శ్రీకాకుళం

కార్పొరేషన్ ఓటరు జాబితా గజిబిజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 19: శ్రీకాకుళం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇంతటితో ఆగకుండా వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విభజన ప్రక్రియ కూడా సిబ్బంది గజిబిజిగా నిర్వహించడం వలన రాజకీయ పక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. సరిహద్దులు, ఇంటి నెంబర్లు, వీధులతో సంబంధం లేకుండా ఓటర్ల జాబితాలో తప్పులు, తడకలుగా రూపొందించారు. వీటికి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలో లోపం ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా అరసవల్లి కేంద్రంగా వార్డుల విభజన జరిగిందని గత కొన్నాళ్లుగా ప్రధాన ప్రతిపక్షం వైకాపా విమర్శల యుద్ధానికి తెరలేపింది. టిడిపి నేతలు మాత్రం ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలను విమర్శలను టేకిట్ ఈజీగా కొట్టి పారేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న నిజం అందరికీ తెలిసిన వాస్తవం. రాజకీయ పక్షాలు మీడియా టైగర్లుగా గర్జిస్తున్నా ఓటర్లకు మాత్రం జాబితాను రూపొందించడంలో అన్యాయం జరిగిందని కొత్తకొత్త అంశాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకే ఇంట్లోని ఓటర్లు రెండు వార్డుల్లో పేర్లు నమోదు కావడం వంటి విచిత్రాలు కూడా నగరంలో కొకొల్లలు. ప్రతి వార్డులో కూడా ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. 36 వార్డులను 50 డివిజన్లుగా విభజించింది తెలిసిందే. ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని కుటుంబాలను ఒక సముదాయంగా వార్డును రూపొందించాల్సి ఉన్నప్పటికీ ఇటువంటి నిబంధనలు అధికారులు ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు. ఒక వార్డులో 1300 మంది ఓటర్లు ఉండగా, మరో వార్డులో 2900 మంది వరకు ఓటర్లు ఉండే విధంగా విభజన పూర్తిచేయడం వెనుక టిడిపి మార్కు దాగి ఉందని విపక్షాలు రచ్చ చేస్తున్నాయి. ఈనెల 10వ తేదీన బిసి, ఎస్సీ, ఎస్టీ జాబితా డ్రాప్టును అధికారులు విడుదల చేశారు. వీటిలో కూడా లోపాలు ఉన్నాయి. ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వ్ కావల్సిన డివిజన్ అధికార పార్టీకి ప్రతికూలంగా ఉంటే ఆ డివిజన్‌లో కొంతమంది ఓటర్లను పక్క డివిజన్‌లో చేర్చి ఆ రిజర్వేషన్ లేకుండా బ్రేకులు వేసే విధంగా ఓటర్ల జాబితాలో పేర్లు తారుమారు చేశారని సామాన్యులు సైతం గొంతు చించుకుంటున్నారు. ఒక కుటుంబాన్ని కూడా అధికారులు మూడు డివిజన్లలో ఓటు హక్కు వినియోగించుకునే విచిత్ర పరిస్థితి కూడా సృష్టించారు. భార్య, భర్త, పిల్లలకు మూడు డివిజన్లకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉండడం విశేషం. ఒకటి, అర డివిజన్లలో మాత్రం ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉండడం సమంజసం. అయితే నగరంలో ఏ వార్డుకు వెళ్లిన ఇదే లొల్లి బట్టబయలు కావడం అధికారుల విచిత్ర వైఖరిగా నిదర్శనంగా చెప్పకతప్పదు. నగరంలోని మొంటేటివీధి, గైనేటివీధి, కత్తెరవీధి, పుణ్యపువీధిలలో ఇదే పరిస్థితి ఉందని ఆశావహులు అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణమైనప్పటికీ ఇరుపార్టీల ఆశావహులు మధ్య అంతరాన్ని పెంచే విధంగా అధికారులు ఓటర్ల జాబితాలు రూపొందించారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం క్షేత్రస్థాయి ఓటర్ల జాబితాను సవరిస్తే నగరంలో బలాబలాలు ఎన్నికల వేళ బయటపడతాయని పేర్కొంటోంది. ఓటమి భయంతోనే ఇటువంటి కవ్వింపు చర్యలకు అధికార పార్టీ పూనుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదిఏమైన మేధావులు అధికంగా ఓటర్లుగా ఉన్న నగరంలో విభజన శాస్ర్తియంగా పూర్తిచేసి జాబితాను కూడా పారదర్శకంగా రూపొందిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పెంచేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.

ముగిసిన ఇంటర్ పరీక్షలు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 19: ఇం టర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 9వ తేదీన జరగవల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీ క్ష ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా 19వ తేదీ కి వాయిదా వేశారు. వాయిదా పడిన ప రీక్ష కూడా ప్రశాంతంగా జరిగింది. ఆదివారం నిర్వహించిన పరీక్షకు జిల్లావ్యా ప్తంగా 22,676మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 723మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌కు 1538మం ది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 50మంది హాజరుకాలేదు.
పోలీసు స్టేషన్‌లో జవాబు పత్రాలు
నరసన్నపేట : మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగిశా యి. ఆదివారం 5కేంద్రాల్లో ఇంటర్ వి ద్యార్థులు పరీక్షలను వ్రాసారు. ఈ నెల 9వతేదీన జరగవల్సిన ఈ పరీక్షను పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భం గా రద్దు చేస్తూ ఆదివారం నిర్వహిం చారు. జవాబుపత్రాలను ఎప్పటికప్పుడు తంతితపాలా కార్యాలయాల ద్వారా తరలించాల్సి ఉందని, ఆదివారం సెలవు కారణంగా పత్రాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా ఏర్పాట్లను నిర్వహించారు.
విద్యార్థుల ఆనందం
జలుమూరు : గడచిన 20రోజులుగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగియడంతో విద్యార్థులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. జలుమూరు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఆ దివారంతో ముగియడంతో ఆనందం తో కేరింతలు కొడుతూ వెనుదిరిగారు. ఇంతకాలం కలిసిమెలసి ఉన్నామని. ఇప్పుడు విడిపోతున్నామని స్నేహితులు కన్నీటి పర్యంతం కావడం కనిపించిం ది. ఈనెల 9వతేదీన జరగాల్సిన మా థ్స్-2 పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భ ంగా వాయిదాపడింది. చివరి పరీక్ష ఆ దివారం ప్రశాంతంగా జరిగింది.

ఎన్నికలకు కమలనాథులు సిద్ధం
* సిక్కోలు కార్పొరేషన్‌లో ఉనికికై యత్నం
* డివిజన్ల వారీగా పోటీకి సమాయత్తం

శ్రీకాకుళం, మార్చి 19: గడిచిన ఎన్నికల్లో మిత్రపక్షంగా పనిచేసిన కమలనాథులు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ఆరంభించారు. 36 వార్డులు ఉన్న మున్సిపాలిటీ 50 డివిజన్లతో కార్పొరేషన్‌గా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. డివిజన్లు సంఖ్య పెరగడంతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్పొరేటర్ పదవి కోసం ఎప్పటినుంచో చేయని ప్రయత్నాలు లేవు. ఇంతలో కమల నాథులు సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగి టిడిపి దూకుడుకు కళ్లం వేసేలా వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిసింది. కనీసం 14 డివిజన్లతో పోటీచేసి కార్పొరేషన్‌లో పార్టీని బలోపేతం చేసే యోచనలో జిల్లా నాయకత్వం ఉంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వానికి అందించడమే కాకుండా వార్డుల వారీగా బరిలో నిలిచేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను కూడా అందించినట్లు విశ్వసనీయంగా తెలిపింది. బిజెపి రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, శవ్వాన ఉమామహేశ్వరి, వెంకటేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, కద్దాల ఈశ్వరమ్మ, దుప్పల రవీంద్రబాబు, రెడ్డి నారాయణరావు తదితరులు ఆయా డివిజన్లతో అభ్యర్థులను బరిలో దింపేందుకు ఓటర్ల జాబితాతో కుస్తీ ప్రారంభించినట్లు తెలిసింది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో నరసన్నపేట, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాల్లో ఒకింటిని కేటాయించినట్లు కేటాయించి టిడిపి హైకమాండ్ యుటర్న్ తీసుకోవడంతో బిజెపి నేతలు నిరాశకు లోనయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పదవిని పొత్తుపై బిజెపికి కేటాయించక పోవడం వారంతా తీవ్ర మనస్తాపానికి గురవుతూ వచ్చారు. ఇటీవల ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మాధవ్‌కు కేటాయించడంతో బిజెపి, టిడిపి పొత్తు మరోమారు రుజువైంది. అయితే జిల్లాస్థాయిలో మాత్రం బిజెపి కేడర్‌కు కనీసం గౌరవం ఇవ్వడం లేదన్న బాధ నేతల్లో లేకపోలేదు. ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఎన్నికలు లక్ష్యంగా ఎంచుకున్నట్లు వ్యూహం అర్థవౌతుంది. అధికార పార్టీకి కార్పొరేషన్ ఎన్నికలు నల్లేరుమీద నడక మాత్రం కాదని చంద్రబాబు తెప్పించుకున్న సర్వేలు రుజువు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో మిత్రపక్షంగా ఉన్న బిజెపి నేతలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను బరిలో దింపేందుకు చేసిన యత్నాలు ఫలించకుంటే టిడిపికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతికూలంగా మారినా ఆశ్చర్యపోవల్సిన పనిలేదు. ఇరుపార్టీల పొత్తు విజయం వైపు నడిపిస్తుందా? బిజెపి ఉనికి చాటుకుంటుందా? లేదా అన్న చర్చ హాట్ హాట్ టాపిక్‌గా మారింది. వీరి పొత్తు చిత్తయితే వైకాపా వాటిని అనుకూలంగా మలుచుకొనేలా వ్యూహాలకు పదును పెట్టే అవకాశం లేకపోలేదు.

పాత్రికేయులకు చంద్రన్న బీమా వర్తింపు
* మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 19: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని, రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ చంద్రన్న బీమా వర్తింప చేశామని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 20,000 మంది జర్నలిస్టులు ఈ పథకంలో సభ్యులుగా చేరారన్నారు. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులో ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్లీనరీ-2017 గోడపత్రికలు, బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర, భాగస్వామ్యం మరువరానిదని, జర్నలిస్టుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్నబీమా ద్వారా కోటి మందికి చేర్చగా అందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 25 వేల మంది ఈ పథకంలో సభ్యులుగా చేర్చామన్నారు. జర్నలిస్టులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 10 లక్షల ప్రమాద బీమా అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ప్రమాద బీమా పథకాన్ని రూపకల్పన చేయడంలో ఎపిజెఎఫ్ పాత్ర మరువరానిదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎపిజెఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జోగినాయుడు, జర్నలిస్టు ఫోరం ప్రతినిధులు గృహానంద్, ఆనంద్‌మోహన్, పి.కూర్మారావు, ఎన్.అప్పారావు, కె.యాదవ్, పి.గిరి పాల్గొన్నారు.

రవాణా రంగంలో
అధిక ఫీజులను వెనక్కి తీసుకోవాలి
* సిటు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 19: రవాణా రంగంలో అధిక ఫీజులను పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు వెనక్కి తీసుకోవాలని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగిస్తామని సిటు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో ఆటో, మోటార్, ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ప్రథమ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అధిక ఫీజులను పెంచి మోటారు కార్మికులపై ప్రభుత్వాలు కక్ష కట్టాయన్నారు. ఇప్పటికే 10 నుంచి 50 శాతం వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. 2016 మోటార్ వెహికల్ యాక్టు బిల్లు అనుసరించి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న సిఫార్సులను సవరించకుండానే యథాతథంగా బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి కేంద్రప్రభుత్వం పెట్టబోతుందని అన్నారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 30 నెలల కాలంలో 20 సార్లు డీజల్ ధరలు పెంచారన్నారు. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో 4 శాతం పన్ను విధించారని ప్రభుత్వ చర్యలను విమర్శించారు. సిటు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, కార్యదర్శి టి.తిరుపతిరావు మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, వ్యక్తిగత వాహనదారులపైన భారీ వడ్డింపులు వేసిందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇప్పటికే అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు నష్టం జరుగుతోందని, పార్లమెంటులో బిల్లు పాసైతే డ్రైవర్ అనే వాడు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే పోరాటాలు చేస్తున్నారని, మోటారు సంక్షేమ నిధి, ప్రమాద బీమా సౌకర్యం, ఇతర సంక్షేమ పథకాల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఈ సభకు విటి ప్రసాద్ అధ్యక్షత వహించగా, సత్యంనాయుడు, సురేష్, సిటు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సూరయ్య, నారాయణ, శ్యామ్యూల్, జగన్, లక్ష్మణరావు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎన్‌ఐఓఎస్ పరీక్షలు
నరసన్నపేట, మార్చి 19: జిల్లాలో జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని శాఖ రాష్ట్ర డైరెక్టర్ డా.బి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండలంలోని తామరాపల్లి, మడపాం, దేవాది గ్రామాల్లో సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌ఐఒఎస్ పరీక్షల ను పరిశీలించామన్నారు. ఈ సందర్భం గా తామరాపల్లి పరీక్షా కేంద్రంలో తన ను కలిసిన విలేఖరులతో ఆయన మా ట్లాడుతూ 1099 పంచాయతీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 75945 మంది అభ్యాసకులు పరీక్షల్లో పాల్గొన్నారన్నారు. రానున్నకాలంలో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని శతశాతం సంపూర్ణ అక్షరాస్యత దిశగా కృషి చేస్తామన్నారు. సమన్యయకర్తలకు నెలవారీ జీతాలు బట్వాడా అయ్యే విధ ంగా చర్యలు చేపట్టామన్నారు. ఈయన వెంట జిల్లా సహాయ డైరెక్టర్ కె.డొంబో, ఎం.సి.ఓ. బి.ఎల్లన్న ఉన్నా రు.
‘ఎన్‌ఐఒఎస్ పరీక్షకు స్పందన కరవు’
సారవకోట : సాక్షర భారత్ కేంద్రాల ద్వారా నూతనంగా అక్షరాస్యులైన వారికి, మధ్యలో చదువు మానివేసిన వారికి జాతీయ ఓపెన్ పాఠశాలల సం స్థ ఆదివారం నిర్వహించిన అక్షరాస్యత పరీక్షకు స్పందన కరువైంది. సాక్షర భారత్ కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు నూతన అక్షరాస్యులు, చదువు మానివేసిన వారు హాజరు శాతం గణనీయంగా తగ్గింది. కొద్దిగ్రామాల్లో మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు ఈ పరీక్ష కేంద్రాలు తెరుచుకోలేదు. మరికొన్ని గ్రామాల్లో పరీక్షాకేం ద్రాల వద్ద సాక్షరభారత్ సమన్వయ కర్తలు పరీక్షలు రాసే వారికోసం ప్రశ్నాపత్రాలు పట్టుకొని ఎదురుచూశారు. గతంలో ఈ పరీక్షల విదివిధానాలకు ఎంపిడిఓ., పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించే వారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పరీక్షా కేంద్రాలకు హాజరై పరీక్షలు నిర్వహణలో సాక్షర భారత్ సమన్వయ కర్తలకు సహకరించే వారు.
ఆదివారం నిర్వహించిన పరీక్షా విధానంలో ఈ ప్రక్రియ ఎక్కడా కనిపించలేదు. సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లే ఏకఛత్రాధిపత్యంగా వ్యహరించవల్సి వచ్చింది. ఈ పరీక్షలు నిర్వహణకు మండలంలో 60 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2310 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మండల సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ వెలమల విజయలక్ష్మి, తిడిమి, జమచక్రం కేంద్రాలను పరిశీలించారు.

పనులు సకాలంలో పూర్తి చేయాలి
* ఎమ్మెల్యే రమణమూర్తి
పోలాకి, మార్చి 19: మండలంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని, వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. గతంలో వనితమండలంవద్ద భారీ తాగునీటి పథకం ఏర్పాటు చేసినప్పటికీ పనుల్లో నాణ్యత లేకపోవడం వలన పైపులైన్లు పాడై మరమ్మతులకు గరయ్యాయన్నారు. ఆ పనులు వేగవంతం చేసి ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని ఆర్.డబ్ల్యు.ఎస్. డి.ఇ. చంద్రశేఖర్‌కి సూచించారు. పిరువాడ సర్పంచు సింహాచలం మాట్లాడుతూ తాగునీటి పైపులైన్లు వేసినప్పటికీ 7ఏళ్లు అవుతున్నా ఇంతవరకు బిల్లులు కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ ఎ.ఇ. భీమరాజ్ కూడా విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించడం సరికాదని గంగివలస సర్పంచు చక్రధర్, డోల సర్పంచు ఉదయభాస్కర్ ఆరోపించారు. ఈ కార్యక్రమం ఎం.పి.పి. తమ్మినేని లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎ.ఎం.సి. అధ్యక్షుడు పైడి భాస్కరరావు, జెడ్పీటిసి. గొండు రామన్న, ఎం.పి.డి.ఓ. లక్ష్మీపతి, తహశీల్దారు రామారావు, మండల సలహాదారు తమ్మినేని భూషనరావు పాల్గొన్నారు.

ఆరిపోతున్న ఎల్‌ఇడి దీపాలు
* మార్పిడికి నోచుకోని వైనం
శ్రీకాకుళం(రూరల్), మార్చి 19: ఎల్ ఇడి దీపాలు ఇచ్చిన అనతికాలంలోనే వెలుగకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పోదుపులో భాగంగా ఆ శాఖ సరఫరా చేసిన ఎల్ ఇడి బల్బుల వెలుగులు మూడునాళ్ల ముచ్చటగానే మారింది. గృహ వినియోగదారులకు ఏడాది కిందట ఇచ్చిన బల్బులు వెలగడం లేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బల్బుల్లో సాంకేతిక లోపం కారణంగా మొరాయిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లు గ్యారంటీ ఉన్న వీటిని మార్పిడి చేసేందుకు ఎటువంటి సెంటర్లు ఏర్పాటు చేయలేదని పలువురు పేర్కొంటున్నారు. పంపిణీ చేసిన కొద్ది రోజులకే బల్బులు వెలగడం లేదని ప్రజలు తెలిపుతున్నారు. మార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినియోదారులు కోరుతున్నారు. గృహవినియోదారులకు విద్యుత్ బిల్లులను తగ్గించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశ పెట్టి విద్యుత్ శాఖ భాగస్వామ్యంలో వినియోగదారులకు ఎల్ ఇడి బల్బులను సరఫరా చేశారు. మండలంలో సుమారు 20 వేల కనెక్షన్లు వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 19వేల వరకు గృహవినియోగ కనెక్షన్లు, 800 వరకు వ్యవసాయ పంపుసెట్ కనెక్షన్లు, 350 వరకు వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ దారులకు ఒక్కొక్క సర్వీసుకు రెండు బల్బులు చొప్పున సుమారు 38 వేల వరకు అందజేశారు ఇందులో చాలా బల్బులు వెలగడంలేదని వినియోగదారులకు తెలియజేస్తున్నారు. దీనిపై ఆ శాఖ ఎ ఇను వివరణ కోరగా ఫణీంద్ర కుమార్ వివరణ కోరగా బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదా అవుతుందని, బిల్లులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టిసారించి నాణ్యమైన బల్బులనే అందించామన్నారు. బల్బులు పాడైతే మార్పిడికి అవకాశం ఉందని ఇందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వెలగని బల్బులను తీసుకువెళితే నాణ్యమైన బల్బులు ఇస్తారన్నారు. ఈ విషయమై దగ్గర్లో ఉన్న లైన్‌మేన్, కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

ఏప్రిల్ పదిలోగా ఫలితాలు
* ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
డివిఇఓ బి.మల్లేశ్వరరావు
ఆమదావలస, మార్చి 19: ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ప్రశాంతంగా ముగిశాయని డివిఇఓ బొడ్డేపల్లి మల్లేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డ ఇంటర్ మ్యాథ్స్-2 పేపర్ ఆదివారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పర్యవేక్షించేందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 61 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ఇందులో ప్రథమ ఇంటర్ 31 వేల మంది, ద్వితీయ ఇంటర్ 30 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇంటర్ స్పాట్ వేల్యూయేషన్ పకడ్బందీగా జిల్లా కేంద్రంలో జరుగుతుందన్నారు. వాల్యూయేషన్ జరిగిన పేపర్ వెంటనే స్కానింగ్ చేయడంతోపాటు ఆన్‌లైన్ చేస్తారని అన్నారు. ఫలితాలు మరింత వేగవంతంగా ప్రకటించేందుకు స్పాట్ వేల్యూయేషన్ చురుగ్గా సాగుతుందన్నారు.
* ప్రభుత్వ కళాశాలలో ఎంసెట్ కోచింగ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలతోపాటు ఎంసెట్‌లో ర్యాంకులు సాధించేందుకు వేసవి సెలవుల్లో జూనియర్ కళాశాలలో ఎంసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు డి విఇఓ మల్లేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించి సిడితో డిజిటల్ తరగతులకు అధ్యాపకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆమదావలసలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదన పంపినట్లు మల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలో ప్రత్యేక బాలికల పాఠశాలతోపాటు వసతి గృహాలు ఉండడంవలన ప్రత్యేక కళాశాల ఏర్పాటు అవసరమని అన్నారు.

ఇటుకల బట్టీ యజమానులను
అరెస్టు చేయాలి
* కలెక్టర్ లక్ష్మినృసింహం
ఇచ్ఛాపురం(రూరల్), మార్చి 19: మండలంలోని బిర్లంగి, పాయితారి గ్రామాల సమీపంలో ఏడు ఇటుకల బట్టీల యజమానులను ఆదివారం సాయంత్రంలోగా అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మినృసింహం ఇచ్ఛాపురం సిఐ అవతారాన్ని ఆదేశించారు. ఈ నెల 19వ తేదిన ఇచ్ఛాపురంలో అక్రమ ఇటుకల బట్టీల కథనం రావడంతో 15వ తేదిన జిల్లా నుంచి ఏడు బృందాలు 42 మంది అధికారులు బట్టీలను సర్వే చేసి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ ఆదివారం తన పర్యటనలో భాగంగా ఇటుకల బట్టీలను పరిశీలించారు. ఇటుకలబట్టీలు వద్ద కూలీ పూరిళ్లు, అనుమతి లేకుండా బట్టీలు ఏర్పాటు చేయడం, రోడ్లును ధ్వంసం అవ్వడాన్ని పరిశీలించారు. పంట కాలువల్లో నీరు సక్రమంగా వెళ్లకుండా అడ్డంగా బట్టీ యజమానులు మట్టిని వేయడం, రైతులు పడుతున్న కష్టాలను పరిశీలించారు. ఈ బట్టీల సమీపంలో కాలువలను ఎవ్వరూ ధ్వంసం చేసారని ప్రశ్నించారు. బిర్లంగికి చెందిన రైతులు కలెక్టర్‌కు ఈ ఇటుకల బట్టీల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చి వివరించారు. బహుదానది నుంచి ఇసుక అక్రమరవాణా గూర్చి వివరించారు. దీని వల్ల పంటలకు కలుగుతున్న నష్టాలను వివరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని రైతుల ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి కలెక్టర్ ఫోన్‌లో సి ఐతో మాట్లాడి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రం లోగా అరెస్టు చేయాలని, అనుమతి పత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. బిర్లంగికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బి.లక్ష్మినారాయణకు తన ఫోన్ నెంబరు ఇచ్చి సాయంత్రంలోగా ఏడు బట్టీల యజమానులు అరెస్టు అయింది లేనిది తనకు చెప్పాలని తెలిపారు.