రాష్ట్రీయం

శ్రీవారి దర్శనాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: నిరంతరం నిత్యకల్యాణం, పచ్చతోరణంగానూ, వేలాది మంది భక్తులతోనూ, వారి గోవిందనామస్మరణలతో మార్మోగే కలియుగ ప్రత్యక్షదైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల క్షేత్రం శుక్రవారం నుంచి పూర్తిగా నిర్మానుష్యం కానుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా తాకింది. గురువారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్ (65) అనే వృద్ధుడికి కరోనా లక్షణాలు కనబడిన నేపథ్యంలో శుక్రవారం నుంచి వారం రోజుల పాటు శ్రీవారి భక్తులను తిరుమలకు అనుమతించకూడదని ప్రభుత్వ సూచన మేరకు టీటీడీ యాజమాన్యం
నిర్ణయం తీసుకుంది. తిరుమల - తిరుపతిల మధ్య ఉన్న రెండు కనుమమార్గాలను కూడా మూసివేయనున్నారు. యూపీలోని మీర్జాపూర్‌కు చెందిన దయాశంకర్ (65)కు నెగెటీవ్ వచ్చినట్టు గురువారం సాయంత్రం స్విమ్స్ ఆసుపత్రిలో జరిగిన పరీక్షల్లో తేలింది. స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ బి. వెంగమ్మ మాట్లాడుతూ దయాశంకర్‌కు కరోనా వైరస్ లేదని ధ్రువీకరించారు.
కాగా ముందు జాగ్రత్తగా భక్తులను స్వామి దర్శనానికి తాత్కాలికంగా వారం రోజుల పాటు నిలిపివేసినా స్వామివారి మూలవిరాట్టుకు నిరంతరం జరిగే కైంకర్యాలు మాత్రం ఆగమోక్తంగా, యధావిధిగా, ఏకాంతంగా అర్చకులు కొనసాగిస్తారు. తిరుమలలో కరోనా సృష్టించిన కల్లోలం దాదాపు 128 సంవత్సరాల తరువాత శ్రీవారి భక్తులను స్వామి దర్శనానికి అనుమతించుకోలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. కరోనా వైరస్‌పై గత 20 రోజుల నుంచి టీటీడీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. అలిపిరి నుంచే తిరుమలకు వెళ్లే ప్రతి వ్యక్తినీ స్క్రీనింగ్‌చేసి మరీ పంపుతోంది. అలాగే తిరుమల అశ్విని ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. తిరుమల అంతటా శానిటైజేషన్‌కు అదనపు ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇన్ని చర్యలు చేపట్టినా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భక్తబృందంలోని ఓ వ్యక్తి ఈ కరోనా లక్షణాలతో కనబడటం అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంలోనే కాకుండా టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా భక్తులను వారం రోజులపాటు అనుమతించకూడదని, యథావిధిగా స్వామివారి కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దయాశంకర్ విషయం తెలియగానే టీటీడీ ఈఓ ఏకేసింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులందరూ అన్నమయ్య భవన్‌లో సమావేశమై అతికీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఈఓ ఏకే సింఘాల్ అన్నమయ్య భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం నుంచి భక్తుల ఆలయప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సంప్రదించి శ్రీవారి ఆలయంలోకి భక్తులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ప్రతినిత్యం స్వామివారికి నిర్వహించే నిత్యకైంకర్యాలు మాత్రం అర్చక స్వాములు ఏకాంతంగా నిర్వహిస్తారన్నారు. ముందుజాగ్రత్త చర్యగా గురువారం సాయంత్రం 3 గంటలకే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేశామన్నారు. సమయ నిర్దేశిత టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనం, శుక్రవారపు ఆర్జిత సేవ టిక్కెట్లు పొందిన భక్తులకు మాత్రం దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. ఎందుకంటే వీరంతా ఇప్పటికే తిరుమలకు చేరుకుని ఉన్నారన్నారు. శుక్రవారం ఉదయం పూజలున్న వారిని అనుమతించి ఉదయం 9.30 గంటలకు భక్తులను అలిపిరి నుంచి తిరుమలకు అనుమతించబోమన్నారు. భక్తులు కూడా సహకరించాలన్నారు. తిరుమలలో ఉన్న భక్తులందరూ తిరుపతికి తరలివెళ్లేంత వరకు కల్యాణకట్ట, అన్నదానం, పీఎసీలను తెరచి ఉంచుతామని, అటు తరువాత వాటిని కూడా తాత్కాలికంగా మూసివేస్తామన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలను ఆలయంలోపలికే పరిమితం చేస్తామని, వాహనసేవలను కూడా ఊరేగించబోమన్నారు. ఇక ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మే 2నుంచి బ్రహ్మోత్సవాలు జరగాల్సి ఉందన్నారు. వాటికి ఇంకా సమయం ఉండటంతో అటు తరువాత ఒక నిర్ణయం చేయాలని నిర్ణయించామన్నారు. ఈలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తూ వారిచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకొని ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన సుమారు 130 మంది భక్తులు ఈనెల 11న తమ స్వగ్రామం నుంచి బయల్దేరి అల్హాబాద్‌కు వెళ్లి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. అక్కడ నుంచి కలకత్తా వెళ్లి కాళీమాతను దర్శించి అటు తరువాత పూరీకి వెళ్లి పూరీజగన్నాథుడిని దర్శించుకొని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకున్నారని టీటీడీ ఈఓ ఏకే సింఘాల్ గురువారం విలేఖరులకు వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో శ్రీశైలంకు చేరుకొని రాములవారిని దర్శించుకొని బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు చేరుకుని మాధవం పీఏసీలో బస చేశారన్నారు. దయాశంకర్‌కు ఆధార్‌కార్డు లేకపోవడంతో ఆయన స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి వెళ్లలేదన్నారు. తక్కిన వారు వెళ్లారన్నారు. దయాశంకర్ గత 20 సంవత్సరాలుగా క్రానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. దయాశంకర్ గురువారం మధ్యాహ్నం ఊపిరాడక పడిపోవడంతో ఆయన్ను స్థానిక అశ్వని ఆసుపత్రికి తరలించామని ఈఓ ఏకే సింఘాల్ తెలిపారు. అలాగే దయాశంకర్‌తో వచ్చిన వారందరినీ కూడా తిరుమలలోనే ఉంచి వారిని పరిశీలనలో పెట్టామన్నారు. వీరు బసచేసిన మాధవం పీఏసీలో రెండు రోజులుగా ఎవరెవరు ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో టీటీడీ విద్యాసంస్థలు ఈనెల 31 వరకు మూసివేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, టీటీడీ సీవీఎస్‌ఓ గోపీనాధ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి తిరుమలలో ఉండటంతో వారం రోజుల పాటు భక్తులను ఆలయంలోకి తాత్కాలికంగా అనుమతించకూడదని టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్వామివారి ప్రసాదాల్లో ఒకటైన వడలను సామాన్య భక్తులకు విక్రయించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
*చిత్రం...విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ ఏకే సింఘాల్