని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నదీ పర్యాటకానికి శ్రీకారం చుడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం దరిమిలా రాష్ట్రంలో మొత్తం నదీ పర్యాటకమంతా నిలిచిపోయింది. అధ్యయన కమిటీ నివేదిక అనంతరం నూతన పర్యాటక విధానంలో భాగంగా ముందుగా గోదావరి నదీ పర్యాటకానికి సిద్ధం చేస్తున్నారు. నదీ పర్యాటకాన్ని నియంత్రించడానికి కంట్రోల్ రూంలు నెలకొల్పుతున్నారు.
గోదావరి నదికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం గండిపోచమ్మతల్లి గుడి జంక్షన్, పోచవరం, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో సింగన్నపల్లి, పాపికొండల పర్వత సానువుల పరీవాహంలోని పేరంటాపల్లి వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. కృష్ణా నదికి సంబంధించి విజయవాడలోని బెరం పార్కువద్ద, కర్నూలులోని శ్రీశైలం, గుంటూరులోని నాగార్జున సాగర్‌వద్ద, ఇవికాక విశాఖపట్నంలోని రుషికొండ వద్ద ఏపీటీడీసీ నియంత్రణ కేంద్రాలు సిద్ధంచేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో పర్యాటక శాఖ, నీటిపారుదల, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, పర్యాటక శాఖ నుంచి సిబ్బంది 11మంది ఉంటారు. ఈ నియంత్రణ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.62 కోట్లు కేటాయించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగన్నపల్లి వద్ద నియంత్రణ కేంద్రానికి రూ.22 లక్షలు, పాపికొండలు వద్ద పేరంటాలపల్లి నియంత్రణ కేంద్రం వద్ద రూ.20 లక్షలు, రాజమహేంద్రవరంలోని నియంత్రణ కేంద్రాన్ని రూ.30 లక్షలతోనూ నిర్మించారు. పోచవరం, గండిపోచమ్మతల్లి గుడి జంక్షన్ వద్ద నియంత్రణ కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించారు.
నదీ పర్యాటక పర్యవేక్షణ అంతా ఈ నియంత్రణ కేంద్రాల నుంచే జరుగుతుంది. ఈ కేంద్రంలోనే టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు నిర్మించారు. పర్యాటకుల సౌకర్యార్ధం వేచియుండు గది, వాష్‌రూమ్, స్టోర్, హాల్, ఆఫీస్‌రూమ్, సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. నాలుగు సీసీ కెమెరాలు, నాలుగు వాకీ టాకీలు ఈ కేంద్రంలో వుంటాయి. ఈ కేంద్రాల్లో స్విమ్మర్లు, బోటు డ్రైవర్, నైట్ గార్డు వుంటారు. పర్యాటకుల వివరాలన్నీ తీసుకున్న తర్వాత, కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత బోటు ఇక్కడ నుంచి కదులుతుంది. సెల్ నెట్ వర్కు సమస్యవల్ల ఎక్కడైనా సమాచారం అందని పరిస్థితి వుంటే వాకీటాకీలు వినియోగిస్తారు. రాజమహేంద్రవరంలోని లాంచీల రేవు వద్ద ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నియంత్రణ కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. విద్యా సంస్థల సెలవులు మొదలయ్యే వేసవి సీజన్ ఆరంభానికి ముందే నదీ పర్యాటకాన్ని పునఃప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
*చిత్రం...సిద్ధమైన ఏపీటీడీసీ పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రం