డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు సాయంత్రం ఆఫీసు నుంచి బయటపడ్డాక ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కల్సుకున్నారు ఇద్దరూ.
ఆ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా, ప్రశాంతంగా, గుడిచుట్టూ దట్టమైన చెట్లతో, పచ్చని పచ్చికతో ఎంతో బావుంటుంది.
అందుకే ఆ రోజక్కడ కల్సుకోవాలని నిర్ణయించుకుని అనుకున్న ప్రకారమే అనుకున్న సమయానికి ఇద్దరూ అక్కడ కల్సుకుని భక్తులు తిరిగే చోటుకి కాస్త దూరంగా అనువుగా ఉన్న స్థలాన్ని ఎన్నుకుని దాదాపు రెండు గంటల సమయాన్ని రెండు క్షణాల్లా గడిపి ఎవరింటికి వారు బయల్దేరారు.
తను సాహిత్యను తరచూ కల్సుకుని సత్కాలక్షేపం చేస్తోన్న విషయం సామ్రాజ్ఞికి ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉంటుందనే విషయం ఏనాడూ ఊహించకపోవడంతో సామ్రాజ్ఞి వ్యాఖ్యానానికి కలవరపడ్డాడు సామ్రాట్.
మనసులో ఏదో ఒక మూల సామ్రాజ్ఞి హాస్యానికి అలా అని ఉంటుందని సరిపెట్టుకుందామని అనుకున్నా, సామ్రాజ్ఞి మనస్తత్వం ‘తను నవ్వుతూ ఎదుటివారిని నవ్వించగలిగేది కాద’ని రూఢీగా తెల్సినవాడు కావటాన మళ్లీ దిగులు ఆవహించిందతణ్ణి.
అయినప్పటికీ ఏదో ఒకటి మాట్లాడక తప్పదు కనుక ‘‘ఆఫీసు పని అవుట్‌డోర్‌కి మారడేమిటి? నీ మాటలు నాకేవీ అర్థం కావడంలేదు’’ అన్నాడు సామ్రాట్ అమాయకంగా మొహం పెట్టి.
‘‘అవునా.. మీ ఆఫీస్ యాజమాన్యం ఈ ఊళ్లో దేవాలయాల్లోనూ, పార్కుల్లోనూ కొత్తగా బ్రాంచ్‌లేమైనా తెరిచిందేమో అనుకున్నానె్లండి’’ అంది సామ్రాజ్ఞి తనూ అతనిలానే అమాయకంగామొహం పెడుతూ.
సామ్రాట్ మనసులో పుట్టిన అనుమానం అంతకంతకూ పెరిగి పెద్దదై అతడి మనసునంతా ఆక్రమించింది.
‘‘నీ మాటలు ఏవిటో కొత్తగానూ, వింతగానూ కూడా ఉన్నాయి సామూ!’’ అని మాత్రం అనగలిగాడు.
‘‘అలాగేం.. ఈ రోజు సాయంత్రం ఆఫీసు వదిలాక ఊరి చివర గుడి వెనుక గంటల తరబడి రాసక్రీడలు గడిపి వచ్చిన మీకే ఈ విషయం అంత వింతగానూ, కొత్తగానూ ఉంటే, దారిన పోయే వాళ్ల ద్వారా మాత్రమే విన్న నాకెంత కొత్తగానూ, వింతగానూ ఉండాలి చెప్పండి’’ అంది సామ్రాజ్ఞి అసలు విషయాన్ని బయపెడుతూ.
విషయం పూర్తిగా అర్థమైంది సామ్రాట్‌కు. అయినప్పటికీ ఆశ చావక, ఊరి చివర గుడి వెనుక రాసక్రీడలా..? నీ మాటలు నాకసలేం అర్థం కావడంలేదు సామూ!
ఏ సీరియల్‌లోని కథ గురించో మాట్లాడ్డం లేదు కదా నువ్వు? అయినా ఆ సీరియల్స్ చూడొద్దంటే వినవు. రోజూ సీరియల్స్ చూసీ చూసీ నీ మెదడంతా ఆ కథలే గిరగిరా తిరుగుతున్నట్టుగా ఉన్నాయి’’ అన్నాడు సామ్రాట్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.
మేకపోతు గాంభీరాన్ని ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా పులిలాంటి క్రూర జంతువులు ఇట్టేపసిగడతాయి.
సామ్రాజ్ఞి పులి. అందునా.. తన అనుమానాలను ఋజువు చేసే ఆధారపు కొసను అనుకోకుండా అంది పుచ్చుకుని ఆకలితోనూ, క్రోధంతోనూ ఉన్న ఆడపులి ఆమె!
ముక్కుపుటాలదురుతోండగా, కళ్లు పెద్దవి చేసి, ‘‘ఏవిటీ. టీవీ చూసీ చూసీ నా మెదడు చెడిపోయిందా? గత కొద్దికాలంగా వేళ తప్పి ఇంటికొస్తోన్న మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనని నేను ఈ రోజు ఉత్త పుణ్యానికి మీ మీద అభాండాలు వేస్తున్నానంటారా?’’ అని హుంకరించింది.
‘‘ఒకరి భాష మరొకరికి అర్థం కాకుండా మనమిలా ఎంతసేపు మాట్లాడుకున్నా ఏమీ ఫలితం ఉండదు. నీ మనసులో ఈ అనుమానపు బీజాల్ని నాటిందెవరో చెప్తావా పోనీ?’’ అన్నాడు సామ్రాట్.
‘‘అంటే మీరు చేసిన నీతిమాలిన పనికి రుజువులూ, సాక్ష్యాలూ చూపిస్తే తప్ప తప్పు ఒప్పుకోరా మీరూ?’’ అంది సామ్రాజ్ఞి.
‘‘ఇంకా చెప్పు!’’ అన్నట్టుగా చూశాడామె వైపు సామ్రాట్.
‘‘నేనడిగిందానికి సమాధానం చెప్పకుండా ఆ చూపేవిటి బెల్లంకొట్టిన రాయిలా’’ అందామె రెట్టిస్తూ.
‘‘బెల్లం కొట్టిన రాయినికదా.. అందుకే మాట్లాడ్డం చేతకాకా..’’ అన్నాడు సామ్రాట్ లోలోపల దిగలుపడుతోన్నా గొంతులో వెటకారాన్ని ధ్వనింపచేస్తూ.
‘‘ఆహా.. చాలా తెలివి తేటలున్నాయి దొరగారికీ! సరే వినండి చెప్తాను. ఈ రోజు సాయంత్రం కనుచీకటి పడేవేళ వేణుగోపాలస్వామి గుడి వెనుక పచ్చికలో నందివర్థనం పొద పక్కన ఒళ్లూ, ఒళ్లూ తగిలేంత దగ్గరగా కూర్చుని పకపకా నవ్వుతోన్న నాపసానితో గడిపిరాలేదూ!?’’ అంది సామ్రాజ్ఞి ‘దీనికేం సమాధానం చెప్తావో చూస్తాన’న్నట్టుగా.
అతికష్టంమీద పెదాలమీదకు నవ్వు తెచ్చుకుని, ‘‘ఓహ్ అదా! నాతో పనిచేసే ఒకవిడ తన కుటుంబ గొడవలేవో చెప్తోంటే ఆఫీస్ వదిలాక అలా వేణుగోపాలస్వామి దేవాలయం వైపు వెళ్లాం.
ఎవరో అది చూసి చిలవలు పలవలు కల్పించి నీ చెవిన వేస్తే దానికే ఏదేదో ఊహించుకుని నన్నపార్థం చేసుకుంటున్నావు అనవసరంగా’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఆహా.. ఆవిడ తన కుటుంబ గొడవలు చెప్పుకుందుకు మీకంటే దగ్గరవాళ్లెవరూ లేరా?’ అంది సామ్రాజ్ఞి నిలదీస్తూ.
‘‘దాందేవుంది సామూ.. మనిషన్నాక బాధలు ఎవరో ఒకరితో పంచుకోవలసిందే కదా! పైగా ‘బాధలు నలుగురితోనూ పంచుకుంటే తగ్గుతాయి. సంతోషం పదిమందితో పంచుకుంటే పెరుగుతుంది’ అనే సామెత నువ్వెప్పుడూ వినలేదా!’’ అన్నాడు సామ్రాట్.
‘‘మీ ఆఫీసులో ఆడాళ్లెవరూ లేరా ఆవిడ బాధలు పంచుకుని తగ్గించేందుకు పాపం!’’ అంది సామ్రాజ్ఞి అక్కసుగా.
‘‘బాధలు పంచుకుందుకు ఆడేవిటి, మగేవిటి? సామూ.. అయినా ఆడవాళ్లు తమ బాధను ఆడవాళ్లతోనే పంచుకోవాలని ఏమైనా సిద్ధాంతం ఉందా?’’ అన్నాడు సామ్రాట్ ఎదురుదాడికి దిగుతూ.

-ఇంకాఉంది

సీతాసత్య