రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: నూతన సంవత్సరంలో శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించనుంది. ఆంగ్ల నూతన సంవత్సరం తరువాత తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ రూ. 50 విలువ కలిగిన శ్రీవారి లడ్డూను ఉచితంగా అందించనుంది. ఇదిలావుండగా ప్రస్తుతం ఉచిత క్యూలైన్లలో వెళ్లే భక్తులకు 70 రూపాయలకు 5 లడ్డూలను అందిస్తోంది. ఇందులో ఒకటి ఉచితంగాను, రూ. 10 చొప్పున 2, రూ. 25 చొప్పున 2 లడ్డూలు అందిస్తోంది. అదనపు లడ్డూను రూ. 50కి అందిస్తోంది. దీంతో పలురకాల సమస్యలను టీటీడీ ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆర్థికంగా భారం పడుతుండటంతో పాటు అంతకుమించి సబ్సిడీ లడ్డూలను దళారీలు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం టీటీడీ ఒక లడ్డూ తయారీకి రూ. 39 ఖర్చు చేస్తోంది. రోజుకు 60వేల లడ్డూలు ఉచితంగా, తక్కిన లడ్డూలు సబ్సిడీపై ఇవ్వడంతో సంవత్సరానికి రూ. 200 నుంచి 250 కోట్ల రూపాయల నష్టాన్ని టీటీడీ భరించాల్సి వస్తోందని అంచనా. ప్రస్తుతం ఐదుమంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉచిత క్యూలైన్లో వెళితే వారు రూ. 350కే 35 లడ్డూలు అందుతాయి. ఇందుకు టీటీడీ లడ్డూలకు పెట్టే ఖర్చు రూ. 1,365. అంటే ఐదుగురు భక్తులకు టీటీడీ ఇచ్చే లడ్డూలకు రూ. 1,015 అదనపు భారంగా మారుతోంది. అంతేకాకుండా దళారీల బెడద పెరుగుతోంది. దీంతో టీటీడీ అధికార యంత్రాంగం అప్రతిష్టను మోయాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి విధానాలకు స్వస్తి పలికి ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే అదనపు లడ్డూలు అవసరమైన వారికి అధికారుల నుంచి అనుమతితో సంబంధం లేకుండా లడ్డూ కౌంటర్‌లోనే రూ. 50 చొప్పున ఎవరికి ఎన్ని లడ్డూలు అవసరమైతే అన్నింటిని ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి టీటీడీ యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేయకపోయినా మీడియాకు ఉప్పందించారు. తద్వారా వచ్చే విమర్శలు, ప్రశంసలను పరిగణనలోకి తీసుకుని అధికారులు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సర్వసాధారణంగా కుటుంబ సమేతంగా వస్తారని, కుటుంబంలో ఐదుగురు ఉంటే వారికి ఐదు ఉచిత లడ్డూలు వస్తాయని, అదనంగా అవసరమైనప్పుడు లడ్డూలను కొనుగోలు చేసుకోవచ్చని ఇది మంచి నిర్ణయమని టీటీడీ వర్గాలు అంటున్నాయి. అలాగే టీటీడీ ఉద్యోగులకు అందించే సబ్సిడీ లడ్డూల ధరలను కూడా పెంచాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. తద్వారా హైందవ ధార్మిక సంస్థ ధర్మాన్ని పాటించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఉచిత లడ్డూ విధానాన్ని అందరూ స్వాగతించినా సబ్సిడీపై లడ్డూలు విక్రయించడం పట్ల గతంలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే మరికొంతమంది మాత్రం భక్తుల సొమ్ముతో సమకూరుతున్న నిధులతో టీటీడీ నడుస్తోందని అలాంటప్పుడు సామాన్య భక్తులకు సబ్సిడీ ధరలతో లడ్డూలు ఇవ్వడం మంచిదనే వాదన కూడా వినిపించింది. ఇందుకు సంబంధించి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి సామాన్య భక్తులకు సబ్సిడీని తొలగించడం సరికాదని అంటున్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే టీటీడీలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న అదనపు ఈఓ ధర్మారెడ్డి కొన్ని దశాబ్దాల క్రితం నిర్ణయించిన ఆర్జిత సేవల ధరలను పెంచాల్సి ఉందని భక్తులు అంటున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ. 220కి విక్రయించే సుప్రభాతం టికెట్టు కొన్నవారికి టీటీడీ రెండు లడ్డూలు ఉచితంగా అందిస్తోంది. అంటే కేవలం రూ. 120కే సుప్రభాతం సేవను అందిస్తున్నారు. ఇలా తోమాల, అర్చన వంటి సేవలు కూడా వరుసలో ఉన్నాయి. అయితే ఇలాంటి ఆర్జిత సేవలు సామాన్య భక్తులు పొందడం ఒక విధంగా అసాధ్యమనే చెప్పక తప్పదు. అలాగే రూ. 300 టికెట్టుపై కూడా రెండు లడ్డూలను టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఉచితంగా ఇలా టికెట్లపై ఇచ్చే విధానాన్ని రద్దు చేయడమా లేక టికెట్టు ధర పెంచాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. రూ. 300 టికెట్టు ధర పెంచాలంటే విఐపీలకు కేటాయిస్తున్న రూ. 500 టికెట్టు ధర పెంచాలి. అది అధికారులకు సాధ్యం కాకపోవడంవల్లే ఇప్పటివరకు తక్కిన టికెట్ల ధరలను పెంచే సాహసం చేయలేకపోతున్నారు.