శ్రీకాకుళం

దెబ్బ మీద దెబ్బ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు గవర్నర్ నరసింహన్ గట్టి షాకిచ్చారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మంత్రి పదవులు స్వీకరించేందుకు రాజ్‌భవన్‌కు రావాలన్న తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హుకుం జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. గవర్నరే స్వయంగా ఎపికి చెందిన ఒక మంత్రితో సుస్పష్టంగా పేర్కొనడంతో వైకాపా తరుఫున గెలిచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయించిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తప్పేటట్టులేదు. టిడిపి బి-్ఫరంతో మళ్లీ విజయం పొందాల్సిఉంటుంది. ఏదో రూపంలో ఎన్నికల్లో గెలవాలని గవర్నర్ స్పష్టం చేయడంతో ఏపీలో మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారని, ఆ సమయంలో వైకాపా నుంచి గెలిచి టిడిపిలో చేరిన కొందరికి మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో అటువంటి అవకాశం లేని కలమట కూడా రాజీనామా చేయాల్సి వస్తుందంటూ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ మంత్రిగా తలసానితో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి అటువంటి వివాదానికి తావివ్వకూడదని గవర్నర్ గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టే!!
తెలుగుదేశం పార్టీలో కురువృద్ధులైన కలమట మోహనరావు మార్కుతో రాజకీయాల్లో అలుపెరగని యుద్ధం చేసి, చివరికి టిడిపికి వ్యతిరేకశక్తిగా మారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బి-్ఫరంతో విజయం సాధించిన కలమట వెంకటరమణ అనతికాలంలోనే గెలిచిన పార్టీలో ఇమడలేక టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ప్రజా నాయకుడు కంటే ప్రతినిధుల నేతగా ఎదగడంతో ప్రారంభమైన నియోజకవర్గం ప్రజల వ్యతిరేకత, నీరు-చెట్టు పనుల్లో అవకతవకలు, ఇసుక మాఫియా, పార్టీ శ్రేణులకు పనుల పంపకాల్లో అసమానతలు, ప్రభుత్వ ఉద్యోగులపట్ల నిరంకుశ వైఖరి విమర్శలతో కాలం నెట్టుకొస్తున్న నేపథ్యంలో వంశధార నిర్వాసితులు తిరుగుబాటు ‘దెబ్బ’ ఆయన రాజకీయ ఉద్యోగానికి అడ్డంకులు కల్పించింది. వంశధార ప్రాజెక్టు నిర్మాణాన్ని సకాలంలో సక్రమంగా పూర్తి చేయాలంటూ 200 కోట్ల రూపాయల వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మంజూరు చేస్తే, వాటిని చెక్కులు రూపంలో నిర్వాసితులకు అందించడంలో జరిగిన జాప్యం, దానికి వెనుక దాగిన ఆర్థిక సర్దుబాట్లు వెరసి, వంశధార నిర్వాసితులు రణరంగానికి దిగే పరిస్థితులకు తీసుకువచ్చింది. నేరుగా సి.ఎం. చేతే ‘క్షమాపణ’ చెప్పించే పరిస్థితులకు జిల్లా తెలుగుదేశం నేతలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చాలా అసంతృప్తితో ఉన్న సిఎం దీనికి అక్కడ ఎమ్మెల్యే మూల్యం చెల్లించేవిధంగా తాజాగా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజుకు పార్టీ అధినేత బి-్ఫరం ఇస్తూ పేరు ప్రకటించడంతో పాతపట్నం నియోజకవర్గంలో మరో పొలిటికల్ పవర్ సెంటర్‌కు గేట్లు బారుగా తెలుచుకున్నాయి. ఆ సంఘటన నుంచి ఇంకా బయటపడేందుకు అవకాశమే లేకుండా సతమతం అవుతున్న కలమటకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం పాతపట్నం ఎమ్మెల్యే కలటమ రాజకీయ జీవితానికి అడ్డంకులు ఆరంభం కానున్నట్టు రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. వంశధార నిర్వాసితులు కలమటపట్ల పెంచుకున్న ద్వేషం, నియోజకవర్గంలో నియంత పోకడలు, శత్రుచర్లకు ఎమ్మెల్సీగా సి.ఎం. ప్రకటించడం ఘటనల నేపథ్యంలో కలమట వైకాపా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే - టిడిపి నుంచి బరిలో నిలిచి గెలుపొందే ఛాన్సు చాలా దూరంగా ఉంటుందన్న రాజకీయ అంచనాలు ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గడచిన ఎన్నికల్లో ఎం.పి.గా ఓటమి చవిచూసిన రెడ్డి శాంతి ప్రజల్లో కలియ తిరుగుతున్నారు. ముఖ్యంగా నిర్వాసితుల గ్రామాలను కేంద్రాలుగా మార్చుకుని ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఓటుబ్యాంకు పెంచుకునేలా పావులు కదుపుతున్నారు. రెడ్డి శాంతి తండ్రి మాజీ జెడ్పీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరానికి ఈ నియోజకవర్గంతోగల అనుబంధం మరింత కలిసివస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాపు సామాజికవర్గం ఇప్పుడిప్పుడే అధికారంలోగల టిడిపిపై వ్యతిరేకత పెంచుకుంటున్న నేపథ్యంలో పాతపట్నానికి ఉపఎన్నికలు అనివార్యమైతే, వైకాపా జెండా రెపరెపలాడుతుందన్న ధీమా కూడా లేకపోలేదంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చెబుతున్నాయి.

జగన్‌పై కక్ష సాధింపు తగదు
* పార్టీ రాష్ట్ర బిసిసెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
సారవకోట, మార్చి 1: వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా ఎప్పటికప్పుడు తప్పుడు కేసులు పెట్టడం తగదని ఆ పార్టీ రాష్ట్ర బిసిసెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతదేహాలు పరిశీలించడానికి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడానికి వెళ్లిన జగన్మోహన్‌రెడ్డిపై అక్కడ జరిగిన ఘటనలను ఆసరాగా తీసుకొని కేసులు బనాయించడం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఆయన అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించినందుకు నిరసనగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆవరణలో గురువారం వైకాపా నిరసన దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని హెచ్చరించారు. త్వరలో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక మండల పార్టీ కమిటీ అధ్యక్షుడు పోలాకి కేశవరావు అధ్యక్షతన జరిగిన దీక్షలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వెంకటసత్యనారాయణ, నాయకులు సర్పంచ్‌లు ఎంపిటిసిలు పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ ఈశ్వరమ్మకు వినతిపత్రం సమర్పించారు.

సజావుగా 10వ తరగతి
పరీక్షలు నిర్వహించండి

శ్రీకాకుళం, మార్చి 2: సజావుగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో వౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి ఏర్పాటు, ఫస్టైడ్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షల దృష్ట్యా చదువుకునేందుకు రాత్రి సమయాలలోనూ విద్యుత్ అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు నిమిత్తం ప్రతీ జిల్లాకు ఏడు కెమెరాలను ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉపశమనం కల్పించాలన్నారు. అనంతరం బాలకల వసతిగృహాల నిర్వహణ, ఉన్నత పాఠశాలలు, డైట్ కళాశాలలు, ప్రాథమిక పాఠశాలలు విడతల వారీగా బయోమెట్రిక్ అమలు, డిజిటల్‌క్లాస్ రూమ్‌లు ఉపయోగం అంశాలపై సమీక్షించారు. ఇ-హాజరు అమలును జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పకడ్బందీగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
సంయుక్త కలెక్టర్-2 పి.రజనీకాంతారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 28వతేదీ కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశామని మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఫ్లైయింగ్‌స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 183 పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం మంజూరైన నిధులకు ట్రెజరీలో ఫ్రీజింగ్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించాలని, రవాణా ఛార్జీల నిధులను ప్రస్తుత ధరలను అనుసరించి మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఇవోలు సుబ్బారావు, ఐ.వెంకటరావు, సర్వశిక్ష అభియాన్ పిఓ ఎస్.త్రినాధరావు, విద్యాశాఖ పరీక్షల సహాయ కమీషనర్ సత్యన్నారాయణ, డిఎస్పీ టి.మోహనరావు, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఆబోతుల ప్రభాకరరావు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదిరాజు ప్రచారం
నరసన్నపేట, మార్చి 2: పరిపక్వత పాలన అందించిన కాంగ్రెస్ పార్టీ తరఫున పట్ట్భద్రుల ఉత్తరాంధ్ర నియోకజవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగానని , తనను ఆదరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి యడ్ల ఆదిరాజు కోరారు. గురువారం మండల కేంద్రంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలను అందించిందని, గతంలో తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డానని, కొద్దిపాటి తేడాతో అపజయం పాలైనా ఈసారి తనను విజయం వరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని నిలిపివేసే విధంగా చర్యలు తీసుకుంటానని, ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, ప్రస్తుత ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, డిసిసిబి అధ్యక్షుడు డోల జగన్ పాల్గొన్నారు.

కూర్మ క్షేత్రాన్ని సందర్శించిన
భగవద్రామానుజుల ప్రచార రథం
గార, మార్చి 2: భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవ యాత్ర సందర్భంగా రామానుజుల వారి ప్రచార రథం గురువారం కూర్మ క్షేత్రాన్ని సందర్శించింది. కూర్మ క్షేత్రానికి చేరుకున్న ప్రచార రథంతోపాటు రామానుజుల వారి భక్త బృందాన్ని ఆలయాధికారులు, అర్చక స్వాములు సాదరంగా స్వాగతించారు. రామానుజుల విగ్రహానికి హారతి ఇచ్చి భక్తుల సందర్శనార్ధం అనుమతించారు. రాష్ట్ర చాత్తాద శ్రీవైష్ణవ సంఘం జిల్లా ప్రతినిధులు ఆరవెల్లి తిరుమలరావు, శ్రీరంగం మధుసూదనరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మధుసూధనరావు, డిఎస్‌ఎన్‌వి ప్రసాద్‌బాబు, పి.వెంకటసత్యనారాయణ నేతృత్వంలో ప్రచార రథం కూర్మక్షేత్రాన్ని సందర్శించింది.

రక్తదానం మరొకరికి ప్రాణదానం
* జెసి-2 రజనీకాంతారావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 2: రక్తదానం మరొకరికి ప్రాణదానమని జెసి-2 పి.రజనీకాంతారావు అన్నారు. విద్యలో ఉన్నత విలువలు నేర్పుతూ సమాజంపై అవగాహన కల్పిస్తున్న న్యూ సెంట్రల్ స్కూల్ ఎంతో ఆదర్శవంతమైందన్నారు. పాఠశాల ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చదువుతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక సాంస్కృతిక రంగాల్లో అవగాహన కల్పించిన నాడే వారి ఉన్నతికి ఢోకా ఉండదన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి వారి ఆలోచన శక్తిని పెంచేలా ఉపాధ్యాయులు భోదించాలన్నారు. ప్రిన్సిపాల్ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ నేటి సమాజంలో ఒత్తిడితో కూడిన విద్యకు చెక్ పెట్టి విద్యార్థులు అవసరమయ్యే విద్యను అందించేలా పాఠశాల పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కు అప్పన్న, పి.వైకుంఠరావు, ఎన్ సి ఎస్ డైరెక్టర్లు పోలుమహంతి శ్రీకాంత్, పి.శ్రీదేవి, ఉపాధ్యాయులు, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.