ఆంధ్రప్రదేశ్‌

సీమ ప్రాజెక్టులకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 11: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్‌టి రామారావు కృషి ఫలంగానే సీమ జిల్లాల్లోని ప్రాజెక్టులకు మోక్షం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాయలసీమ ఎడారిగా మారకముందే కృష్ణామిగులు జలాలను సీమ జిల్లాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కడప జిల్లా గండికోట జలాశయం నుంచి నీటిని పులివెందులకు తరలించే క్రమంలో పైడికాలువకు బుధవారం విడుదల చేశారు. గండికోట వద్ద పైలాన్‌ను సిఎం ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కృష్ణామిగులు జలాలను సీమకు తరలించేందుకు గండికోట, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు టిడిపి హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తికావడంతో ప్రారంభించారన్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అర్థాంతరంగా నిలిచిన ప్రాజెక్టుల నిర్మాణాలను తిరిగి తామే పూర్తి చేసి ప్రారంభిస్తున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌పార్టీ పాలనలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. పచ్చని పొలాలతో కళకళలాడే భూములను ఎడారిగా చేసి ప్రజలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టిడిపి తిరిగి అధికారంలోకి రాగానే వైఎస్ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు, తమ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నామన్నారు. వీటన్నింటినీ చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చినా తాను వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయించేందుకు కేంద్రంపై వత్తిడి తెచ్చామన్నారు. ఆ ఏడు మండలాలను విలీనం చేయించిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుచేశానని ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ముందుకు సాగలేదన్నారు. ఏడు మండలాలు విలీనం కాకుంటే ప్రాజెక్టు మంజూరైనా తెలంగాణ ప్రభుత్వం వాటిని బూచిగా చూపి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్న భయంతోనే ప్రధానిపై ఒత్తిడి తెచ్చి మరీ ఆర్డినెన్స్ తెచ్చుకున్నామన్నారు. ప్రత్యేక హోదాకోసం పోరాడితే దానికి సాంకేతిక సమస్యలు ఎదురవడం, ఇతర రాష్ట్రాలు సైతం హోదాను ఆశించడంతో తాను వెనక్కు తగ్గానన్నారు. పోలవరానికి పూర్తిస్థాయిలో నాబార్డు నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, అందులో భాగంగా గత నెలలో రూ.1981కోట్లు విడుదల చేసిందన్నారు. దీంతో గతనెల 30న స్పిల్‌వే కాంక్రీట్ పనులు చేపట్టామన్నారు. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును ఇంచుమించు పూర్తిచేసి డెడ్‌స్టోరేజి నుంచి నీరు విడుదల చేస్తామని బాబు స్పష్టం చేశారు. 2019లో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని ఆయన అన్నారు.
హంద్రి-నీవా సుజలస్రవంతి పథకాన్ని త్వరలో పూర్తిచేసి చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా మడకశిర వరకు తాగునీరు ఇస్తామని సిఎం పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నీరు గండికోటకు తీసుకొచ్చేందుకు అవుకు ప్రాజెక్టు సొరంగమార్గానికి సాంకేతిక లోపం తలెత్తడంతో నీటి విడుదలలో జాప్యం జరిగిందన్నారు. దానికి ప్రత్యామ్నాయం టనె్నల్ నిర్మాణం పనులు చేపట్టామని అది పూర్తయితే 6 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అన్నారు. వెలుగోడును గడువులోగా పూర్తిచేసి తెలుగుగంగకు 17 నుంచి 18 టిఎంసిల నీటిని తరలిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎడారిగా మారిన సీమ జిల్లాల ప్రజలను ఆదుకునేందుకు కర్నూలులో ఈనెల 2న జన్మభూమి ప్రారంభం రోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామన్నారు. జన్మభూమి ముగింపు సందర్భంగా బుధవారం గండికోట రిజర్వాయర్‌ను ప్రారంభించామన్నారు. దీంతో సీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలన్న తమ ధ్యేయం నెరవేరిందన్నారు. జన్మభూమి - మా ఊరు ద్వారా కుటుంబ వికాసం నిమిత్తం 15 సూత్రాలతో 15 సమస్యలు గుర్తించి నిరుపేదలందర్నీ ఆదుకుంటూ ప్రజలకు వౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బాబు గుర్తు చేశారు. సభలో మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరరావు, మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

చిత్రం... గండికోట జలాశయం నుంచి పులివెందులకు జలాలు విడుదల చేసిన అనంతరం సభలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు