శ్రీకాకుళం

కింతలి స్కూల్‌కు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 17: పొందూరు మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐకెన్ జాతీయ అవార్డుకు ఎంపికైందని విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జన నివారణను ఇక్కడ విద్యార్థులు విజయవంతంగా చేపట్టినందుకు ఎంపికైనట్టు తెలిపారు. గ్రామం నుండి పాఠశాలకు వెళ్లే రహదారి పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటూ నడవలేని పరిస్థితిలో ఉండేదని ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సందేహించే పరిస్థితుల్లో వారంతా ముందుకు వచ్చి పాఠశాల పరిశుభ్రతపై యుద్ధం చేశారన్నారు. పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతున్నా, మధ్యాహ్న భోజనం చేస్తున్న భరించరాని దుర్గంధం విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వారి చదువుపై ఆలోచన లేకుండా చేసేదన్నారు. ఈ తరుణంలో ప్రముఖ బిలియార్డ్స్ క్రీడాకారుడు గీతాసేథ్ ప్రారంభించిన డిజైన్ ఫర్ చేంజ్ అనే అంతర్జాతీయ సంస్థ బహిరంగ మలవిసర్జన నివారణ కార్యక్రమంపై ఐకెన్ అవార్డుకు చేపట్టిన ప్రాజెక్టు ఈ పాఠశాలకు ఓ స్ఫూర్తిగా అందించిందన్నారు. ఈ సంస్థకు ఎన్‌ఆర్‌ఐగా ఉత్తర అమెరికాలో ఉన్న కోమటి జయరామ్ ప్రతినిధిగా ఉండటం పాఠశాలకు కలిసివచ్చింది. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు డిసెంబర్ 3, 4వ తేదీల్లో అహ్మదాబాద్ నగరంలో ఎంటర్ పెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్ ఇన్‌స్టూట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో ఐకెన్ అవార్డు-2016తోపాటు సూపర్‌హీరోస్ ఆఫ్ చేంజ్ అవార్డులతో సత్కరించనున్నారని డిఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కోమటి జయరామ్‌తోపాటు, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, డి ఈవో దేవానందరెడ్డి, డిప్యూటీ డి ఈవో సుబ్బారావు, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ బి.శ్రీనివాసరావులు సహకార అందించారని ఉపాధ్యాయులు తెలిపారు. రు.
బ్యాంకుల్లో సంపన్నులకే పెద్దపీట!
శ్రీకాకుళం: వ్యవసాయానికి చేతిలో సొమ్ములుంటే ఆనందంగా.. ఈల వేసుకుంటూ చేసుకోవచ్చును. ఇది ఒకప్పటి రైతు మాట. ఇప్పుడు ఆ ధైర్యం లేకుండా పోయింది. రూ. లక్షలు, కోట్లు ఉన్నా కోతలు కోయించుకోలేని పరిస్థితుల్లో జిల్లా రైతులు ఉన్నారు. పెద్దనోట్ల కట్టలు ఉన్నా కనీసం కోతలు నిర్వహించలేకపోతున్నాయన్న బాధ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిన్న, మధ్యతరగతి రైతులంతా నిరాశ, నిస్పృహల మధ్య కొట్టాడుతున్నారు. జిల్లా అంతటా నోట్లు మార్పిడి, డిపాజిట్లు, నల్లధనం దొడ్డిదారిలో రవాణా, ఒత్తిళ్ళకులోనై బ్యాంకు ఉద్యోగులు సంపన్నులకే సేవలందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లా అంతటా కరెన్సీ కహానీలు చూస్తునే ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయరంగంపై పెద్దనోట్లు ప్రభావం పడింది. కోతల సమయం కావడంతో కూలీలు చిల్లర నోట్లు కూలీ డబ్బులుగా ముందుగా చెల్లిస్తేనే మడుల్లోకి దిగుతామంటూ బెట్టు చేస్తున్నారు. పండిన పంట కళ్లాలకు చేర్చేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నా కరెన్సీ కష్టాలను మాత్రం జయించలేకపోవడంతో జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమయానికి 87 శాతం వరకూ కోతలు జరగాల్సివుందని వ్యవసాయశాఖ అధికారులే సుస్పష్టం చేస్తున్నారు. కానీ, ఈ పరిస్థితులపై కలెక్టర్, ఇతర అధికారులు ఏ విధంగా వ్యవసాయరంగాన్ని పెద్దనోట్ల అటాక్ నుంచి రక్షించాలన్న వ్యూహరచన, సమీక్షలు నిర్వహించలేకపోవడంతో రైతాంగం అల్లాడుతోంది. పెద్ద నోట్ల రద్దు వాటి స్థానంలో చిల్లర నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్నటి వరకూ మార్కెట్‌పై చూపిన ప్రభావం ఇప్పుడు అన్నదాతలకు తాకడంతో వారంతా దిక్కులు చూస్తూ తల్లడిల్లుతున్నారు. అతికష్టమీద ఈ ఏడాది వరి సాగుచేసి పంటపండించారు. ఇప్పుడు కోతలుకోయాల్సిన తరుణంలో చిల్లర నోట్లు ఇస్తేనే కోతలకు వస్తామంటూ కూలీ తేగేసి చెబుతున్నారు. ఓ వైపు కూలీల కొరత మరోవైపు డబ్బు సమస్యతో ఏంచేయాలో తోచక సతమతమవుతున్నారు.
జిల్లాలో బ్యాంకులు కేవలం 330 శాఖలే ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల సంఖ్య కేవలం 78 బ్యాంకులు మాత్రమే. పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో అన్ని బ్యాంకులలో కూడా లభ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతంలో చిల్లర నోట్లు సమస్య మరింత జఠిలంగా మారింది. మార్కెట్‌లో పెద్దనోట్లు చలామణీ నిలిచిపోయింది. ఇక ఆర్టీసీ బస్సులు, విద్యుత్ బిల్లులు చెల్లింపులకు 24వ తేదీ వరకూ గడువున్న వారు మాత్రం పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. డిపోలకు చేరుతున్న చిల్లర నోట్లు తిరిగి కండక్టర్లుకు ఇచ్చి రోటిషన్ చేసే పరిస్థితి కన్పించడం లేదు. గత పది రోజులుగా ఈ సమస్య కొనసాగుతునే ఉంది. ప్రజల్లో ఈ సమస్య ఏదో రూపంలో వారి నిత్యవసరరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు. చిల్లర నోట్లు ప్రభావం ఇప్పుడు అన్నదాతలను చట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే రోజుకోరకంగా వాతావరణం మారుతుంది. చాలా మంది రైతులు పంట కోత దశకు వచ్చేసింది. కోతకు సిద్ధమవుతున్న రైతులకు చిల్లర సమస్య వెంటాడుతుంది. పెద్ద నోట్లు ఇస్తే వరికోతలకు రావడం కుదరదంటూ కూలీలు స్పష్టం చేయడంతో ఇప్పుడు చిన్న నోట్లు ఎక్కడ సంపాదిస్తామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే జిల్లాఅంతటా కూలీల కొరత వెంటాడుతోంది. వలసలు వల్ల జిల్లాలో వ్యవసాయపనుల సమయంలో కూలీల కొరతను ప్రతీ రెండు పంటలకు రైతులకు సమస్యగానే ఉంటోంది. దీనికితోడు పెద్దనోట్లు తెచ్చిన తంటా మరింత సమస్యను పెంచినట్టు అయ్యింది. అలాగే, ఉన్నపాటి రెండుమూడు పెద్దనోట్లు మార్చుకునేందుకు వ్యవసాయ కూలీలు బ్యాంకులకు తెల్లతెల్లవారునే క్యూలో నిలుచుని వచ్చేసరికి వారికి కోతలకు వెళ్ళే ఓపిక నశించిపోవడంతో రోజురోజుకూ కోతలు వాయిదా పద్ధతిలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆరుగాలం శ్రమించిపండించిన పంటను కళ్లాలకు తరిలించేందుకు రైతులు సిద్ధమైన నేపథ్యంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో లబోదిబోమంటున్నారు. గతంలో పండిన ధాన్యం కూలీలు తీసుకునే వారని కొంతకాంలగా డబ్బులే కూలీగా తీసుకుంటున్నారు. తాజాగా 500, 1000 నోట్లు చలామణి నిలిచిపోవడంతో ఇప్పుడు కూలీలకు రోజువారి డబ్బులను ఏలా చెల్లించే అవకాశంలేక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన అక్కడ కూడా రెండు వేల రూపాయల నోటు ఇస్తుండడంతో అది అసలు మారే పరిస్థితి లేకుండా పోయింది. ఎకరా వరి పంట కోసేందుకు 1500 నుంచి రెండు వేల రూ.లు వరకూ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ రైతు కూడా ఈ చిల్లర డబ్బులు సమకూరిస్తే తప్ప వరిపంట కోత కోయించుకునే పరిస్థితి ఉండదు. దీనికి తోడు కోసిన పంట నూర్పిడిచేయాలన్న కల్లాలకు చేరిపంచాలన్న అదనంగా మరికొంత సొమ్ము అవసరం. దీంతో బ్యాంకులు గ్రామీణ ప్రాంత రైతులకు దండిగా సొమ్ములు అందించేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
శ్రీకాకుళం రూరల్, గార, జలుమూరు, నరసన్నపేట, టెక్కలి, పోలాకి, ఆమదాలవలస, సరుబుజ్జిలి, తదితర మండలాలకు చెందిన భూములు వంశధార, నాగావళి కాలువ కింద సాగవుతున్నాయి. రెండున్నర లక్షల ఎకరాలకుపైగా భూములలో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు పెద్దగా లేకపోవడం తుఫాన్ గండ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న రైతులకు పెద్దనోట్లును చిల్లర నోట్లుగా మార్చే సమస్య ఎదురైంది. వేగంగా పండిన పంటను కోసి కల్లాలకు చేర్చాలని రైతులు తాపత్రయం పడుతుంటే చిల్లర నోట్లు అడ్డంకిగా మారాయి. తాజాగా వాతావరణం మార్పుచోటు చేసుకోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో వరి పంటకోత కోసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు కూలీల కోసం తిరుగుతున్నారు. కొందరు రైతులు కూలీలతో ఒప్పందం కుదుర్చుకుని కోతకోస్తుండగా ఆ పక్కనే ఉన్న రైతుకు చిల్లర సమస్యతో పండిన పంట కోయించుకోలేకపోతున్నారు. నోట్లు రద్దు మేలైనా రైతుల కష్టాలను కూడా ప్రభుత్వం చూడాలని ఒప్పంగికి చెందిన సూరిబాబు అనే రైతు కోరుతున్నాడు.

పివోఎస్ మిషన్ల ఏర్పాటు

శ్రీకాకుళం, నవంబర్ 17: జిల్లాలో నగదు సమస్య తీర్చేందుకు పాయింట్ ఆఫ్ సేల్(పిఓఎస్) మిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. జిల్లాలో పెద్దనోట్ల, చిల్లల సమస్యలపై బ్యాంకర్లు, వర్తకులతో గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోసమావేశం నిర్వహించారు. కరెన్సీ సమస్య తాత్కాలికమైనదని, కొద్ది రోజుల్లో పూర్తిగా పరిష్కారం కాగలదన్నారు. చిల్లర కొరత వలన తక్కువ స్థాయిలో కొనుగోలు చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అయితే జిల్లాలో అంత తీవ్రత లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు ప్రజలకు అరువుపై సరుకులు అందిస్తుండటం పట్ల అయన అభినందించారు. చిల్లర సమస్య పరిష్కరించేందుకు పిఏఎస్ మిషన్లను దుకాణాలు, పెట్రోల్ బంకులు, రైతు బజార్లు, ఆర్టీసీ బస్టాండుల్లో ఏర్పాట్లకు చర్యలు చేపడుతన్నట్టు తెలిపారు. ఎస్‌బిఐ 500, ఎస్‌బిహెచ్ రూ.125పి ఓఎస్ మిషన్లను అందించేందుకు ఇప్పటికే ఆర్డర్ చేశాయని ఆయన తెలిపారు. మిగిలిన బ్యాంకుల సైతం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా 50, 100నోట్ల కరెన్సీ 50 నుండి రూ.100కోట్ల వరకు జిల్లాకు ఏర్పాటు చేయాలని లేఖ రాశామని చెప్పారు. చిల్లర కొతర కొంతమేర తీర్చేందుకు దేవాలయాల హుండీలలో ఉండే మొత్తాలను లెక్కించి బ్యాంకులలో జమ చేయాలని ఆదేశించామని ఆమేరకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో చిల్లర సమస్యలపై తన పర్యటనల్లో పరిశీలిస్తున్నామని తీవ్రమైన సమస్యలు ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. తీవ్ర సమస్యలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. జిడి, గ్రానైట్ పరిశ్రమల ప్రతినిధులను సంప్రదించగా సమస్యలు లేవన్నారన్నారు. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరికాయల వ్యాపారంలో కొద్దిపాటీ సమస్య ఉన్నట్లు సమాచారం ఉందని, ప్లాస్టిక్ కరెన్సీ, మొబైల్, నెట్‌బ్యాంకింగ్ వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చౌక ధరల దుకాణ దారులను బిజినెస్ కరస్పాంటెండెంట్‌లుగా నియమించేందుకు ఇప్పటికే 506మందిని గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవహారం ఎక్కువగా జరపాలని ఆయన కోరారు. పి ఓ ఎస్ మిషన్లను ఉచితంగా సరఫరా చేస్తున్నామని లీడ్‌బ్యాంకు మేనేజర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. పివో ఎస్ మిషన్ల వినియోగంలో డిసెంబర్ 30వరకు ఎటువంటి రుసులు వసూలు చేయడం లేదని బ్యాంకర్లు తెలిపారు. వర్తక ప్రతినిధులు నటుకుల మోహన్, కోరాడ హరగోపాల్ మాట్లాడుతూ చిల్లరపై గ్రామీణ ప్రాంతాల్లో కొంత సమస్య ఉందన్నారు. నగరంలో కనీసం 4,5 ప్రదేశాల్లో పి ఓ ఎస్ మిషన్లు ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం ఉంటుందన్నారు. పెట్రోలియం వ్యాపారులు మాట్లాడుతూ అధిక శాతం ప్రజలు పెద్దనోట్లను తీసుకువచ్చి తక్కువ మొత్తంలో పెట్రోల్ అడుగుతున్నారని తద్వారా చిల్లర సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. 50, 100నోట్లను ఏటి ఎంల నుండి డ్రా చేస్తున్నప్పటికీ సర్కిలేషన్ చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమీషనర్ పి ఏ శోభ, జెసి చక్రధరబాబు, ఐ టి డి ఏ పివో ఎల్.శివశంకర్, ఆంధ్రాబ్యాంకు డి జి ఎం రాధాకిషన్‌రావు, ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ మేరీగ్రాసియా ఇతర బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో 19 పూరిళ్ళు దగ్ధం
రణస్థలం, నవంబర్ 17: మండలంలోని తిరుపతిపాలెం గ్రామంలో గురువారం వేకువజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మండల రామినాయుడు అనే ఇంటి వద్ద పూరింటిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న పూరిళ్లు అన్నీ ఆహుతయ్యాయి. అందరూ గాఢ నిద్రలో ప్రమాదం జరిగింది. అంతా నిద్రమత్తులోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. రాత్రి సమయం కావడంతో చిమ్మచీకటిలో కనీసం ఏ వస్తువు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం ఏ విధంగా సంభవించిందో తెలియలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు తెలిపారు. ఇళ్లల్లో దాచుకున్న సామగ్రి కాలిపోయింది. అదే విధంగా పాస్ పుస్తకాలు కాలిపోయినట్టు రైతులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు వ్యక్తిగత కార్యదర్శిని గ్రామంలోనికి పంపించి సహాయక చర్యలను చేపట్టారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని తహశీల్దార్ శ్రీరాములు, ఎంపిపి గొర్లె విజయకుమార్‌చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
మానవత్వం చాటుకున్న ఎన్‌ఇఆర్
తిరపతిపాలెం అగ్ని ప్రమాద బాధితులకు స్థానిక టిడిపి నాయకులు నడుకుదిటి ఈశ్వరరావు అండగా నిలిచారు. ఈ గ్రామం బంటుపల్లి ఎంపిటిసి పరిధిలో ఉండటంతో ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే గ్రామానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ప్రతీ ఇంటికీ వెళ్లి బాధితులను పరామర్శించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్‌ఇఆర్ యువత ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు భోజన సదుపాయాలు, మంచినీటి సరఫరా వెంట వెంటనే చేయించారు. ప్రస్తుతం వారికి అవసరమైన బియ్యాన్ని బట్టలను అందజేశారు. ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయమే కాకుండా మహాలక్ష్మి యూత్‌క్లబ్ నుండి పూర్తిస్థాయి సహకారం బాధ్యులకు అందుతుందని భరోసా ఇచ్చారు.
బ్యాంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
ఎచ్చెర్ల, నవంబర్ 17: పెద్దనోట్లు రద్దు చేసి 10 రోజులు కావస్తున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్యాంకుల వద్ద రద్దీ కొనసా గుతోంది. ముఖ్యంగా వందనోట్లు కొరత అటు బ్యాంకు సిబ్బందిని, ఇటు సామాన్యులను మరిన్ని కష్టాలను గురిచేస్తోంది. కేవలం రూ.4,500 మాత్రమే పెద్దనోట్ల మార్పిడికి బ్యాంకులు చెల్లించేందుకు కూడా వందనోట్ల కొరత పట్టి పీడిస్తోంది. ఉదయం తొమ్మిది గంటల నుండే మండల కేంద్రంలో ఎ.బి, ఎస్‌బి హెచ్, ఏపిజివిబి చిలకపాలెం, ధర్మవరం, ముద్దాడ, ఎస్‌ఎం పురం, పొన్నాడ శాఖల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సివస్తోంది. నగదు చెల్లించేందుకు ఒకే కౌంటర్ కావడం వలన గంటల తరబడి పనులు మానుకొని పెద్దనోట్లు మార్చుకునేందుకు నిరీక్షి స్తున్నారు. పోస్ట్ఫాసుల వద్ద వందనోట్లు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అక్కడ కూడా లభ్యం కాకపోవడంతో సామాన్యుల నుండి అసమాన్యుల వరకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఓ వైపు కోతలు, మోతలు ఊపందుకోవడం, భవన నిర్మాణ పనులు కూడా కొనసాగుతుండటంతో సాయంత్రం అయ్యే సరికి కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అటు రైతులు, ఇటు నిర్మాణ యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపితే కాని కూలీలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ఇలా బ్యాంకు అధికారులు కూడా తామేమి చేయలేమని రూ.2వేల నోట్లే అందుబాటులో ఉన్నాయని తెగేసి చెప్పడంతో చేసేది లేక అనేక మంది డిపోజిట్ చేసేందుకు కూడా అత్యుత్సాహం కనబరుస్తున్నారు.
కూరగాయలు, పాలు, నిత్యవసర సరుకులు క్రయవిక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును పలువురు తప్పు పడుతున్నారు.

షిర్డీసాయి ఆలయంలో పూజలు
శ్రీకాకుళం(కల్చరల్), నవంబర్ 17: నగరంలోని షిర్డీసాయి ఆలయాల్లో గురువారం పూజలు నిర్వహించారు. విశాఖ బి కాలనీలోని పెద్ద షిర్డీసాయి మందిరంలో అర్చకులు బి.శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో కాగడాల హారతి, క్షీరాభిషేకం జరిగింది. బొందిలీపురం, ఇల్లీసుపురం, కలెక్టర్ బంగ్లా వద్ద నున్న షిర్డీసాయి ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ గొర్లె సంతాపసభ
బలగ, నవంబర్ 17: మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. హరిబాబు సంతాపసభ శ్రీకాకుళంలోని వైఎస్ ఆర్ కల్యాణమండంలో శనివారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నట్టు నిర్వాహణ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రకటన తెలిపారు. ఈ సంతాపసభకు వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సభ్యునిగా పనిచేసిన హరిబాబు సంతాపసభకు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, జడ్పీటిసిలు హాజరు కావాలని అప్పలనాయుడు కోరారు.
చినపూడివలస
ఉపాధ్యాయురాలికి నోటీసు
ఎచ్చెర్ల, నవంబర్ 17: చినపూడివలస ప్రాథమిక పాఠశాలలో సెకండరీ టీచర్‌గా పనిచేస్తున్న జి.ఉదయలక్ష్మి జూలై 25 నుండి పాఠశాలకు గైర్హాజరు కావడంతో డిఈవో దేవానందరెడ్డి నోటీసు జారీ చేసినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం డిఈవో కార్యాలయానికి వారం రోజుల్లో హాజరు కావాలని లేని ఎడల సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
బాలల హక్కులపై ప్రచార ర్యాలీ
లావేరు, నవంబర్ 17: బాలల హక్కు దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో బాలలహక్కులపై ప్రచార ర్యాలీని చేపట్టారు. అంగన్వాడీ కేంద్రం నుండి పురవీధుల గుండా మండల తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించి బాలల హక్కులకు భంగం వాటిల్లకూడదని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు వజ్రమ్మ, అన్నపూర్ణ, లక్ష్మీ, సుభద్ర పాల్గొన్నారు.
నిందితుడి అరెస్ట్
సారవకోట, నవంబర్ 17: మండలంలోని రైవాడ గ్రామంలో పట్ట రామచంద్రరావు అనే యువకుడు మృతిచెందడానికి కారకుడైన ఇదే గ్రామానికి చెందిన బొంతు నాగభూషణరావును అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాదరావు తెలిపారు. గురువారం పాతపట్నం కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం నిందితుడు మృతుడు రామచంద్రరావు తలపై కర్రతో కొట్టి గాయపరచగా చికిత్స పొందుతూ రామచంద్రరావు మృతిచెందిన విషయం తెలిసిందే.

క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్న బాస్కెట్‌బాల్
బలగ, నవంబర్ 17: జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు ఇటువంటి పోటీలు మరింత స్ఫూర్తి నింపుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ పి.శోభా అన్నారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మైలపల్లి రాములు, పైడమ్మ దంపతుల స్మారక ప్రథమ జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించడంతో క్రీడాకారుల్లో నూతనుత్తోజంపాటు మరింత ఆసక్తి నింపుతుందన్నారు. ఇటువంటి పోటీలు తరుచుగా నిర్వహించినట్టయితే క్రీడాకారులకు స్ఫూర్తినింపుతుందన్నారు. రెండు రోజల పాటు నిర్వహించే ఈ పోటీలకు సీనియర్ బాలుర నుంచి 13 జట్లు, సీనియర్ బాలికలు రెండు జట్లు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు శుక్రవారం బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షులు ఎం.ఎస్. ఆర్.మూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి అర్జున్ రెడ్డి, సంఘం ప్రతినిధులు టి. ఎం. ఎస్.ప్రకాష్, ఉపాధ్యక్షుడు రామస్వామి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పి.నాగభూషణరావు, సిహెచ్.దేవదత్తానంద్ పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చారా?
గార, నవంబర్ 17: ఎన్నికలు సమయంలో అధికారం అందిపుచ్చుకునేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి తీరా అధికారం అందిపుచ్చుకున్న తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో గురువారం కొర్లాం పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొమరవానిపేట గ్రామంలో మత్స్యకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మత్స్యకారులకు కుల ప్రాతిపదిక ప్రాధాన్యం కల్పిస్తానన్నారు.. కల్పించారా? డ్వాక్రా రుణాలు మాఫీ పెట్టుబడి నిధి అంటూ కల్లబొల్లి మాటలుతో డ్వాక్రా మహిళలను బురిడీ కొట్టించడం అడ్డగోలు వ్యవహారం కాదా అంటూ ప్రశ్నించారు. గడచిన ఎన్నికలు సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు.. అవి ఎంత వరకు నెరవేరాయి అన్న అంశమై స్థానిక మత్స్యకారులతో చర్చించారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్నది గుర్తించాలన్నారు. గడచిన రెండున్నరేళ్లు తెలుగుదేశం పాలనలో పెరిగిన ధరలు గుర్తించారా అని ప్రశ్నించారు. రేషను దుఖాణాలు ద్వారా అందుతున్న సరుకులుపై ఏమైనా అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఈయన వెంట ఆ పార్టీ మండల కన్వీనరు పీస శ్రీహరిరావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, కొయ్యాన నాగభూషణరావు, యాళ్ల నారాయణరావు, గొండు క్రిష్ణమూర్తి, మూకళ్ల తాతబాబు, పి. గణేశ్వరరావులతో పాటు స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాక్షరభారత్ కేంద్రాలు మెరుగైన ఫలితాలు సాధించాలి
నరసన్నపేట, నవంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం వయోజనులకు సంబంధించి విద్యను అందించే దిశగా అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, సాక్షరభారతీ కేంద్రాలను నడిపిస్తోందని వయోజన విద్యాశాఖ సూపర్‌వైజర్ ఏ.సోమేశ్వరరావు తెలిపారు. గురువారం మండలంలోని తామరపల్లి గ్రామంలో సాక్షరభారతీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కేంద్రం ద్వారా సుమారు 30మంది మహిళా సంఘ సభ్యులకు అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించాలని దీనిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతీ ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అనంతరం ఆయన రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ ఎల్లన్న పాల్గొన్నారు.
నిలిచిన ఉపాధి చెల్లింపులు
* లబ్ధిదారులు గగ్గోలు
ఎచ్చెర్ల, నవంబర్ 17: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బిల్లులు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులంతా గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని ఇంకుడు గుంతలుసుమారు 2500, వ్యక్తిగత మరుగుదొడ్లు 225, వర్మీ కంపోస్టు పిట్లు 2300 నిర్మాణాలు పూర్తి చేసుకొని బిల్లుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు అదిగో ఇదిగో అంటూ దాటవేయడంతో ప్రభుత్వ తీరును లబ్ధిదారులంతా తప్పు పడుతున్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, భూగర్భజలాల పరిరక్షణ పేరిట ఇంకుడు గుంతలు, సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించేందుకు వర్మీకంపోస్టు పిట్లు నిర్మించాలని సంబంధిత అధికారులు లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి నేడు బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం వహించడాన్ని వారంతా తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై ఏపివో సత్యన్నారాయణనను వివరణ అడుగగా సెప్టెంబర్ నుండి పూర్తిగా బిల్లులు చెల్లించడం లేదని సుమారు రూ.70లక్షలు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్టస్థ్రాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో
జిల్లాకు తృతీయస్థానం
బలగ, నవంబర్ 17: అండర్-29 రాష్టస్థ్రాయి పాఠశాలల క్రీడల సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు తృతీయస్థానం కైవశం చేసుకున్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు కడప జిల్లా పులంపేటలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మూడోస్థానంలో నిలిచారు. ఇందులో నైపుణ్యం చూపిన జి.హరిప్రసాద్(ఇప్పిలి), టి.శ్రీను(ఇప్పిలి), ఎ.రమణమూర్తి(తొగరాం) క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు మహారాష్ట్రంలోని జౌరంగాబాద్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లోకు అర్హత సాధించారు. జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ పట్ల, అలాగే క్రీడాకారులు ఎంపిక పట్ల అండర్-19 జిల్లా కార్యదర్శి కృష్ణ, జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.హరిధరరావు, ఎం.వి.రమణ, కన్వీనర్ కిల్లశెట్టి అరుణ్‌కుమార్ గుప్త, సంఘ సభ్యులు జి.కాశీవిశే్వశ్వరరావు, కె.కిరణ్‌కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు వై.సాంబమూర్తి, సాంబమూర్తి, వై.పోలినాయుడు, ఎం. ఎస్.సి శేఖర్ అభినందించారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి
బలగ, నవంబర్ 17: బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యతలను పౌరులంతా స్వీకరించాలని యూత్‌క్లబ్ ఆఫ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎం.ప్రసాదరావు స్పష్టం చేశారు. గురవారం మహిళా కళాశాల ఆడిటోరియంలో చైల్డ్‌లైన్ 1098 తరుపున జిల్లాస్థాయి మల్లీస్టేక్ హోల్డర్స్ కనె్సల్టెన్సీ సమావేశం నిర్వహించారు. ప్రసాదరావు మాట్లాడుతూ అధికారులు దృష్టికి పిల్లలకు సంబంధించిన సమస్యలు బాలకార్మిక వ్యవస్థ బాల్య వివాహాలు నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఫిర్యాదులు అందించాలని సూచించారు. సిడబ్ల్యుసి మెంబర్ బి.మల్లేశ్వరరావు, సెట్‌శ్రీ మేనేజర్ అప్పలనాయుడు, రెడ్‌క్రాస్ ప్రతినిధి సీతంనాయుడు, ఎన్‌సి ఎల్‌పి పిడి రామకృష్ణ, డిసి పివో కెవి.రమణ, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిఫెడరిక్, బ్రెడ్స్ ఎన్జీవో సాంబశివరావు పాల్గొన్నారు.