డైలీ సీరియల్

వ్యూహం-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు స్కంద, ఐపియస్ గదా!’’
‘‘అవును’’ అన్నాడు స్కంద.
‘‘మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు?’’
‘‘ముంబైలోని అరిఫ్‌గారి బిల్డింగ్‌లో గ్యారేజ్‌లో, అండర్‌గ్రౌండ్ రూములో బాంబులు పెట్టారని, అవి ఏ క్షణాన్నైనా పేల్చవచ్చని మాకు సమాచారం వచ్చింది.. ఆ సమాచారాన్ని ముంబై పోలీసు కమిషనర్‌గారితో షేర్ చేసుకున్నాం! బాంబులు నిర్వీర్యం చేసే పనిలో వున్నాం.. మీరెవరో చెప్పారుగాదు’’ అన్నాడు స్కంద.
డాక్టర్ అరవింద్ ఎవరో తనకు తెలియనట్లు మొహం పెట్టాడు స్కంద.
అరవింద్‌కు అర్థం అయిపోయింది.
వీళ్ళేదో పెద్ద ప్లానుతోనే వచ్చారు.. బిల్డింగ్‌లో బాంబులు పెట్టడం.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించడం అంతా బూటకం!
‘తెర వెనుక ఏదో కథ నడుస్తూ వుంది’ అనుకున్నాడు.
డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు బయటకు వచ్చేశారు.
‘‘అన్నీ చెక్ చేశాం సార్.. ఏం దొరకలేదు’’ అన్నారు వాళ్ళు.
అరిఫ్‌కు వొళ్ళు మండిపోయింది.
‘‘మమ్మల్ని మా బిల్డింగ్‌లోనుంచి బయటకు తీసుకువచ్చి బయట ఎండలో కాంపౌండ్‌వాల్ దగ్గర నిలబెట్టారు.. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా బిల్టింగ్‌లో చొరబడ్డారు.. మిమ్మల్ని కోర్టుకు లాగుతాను. మీ ఉద్యోగాలు ఊడిపోయేవరకు నిద్రపోను! మీకు రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తాను! ‘అరిఫ్ అంటే బేవకూఫ్’ అనుకున్నారా? నా తడాఖా చూపిస్తాను!’’ గర్జించాడు అరిఫ్.
అతని మాటలు పోలీసు కమిషనర్ పట్టించుకోలేదు.
‘‘అందరూ జాగ్రత్తగా వినండి.. మరో పావు గంటసేపు ఎవరూ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టకండి! ఏదో ఒక మూల బాంబులు వుండొచ్చు! ఎట్ ఎనీ టైం బాంబ్స్ మే బి డిటొనేటెడ్.. ఏ క్షణంలోనైనా బాంబులు పెద్ద శబ్దంతో పేలవచ్చు! బి కేర్‌ఫుల్!’’ మైకులో ఎనౌన్సు చేశాడు గోయల్.
‘‘అంతా ట్రాష్.. అంతా బోగస్’’ గొణుక్కున్నాడు అరిఫ్.
లోపలికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యలేదు.
పది నిముషాలు గడిచాయేలేదో పెద్ద శబ్దం చెవులు చిల్లులుపడేటట్లు విన్పించింది. భవనం పైకప్పు ఎగిరిపడింది. గోడలు కూలిపోయాయి.
ఆ శబ్దానికి అందరూ దూరంగా పరిగెత్తారు. కొంతమంది రాళ్లు పడి గాయాలయ్యాయి. గాయాలు అయినవాళ్ళలో పోలీస్ కమిషనర్ గోయల్ కూడాన్నారు.
అరిఫ్, అరవింద్ దూరంగా పరుగులు తీశారు. ఆ విస్ఫోటన శబ్దం రిట్జ్ హోటల్‌దాగా విన్పించింది. జీవితంలో అదే మొదటిసారి రోడ్లమీద పరుగులు తీయడం వాళ్ళిద్దరికీ. పావు గంట తరువాత తిరిగి వచ్చి చూశారు.
పెద్ద పెద్ద రాళ్ళకుప్పలు తప్పితే అక్కడ భవనం వున్న జాడే లేదు. పొగ, దుమ్ము ధూళి తప్పితే ఏం కన్పించడంలేదు.
అంబులెన్స్ వచ్చింది.గాయపడినవారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్నారు.
‘‘్భవనంలో వున్నట్లయితే మనం చనిపోయి వుండేవాళ్ళం’’ అన్నాడు అరిఫ్.
డాక్టర్ అరవింద్‌కు మాత్రం నమ్మశక్యం కావడంలేదు.
టివీ చానళ్ళవాళ్ళు వచ్చేశారు. అరిఫ్ చుట్టూ మూగి అతనిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. తనకు జరిగిన నష్టం గూర్చి వివరిస్తున్నాడు అరిఫ్. పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు అరిఫ్ టీవీ కెమెరాలముందు నిలబడి.
మనస్సులో పోలీసు అధికార్ల మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ వుంది. మొహంలో తన ఆగ్రహ జ్వాలలు కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు.
పోలీసు వాళ్ళే తన బిల్డింగ్‌లో జొరబడి బాంబులు పెట్టి వుంటారు’ అనుకున్నాడు అరిఫ్ మనస్సులో. ‘స్కంద ప్లానే ఇదంతా!’ అనుకున్నాడు డాక్టర్ అరవింద్.
‘బిల్డింగ్ సెర్చ్ చేస్తున్నాం అంటూ లోపలికి వెళ్ళి బాంబులు అమర్చి బయటకు వచ్చి వుంటారు’. అంతా స్కందా ప్లానే.
***
క్యాంటీన్‌లో భోజనం చేసి తన క్వార్టర్స్‌కు వచ్చి టీవీ ఆన్ చేసింది డాక్టర్ లోహిత.
అన్ని వార్తా చానల్స్‌లో ముంబైలో మాఫియా కింగ్ అరిఫ్ బిల్డింగ్‌లో బాంబు పేలుళ్ళు వార్త ఫ్లాష్ అవుతూ వుంది.
నేలమట్టం అయిన బిల్డింగ్ సమీపంలో నిలబడ్డ స్కంద, డాక్టర్ అరవింద్ కన్పించారు. మంచి పని జరిగిందన్నట్లుగా స్కంద మొహంలో భావాలు కన్పించేయి. అరవింద్ మాత్రం దిగాలుపడి నిలబడ్డాడు.
అరిఫ్ వైల్డ్‌గా రియాక్ట్ కావడాన్ని కూడా టీవీ చానల్స్ చూపించాయి.
ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.
రాత్రి పదవుతుంది. ఈ సమయంలో ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు. ఎమర్జన్సీ కేసు వుంటే ఫోన్ చేస్తారు తనకు. రూమ్ సర్వీసు వాళ్ళు కూడా రాత్రి పది దాటేక రారు.
తలుపు తీసింది లోహిత. ఎదురుగా నిలబడ్డ ఇద్దరు వ్యక్తుతలు కన్పిచారు.
వచ్చింది ఎవరానని పరీక్షగా చూసేలోపే ఆమె మొహంమీద దుప్పటి కప్పేశారు.
పెద్దగా అరిచింది. ఆమె కేకలు చుట్టుప్రక్కల ఎవరికీ విన్పించలేదు. రాత్రి పూట క్వార్టర్స్ దగ్గర పెద్దగా ఎవరూ తిరగరు.
ఆమెను మోసుకెళ్ళి క్వార్టర్ వెనుక వున్న పెద్ద మాన్‌హోల్ మూత తీసి అందులో పడేశారు. మూత మూసేసి పైన పెద్ద బండరాయి పెట్టారు.
‘వెనుకవైపునకు ఎవరూ రారు. దిక్కు మొక్కూ లకేండా చనిపోతుంది’ అనుకుంటూ వెళ్లిపోయారు వాళ్ళిద్దరూ.

మాన్‌హోల్‌లోపల ఒకటే మురుగువాసన.
దోమలు పీకుతున్నాయి.
మొహానికి కప్పిన దుప్పటి తొలగించుకుని పెద్దగా కేకలు పెట్టింది. ఆమె అరుపులు, కేకలు ఎవరికీ విన్పించడంలేదు.
నడుం లోతువరకు మురుగునీళ్ళు ఉన్నాయి. చేతులు కిందకు చాపితే మురుగునీళ్ళు తగులుతాయి. మళ్లీ ఆ చేతుల్ని మొహం దగ్గర పెట్టుకోలేదు.
చేతులు పైకెత్తి మాన్‌హోల్ మూత నెట్టే ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మూత కొంచెం కూడా కదలడంలేదు.
లోపలంతా కటికచకటి.
రాత్రిపూట ఎవరూ అటువైపు రారు.
పగలు కూడా ఎవరూ గమనించకపోతే తన పరిస్థితి ఏమిటి? నీరసం వచ్చి మురుగునీళ్ళలో కుప్పలా కూలిపోయి ఊపిరి ఆడక చనిపోతుందేమో!
రాత్రంతా దుర్గంధాన్ని భరిస్తూ గడపాల్సిందే!
నిద్ర పట్టలేదు.
మెలకువతోనే రాత్రంతా గడిపింది.
మరుసటి రోజు ఉదయం మసక వెలుగు కన్పించింది.
అమ్మ దీవెన తనకు వుంటే తను బయటపడుతుంది.
... ఛానె్సస్ ఆర్ రిమోట్.. అవకాశం తక్కువ తను బయటపడటానికి.
క్వార్టర్ వెనుక వైపు పెద్ద నేరేడు చెట్టు వుంది.
తోటమాలి సయ్యద్ కూతురు ఫర్హానా నేరేడు కాయలంటే ఇష్టం. ఉదయం పూట వచ్చి చెట్టుమీద నుంచి కింద రాలిపడిన నేరేడు కాయలు ఏరుకుంటుంది. ఆ అమ్మాయి వచ్చి పండిన కాయలు ఏరుకుని గినె్నల వేసుకుంటూ వుంది.
లోహితకు పైన ఎవరో తిరుగుతున్నట్లు శబ్దం విన్పించింది. ఆ అమ్మాయి విరిసిన రాయి వచ్చి మ్యాన్ హోల్ పైమూతమీద పడింది.
నేరేడు కాయలు ఏరుకోవడానికి పర్హానా వచ్చిందని అర్థం అయింది. కాయలు కింద రాలిపడటానికి రాళ్ళు విసురుతుంది ఆ పిల్ల.
పెద్దగా కేకలు పెట్టింది లోహిత.
పర్హానాకు కేకలు విన్పించలేదు.
ఏదో ఆలోచన మెరిసింది లోహిత మెదడులో. తలలో వున్న హెయిర్ పిన్ను తీసి పై మ్యాన్‌హోల్ పైన గట్టిగా గీసింది.
మ్యాన్‌హోల్ దగ్గరకు వచ్చిన ఆ అమ్మాయికి లోహిత మ్యాన్‌హోల్ మూతను గీకుతున్న శబ్దం విన్పించింది.
ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ శక్తినంతా ఉపయోగించి పెద్దగా కేకలు పెట్టింది లోహిత.
మ్యాన్‌హోల్ లోపలినుంచి ఎవరో అరుస్తున్నారి అర్థం అయింది. మూతపై వున్న బండరాయిన నెట్టబోయిందిగాని ఆ అమ్మాయి వల్ల కాలేదు.
అప్పుడే రోడ్డుమీద సైకిల్‌మీద వెళ్తున్న సయ్యద్ కన్పించాడ.
పెద్దగా కేక వేసి తండ్రిని పిలిచింది.
వాళ్ళిద్దరూ మ్యాన్‌హోల్‌పై వున్న బండరాయిని అతి కష్టంమీద పక్కకు నెట్టి మూతను తీశారు.
లోపల వున్న లోహితను గుర్తించాడు సయ్యద్.
అతని చెయ్యి ఆసరాగా తీసుకొని బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పింది.
సయ్యద్ డ్యూటీకి వెళ్లిపోయాడు.
పర్హాను హాల్లో కూర్చోబెట్టి బాత్‌రూముకు వెళ్లింది లోహిత. నాలుగైదుసార్లు సబ్బుతో వొంటిని రద్దుకుంటేగానీ మురుగు వాసన పోలేదు. ప్రాణాలు దక్కేయి.. అంతే చాలు.. ఆ మురుగు వాసన పట్టించుకోలేదు.
బాడీ లోషన్ స్ప్రే చేసుకుని బట్టలు వేసుకుని పర్హానా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి బుగ్గలు ముద్దుపెట్టుకుంది.
‘‘్భగవంతుడే నిన్ను పంపించాడు.. లేకపోతే క్వార్టర్ వెనుక వెనుకవైపు ఎవరూ వచ్చేవాళ్ళు కాదు.. ఆ మురుగునీళ్ళలో కుళ్లిపోయి చనిపోయి వుండేదాన్ని. నీకు మంచి సంబంధం చూసి, నీ పెళ్లికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను’’ అంది లోహిత పర్హానా చేతులు పట్టుకుని.
తన చేతిలోని నేరేడుకాయ లోహిత నోట్లో పెట్టింది ఫర్హానా.
