సబ్ ఫీచర్

విస్ఫోటం లాంటి వివాదానికి తెరపడిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల మధ్య వివాదానికి తెరపడిందనే అనిపిస్తుంది. గత నెలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించడంతో ఈ విస్ఫోటం మొదలైంది. ఈ నెల 2వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ‘కేసుల విభజన’కు సంబంధించి ప్రకటించిన రోస్టర్ విధానం పత్రికల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ నేపథ్యంలో వివాదానికి తెరపడిందని అనిపిస్తుంది. జనవరి 13 నుంచి ఈనెల 2వరకు జరిగిన విశేషాలను ఈ సందర్భంగా విశే్లషించాల్సి ఉంది.
జనవరి 26న మన రాష్ట్ర హైకోర్టులో జరిగిన న్యాయమూర్తుల, న్యాయవాదుల సమావేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అనేక విశేషాలను మనకు తెలియచెప్పారు. మన న్యాయవ్యవస్థ మొదటి పరీక్షను- మన దేశం గణతంత్ర దేశమైన నాలుగో ఏటనే ఎదుర్కొందని ఆయన అన్నారు. 1954 జనవరి 3న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పతంజలి శాస్ర్తీ పదవీ విరమణ సందర్భంగా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జస్టిస్ బి.కె.ముఖర్జీని ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టమని కోరారట! కాని తనకంటే సీనియర్ అయిన జస్టిస్ మెహర్‌చంద్ మహాజన్ ఉన్నారనే కారణంతో ముఖర్జీ మర్యాద పూర్వకంగా నెహ్రూ అభ్యర్థనను తిరస్కరించారట. నెహ్రూజీ వత్తిడి చేస్తే రాజీనామా చేస్తాను గానీ తనకంటే సీనియర్ ఉండగా తాను ఆ అత్యున్నత స్థానాన్ని అధిష్ఠించలేనని చెప్పారట. జస్టిస్ మహాజన్ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేశాకే జస్టిస్ ముఖర్జీ ఆ పదవిని అధిరోహించారని రంగనాథన్ గుర్తుచేశారు. అలాంటి న్యాయమూర్తుల నుంచి మనం స్ఫూర్తిని పొందాలన్నారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల కాలం నాటి సంఘటనను మనకు గుర్తుచేసి జస్టిస్ రమేష్ రంగనాథన్ మనలను మేలుకొలిపారు. కాగా, పదవులను పట్టుకుని ‘ఇక మీకు ఉద్వాసనే’ అన్న తరువాత కూడా వేల్లాడిన న్యాయమూర్తుల ఉదంతాలు కూడా మనకు తెలుసు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి.దినకరన్, ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నారాయణ శుక్లాల ఉదంతాలను మనం పరిశీంచాల్సి ఉంది. నారాయణ శుక్లా వ్యవహారం మరింత హాస్యాస్పదం. ఆ న్యాయమూర్తిని అభిశంసించడానికి పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ- సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తే స్వయంగా ఉత్తరం రాశారట! అయినా శుక్లా తన పదవి నుంచి తప్పుకోలేదు. దాంతో ఆయనను విధులకు దూరంగా ఉంచాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారట. ఈలోపుగా నారాయణ శుక్లా 90 రోజులు ‘సెలవు’ పుచ్చుకున్నారట! ఈ వ్యవహారాలు దేన్ని సూచిస్తున్నాయి? ఎంత ఉన్నత పదవులలో వున్నవారిలోనైనా ‘సంస్కారం’ లోపించిందని మనకు అవగతమవుతుంది.
ప్రఖ్యాత రచయిత, బ్రిటన్‌లో మన మాజీ హైకమిషనర్ కులదీప్ నయ్యర్ చెప్పిన విషయాలను మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. 1970-1980 కాలంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్‌కు, ఆయన తరువాత ఆ పదవిని చేపట్టిన భగవతికి, 1990లో జస్టిస్ ఎం.ఎ.అహమ్మదీ, జస్టిస్ కులదీప్‌సింగ్‌ల మధ్య విభేదాలు చెలరేగాయి. వాటిని క్రమశిక్షణారాహిత్యంగా భావించారే తప్ప తిరుగుబాటుగా ఎవ్వరూ పరిగణించలేదు.
తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులకు మధ్య విభేదాలెన్ని వున్నా వాటిని పాత్రికేయుల సమావేశంలో బయట పెట్టుకోవటం- సుప్రీం కోర్టు నైతికాధికారంపై అనుమాన ఛాయలు ప్రసరింపచేసింది. న్యాయవ్యవస్థ నిజాయితీపై ప్రశ్నలు రేపింది.. ధర్మాసనాలను నెలకొల్పే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉన్నమాట నిజమే. కాని దానిని ఏకపక్షంగా కాకుండా వివేచనతో ఉపయోగించాలి. ‘జాతీయ న్యాయ నియామకాల చట్టా’న్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నా, న్యాయమూర్తులు దానిని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సరికొత్త వివాదాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకంలో తన మాట నెగ్గించుకునే అవకాశముందని జడ్జీలు గ్రహించటం లేదు.
‘నేడు ఏ కేసులోనూ సత్వర న్యాయం జరుగుతుందనే ఆశలేదు.. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది కొంతకాలం క్రితం వరకూ ఎవరూ ఊహించలేనిమాట. ఇప్పుడు చాలామంది నోట ఆమాటే వినిపిస్తోంది.. ప్రజలు ఎన్నుకున్న చట్టసభలపై తన మాట నెగ్గాలనే ధోరణి ఇప్పుడు న్యాయవ్యవస్థలో కనిపిస్తుందంటే అతిశయోక్తికాదు. అయితే రాజకీయ నాయకులను దారిన పెట్టగలిగే సత్తా న్యాయవ్యవస్థకు ఉందనటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎంతసేపూ తమ గురించే ఆలోచించుకుంటే, న్యాయాన్ని పట్టించుకోకపోతే- ప్రజాస్వామ్యం తప్పక ప్రమాదంలో పడుతుంది. ఇదీ నేటి పరిస్థితి.. సర్వత్రా విజ్ఞుల సందేహాలు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కేసుల విభజనకు సంబంధించి రోస్టర్ విధానాన్ని గురించి చేసిన ప్రకటన పత్రికలలో వచ్చింది కాబట్టి ఈ వివాదం ఇక ముగుస్తుందని ఆశిద్దాం.
మహాయోగి అరవిందులు, వారి శిష్యురాలు మదర్‌లను గురించి చాలామంది వినేవుంటారు. ఆమె ఒక సందర్భంలో ఇలా అన్నారు. ‘వారు లేనిదే నాకు ఉనికే లేదు, నేను లేకుండా వారు మీకు కనిపించరు (అభివ్యక్తీకరింపబడరు)’ ఇది మన న్యాయవ్యవస్థకు పూర్తిగా సరిపోతుంది. మన రాజ్యాంగం, సుప్రీం కోర్టు, న్యాయవ్యవస్థ లేనిదే మనకు ఉనికే లేదు. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది? మన సబార్డినేట్ న్యాయవ్యవస్థ ద్వారా పైన చెప్పినవి సామాన్యులకు అర్థం కావు, పెద్దగా తెలియకపోవచ్చు.
కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి, రోజుల తరబడి తమ అధీనంలో ఉంచుకోకుండా 24 గంటల్లోగా న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నారంటే- మన రాజ్యాంగ శక్తి మనకు అర్థమవుతుంది సుమా! అలా మన రాజ్యాంగం మనలను రక్షిస్తుంటుంది. మన ఈ సబార్డినేట్ న్యాయవ్యవస్థ లేకుండా- మనకో రాజ్యాంగం, సుప్రీం న్యాయవ్యవస్థ లేకుండా- ఈ రెండవ న్యాయవ్యవస్థ మనలేదుగదా! రెండవ వ్యవస్థ ద్వారానే మొదటి వ్యవస్థ అర్థమవుతుంది. కాదంటారా?

-కె.తారానాథ్ (విశ్రాంత జిల్లా న్యాయమూర్తి)