డైలీ సీరియల్

యువర్స్ లివింగ్లీ 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు కూడా అతడి కొడుకు భరణి ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నాడు.. కాకపోతే పై అంతస్థులోని పడక గదిలో శవమై పడి ఉన్నాడు.
ఒక్కగానొక్క కొడుకు మరణవార్త తాలూకు దుఃఖంతో క్రింద హాల్లో కూర్చున్న భుజంగరావు కూడా ప్రాణం వున్న శవంలాగే ఉన్నాడు.
‘‘అబ్బాయికి హార్టు ప్రోబ్లమ్స్‌గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా?’’ హాల్లోవున్న జనాల్లో ఎవరో అడిగారు ప్రక్కన కూర్చున్నవాళ్ళని.
‘‘నిండా పాతికేళ్ళు కూడా లేని యువకుడికి ఆరోగ్య సమస్యలేమిటండీ? ఆ యువకుడిది మంచి ఎక్సర్‌సైజ్ బాడీ. స్పోర్ట్స్ పెర్సన్ అని కూడా విన్నాను’’.
‘‘మరెలా జరిగిందంటారు ఇదీ ఇంత సడెన్‌గా?’’
‘‘ఏమో మరి? భుజంగరావుగారు ఆత్మహత్య అనుకుంటున్నారు’’.
‘‘హత్యా!? ఉలిక్కిపడ్డట్టుగా అన్నాడు ఆ వ్యక్తి ‘‘శవాన్ని నేను నా కళ్ళతో చూసానండీ. అసలు ఆ ఆనవాళ్ళే లేవు కదండీ. శవమీద ఎక్కడా గాయాలే లేవే, కనీసం గొంతు నులిమి చంపిన ఆనవాళ్ళు కూడా లేవు కదా? నా అభిప్రాయం అడిగితే ఇది హత్య కానే కాదు’’.
‘‘శవాన్ని కళ్ళతో చూడగానే హత్యో, కాదో చెప్పడానికి మీరేమైనా డికెట్టివ్‌లా? చెట్టంత కొడుకుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో వున్నాడు. ఆయన అనుమానాలు ఆయనవి. పరిశోధించడానికి పోలీసులు ఉన్నారు. పోస్టుమార్టమ్ చేయడానికి డాక్టర్లున్నారు. మధ్యన మీ అభిప్రాయం ఎవరడిగారు? గట్టిగా మాట్లాడకండి. భుజంగరావుగారు వింటే కోపగించుకుంటారు’’ మందలిస్తున్నట్లుగా అన్నాడు మరో వ్యక్తి.
అప్పటికే పోలీసు సిబ్బంది వచ్చి శవానికి ఫొటోలు తీసుకోవడం, వేలిముద్రలూ, ఇతర ఆధారాలు సేకరించడం, పోలీసు కుక్కల చేత పరిశీలింపచేయడం అన్నీ జరిగాయి. మరోసారి పైగదిలోకి వెళ్లి శవాన్ని చూసి క్రిందికి వచ్చాడు ఎస్సై రవీంద్ర. భుజంగరావు దగ్గరికి వచ్చి ‘‘ఒకసారిలా వస్తారా?’’ అన్నాడు.
భుజంగరావు లేచి రవీంద్రతో పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడున్న సోఫాల్లో ఇద్దరూ కూర్చున్నాక ‘‘చెప్పండి?’’ అన్నాడు.
అస్తమిస్తున్న సూర్యుడి బంగారు రంగు కాంతి గది కిటికీలోంచి ఏటవాలుగా వచ్చి వాళ్ళు కూర్చున్న చోటులో పడుతోంది. ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఆ దృశ్యం అప్పుడున్న ఆయన మనస్థితివల్ల నిస్తేజంగా కనిపిస్తోంది.
‘‘శవాన్ని నేను పరిశీలించాను’’ ఎలా మొదలుపెట్టాలో తెలియనట్టుగా అన్నాడు రవీంద్ర.
‘శవమన్న’ పద ప్రయోగానికే విలవిల్లాడిపోయినట్టుగా చూసాడు భుజంగరావు.
‘‘అయాం సారీ.. మీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ జరిగిన దాన్ని మనం ఎంత తొందరగా అంగీకరిస్తే అంత తొందరగా జరగాల్సిన కార్యక్రమాలని చెయ్యగలం. మీకు చెప్పేటంతటివాడ్ని కాదు’’.
భుజంగరావు ఒకసారి భారంగా ఊపిరి పీల్చి కళ్ళలో చెమ్మని తుడుచుకుంటూ అన్నాడు ‘‘చెప్పండి’’.
‘‘్భరణి యువకుడు. మంచి ఆరోగ్యవంతుడు. సహజ మరణం సంభవించాల్సిన వయసు కాదు అతనిది. ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం కూడా అతడికి లేదు. ఈ నేపథ్యంలో మీ కొడుకుది హత్యేమోనని అనుమానిస్తున్న మీ ఆలోచన వెనుక అర్థముంది. మీకే కాదు, నాకు కూడా ఆ అనుమానం వస్తోంది.