****
ముఖ్యమైన అనుచరులతో హోటల్ ఆస్టోరియాలో సమావేశమయ్యారు అరిఫ్. హిందీలోనే వాళ్ళ సంభాషణలు సాగిపోతున్నాయి.
‘‘నేను సిటీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడేటప్పుడు నువ్వు తెలుగులో ఎవరితోనో మాట్లాడుతున్నావ్? అతనెవరు?’’ అడిగాడు అరిఫ్ అరవింద్‌ను.
‘‘అతని గూర్చి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ వుంటారు. మన హాస్పిటల్ వ్యవహారాలు ఇనె్వస్టిగేట్ చేస్తున్నది అతనే! స్కంద, ఐపియస్’’ అన్నాడు అరవింద్.
‘‘ముందు నాకెందుకు చెప్పలేదు.. అదే స్పాట్‌లో షూట్ చేసి పారేసేవాడిని.. బాస్టర్డ్.. నీ అవివేకం మూలంగా తప్పించుకున్నాడు.. వాడు, గోయల్ క్లోజ్ ఫ్రెండ్స్! ఇద్దరినీ అదే స్పాట్‌లో కాల్చేసి జైల్లో కూర్చునేవాడిని.. డబ్బుఖర్చుపెట్టి మళ్లీ బెయిల్‌మీద బయటకు వచ్చేసేవాడిని’’ అన్నాడు అరిఫ్ ఆవేశంతో ఊగిపోతూ.
అరిఫ్ అనుచరులలో ఒకడు లేచి నిలబడ్డాడు.
‘‘బాంబులు పేలకముందు నేనో దృశ్యం చూశాను సార్.. పోలీసు వాహనాల వెనుక ఓ వ్యక్తి కూర్చుని మాటిమాటికి వాచీలో టైము చూసుకుంటున్నాడు. సంచిలోనుంచి చిన్న ఫ్లాక్సులో వున్న మెషిన్ బయటకు తీశాడు. దాని మూత మీద ఓ ఎర్రటి బటన్ వుంది.. గాఢంగా శ్వాస పీల్చి, టైము చూసుకుని, ఎర్ర బటన్ నొక్కాడు సార్... అతను చేస్తున్న పని వింతగా అన్పించి నా సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యం రికార్డ్ చేసుకున్నాను.. బటన్ నొక్కిన మరుక్షణం పెద్ద శబ్దంతో భవనం టాప్‌లేచి ఎగిరిపడింది. క్షణాల్లో భయం కుప్పకూలిపోయింది’’ అన్నాడతను సెల్‌లో రికార్డు అయిన ఫొటోను అరిఫ్‌కు చూపిస్తూ.
ఆ బాంబు పేలుళ్ళకు కారకులు పోలీసువాళ్ళే! చేతిలో ప్లంగర్ పట్టుకుని రెడ్ బటన్ నొక్కుతున్నవాడు స్కందకు తెలిసినవాడే అయివుంటాడు. వాడి మొహంలో ఆంధ్రావాళ్ళ పోలికలు వున్నాయి.. ఈ ఫోటో కాపీలు తీసి కోర్టుకు సమర్పించుదాం! స్కందమీద, గోయల్‌మీద కేసు పెడతాను. వాళ్ళనే ఎక్యూజ్డ్‌గా చూపిస్తాను అఫిడవిట్‌లో. వీళ్ళిద్దరి సంగతి నాలుగైదు సంవత్సరాల తరువాత చూస్తాను.. అప్పటికి అంతా సర్దుకుంటుంది.. అప్పుడు వాళ్ళిద్దరూ యాక్సిడెంట్స్‌లో చనిపోయినట్లు టీవీ చానల్స్‌లో వార్త వస్తుంది’’.
‘‘ఇప్పుడే వాళ్ళను ఖతమ్ చెయ్యొచ్చు కదా!’’
‘‘ఇప్పుడొద్దు.. ఇప్పుడు అందరి దృష్టి మనమీద వుంది. వాళ్ళకు ఏ అపాయం జరిగినా పోలీసుల దృష్టి మనమీద వుంటుంది.. అసలే ఇప్పుడు నేను ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోయాను.. ప్రస్తుతం మనం మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిన్న వాళ్ళమీద దృష్టి పెడదాం! చిన్నవాళ్ళంటే పెద్దగా లైమ్‌లైట్‌లో లేనివాళ్ళు! ముందు డాక్టర్ లోహితను మర్డర్ చెయ్యాలి! నెక్స్ట్ ఆ కాశీగాడు.. ఆ బాస్డర్డ్ మన రహస్యాలు స్కందకు చేరవేస్తున్నాడు.. ఉయ్ మస్ట్ ఫినిష్ దె ఇమ్మిడియెట్లీ!’’ అన్నాడు అరిఫ్.
***
లోహితను అరిఫ్ మనుషులు చంపెయ్యాలనే ప్రయత్నంలో వున్నారని కాశికి తెలిసింది.. అది అతనికి పూర్తిగా నచ్చని విషయం.
.. ఆ తరువాత తనను టార్గెట్ చేస్తారు.. వాళ్ళకు అనుమానం వస్తే ఎవరిని వొదలరు..
లోహిత క్వార్టర్స్ దగ్గరకు వచ్చేడు కాశి.
రాత్రి జరిగిన సంఘటన చెప్పింది అతనికి. ఆ సంఘటన చెబుతుంటే ఆమెకు దుఃఖం పొర్లుకు వచ్చింది.
‘‘డాక్టరుగా రెండు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి.. ఒకటి గవర్నమెంటు హాస్పిటల్లో అసిస్టెంట్ సివిల్ సర్జెన్‌గా, మరొకటి హైదరాబాద్‌లో కామినేని హాస్పిటల్లో.. ఆ రెండూ వదులుకుని ఇక్కడ డాక్టరుగా చేరాను. మా అమ్మ చెబుతూనే వుంది.. ‘హాయిగా గవర్నమెంటు డాక్టరుగా పనిచెయ్యి!’ అని.. ఆమె మాటలు విన్పించుకోకుండా ఎక్కువ జీతానికి ఆశపడి ఇక్కడ చేరాను.. డాక్టరుగా ఇతరులకు ప్రాణాలు పోయవలసిన నేను, నా ప్రాణాలు కాపాడుకునే స్థితికి చేరుకున్నాను.. ప్రతిక్షణం ఏదోక గండం నన్ను వెంటాడబోతూ వుంది.. ఎలా బయట పడతానో!’’ అంది లోహిత కళ్ళు తుడుచుకుంటూ.
‘‘మీరేం భయపడకండి.. నేనున్నాను గదా! నాక్కూడా ఇక్కడ పని చెయ్యాలని అన్పించడంలేదు. అరిఫ్ ముఠాకు దూరంగా వెళ్లిపోవాలి! పది నిముషాలలో నేను రెడీ అయి కారు తీసుకొని వస్తాను.. కార్లో విజయవాడ దగ్గర్లో వున్న ఓ పల్లెటూరు వుంది.. అక్కడ నెల రోజులు ఉందాం! మనం ఎక్కడ వుంది అరిఫ్ మనుషులు తెలుసుకోలేరు. నెల రోజులు మనం కన్పించకపోయేసరికి చాలా దూరం పారిపోయి వుంటారనుకుంటారు.. మన విషయం పట్టించుకోరు.. క్షేమంగా ఇక్కడనుంచి బయటపడాలి! నేను మిమ్మల్ని ఇక్కడనుండి బయటకు తీసుకెళ్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు. మీరూ రెడీగా వుండండి.. పది నిముషాల్లో వచ్చేస్తాను’’ అనేసి వెళ్లిపోయాడు కాశి.
కాశి వెంట వెళ్ళడం లోహితకు ఇష్టంలేదు.. కానీ తప్పదు! అతని సహకారం లేకుండా ఇక్కడనుండి బయటపడడం కష్టం!
ఇక్కడందరూ కాశీ అంటే భయపడతారు. డాక్టర్ అరవింద్‌కు అతను కుడి భుజం అని అందరికీ తెలుసు.. అతనితో కలిసి ముందు ఇక్కడనుంచి బయటపడాలి! సురక్షితమైన ప్రాంతం చేరుకున్నాక తను ఎక్కడ వున్నదీ స్కందకు చెప్పాలి. అతను వచ్చి తనను తీసుకువెళతాడు.. కాశిని వదిలించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు...
స్కోడా కారు తీసకువచ్చాడు కాశి.
‘‘ఈ కారులో మనం ఎంత దూరమైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చ! ఈకారు నాకు అరవింద్ కొనిపెట్టాడు. అదొక్కడే అతను నాకు చేసిన సహాయం’’ అన్నాడు కాశి.
తన బ్యాగులు కారు వెనుక డిక్కీలో పడేయబోయింది.
‘‘వొద్దు.. లగేజి కారు వెనుక సీట్లో పెట్టండి.. మీరు డిక్కీలో అడ్జెస్ట్ అయిపోండి.. కొంత దూరం పోయేక వెనుక సీట్లోకి వచ్చేద్దురుగాని.. ఇక్కడనుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు నాతో వస్తున్నట్లు ఎవరూ అబ్జర్వ్ చేయకూడదు.. అందుకే మిమ్మల్ని డిక్కీలో సర్దుకోండని అన్నాను’’
అతను చెప్పినట్లే చేసిందామె అటు ఇటు చూసి. చుట్టుప్రక్కల ఎవరూ లేరని నిర్థారణ చేసుకున్నాక డిక్కీలో వొత్తిగిలి పడుకుంది.
కారు స్టార్టు చేశాడు కాశి.
మెయిన్ గేటు దగ్గరకు రాగానే కావాలనే కారు ఆపాడు. కారు దగ్గరకు వచ్చి కాశికి సెల్యూట్ కొట్టారు సెక్యూరిటీ సిబ్బంది. కారులో తనొక్కడే వెళ్తున్నాడని వాళ్ళందరూ అనుకోవాలి.
హాస్పిటల్ నుంచి కొంతదూరం వచ్చేక లోహిత డిక్కీలోనుంచి ముందు సీటులోకి వచ్చేసింది.
కారు భద్రాచలం నుంచి పాల్వంచ వైపు దూసుకుపోతూ వుంది. లోహితను హాస్పిటల్ నుంచి ఎవరూ చూడకుండా బయటకు తీసుకువచ్చానని కాశి సంబరపడ్డాడు కాని, ఆ కారును మరో కారు అనుసరిస్తూ వుంది.
లోహితను డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేసిన వాళ్ళే ఆ కారులో వున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ లోహితను హత్య చేసే ఉద్దేశ్యంలో వున్నారు వాళ్ళు.
పాల్వంచ దగ్గరకు రాగానే పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపాడు. టాంక్ నిండా ఆయిల్ నింపించాడు. మనీ పే చేశాక రెండు నిముషాలు లిలాక్స్‌డ్‌గా వుండాలనుక్నుడు. సిగరెట్ తాగాలన్పించింది. పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ తాగితే ఊరుకోరు.. బంక్ వెనుక వైపున్న ఖాళీ స్థలంలోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు.
పదేళ్ళ కుర్రాడు చెక్కతో చేసిన బొమ్మలు తెచ్చి కారులో కూర్చున్న లోహితకు చూపించాడు. కారు దిగి రెండు నిముషాలు ఆ కుర్రాడితో మాట్లాడాలన్పించింది ఆమెకు.
కారు దిగింది లోహిత.
వెనుక వస్తున్న కారు ఆమె ప్రక్కన ఆగింది. కారులో కూర్చున్న వ్యక్తి మిర్రర్ కిందకు దింపి బాటిల్ వున్న యాసిడ్ ఆమె మీద పోసే ప్రయత్నం చేశాడు. రోడ్డుమీద వెళ్తున్న పోలీసు పెట్రోల్ వ్యాన్ చూసి కారు నడుపుతున్న రెండో వ్యక్తి కారు ఆపకుండా స్పీడ్ పెంచాడు.
యాసిడ్ చల్లే ప్రయత్నం చేసిన వ్యక్తి గురి తప్పింది. సడన్ జర్క్‌కు ఆ యాసిడ్ కారు నడుపుతున్న వ్యక్తిమీద కొద్దిగా వొలికింది. శరీరం మీద యాసిడ్ పడటంతో ఆ బాధ ఓర్చుకోలేక కేకలు పెట్టాడు.
కారు ఆపితే ఓ చిక్కు. అందరూ గుమిగూడతారు. డ్రైవర్ కేకలు పెడుతుండడంతో ఏమైందని యక్ష ప్రశ్నలు వేస్తారు. యాసిడ్ ఎవరు చల్లారు? ఎందుకు? కారులో వున్న వ్యక్తిదగ్గర యాసిడ్ బాటిల్ ఎందుకు వుంది? కారు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి కారు నడుపుతున్న వ్యక్తికి శతృత్వం వుందా?
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.
పోలీసులు చూస్తే మరిన్ని కష్టాలు..
హాస్పిటల్ ఎక్కడ వుందానని వెతుక్కుంటూ వెళ్లిపోయారు వాళ్ళు కారులో.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