రాష్ట్రీయం

వర్గీకరణకు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 27: వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ధర్మ యుద్ధానికి కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాదిగలు చేపట్టిన వర్గీకరణ చట్టబద్దత కోసం వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందినప్పుడే అసలు ప్రగతి సాధ్యమన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌తోపాటు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారం చివరనున్న వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు దక్కాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. అందుకే దశాబ్థాలుగా ఎమ్మార్పీస్ చేస్తున్న పోరాటానికి చట్టబద్దత కల్పించడానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, చట్టబద్ధత కల్పించే విధానానికి రూపకల్పన చేయనున్నట్టు ప్రకటించారు. మాదిగల చిరకాల న్యాయమైన కోరిక నెరవేరుతుందని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కొంతమందికి తనపై కోపంవచ్చే అవకాశం ఉందని, అయినా ఫర్వాలేదని, తాను గతంలోనే ఎమ్మార్పీస్ ఉద్యమం రాకముందే వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తానని గుర్తు చేశారు. తనను ఆనాడే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా? అని ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. మాదిగలది న్యాయమైన పోరాటమని, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేంత వరకు తాను వెన్నుదన్నుగా ఉండి సహకారం అందిస్తానని, అవసరమైతే పోరాటానికి సిద్ధమని వెంకయ్యనాయడు ప్రకటించారు. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఏ పదవీ ఆశించబోనంటూ, రాజకీయ చరమాంకంలో ఉన్న తాను ఏ స్వార్థం ఆశించి ఈ ప్రకటన చేయడం లేదని ప్రకటించారు. దక్కాల్సిన వారికి న్యాయం దక్కాలన్నదే తన ఆరాటమని వివరించారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందరికీ అందాలని, అందరికీ న్యాయం జరగాలని ఆనాడే అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సహకారంతో మాదిగల న్యాయమైన కోరికను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని దేశాన్ని మార్చడానికి రిఫామ్స్, పెర్‌ఫామ్స్, ట్రాన్స్‌పామ్ ప్రాతిపదికన ముందుకు సాగుతున్నారని తెలిపారు. తన్‌సే, మన్‌సే, ధన్‌సే స్వచ్ఛ భారత్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజ హితానికి మంద కృష్ణ చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
దోచుకున్నది, దాచుకున్నది కాదు
సభకు అధ్యక్షత వహించిన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల వర్గీకరణ కోరికను బలంగా చాటడానికి, గొంతును వినిపించడానికి ఈ ధర్మయుద్దాన్ని ఎంచుకున్నామని ప్రకటించారు. ఇది ఎవరి మీదో పోరాటం కాదని గుర్తు చేశారు. తాము దోచుకున్నది, దాచుకున్నది లేదని, కేవలం కూలీమీద ఆధారపడి జీవించే దళితులు స్వచ్చంధంగా తరలివచ్చి తమ ఆకాంక్షను చాటి చెప్పారన్నారు. తమ ఆవేదనకు, ఆకాంక్షకు ప్రతిరూపం ఈ మహాసభ అన్నారు. ఇప్పటికి మూడు కమిషన్‌లు వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినా, అన్ని పార్టీలు మద్దతు ప్రకటించినా ఇప్పటి వరకు చట్టబద్ధత జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్యపైనే మాదిగ జాతి యావత్తూ ఆశలు పెట్టుకున్నదని, న్యాయం జరుగుతుందన్న ఆశతో ఎదురు చూస్తోందని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మార్పీస్ ధర్మయుద్దానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని, పార్లమెంట్‌లో బిల్లు పెడితే పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాలు తీర్మానాలు చేసినా, కమిషన్‌లు నివేదికలు అనుకూలంగా ఇచ్చినా వర్గీకరణ జరగలేదన్నారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలు మాట్లాడుతూ ధర్మయుద్దం న్యాయమైందని, ఇప్పటికే ఆలస్యమైందని వెంటనే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా హయాంలో వర్గీకరణను అమలు చేస్తే దాదాపు 22వేల మందికి లాభం చేకూరిందని, కాని కొంతమంది కోర్టుకు వెళ్లడం ద్వారా చట్టబద్ధత అవసరమైందని గుర్తు చేశారు. ఇంకా సభలో ఎంపీలు నంది ఎల్లయ్య, రాపోలు ఆనంద భాస్కర్, కాంగ్రెస్ నాయకులు శైలజానాధ్, కె జానారెడ్డి, బిజెపి నాయకులు డాక్టర్ లక్ష్మణ్, జి కిషన్‌రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ చేపట్టిన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కర్ణాటక మంత్రి హెచ్ ఆంజనేయ, స్వామి ఆగ్నివేష్, సిపిఎం నాయకులు నాగయ్య, డిసి రోషయ్య, బొట్ట శ్రీనివాస్, విమలక్క, కవులు, కళాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

చిత్రం... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధానికి వచ్చిన మాదిగలకు అభివాదం చేస్తున్న మంద కృష్ణ మాదిగ