అయితే, విచిత్రమేమిటంటే మీ అబ్బాయి శవమీద కానీ, అతడు పడున్న ఆ గదిలో కానీ, ఈ గెస్ట్‌హౌస్‌లో కానీ దీనిని హత్య అని అనుమానించడానికి ఒక్క ఆధారమూ కనిపించడంలేదు. నార్కొటిక్స్, డ్రగ్స్, మత్తు పదార్థాలూ.. ఈ కాలం పిల్లల అలవాట్లు ఊహించలేనట్టుగా ఉంటున్నాయి. భరణికి కూడా అటువంటి అలవాట్లున్నట్లైతే, వాటిలో ఏదైనా వికటించి ఫుడ్ పాయిజనింగ్ జరిగి మరణం సంభవించి వుండే ఆస్కారం కూడా వుంది. ఈ విషయాలన్నీ పోస్ట్‌మార్టమ్‌లో బయటపడతాయి. నగరంలోకెల్లా అనుభవజ్ఞులైన డాక్టర్లతో పోస్టుమార్టమ్ జరిపిద్దాం. ఆ రిపోర్టులని బట్టి మనం మిగతా విషయాలు పరిశోధించవచ్చు’’.
‘‘మత్తు పదార్థాలు వాడడం, డ్రగ్స్ వంటి అలవాట్లు భరణికి లేవు. నాకు వాడి గురించి బాగా తెలుసు. వాడు జీవితాన్ని ఎంజాయ్ చేసే రకమే కానీ జీవితాన్ని నాశనం చేసుకునే రకం కాదు’’ రవీంద్ర మాటలకి అడ్డువస్తూ అన్నాడు భుజంగరావు.
రవీంద్ర వయసు నలభయారేళ్ళు ఉంటుంది. భరణి వయసు కాకపోయినా, కొంచెం చిన్నవాడైన కొడుకు అతడికి కూడా వున్నాడు. అతడు భుజంగరావు బాధని అర్థం చేసుకోగలిగాడు. ఆయన వంక అనునయంగా చూసాడు.
‘‘్భరణి స్నేహితులతో కలిసి గెస్ట్‌హౌస్‌లో పార్టీ చేసుకోవడానికి అప్పుడప్పుడూ వస్తూ వుంటాడు కానీ ఎప్పుడూ ఇక్కడికి ఒంటరిగా రాడు. ఆ మాటకొస్తే భరణి ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ అతడి కూడా ఎవరో ఒకరు స్నేహితులు ఉంటారు. అలాంటిది గెస్ట్‌హౌస్‌కి భరణి ఒక్కడూ వచ్చేడంటే నాకు నమ్మకం కుదరడంలేదు. పనిగట్టుకుని చనిపోవడానికే వచ్చినట్టు భరణి ఇక్కడికి ఒక్కడే ఎందుకు వస్తాడు? అది నా అనుమానానికి మొదటి కారణం’’ అన్నాడు భుజంగరావు.
‘‘ఇక్కడికి ఎవరు వచ్చినా, ఎవరు వెళ్లినా వాచ్‌మెన్‌కి తెలియాలి కానీ దురదృష్టవశాత్తూ ఈ రోజు వాచ్‌మెన్ కూడా సిటీకి పనిమీద వెళ్ళడంతో ఆ సమాచారం మనకి తెలియడంలేదు’’ తనలో తాను అనుకుంటున్నట్టుగా ఆయనతో అన్నాడు రవీంద్ర.
‘‘అవును. గెస్ట్‌హౌస్ తాళం ఒకటి వాచ్‌మెన్ దగ్గర ఉంటుంది. మరొకటి భరణీ దగ్గర వుంటుంది. ఎప్పుడైనా అనుకోకుండా వచ్చినపుడు వాచ్‌మెన్ లేకపోతే ఆ తాళంతో తలుపు తెరచుకుని లోపలికి వస్తాడు భరణి. ఇవాళ కూడా అలాగే వచ్చి వుంటాడు. అది కాదు నేను చెప్పదలుచుకున్నది’’ ఒక్క క్షణం ఆగి, అన్నాడు భుజంగరావు. ‘‘్భరణి ఇక్కడికి ఒంటరిగా రాడన్నది కచ్చితం. మనకి పైకి కనిపిస్తున్నట్టుగా భరణిది సహజ మరణమో లేక మీరన్నట్టుగా ఫుడ్ పాయిజనింగ్‌వల్ల సంభవించిన మరణమో ఐతే, భరణి కూడా వచ్చిన వాళ్ళు భరణిని ఒక్కడ్నే వదిలేసి ఎందుకు పారిపోనట్టు? సిటీ నుంచి వాచ్‌మెన్ వచ్చి మనకి సమాచారం అందించేదాకా మనకి భరణి మరణం గురించి తెలియలేదు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