శ్రీకాకుళం

సిక్కోలుకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళిక, ఆలోచనలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ‘నవ్యశ్రీకాకుళం’ నిర్మాణానికి పెద్దపీట వేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17 బడ్జెట్‌లో నవ్యశ్రీకాకుళం నిర్మాణానికి మూలాలైన పారిశ్రామికాభివృద్ధి, పోర్టులు, ప్రాజెక్టుల నిర్మాణాలకి ఆర్థిక బడ్జెట్‌లో కల్పించిన స్థానాలను పరిశీలిస్తే... 1994 తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి ఒడిశా పేచీలను పరిష్కరించేసరికే కాలం గడిచిపోయింది. మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో పెరిగిన అంచనాల మేరకు సుమారు 450 కోట్ల రూ.లు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఐదు ప్రధాన సాగునీటి ప్రాజెకులకు 7,325 కోట్ల రూ.లు కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మంత్రి గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనగా, అందులో 350 కోట్ల రూ.లు వంశధార ప్రాజెక్టు నిధులుగా కేటాయింపులు చేశారు. ఇప్పటికే 93 కోట్ల రూపాయలకు పాలనాపరమైన అనుమతులు విడుదల చేసిన సర్కార్ ఇటీవల కేబినేట్ సమావేశం అనంతరం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవతో జి.వో.నెం.22, 63 ప్రభుత్వం విడుదల చేస్తూ భూసేకరణ, ఆర్.ఆర్. ప్యాకేజీలతోపాటు 87, 88 ప్రాజెక్టు ప్యాకేజీ పనులకు 450 కోట్ల రూపాయలకు కొత్తగా టెండర్లు ప్రక్రియ జరిగింది. దీనికి ముందుగా అవసరమైన నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించి కరెన్సీ కేటాయింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇలా వంశధార ప్రాజెక్టు పనుల్లో కేవలం 30 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉండగా, వీటిని 2018 నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని నిధులు కుమ్మరిస్తోంది. మరో రెండేళ్ళలో జిల్లా రైతాంగం రెండో పంట కూడా వేసుకునేందుకు వంశ‘్ధర’ 2.55 లక్షల ఎకరాలకు అందే అవకాశం ఏర్పడనుంది.
భావనపాడు పోర్టుకు...
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి తీసుకున్న భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా ఈ ఆర్థిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో ఐదు పోర్టుల అభివృద్ధి, నిర్మాణాలతోపాటు రెండు ప్రాంతాల్లో లాజిస్టిక్స్ ఏర్పాటు చేసేందుకు కేటాయించిన నిధుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా నిధులు కేటాయింపులు చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ప్రైవేటు పార్టర్‌షిప్ (పీపీపీ)తో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసేందుకే సర్కార్ నిధులు కేటాయింపులు చేసింది. ప్రజాభిప్రాయసేకరణ, స్థానిక మత్స్యకారుల సహాయసహకారాలతో వారికి అత్యుత్తమైన జీవనస్థాయి పెంచేలా ప్యాకేజీలు ఏర్పాటు కోసం బడ్జెట్‌లో అత్యంత కీలకమైన నిర్ణయాలతో కేటాయింపులు చేయడం శుభపరిణామమే! రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళాన్ని నవ్యశ్రీకాకుళంగా మార్చాలన్న ప్రజాప్రతినిధులు, అధికారుల తపనకు దీటుగా ఆర్థిక మంత్రి కూడా నిర్మాణశక్తి కోసం నిధులు కురిపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఖాదీ కార్మికులకు వరాలు
దేశానికి వనె్నతెచ్చే పొందూరు ఖాదీ. అటువంటి వనె్నకు నిరంతరం ఆకలికేకలతో అలమటిస్తూ పొందూరు ఖాదీ ఖ్యాతిని దేశవిదేశాల్లో ఇనుమడింపజేస్తున్న ఖాదీ కార్మికులకు ఆర్థిక భరోసా ఇచ్చేలా బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఎపీ సర్కార్ చేసింది. ముఖ్యంగా వారికి ఆరోగ్య బీమాతోపాటు, ఆర్థిక బీమా పాలసీ కల్పించేందుకు నిధి ఏర్పాటు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. వీరికోవలోకే చేనేత కార్మికులు
కూడా ఫించన్లు, వారి తయారీ చేసిన బట్టలకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా నిధులు కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లో చోటుచేసుకుంది.
భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అంకురార్పణం జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే సిక్కోల్ వాసులకు విమానాలు ఎక్కేందుకు అవకాశం దగ్గరలో ఉండేలా అవుతుంది. ప్రతీ పంచాయతీ నుంచి రెండులైన్ల సి.సి.రోడ్లు జిల్లా నగర కేంద్రానికి చేరేలా నిధులు కేటాయింపులు ఈ బడ్జెట్‌లో పొందుపరిచారు. 1101 పంచాయతీలకు 1459 కిలోమీటర్ల సి.సి.రోడ్డులు ఎన్‌ఆర్‌ఈజీఎస్, చంద్రబాట నిధులతో స్మార్ట్ విలేజ్‌ల రూపకల్పనకు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యత ఇస్తూ అందరికీ గూడు కల్పించాలని, రెండు వారాల్లోనే సాగు బాగు చేసేలా నిధులు జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ నిర్మాణాలు, అభివృద్ధి పనులన్నీ టైంబాండ్ మేరకు నిర్వహిస్తే 2018 నాటికి నవ్యశ్రీకాకుళం నిర్మాణం జరిగిపోయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కానీ, గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆఫ్‌షోర్ నిర్మాణానికి కావల్సిన 127 కోట్ల నిధులకు మిగిలిన కేటాయింపులు చేయని సర్కార్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు కేటాయించిన వంద కోట్లు, పాతబ్రిడ్జి నిర్మాణం, పొన్నాడ బ్రిడ్జి నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎసీ ఆడిటోరియం వంటి నిర్మాణాలు నవ్యశ్రీకాకుళానికి మూలాలే. అయినప్పటికీ, ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఊసే లేదు. జిల్లాలో 42,000 మంది నిరుద్యోగ యువతకు ఇస్తామన్న బాబు హామీలకు తగ్గట్టుగా నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం శోచనీయం.

చక్రపెరుమాళ్ల ఉత్సవాలు ప్రారంభం
కవిటి, మార్చి 10: మండలంలోని బెజ్జిపుట్టుగలో కొలువైన శ్రీ చక్రపెరుమాళ్ల స్వామి డోలోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు గురువారం నుండి 15 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్తలు పొందల వంశస్థులు తెలిపారు. నియోజకవర్గంలోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో 15 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ విదియనాడు ప్రారంభమైన ఉత్సవాలు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమితో ముగుస్తాయి. ఈ ఆలయానికి ఘనచరిత్ర ఉందని ఉద్దానం ప్రాంతం ప్రజలు చెబుతుంటారు. ఆలయం మొత్తం రాతితో నిర్మితమై ఉంటుంది. దేవాలయ చరిత్ర కథనం ప్రకారం... సుమారు 300 ఏళ్ళకిందట ఆంగ్లేయుల పాలన సాగుతున్న సమయంలో గ్రామానికి చెరువులో ఉన్న తూర్పుతీరంలోని సముద్రమార్గం మీదుగా నౌకా ప్రయాణం చేస్తూ అందులోని పంచలోహాలు, బంగారం, వెండి ఆభరణాలను అంగ్లేయులు తమ దేశానికి తీసుకుపోతున్న తరుణంలో ఈ ప్రాంతానికి వచ్చే సమయంలో నౌక ఒక్కసారిగా ఆగిపోయింది. దానిని తిలకించేందుకు వందలాది మంది సముద్రతీరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పొందల వంశస్థులైన రాజయోగి స్వర్గీయ రామస్వామినాయుడు తదితర గ్రామ పెద్దలు వెళ్లి నౌకను పరిశీలించగా అందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చక్రపెరుమాళ్ల స్వామి విగ్రహాలు కన్పించాయి. శుభ సమయంగా భావించి వాటిని తెచ్చి బెజ్జిపుట్టుగలోని తాటాకుల మందిరాన్ని నిర్మించి, విశేష పూజలు చేశారు. అప్పటి నుండి స్వామి వారికి పూజలు నిర్వహిస్తూ ఏటా 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి రోజైన ఈనెల 23వ తేదీ బుధవారం స్వామి వారికి నిర్వహించే ప్రత్యేక పూజలను తిలకించడానికి నియోజకవర్గం నుండే కాకుండా ఒడిశా రాష్ట్రం నుండి వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. చివరి రోజు పెద్దయాత్ర జరగడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఖరీఫ్ నాటికి తోటపల్లి నీరందేనా?
పాలకొండ, మార్చి 10: తోటపల్లి కాలువలు చెంత ఉన్నప్పటికీ పాలకొండ, వీరఘట్టం, బూర్జ మండలాలు రైతులు ప్రతి ఏటా వర్షాధారం పైన పంటలు పండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దశాబ్దాలు కాలం నాటి కాలువలు ప్రస్తుతం పూడికలతో నిండిపోయి సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. రెండేళ్లు కిందట వీరఘట్టం వద్ద సైపూన్‌కు గండిపడటంతో మరమ్మతులు చేయడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో తోటపల్లి కాలువలు అధునికీకరణకు రూ.139 కోట్లు మంజూరు చేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య పనులకు మండలంలోని నవగాం గ్రామం వద్ద 2010లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తోటపల్లి కాలువలు ద్వారా ఏడాది కాలంలో వ్యవసాయానికి పుష్కలంగా నీరందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, అనంతరం జరిగిన పరిణామాలు కారణంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో హైపర్ కమిటీ ఏర్పాటు చేసి తోటపల్లి అధునికీకరణ అంత అవసరం లేదని, ప్రస్తుతం బడ్జెట్‌కు ఈ కాలువ పనులు భారంగా మారాయని నిధులు కేటాయింపు రద్దు చేశారు. అక్కడితో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, వైకాపా రాజకీయ పార్టీలు తోటపల్లి కాలువలు ఆధునికీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఓటేసి గెలిపిస్తే ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తెలుగుదేశంపార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ తోటపల్లి వైపు కనె్నత్తి చూడటంలేదు. ప్రస్తుతం ఈ పనులు విలువ సుమారు రూ.179 కోట్లగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. గతంలో విడతల వారీగా ఆధునికీకరణ పేరుతో రూ.7.50 కోట్లు మంజూరు చేసినప్పటికీ, అప్పట్లో జరిగిన పనులు కనీసం ప్రస్తుతం మచ్చుకైన కనిపించటంలేదు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తోటపల్లి ఆధునికీకరణ ఊసులేదని వార్తలు రావడంతో రైతులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఆధునికీకరణకు సహకరించాలని కోరుతున్నారు.

ఈ సారి నిధుల కోతే..!
ఎచ్చెర్ల, మార్చి 10: జిల్లా అభివృద్ధికి అండగా నిలిచే అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర బడ్జెట్‌లో ఈ సారి నిధుల కోత విధించింది. దీంతో విశ్వవిద్యాలయం భవిత ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత గత ఏడాది తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేవలం రూ.6.5 కోట్లే. ఈ నిధులు జీతాలకే చాలని పరిస్థితి నెలకొంది. శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల 12బి గుర్తింపు లభించక యుజిసి నిధులు మంజూరు కాక రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపైనే ఈ విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుంది. 2008లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి కేవలం పదిమంది మాత్రమే రెగ్యూలర్ బోధన సిబ్బంది ఉన్నారు. 61మంది బోధనా సిబ్బందిని పోస్టులు మంజూరు ఉన్నప్పటికీ నియమించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా కాంటాక్ట్ ఫేకల్టీ 65మంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే 88మంది బోధనేతర సిబ్బందిని నియమించాలని రాష్ట్రప్రభుత్వం కోరిన ప్రతిపాదనల మేరకు ఇక్కడి అధికారులు అందించిన నివేదికలకు అతి గతీ లేకుండా పోయింది. దీంతో కాంటాక్ట్ పద్ధతిపైనే విశ్రాంతి ఉద్యోగులతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 16 విభాగాలు 17 కోర్సులు సుమారు 1000మంది విద్యార్థులు ఉన్నత చదువులు సాగిస్తున్నారు. ఇటువంటి విశ్వవిద్యాలయం ఇటీవలి ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో సీ గ్రేడ్ దక్కించుకుంది. వెనుకబడిన జిల్లాలో ఉన్న అంబేద్కర్ వర్శిటీ అభ్యున్నతికి అనుగుణంగా నిధులు కేటాయిస్తారని అందరూ భావించినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మాత్రం ఉన్నత విద్యకు రూ.2642 కోట్లు కేటాయింపు జరిపి చేతులు దులుపుకొంది. దీంతో గత ఏడాది మాదిరిగా నిధులు వాటా ఈ వర్శిటీ ఖాతాల్లో జమ అయితే శాశ్వత ప్రాతిపదికన బోధనా భోదనేతర సిబ్బంది నియామకాలు ఎలా సాధ్యమన్న సందేహాలు తొంగి చూస్తున్నాయి. విద్యాధికులు సర్కార్ కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. ఇటువంటి చాలీ చాలని నిధులు ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేయిస్తాయో వేచి చూడాలి మరి

‘సుప్రీం’ తీర్పును అమలు చేయండి
శ్రీకాకుళం, మార్చి 10: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సాక్షిగా అర్చకులు ప్రభుత్వంపై దండెత్తారు. తమ సంక్షేమానికి సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎక్కడా అమలైన దాఖలా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ అర్చకున్ని అక్కడి ముఖ్యకార్యనిర్వహణాధికారి బాబూరావు లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, ఆ అర్చకుడు మానసిక ఆందోళనతో కోమాలోకి వెళ్లిపోయారని, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అరసవల్లి ఆలయ సూర్యనమస్కారాల మండపంలో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో అర్చకుల సమస్యలపైన, అనేక దేవాలయాల్లో కనీస వేతనం అమలు కాకపోవడంపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంటు కమిషనర్‌లతో పాటు జిల్లాలోని దేవాలయాల ఈవోలు, మేనేజర్లతో ఓ సమావేశం నిర్వహించారు. అర్చక సమాఖ్య అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ అర్చకులను అత్యంత హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కనీస వేతనం ఆలయ ఆదాయాన్ని బట్టి పదివేల రూపాయలు చెల్లించాలని తీర్పులు ఉన్నప్పటికీ, ఎక్కడా అమలైన దాఖలా లేదని అన్నారు.
దీంతో తాము రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పోరాటానికి సిద్ధం అయ్యామన్నారు. సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డిసి మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శ్యామలాదేవి, సీనియర్ ఈవో ప్రసాదు పట్నాయక్ పాల్గొన్నారు.

31లోగా ‘దీపం’ లక్ష్యాన్ని పూర్తిచేయండి
శ్రీకాకుళం, మార్చి 10: జిల్లాకు కేటాయించిన దీపం కనెక్షన్ల లక్ష్యాన్ని ఈనెల 31వ తేదీ లోగా పూర్తిచేయాలని సంబంధింత గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. ఆయన చాంబర్‌లో ఏర్పాటుచేసిన ఎల్‌పిజి గ్యాస్ కంపెనీ డీలర్లతో సమీక్ష నిర్వహిస్తూ దీపం కనెక్షన్లు లక్షా 58 వేలు లక్ష్యం కేటాయించగా, ఇంతవరకూ 59వేలు మాత్రమే పంపిణీ చేశారన్నారు.
అలాగే చిన్నచిన్న తినుబండారాలు తయారికి వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయకుండా ఆ కనెక్షను వారి పేరునే రెగ్యులేట్ చేయాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ నుండి వేరే సిలిండరుకు బదిలీ చేసే పద్ధతిని అరికట్టాలని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరా డిటిలు సహకారంతో గ్యాస్ కంపెనీలు తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఐదుకిలోమీటరు పరిధిలోని వినియోగదారులకు డోర్ డెలివరీ ఉచితంగా చేయాల్సి ఉండగా సిలిండరు ఖరీదుకు అదనంగా వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పద్ధతిని డీలర్లు అరికట్టించాల్సి ఉందన్నారు. సమావేశంలో జెసి వివేక్ యాదవ్, డిఆర్వో బి.హెచ్. ఎస్.వెంకటరావు, డిఎస్‌వో, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
సారవకోట, మార్చి 10: ఉపాధి హామీ పథకం ఏపివో శశిభూషణరావు తన ఉద్యోగ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కూర్మనాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని చిన్నగుజ్జువాడ గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి పనులను గురువారం పరిశీలించిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ఏపివో పనితీరు సంతృప్తికరంగా లేదని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్టు నివేదికలు స్పష్టంచేస్తున్నాయని అసహనం వ్యక్తంచేశారు. పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో తొలగిస్తామని హెచ్చరించారు. అదే విధంగా సాంకేతిక సహాయకులు క్షేత్ర సహాయకుల పనితీరు వేతనదారులకు కల్పించిన పనిరోజులు గిట్టుబాటు వేతనం మరుగుదొడ్ల నిర్మాణం ప్రగతి తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఏప్రిల్ నెలనుండి వీరిని కొనసాగించాలా లేదా తొలగించాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. క్షేత్రసహాయకులు లేని చోట్ల సీనియర్ మేట్లకు బాధ్యతలు అప్పగించాలని ఎంపిడివో లవరాజుకు సూచించారు. మండలంలో ప్రస్తుతం 2800మంది మాత్రమే వేతనదారులు పనిచేస్తున్నారని ఈ సంఖ్యను ఎనిమిది వేలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 22వలోగా మంజూరయిన 147 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు సొమ్ము చెల్లించాలని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీల వారీగా క్షేత్రసహాయకుల పనితీరును ఆయన సమీక్షించారు. గొర్రెబంద పంచాయతీ మినహా మిగిలిన పంచాయతీలలో వేతనదారులకు అతి తక్కువ రోజువారీ సొమ్ము అందడం పట్ల ఆయన అసంతృప్తివ్యక్తంచేశారు. క్షేత్రసహాయకులు పనితీరు ఇదే విధంగా ఉంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పలువురు సాంకేతిక సహాయకులు లేవనెత్తిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాలలో ఎంపిడివో లవరాజు, క్షేత్రసహాయకులు, సాంకేతిక సహాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

స్వచ్ఛ విద్యాలయాల తీరు భేష్
శ్రీకాకుళం, మార్చి 10: జిల్లాలో స్వచ్ఛవిద్యాలయాలను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. స్వచ్ఛ్భారత్ మిషన్ స్వచ్ఛ విద్యాలయాల ఎంపిక కార్యక్రమం చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సైతం తుదిరౌండు ఎంపికలు చోటు సంపాదించుకున్నది. కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహ, జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి న్యూఢిల్లీ వెళ్లి స్వచ్ఛవిద్యాలయంపై జిల్లాలో చేపట్టిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన డిప్యూటీ కార్యదర్శి గోపాల్ మాద్వాణి, సంయుక్త సంచాలకులు అశోక్ జిల్లాలో స్వచ్ఛవిద్యాలయాలను పరిశీలించేందుకు జిల్లాకు విచ్చేశారు. రణస్థలం మండల కేంద్రంలోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొందూరు మండలం లోలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాల, ఎచ్చెర్లలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళంలో చౌదరి సత్యనారాయణ కాలనీలోగల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలతో మరుగుదొడ్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల తరగతి గదులు, వంట గదులను పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. రణస్థలం డిజిటల్ తరగతి గదులను పరిశీలించి పాఠశాల నిర్వాహణ పట్ల సంతృప్తిని వ్యక్తంచేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం, స్వచ్ఛవిద్యాలయం కార్యక్రమం వివరాలను అడిగారు. పరిశుభ్రత పాటించడం, మరుగుదొడ్ల నిర్వహణ, వాటిని ఉపయోగించిన తరువాత వాటి పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా విద్యార్థులు ఆచరిస్తున్న తీరునుఅడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల వలన ఉపయోగంగా ఉందని, నీటి సదుపాయం ఉందని, ఉపయోగించిన అనంతరం శుభ్రపరుస్తున్నారని విద్యార్థులు వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా మరుగుదొడ్ల నుండి వచ్చిన అనంతరం సబ్బుతో శుభ్రం చేస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. రణస్థలంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా ప్రస్తుతం మరుగుదొడ్ల సదుపాయం బాగుందని, విద్యార్థినీలు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం గురించి వివరిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనే ధ్యేయంతో ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమంగా విద్యార్థులు తెలిపారు. తల్లిదండ్రులకు గ్రామస్థులకు స్వచ్ఛత గురించి తెలియజేస్తున్నారా అని బృందం విద్యార్థులను ప్రశ్నించగా తెలియజేస్తున్నామని పరిశుభ్రంగా ఉండాలని వివరిస్తున్నామని తద్వారా వ్యాధుల నుండి దూరంగా ఉంటామని వివరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బయో మరుగుదొడ్లను కేంద్ర బృందం పరిశీలించింది.
కలెక్టర్ జిల్లాలో స్వచ్ఛవిద్యాలయాల గూర్చి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, సౌకర్యాన్ని కల్పించామని కొన్ని పాఠశాలలకు శాశ్వతంగా రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించామని, మిగిలిన వాటికి కల్పించే చర్యలు చేపడుతూ తాత్కాలికంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. పరిశ్రమల సామాజిక బాధ్యత కింద పాఠశాలలో వౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లావిద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఎస్.త్రినాథరావు, ఉపవిద్యాశాఖాధికారులు వి.సుబ్బారావు, ఆబోతుల ప్రభాకర్‌రావు, తిరుమల చైతన్య, సర్వశిక్ష అభియాన్ కార్యినిర్వహక ఇంజినీరు పి.సుగుణాకరరావు, ఉపకార్యనిర్వహక ఇంజినీరి గణపతిరావు పాల్గొన్నారు.