డైలీ సీరియల్

ట్విన్ టవర్స్.. 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరం అంతా పూర్తి అయ్యాక, చివరగా ‘‘చిన్నప్పుడు చూచిన పాతాళ భైరవి సినిమాలోలాగా ఏ దేవతయినా నరుడా ఏమి నీ కోరిక?’’ అని అడిగితే, ‘‘నా భార్యని నా పక్క సీటులో కూచోబెట్టు’’ అని అడిగేవాడిని.
లవ్,
రఘు
అని ముగించాడు.
‘‘ఎంత చక్కగా రాశాడు కల్యాణి! అతనిలో ఇంత చక్కని భావాలు ఉన్నాయని నేను అనుకోలేదు సుమా! ఏదో పుస్తకాల పురుగు అనుకున్నాను’’ అని నవ్వింది. ఆవిడ మామూలు మాటల ధోరణిలోకి వెళ్లిపోయి ‘‘చూడు, మా పెళ్లయి ఇనే్నళ్ళు గడిచింది. మీ అన్నయ్య ఇలాటి చక్కటి ఉత్తరం ఒక్కటయినా రాశాడేమో నాకు’’ అంది.
నేను పక్కున నవ్వాను. ‘‘నువ్వు అసలు మా అన్నయ్యని వదిలి వెళ్లింది ఎప్పుడూ, నీకు ఉత్తరం రాయడానికి’’ అన్నాను.
‘‘అదీ నిజమేలే! దేనికయినా పెట్టి పుట్టాలి’’ అంది నిట్టూరుస్తూ, మా అన్నయ్యతో కలిసి ఉండటం చాలా కష్టతరమైన పనిలాగా!
‘‘నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు తెలియదు వదినా’’ అన్నాను.
నా కంఠధ్వనికి చలించినట్లయ్యి, ‘‘రెండేళ్ళు ఎంత సేపు గడుస్తాయి కల్యాణి. చదువులో పడ్డావంటే రోజులు ఇట్టే గడుస్తాయి. ఏళ్ళు ఎప్పుడు పూర్తయ్యాయో కూడా తెలియదు’’ అంది ఓదార్పుగా! ఆ రాత్రి, అల్లుడి యోగ క్షేమాలు తెలుసుకుని అందరూ సంతోషించారు. మా మామ్మయితే నా అదృష్టానికి మరోసారి మురిసిపోయింది.
అతని ఉత్తరానికి నేను కూడా చేతనైనంతలో చాలా చక్కగా రాశాననే అనుకున్నాను.
‘‘అతని ఆగమనం నా జీవితంలో ఎంత అనుకోనంత హఠాత్తుగా జరిగిందో, అతను తను ఊహించనంతగా ఎంతగా తన మనసును ఆక్రమించాడో రాశాను. అతను నా దైనందిన జీవితంలో ఎంత దూరంగా ఉన్నా, నా మనసు ఎంత సమయం అతని చుట్టూ పరిభ్రమిస్తోందో రాశాను. కొద్దిరోజుల క్రితం అతనెవరో తెలియని నాకు అతన్ని గురించి ఆలోచించకుండా అసలు రోజు గడవడంలేదని రాశాను. అతను కూడా నా ఉత్తరాలకు ఎదురుచూస్తున్నట్లే కనిపించేవాడు. రఘు దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం పదే పదే చదువుతూ ఉండేదాన్ని. ‘‘నీలాంటి దానినెవరినో బాపు చూచి ఉంటారు. అందుకే అంత నాచురల్‌గా వేయగలిగారు ఆ చిత్రాన్ని’’ అన్నాడు, అన్నయ్య ఒకసారి నా గదిలోకి వచ్చినపుడు.
బాపుగారి బొమ్మ ఒకసారి మాగజైన్ కవరుమీద వచ్చింది. అది నాకెంత నచ్చిందంటే ఆ మాగజైన్ నా దగ్గర ఇప్పటికీ ఉంది.
ఆ చిత్రం ఒక కొత్తగా పెళ్ళయిన ఓ అమ్మాయి భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకునే దృశ్యం. బాపుగారి స్టైల్. ఆ అమ్మాయి పెదిమలమీద చిరునవ్వు. తలనిండా పూలు, మనసులోని ఊహలు ప్రతిబింబిస్తూ వెలిగిపోతున్న ముఖం. చుట్టూ చదువుతూ మధ్యలో ఆపి బోర్లించిన పుస్తకాలు. గోడమీద దండవేసిన దేవుడి పటం. టేబుల్ మీద పెళ్లి ఫొటో. డెస్సర్‌మీద గాజులు. ఎంబ్రాయిడరీ చేసే చట్రం. ఎంత నాచురల్ పరిసరాలో. ఆ అమ్మాయి చేతిలో భర్త రాసిన ఉత్తరం. చెంపను ఆనించుకున్న చెయ్యి. అయినా బాపుగారికెలా తెలుసమ్మ ఆడపిల్ల గది ఎలా ఉంటుందో. అంతకంటే ఆడపిల్ల మనసెలా ఉంటుందో.
