డైలీ సీరియల్

పూలకుండీలు- 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న నేనడిగితే ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, ఇపుడే డిచార్జి చెయ్యం అన్నోల్లు నేను ఇంటికి పోయొచ్చేసరికి ఈ మూడు రోజుల్లోనే ఎక్కడ దాసిపెట్టి నాటకమాడుతున్నారు. మర్యాదగా నా భార్యను తీసుకొచ్చి నాకు చూపిస్తారా లేకుంటే పోలీస్‌స్టేషన్‌కి బొయ్యి కేసు పెట్టమంటారా?’’ అంటూ పెద్ద ఎత్తున గోలకు లేచాడు.
అతని అరుపులు విన్న ఆ వెయింటింగ్ హాల్లోని పేషెంట్లు, వాళ్ళ తాలూకు మనుషులు ‘‘ఏంటి ఏంటి’’ అన్నట్టు ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకోసాగారు.
రిసెప్షన్‌లో మొదలైన అలజడికి ఉలిక్కిపడిన సెక్యూరిటీ వాళ్ళు వెంటనే పరుగెత్తుకొచ్చి ఎల్లయ్యను గొర గొరా ఈడ్చుకుంటూ తీసుకుపోయి హాస్పిటల్ ముందు రోడ్డుమీద కుదేసి ‘‘హాస్పిటల్ ముందు అనవసరంగా గొడవ చెయ్యకు. పోలీసుల్ని పిలిపించి బొక్కలో తోయిస్తాం’’ అంటూ హెచ్చరించారు.
గంజిలో నుండి తీసి పడేసిన ఈగలా రోడ్డుమీద కూలబడి ఎంతోసేపు మొత్తుకున్నా ఎల్లయ్యను వేలాదిమంది సాగిపోతున్న ఆ రోడ్డులో ఒక్కడంటే ఒక్కడన్నా ఒక్క క్షణం నిలబడి ‘‘ఎందుకిలా అరుస్తున్నవ్? విషయమేంటి?’’ అంటూ అడిగిన పాపాన పోలేదు.
అరిచీ అరిచీ అలసిపోయిన ఎల్లయ్యకు నోరు ఆర్చుకుపోవడంతో కూర్చున్న దగ్గిరినుండి లేచి వెళ్లి ఆ దగ్గర్లో వున్న వీధి కుళాయి దగ్గర పొట్టనిండా నీళ్ళు దాగి దాని పక్కనే వున్న ఓ చెట్టునీడలో కూర్చుని ‘‘వీళ్ళ సంగతి ఎట్ల తేల్చాల్నో అట్లనే తేల్చాల’’ అనుకుంటూ చాలాసేపు ఆలోచన చేసి ఓ నిర్ణయానికొచ్చాడు.
అనుకున్నదే ఆలస్యం చెట్టుకింద నుండి లేచి, గుడ్డలు దులుపుకుని సికింద్రాబాద్ ప్యాసింజర్ పట్టుకుని పాల్వంచ బయలుదేరాడు.
ఆ రాత్రి తెల్లవారు ఝామున నాలుగ్గంటలకు ఇల్లుచేరిన ఎల్లయ్య పొద్దునే్న లేచి వెళ్లి బస్తీ పెద్దలకు విషయమంతా వివరించి ‘‘నాకేదన్నా సాయం చేసి నా భార్యను నాకు అప్పగించే ఏర్పాటు చెయ్యండి!’’ అంటూ అప్పటిదాకా జరిగిన కథనంతా వివరించాడు.
ఎల్లయ్య చెప్పిందంతా ఆ చెవిన విని ఈ చెవిన వదిలిపెడుతూ వచ్చిన పెద్దమనుషులు ఆఖరికి నోరు విప్పి ‘‘నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆర్‌ఎంపి లింగయ్యమీద, హైదరాబాద్ హాస్పిటల్ వాళ్ళమీద కేసు పెట్టు. అప్పుడు పోలీసోల్లే నీ భార్యను తీసుకొచ్చి నీకెట్లా వప్పజెప్పరో చూద్దాంగాని’’ అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు తప్ప ‘‘పదా మేం గూడా నీతోపాటు స్టేషన్‌కొస్తాం’’ అంటూ ముందుకు రాలేదు.
‘‘బట్ట చాటు పుండు బావగారి వైద్యం! అన్నట్టుగా మాట్లాడుతున్న వీళ్ళు నాకేదో సాయం చేస్తారన్న నమ్మకంతో హైదరాబాద్ నుండి చావు బతుకులమీద వురికిరావడం నాదే బుద్ధి తక్కువ! అదే నాలుగు పైసలున్నోల్లకు ఏదన్నా జరిగితే ఇదే పెద్దమనుషులు ఆగమేఘాలమీద పొయ్యి ఎవర్ని కలవాలో వాళ్లను కలిసి, ఎక్కడ బత్తీ పెట్టాల్నో అక్కడ పెట్టి చెయ్యాల్సిన పని గుట్టుసప్పుడు కాకుండా చేసి పెట్టేవాళ్ళు కాదా? అందుకే అంటారు డబ్బు లేనోడు డుబ్బుకు కొరగాడని.
ఇప్పటిదాకా ఈ బస్తీలో వాళ్ళంతా శాంతమ్మ హైదరాబాద్ ఎందుకు పోయిందో తెలిసినప్పటికీ నా ముందు కొచ్చి అడిగినోల్లు లేరు. ఏదో బస్తీ పెద్దమనుషులు గదా సాయం చేస్తారని నమ్మి నా అంతట నేనే జరిగింది చెప్పుకున్నా. సాయం చెయ్యకపోగా ననే్న స్టేషన్‌కి బొయ్యి ఆ ఆర్‌ఎంపి లింగయ్యమీద కేస్ పెట్టమని ఉచిత సలహా ఇస్తున్నారు. వీళ్ళ మాటలిని ఇపుడు నేనా పని చేస్తే ఏనుగు నెత్తిన ఏనుగే మన్ను పోసుకున్నట్టు అయిద్ది దప్పా పాయిదా వుండదు గాక వుండదు. పైనుంచి విషయం ఇప్పటిదాకా తెలిసినోనికి తెలవనోనికీ మొత్తం డప్పుకొట్టి చెప్పినట్టైది. దానికన్నా అది వచ్చిన్నాడే వస్తదిలెమ్మని చేతులు ముడుసుకొని ఇంట్లో కూసునుడు వుత్తమం’’ పెద్దమనుషుల వ్యవహార శైలిమీద తనలో తను తర్కించుకోసాగాడు ఎల్లయ్య.
‘ఏందయా! మాసాయిన మమ్ముల్ని వదిలేసి నీ సాయిన నువ్వు ఏదో ఆలోచించుకుంట కూసుంటే ఏమన్నట్టు!? మాకేం పనుల్లేక ఇక్కడికొచ్చి కూచున్నామనుకుంటున్నావా?’’ చూసీ చూసీ విసుక్కుంటూ అన్నారు పెద్దమనుషులు.
వాళ్ళ మాటలకు ఒక్కసారిగా వులిక్కిపడుతూ వాస్తవంలోకొచ్చిన ఎల్లయ్య పెద్దల వంక చూస్తూ ‘‘మా అమ్మా నాయిన వాళ్ళతో ఒకసారి ఆలోచించుకొని పొయ్యొస్తా’’ అంటూ అక్కణ్ణుండి లేచి బయపడ్డాడు.
ఇంటికి వచ్చిన ఎల్లయ్యను చూస్తూనే ‘‘ఇంతసేపు యాడికి పొయినవ్ కొడుకా!’’ అంటూ అన్నం కంచాన్ని కొడుక్కి అందించింది ఎల్లయ్య తల్లి కమలమ్మ.
అన్నం తింటూనే బస్తీ పెద్దల దగ్గర జరిగిన విషయాలను తల్లిదండ్రులకు వివరించాడు ఎల్లయ్య.
కొంతసేపు అక్కడ వౌనం రాజ్యం ఏలింది.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.
పిల్లలు నలుగురూ బితుకు బితుకుమంటూ తండ్రి, తాతా, నాయినమ్మల వంక చూడసాగారు.
‘‘ఒక్కసారి ఇంటిల్రాజులందరం హైదరాబాద్ పొయ్యొద్దాం వస్తారా?’’ కొంతసేపటి తరువాత ఆలోనల్లోనుండి బయటకు వచ్చి తల్లిదండ్రుల వంక చూస్తూ అడిగాడు ఎల్లయ్య.
‘‘అట్లనే పోదాం కొడుకా! వస్తే కోడల్ని తీసుకొని ఇంటికొద్దాం. లేకుంటే ఈ ఊరు దిక్కు మల్ల తిరిగి సూడకుంట ఆ పట్నంల్నే ఏదో పనిచేసుకొని బతుకుదాం’’ కొడుకు వెన్ను తడుతూ మాట్లాడుకొచ్చారు ఎల్లయ్య తల్లిదండ్రులిద్దరూ ఏక కంఠంతో.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు