శిప్ర వాక్యం

‘వాగ్దాన భంగం’.. నేతల నైజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉంటున్నాయి. వివిధ పార్టీల ఎత్తులకు, అవకాశవాదానికి ఎన్నికల హామీలు అద్దం పడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ఏ మేరకు అమలు చేస్తున్నాయన్నది ప్రజలందరికీ తెలిసిందే. పోటాపోటీగా రాయితీలు, ఉచిత పథకాలు ఇస్తున్నా- వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార తెరాస, మహాకూటమిలోని పార్టీలు, భాజపా నాయకులు వోటర్లకు అందమైన హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీల్లో కొన్ని గమనార్హమైన అంశాలున్నాయి.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తాము తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిములకు పనె్నండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ వాగ్దానం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ మసీదులకు, క్రైస్తవుల చర్చిలకు ఉచిత విద్యుత్తును అందజేస్తామని భరోసా ఇచ్చింది. మతాల వారీగా తెరాస, కాంగ్రెస్ ఇస్తామంటున్న ఈ ప్రోత్సాహకాల గురించి తెలిశాక భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, ‘హిందువుల దేవాలయాలు ఏం పాపం చేసుకున్నాయి?’ అని ప్రశ్నించాడు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి వివిధ రాజకీయ పక్షాలకు ముస్లిములు, క్రైస్తవులు పదిలమైన ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు. నాస్తికులైన కమ్యూనిస్టులు కూడా కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లపైనే అధికారంలోకి వస్తున్నారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో 2 కోట్ల మంది బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులున్నారు. లోగడ కమ్యూనిస్టులు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఈ ఓటు బ్యాంకునే నమ్ముకోవడం అందరికీ తెలిసిందే. మయన్మార్ నుండి వచ్చిన లక్షలాది రోహింగ్యాలు అస్సాంలో ఓటు బ్యాంకుగా ఉన్నారు.
మరి హిందువుల మాటేమిటి? ఎనె్నన్నో సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్న హిందువుల్లో ఐక్యత లేదు. హిందువుల్లోని ఈ బలహీనత ఆధారంగా లోగడ మొగలులు, ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ, ఇప్పుడు చైనా భారత్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. క్రైస్తవులకు చర్చిలు కట్టించి ఇస్తామని, ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వా గ్దానం చేయటంలో ఆంతర్యం ఇదే!
యోగి ఆదిత్యనాథ్, పరిపూర్ణానంద స్వామి వంటి సన్యాసులకు రాజకీయాలెందుకు? అని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. మరి ఢిల్లీలోని మక్కామసీదు ఇమాం బుఖారీలు ముస్లింలు ఎవరికి ఓటువేయాలో నిర్ణయిస్తూ ఫత్వాలు జారీచేస్తుంటే ‘అది తప్పు’ అని నిలదీసేవారే లేరు. కాంగ్రెస్‌వి మత రాజకీయాలు కావా? అహమ్మదాబాద్‌లోని ఆర్చి బిషప్ ‘ఈ దేశంలో జాతీయవాదం వికసించకుండా చూడండి’ అంటూ క్రైస్తవులకు హుకుం జారీ చేయడం సబబేనా? అండమాన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కార్ స్మృతి చిహ్నాన్ని మణిశంకర అయ్యర్ అనే కాంగ్రెస్ నాయకుడు ధ్వంసం చేసి వచ్చాడు. ఇలా ఎందుకు చేశావు? అని ఆయనను ప్రశ్నిస్తే- ‘హిందూ మతవాదిని కాబట్టి’ అని జవాబిచ్చాడు.
***
కాంగ్రెస్‌కు, తెలుగుదేశం పార్టీకి సమాన భావజాలం ఏముంది? కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదిపై తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగింది. మరి ఈ ఉప్పూ నిప్పూ ఎలా కలిశాయి? వీటిని అవకాశవాద రాజకీయాలు అంటారా? లేక వరదలో కొట్టుకొనిపోతున్న పాము, ముంగిసలు ఒకచోటికి చేరినట్లు అనుకోవాలా? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఒక తాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని సీపీఐ నేత నారాయణ అన్నాడు. ఇక, ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 119 స్థానాలకు ఎందుకు పోటీచేసింది? ఈ ఒంటరి పోటీలో తాము అన్ని స్థానాలూ గెలువబోతోందని కాదు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఇది పునాది అని అర్థం.
***
భాజపా మరొక ఘన విజయం సాధించే ప్రయత్నంలో ముందడుగు వేసింది. అది మైకేల్‌జేమ్స్ క్రిస్టియన్ అనే బ్రిటీషు పౌరుణ్ణి ఇండియాకు తీసుకొని రావటం. ఇతడు అగస్తా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణంలో ప్రధాన దళారి. ఇతనిని యునైటెడ్ అరబ్ ఎమిరిటస్ నుండి ఎట్టకేలకు భారత్‌కు తీసుకొనివచ్చారు. మన విదేశాంగ మంత్రి సుషమా స్వరాజ్ సాధించిన విజయం ఇది. లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌ను తీసుకొని రావడం మోదీ సర్కారుకు తొలి విజయం. దుబాయి నుండి ఒక ప్రైవేటు విమానంలో ఆయనను ఇండియాకు తీసుకొని వచ్చి న్యాయస్థానంలో హాజరు పరచడం నిజంగా ఊహించని పరిణామమే. వీవీఐపిల ప్రయాణాల కోసం కొన్న 12 హెలికాప్టర్లలో 225కోట్ల కుంభకోణం జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇది రూ. 3,600 కోట్ల కాంట్రాక్ట్. మిలాన్ కంపెనీకి చెందిన ఈ ఒడంబడికపై 2010లో సంతకాలు జరిగాయి. అప్పుడు కొందరికి ముడుపులు అందాయట. కొంతమంది కాంగ్రెస్ ప్రముఖులకు కమీషన్లు అందినట్లు వివరాలతో కూడాన ఓ డైరీ సీబీఐ అధికారులకు లభించింది.
నిజానికి మిలన్ కోర్టు లోగడ అగస్టా కుంభకోణానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకున్నది. అంటే భారత ప్రభుత్వం, మన కోర్టులూ వెనుకపడ్డాయని అర్థం. 2014లో ఈ కాంట్రాక్టును రద్దు చేశారు. జోసఫ్ అనే ఢిల్లీ నివాసి మైకేల్ జేమ్స్‌కు డిఫెన్సు లాయర్‌గా వచ్చాడు. ఇతడు కాంగ్రెసు యువజన విభాగం నాయకుడు. క్రిస్ట్ఫర్‌ను రక్షించవలసిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చింది? సోనియా గాంధీ ఎప్పుడూ బ్రిటన్‌లో క్రిస్ట్ఫర్ ఆతిథ్యం స్వీకరిస్తూ ఉంటుంది. ‘‘మాకేదైనా కాంట్రాక్టు ఇప్పించండి’’అని ఆ పెద్దమనిషి అడిగాడట! ఇప్పుడు మైకేల్ క్రిస్ట్ఫర్ నోరువిప్పితే 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన నోరు మూయించాలని జోసఫ్ ద్వారా ప్రయత్నిస్తున్నారట! క్రిస్ట్ఫర్ దోషి అని మిలన్ కోర్టుతోబాటు దుబాయిలో కోర్టు నిర్ధారించింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ఇతనిని క్షేమంగా విడిపించాలని కాంగ్రెస్ నేతలు సహజంగానే ప్రయత్నిస్తారు. ఆనాటి మన రక్షణశాఖామాత్యుడు ఎ.కె.ఆంటోనీ స్వయంగా ‘అగస్టా హెలికాప్టర్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగింది’ అని స్వయంగా ఒప్పుకోవటం గమనార్హం!
ఫ్రాన్సుకు చెందిన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లలో ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణను కొద్ది నెలలుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు. నేరమంతా రక్షణ రంగానికి చెందిన త్యాగి కుటుంబం మీద ఇంతకాలం నెట్టి యుపిఏ సారధులు తప్పించుకున్నారు. ఇక అలాంటి అవకాశం లేదు. క్రిస్టియన్ మైకేల్‌ను ఎవరూ హత్య చేయకుండా భద్రతను పటిష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల లోగా నేషనల్ హెరాల్డ్ కుంభకోణం తీర్పు వెలువడితే కాంగ్రెస్‌కు కష్టకాలమే. ఈ తీర్పు గనుక తమకు వ్యతిరేకంగా వస్తే రాహుల్, సోనియాల ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది. *

ప్రొ. ముదిగొండ శివప్రసాద్