రాష్ట్రీయం

సమావేశాలకు సెలవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీని బహిష్కరించిన వైకాపా
రోజా సస్పెన్షన్‌పై ఆగ్రహం
కాల్‌మనీ చర్చ ముగింపుపై నిరసన
నిష్క్రమించిన జగన్, ఎమ్మెల్యేలు
జగన్ సైకో: పీతల, అచ్చెన్నాయుడు

హైదరాబాద్, డిసెంబర్ 21: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై అర్థాంతరంగా చర్చ ముగించినందుకు, వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాపై ఏడాదిపాటు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయనందుకు నిరసనగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం శాసనసభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీ రాకెట్, ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై ప్రతిపక్ష నేత జగన్, మంత్రి యనమల మధ్య వాగ్వాదం జరిగింది. తొలుత ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ కాల్‌మనీ అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలను ప్రజలు చూస్తున్నారన్నారు. కాల్‌మనీపై చర్చ సగంలోనే ముగిసిందన్నారు. సభలో రెండే పక్షాలున్నాయని, ఒకటి అధికార పక్షం తెదేపా, రెండోది ప్రతిపక్షం వైకాపా అన్నారు. బిజెపి ఇప్పటికే తెదేపా కండువా వేసుకుందన్నారు. అధికార పార్టీ తెదేపా తమకు అధికారం ఉంది కదాని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిందన్నారు. స్పీకర్ అధికారాల గురించి రాజ్యాంగం పదవ షెడ్యూల్ ఏడవ నిబంధనలో ఉందన్నారు. ప్రస్తుతం తమ పార్టీ స్పీకర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే ప్రతిపాదన ఉన్నట్టు చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం వైకాపాపట్ల అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభను బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
సస్పెన్షన్ ఎత్తివేయలేం: యనమల
వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే ప్రసక్తిలేదని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. సస్పెన్షన్‌పై నిర్ణయం సభ మొత్తం తీసుకున్నదన్నారు. ఎట్టి పరిస్ధితుల్లో రోజా సస్పెన్షన్‌ను సమీక్షించే ప్రసక్తిలేదన్నారు. అసెంబ్లీ సర్వోన్నతమైనదని, బాయ్‌కాట్ చేస్తామంటే చేసుకోవచ్చని ఆయన ప్రతిపక్షనేత జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుని సస్పెండైన ఎమ్మెల్యే రోజా తాను చేసింది తప్పని అభ్యర్ధించాల్సి ఉంటుందని, అలాకాకుండా హౌస్ తప్పుచేసింది సరిదిద్దుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు తప్పుదోవబట్టించే విధంగా ఉండరాదన్నారు. బిఏసి సమావేశంలో కాల్‌మనీపై ప్రకటన తర్వాత చర్చకు ప్రతిపక్షం అంగీకరించి, ఇప్పుడు చర్చ తర్వాత ప్రకటనకు అనుమతించడంపై స్పీకర్‌కు దురుద్దేశ్యాలు ఆపాదించడం తగదన్నారు. ప్రధాన ప్రతిపక్షం చర్చలో పాల్గొని అర్ధవంతమైన చర్చ చేయాలన్నారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలపై కోర్టులకు వెళ్లడం, సభను బహిష్కరించడమనేది వైకాపా ఇష్టమన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ తమ పార్టీ అభాండాలు వేసే కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలు చూస్తున్నారని, రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయనందుకు బాయ్‌కాట్ చేస్తున్నామని, సభకు సెలవు అని నమస్కారం పెట్టి సభనుంచి వెళ్లిపోయారు. జగన్‌వెంట వైకాపా ఎమ్మెల్యేలు సభనుంచి నిష్క్రమించారు. దీనిపై ప్రతిపక్షనేత జగన్ స్పందిస్తూ కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ఒక ఎమ్మెల్సీ సోదరుడుకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఈ కేసుపట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటని ప్రశ్నించారు. కాల్‌మనీపై చర్చ జరగాలని, ఇంకా మాట్లాడాలన్నారు.
జగన్ సైకో: మంత్రులు ధ్వజం
సభనుంచి వైకాపా సభ్యులు వెళ్లిపోయిన తర్వాత స్పీకర్ అనుమతితో మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. జగన్‌కు స్ధిరతక్వం లేదని, ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నారన్నారు. తాను ఏదనుకుంటే అదే చేయడంతప్ప ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదన్నారు. సభా సమయాన్ని వృధా చేశారన్నారు. సభలో ప్రతిపక్షం లేనందువల్ల టిడిపినే ప్రతిపక్షంలా వ్యవహరిస్తుందన్నారు. బిజెపి ఒక జాతీయ పార్టీ అని, ఆ విషయాన్ని మర్చిపోయి, టిడిపి కండువాలు కప్పుకున్నారంటే జగన్ విమర్శించడం తగదని మంత్రి కామినేని అన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అంబేద్కర్‌పై చర్చ వ్యతిరేకించినప్పుడు జగన్ పతనం ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్యే రోజా ప్రవర్తన మహిళలు తలదించుకునే విధంగా ఉందన్నారు. రోజా లేకపోతే ప్రతిపక్షం లేదన్నట్లుగా, జగన్ ఒక జూనియర్ ప్రతిపక్ష నేతలా వ్యవహరించారన్నారు. రోజా లేకపతే జగన్ మాట్లాడే పరిస్ధితి లేదా అన్నారు. సిఎం పట్ల రోజా చేసిన వ్యాఖ్యలు అసమంజసమన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎర్రచందనం గురించి మాట్లాడితే గంగిరెడ్డి వ్యవహారం, లింకులు బయటకు వస్తాయని జగన్ భయపడ్డారన్నారు. బాక్సైట్ గురించి చర్చ ఉంటే ఎందుకు బాయ్‌కాట్ చేసినట్టన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, విజయవాడను క్రైమ్ సిటీ అంటూ అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. విజయవాడ రాజధాని కావడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. అనంతరం స్పీకర్ ఆదేశంపై సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది.