శ్రీకాకుళం

భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీముఖలింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, ఫిబ్రవరి 24: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం మధుకేశ్వర ఆలయ ప్రాంగణం మహాశివరాత్రి శుక్రవారం శివనామస్మరణతో హోరెత్తింది. సూర్యోదయం పూర్వం 3గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, అర్చకులచే లోక కళ్యాణార్థం శాశ్వత ధర్మకర్తలు పర్లాకిమిడి మహారాజ్ గోపీరాజ్ గజపతి, శ్రీమాన్ మహాదేవవర్మ పేరున మొదటి పూజ ప్రారంభమైంది. తరువాత భక్తుల దర్శనం మొదలైంది. ఉదయం 9గంటల వరకు సాదాసీదాగా భక్తులు క్యూలో కనిపించారు. అక్కడ నుండి మధ్యాహ్నం 2గంటల వరకు భక్తుల రద్దీ పెరిగింది. మధుకేశ్వర ఆలయంతోపాటు సోమేశ్వర, భీమేశ్వర ఆలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం భక్తులు తక్కువగా ఉన్నందున పోలీస్ సిబ్బందిని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వెనక్కు పంపించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ పరిశీలించి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటసూర్యనారాయణ భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మధుకేశ్వర స్వామికి లింగోద్భవం జరపడానికి పర్లాకిమిడి రాజు తరఫున దేవాలయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సత్యసాయి సేవా సమితి సభ్యులు భక్తులకు తాగునీరు అందించారు. మండలంలోని చల్లవానిపేట భ్రమరాంబికా మల్లికార్జున, జలుమూరు స్వయంభీమేశ్వర, యలమంచిలి ఎండల కామేశ్వర, కరవంజ కాశీవిశే్వశ్వరాలయాలవద్ద తెల్లవారుజామును భక్తుల కోలాహలం కనిపించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ప్రముఖుల సందర్శన : మధుకేశ్వర స్వామిని శ్రీకాకుళం ఎం.పి.కింజారాపు రామ్మోహన్‌నాయుడు తల్లి విజయలక్ష్మీ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు డోల జగన్, వైకాపా మహిళా నాయకురాలు పద్మప్రియ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి, పశు సంవర్థక శాఖ జెడి వెంకటేశ్వర్లు పలువురు ప్రముఖులు స్వామిని దర్శించారు.
సిబ్బంది తీరుపై ఎస్పీ ఆగ్రహం: మధుకేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో తాను చెప్పింది ఒకటి, సిబ్బంది చేసింది మరొకటి కావడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగం ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్త పరిచారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకపోతే ఎలా అని మండిపడ్డారు.

మణినాగేశ్వరుని దర్శించుకున్న కలెక్టర్
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 24: బలరాముడు ప్రతిష్టించిన పంచలింగాల్లో ఒకటైన మండలంలోని కళ్లేపల్లిలో వేంచేసిఉన్న శ్రీ మణినాగేశ్వరస్వామిని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినాన పంచలింగాలను ఒకే రోజు దర్శించుకుంటే కోటి యజ్ఞాల ఫలం అనే నానుడితో జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. పశ్చిమ ముఖంగా ఉండటం ఈ ఆలయం విశిష్టత. శుక్రవారం వేకువజామునుండే స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 6గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు అఖండ భజన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలిపారు. రుద్రాభిషేకాలు అనంతరం రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవాభిషేకం నిర్వహించారు. భజన మండలి భక్తులచే విశేష భజనలు నిర్వహించారు. నాగేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇప్పిలిలో వేంచేసిఉన్న శ్రీ పిప్పలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

హరహర మహాదేవ శంభో శంకర
* భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 24: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు శంభోశంకర కీర్తనలతో శివుని దర్శించుకునేందుకు బారులు తీరారు. నగరంలో శ్రీ ఉమారుద్రకోటేశ్వర ఆలయాన్ని ఎంపి రామ్మోహన్‌నాయుడు తల్లి విజయకుమారితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ వి.కిరణ్‌బృందం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే కొన్నావీధిలోని భీమేశ్వరరాలయంలో భీమేశ్వర భజన బృందం ఉదయం 5గంటల నుండి భజన నిర్వహించారు. కార్యక్రమంలో బమ్మిడి రాంబాబు, గార సూర్యనారాయణ, మన్మధరావు, ఈశ్వరరావు అప్పారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పాతబ్రిడ్జి వరకు క్యూలైన్‌కొనసాగింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు పాతబ్రిడ్జిపైనే పార్కింగ్ చేయించారు. బ్యాంకర్స్ కాలనీలో ఉన్నశివబాలాజీ ఆలయంవద్ద శివరాత్రి పురస్కరించుకొని ఓం నమఃశివాయ పేరిట పెద్ద ముగ్గును వేసి రికార్డును నెలకొల్పారు.

ఎన్నికల కోడ్‌కు తూట్లు
చోద్యం చూస్తున్న అధికారులు
* పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనం
పలాస, ఫిబ్రవరి 24: స్థానిక సంస్థాగత, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని ఆదేశాలిచ్చిన పలాస నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు సైతం దర్శనమిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని పలుచోట్లు ఫ్లెక్సీలు, వివిధ పార్టీల జెండాలు దర్శనమిస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో అక్కుపల్లి, బైపల్లితోపాటు ఇతర ప్రాంతాల్లో వివిధ పార్టీల ఫ్లెక్సీలు, ముసుగు లేని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మందస మండలంలోని మందస, హరిపురం, బాలిగాం, అంబుగాం, బేతాళపురం ప్రాంతాల్లో వివిధ పార్టీల అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన ప్రజాప్రతినిధుల ముఖచిత్రాలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌లో భాగంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల ముఖచిత్రాలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని, విగ్రహాలకు ముఖాలు కనిపించకుండా ముసుగులు వేయాలని ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోరన్న భావనో, లేకుంటే ఎవరు చూస్తారన్న నిర్లక్ష్యమోగాని వివిధ పార్టీల ఫ్లెక్సీలు దర్శనమిస్తూ వారి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కనిపిస్తుండడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలుచేసి వివిధ పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

నేటినుండి సాంస్కృతిక, క్రీడా సంబరాలు

బలగ, ఫిబ్రవరి 24: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక కమిటీ నిర్వహణలో జరగనున్న ప్రాంతీయ సాంస్కృతిక, క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని ఎస్‌బిఐ స్ట్ఫా యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆర్.నరేంద్రకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఎస్‌బిఐ జోనల్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ మీట్‌పై ఆయన విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 26వతేదీల్లో ఇదే వేదికపై ప్రాంతీయ సాంస్కృతిక, క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన సుమారు 250 బ్రాంచీలలోపనిచేస్తున్న సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. నిత్యం బ్యాంకు పనుల్లో నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న సిబ్బందికి కాస్త ఊరట కలిగించి మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది విజయనగరం, తర్వాత విశాఖపట్నంలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకు సిబ్బందిలో ఉన్న కళలను వెలికితీసి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రాంతీయ సాంస్కృతిక, క్రీడా సంబరాలు వేదిక కానుందని చెప్పారు. ఈ సంబరాల్లో నాటకాలు, నాటికలు, ఏకపాత్రాభినయం, సంగీతం, ఇనుస్ట్రుమెంట్స్, వోకల్, మోనో యాక్షన్ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్విజ్ చదరంగం, కారమ్స్, వక్తృత్వ పోటీలు, ఫ్యాన్సీ, వస్తధ్రారణ ఉంటాయని చెప్పారు, బ్యాంకు సిబ్బంది వారికి ఆసక్తి ఉన్న కళారంగంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజోయ్‌కుమార్ పండిట్ ప్రాంతీయ మేనేజర్ డి.మేరీసగారియా, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, హైదరాబాద్ సర్కిల్ సిఎఎస్ ప్రభాకర్, ఎన్.సాంబశివరావు, సర్కిల్ సంక్షేమ కమిటీ సభ్యులు ఎంబివిఎన్. ఎన్.సూర్యలక్ష్మీ, సహాయ జనరల్ మేనేజర్ జి.నాగరాజు పాల్గొంటారని చెప్పారు. బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు హాజరై రెండు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రాంతీయ కార్యదర్శి కె.సి.హచ్.వెంకటరమణ, పట్టణంలోని పలు బ్రాంచీల సిబ్బంది టి.శ్రీనివాసరావు, బి.శేషుమూర్తి, చల్లా రమణమూర్తి, కృష్ణంరాజు పాల్గొన్నారు.

ఆధునీకరణపై అనుమానాలు?
* కేటాయించని నిధులు
* రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24: ప్రతీయేటా ఖరీఫ్‌లో వరిసాగు చేసే రైతులకు సాగునీటి కష్టాల నుండి గట్టెక్కించాలని చేసిన విన్నపాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నారాయణపురం కుడికాలువను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోకపోవడంతో ఆయకట్టు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాదైనా ఆధునీకరణ పనులు ప్రారంభం అవుతాయన్న ఆశ రైతుల్లో కలగడం లేదు. నిధుల కేటాయింపు జరగకపోవడం, పనుల నిర్వహణకు టెండర్లు పూర్తి చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 22వేల హెక్టార్లకు సాగునీరు సరఫరా చేసే కుడికాలువ పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.10కోట్ల నిధులు వెచ్చించాల్సి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆధునీకరణ పనులు చేపడతామని టెండర్లు ఖరారు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటువంటి కారణాల వలన ఎచ్చెర్ల మండలంలోని శివారు గ్రామాలైన భగీరథపురం, రామజోగిపేట, ధర్మవరం, పొన్నాడ, బొంతలకోడూరు, ముద్దాడ,కొత్తపేట, కొంగరాం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాలకు సాగునీరు సరఫరా కాక, పంట చేతికొచ్చే సమయంలో బాగా నష్టపోతుంది. ప్రతీయేటా ఇదే పరిస్థితి ఉత్పన్నం అవుతున్నప్పటికీ పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అధికవర్షాలకు ప్రధాన కాలువతోపాటు బ్రాంచ్ ఛానళ్లకు గండ్లు ఏర్పడి పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయి. మదుమలు, షట్టర్లు పూర్తిగా పాడైనప్పటికీ వీటికి మరమ్మతులు చేపట్టడం లేదు. డ్రాపులు, బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నీటి సంఘాల పేరుమీద నీరు-చెట్టు పనులు ఆయకట్టు చెరువుల్లో జెసిబిలతో పూర్తిచేసినప్పటికీ కాలువల దుస్థితి మారకపోవడంతో సాగునీరు, తాగునీరు ఇబ్బందులు మండల వాసులకు తప్పడం లేదు. అయితే ఎకరాకు 200 చొప్పున ప్రతీయేటా నీటి తీరువా మాత్రం చెల్లించాలని రెవెన్యూ అధికారులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. పంట నష్టపోయినా నీటితీరువా చెల్లిస్తున్నప్పటికీ సాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు పాలకులు, అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 55 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రధాన కాలువను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.

మాధవ్‌ను ఎమ్మెల్సీగా గెలిపించండి
* బిజెపి నేతల ప్రచారం
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24: ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పివిఎన్ మాధవ్‌ను గెలిపించాలని భారతీయ జనతాపార్టీ నేతలు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేశవరావుపేట, పోలీస్‌క్వార్టర్, లింగాలపేట, కింతలిమిల్లు గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్‌ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును మాధవ్‌కు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కేశవరావుపేట సర్పంచ్ పొందూరు భీమారావు, బిజెపి నాయకులు సంపతిరావు నాగేశ్వరరావు, మారుతీరాజు, చంద్రరావు, యతిరాజులు ఢిల్లీశ్వరరావు పాల్గొన్నారు. మండలంలో 950మంది ఓటర్లు ఉన్నారని, వీరందరినీ కలిసి బిజెపి అభ్యర్థిని బలపర్చాలని కోరుతామన్నారు. అలాగే సిపిఎం అభ్యర్థి అజశర్మకు మద్దతుగా సిటు నేతలు ప్రచారం నిర్వహించారు. పి.తేజేశ్వరరావు, ఎన్‌విరమణ గ్రాడ్యుయేట్స్‌ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

కూర్మనాథుని దర్శించుకున్న
నటుడు అశోక్‌కుమార్
గార, ఫిబ్రవరి 24: మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రాన్ని సినీ నటుడు అశోక్‌కుమార్ దంపతులు శుక్రవారం చేరుకుని కూర్మనాథుని దర్శించుకున్నారు. సినీనటుడు అశోక్ దంపతులను ఆలయాధికారులు, సర్పంచు బరాటం రామశేషులు సాదరంగా స్వాగతించారు. ఆలయ బేడా మండపంలో గోడలపై ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చారిత్రక చిత్రాల చరిత్రను అర్చక స్వాములు వివరించారు. అదేవిధంగా క్షేత్ర మహత్యాన్ని తెలియజేసారు. అనంతరం కూర్మనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసిన అర్చక స్వాములు లక్ష్మి సన్నిధిలో విశేష కుంకుమార్చనలు గావించారు. బేడా మండపంలో నటుడు అశోక్ దంపతులకు ఆశీర్వచనాలు పలికిన అర్చక స్వాములు తీర్ధ ప్రసాదాలు అందజేసారు.