అయినా భగవంతుడు కొద్దిమందికి ఇంత ఉన్నతమయిన వరాలు ఇస్తాడు. బాపుగారికి చిత్రలేఖనం, సుశీలగారికి మధురస్వరం, సుబ్బలక్ష్మిగారికి సంగీత జ్ఞానం. స్వాతి ముత్యాలు. సుగంధ పుష్పాలు. ఇలాంటి సుగంధపు నందన వనంలో గడ్డిపరకలు తనలాంటివాళ్ళు. జీవితానికి ఎటువంటి ప్రత్యేకత లేకుండా గాలి ఎటు వీస్తే అటు ఊగుతాం! భగవంతుడికి కూడా పక్షపాతం ఉంది అనుకున్నాను. ఆ క్షణంలో భగవంతుడిమీద కొంచెం కోపం కూడా వచ్చింది.
ఆ మర్నాడు సాయంత్రం, ఒక స్నేహితురాలిని కలిసి ఇంటికి వచ్చేటప్పటికి వరండాలో అమ్మ, మామ్మ ఏదో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడంగానే మానేశారు. అదేదో నన్ను గురించేనని అనుకున్నా. కాని అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఆ తరువాత, ఒక వారం రోజుల తరువాత ఎందుకో చాలా అలసటగా అనిపించడం మొదలుపెట్టింది. బద్ధకంగా అనిపించింది. ఏమయి ఉంటుందా అని కూడా అనిపించింది. పోయిన 5, 6 వారాలుగా నా జీవితం ఒక సుడిగాలిలాగా గడిచింది. హడావిడిగా పెళ్లి, రాగానే పరీక్షలు, అనుకున్నదానికంటే ఎక్కువగానే అలసిపోయినట్లున్నాను. అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకని.
నాకు కాస్త బాగాలేదంటే మా అమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఉప్పు, మిరపకాయలు, విభూదులు, కొబ్బరికాయలు దిష్టి పేరుతో ఖర్చయిపోతూ ఉంటాయి. ఆ సాయంత్రం మా వదిన అంది ‘‘నీ ముఖం బాగా వాడిపోయింది. ఎందుకో బాగాలేదనిపిస్తోంది. నా స్నేహితురాలు డాక్టర్ ఉష దగ్గరకు వెడుతున్నా, నాతోరా ఆవిడతో మాట్లాడదాం’’.
‘‘వద్దులే వదినా! ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకు?’’ అని కొట్టిపారేయబోయాను. కాని ఆవిడ ఎందుకో గట్టిగానే పట్టుబట్టింది.
ఎందుకో, మా అమ్మే మా వదినతో చెప్పినట్లుంది. తమాషా, మా అమ్మ ఇలాంటి పనులన్నీ మా వదినకే పురమాయిస్తూ ఉంటుంది.
‘‘్ఫరవాలేదులేరా. నేన ఎలాగూ వెడుతున్నాను. తనని కలిసి చాలా రోజులయింది. మళ్లీ కనిపించకపోతే తిడుతుంది’’ అంటూ బయలుదేరదీసింది. మా వదినకి ఆ డాక్టర్ మంచి స్నేహితురాలు. ఆవిడ కొడుకు, మా రాజకుమారుడు క్లాసుమేట్స్ కూడా. ఇంచుమించు ఈవిడ వయసే!
ఆవిడ హాస్పిటల్‌కి వెళ్ళేసరికి ఎక్కువగా ఎవరూ లేరు. ఆ సమయంలో ఆవిడ చాలా కొద్దిమంది బయటవాళ్ళను చూస్తుంది. ఆవిడ, వదిన, లోకాభిరామాయణం, కొడుకుల స్కూల్స్, టీచర్ల చేతకానితనం, పట్టించుకోని మొగుళ్ళ వైఖరి- ఒకటేమిటి, దేశాన్ని ఎలా పాలించాలో తప్ప అన్ని కబుర్లు చెప్పుకున్నారు.
మా వదినకెందుకో రాజకుమారుడి తరువాత మళ్లీ పిల్లలు పుట్టలేదు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి