శ్రీకాకుళం

చట్టం కన్నా...చుట్టం మిన్న..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మంచితనానికి ఇవి రోజులు కావని ఉసూరుమనే వారికి ‘రిమ్స్‌లో దొంగా - పోలీసాట’ వినిపిస్తే ఆనందంతో గంతులేస్తారు. మన వ్యవస్థ పై, విలువలపై మనకు గల విశ్వాసాన్ని వెయ్యింతలు పెంచిన భలే మంచి దొంగాటకంలో ఒకరిని మించిన మంచివాళ్ళు ఇంకొకరు. సాధారణంగా జాలి‘గుండె’లేని ప్రతి వారూ దొంగలెక్కడ వస్తారోనని రాత్రివేళ గేట్లు, తలుపులు, కిటికీలు బిడాయించుకుని పడుకుంటారు. ఉత్తమమైన రిమ్స్ వైద్యులు మాత్రం చొరబడదలచే వారికి ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా ఆసుపత్రిలో ఏకో కార్డియోగ్రాం గుండె జబ్బులు నిర్థారణ చేసే యంత్రం కలిగిన గదికి తలుపులు తెరిచే పెడతారు. అవసరమైతే ఆ యంత్రంలో పరికరాలు తొలగించేందుకు కావల్సిన పనిముట్లు కోసం అవస్థలు పడకుండా దొంగలకు అందుబాటులో ముందే సిద్ధం చేశారు. ఇక రిమ్స్‌కు వచ్చి ఏకో కార్డియోగ్రాం యంత్రంగల గదిలో కొచ్చే దొంగలు వీరి కంటే మంచివారు. ఎంతటి విలువైన పరికరాలు, ఖరీదైన యంత్రాలు రారమ్మని పిలుస్తున్నా చలించక, అత్యాశకుపోక కేవలం ఏకో కార్డియోగ్రాం యంత్రంలో ‘ప్రోబ్’ పరికరాన్ని మాత్రమే దొంగిలించి పోయారు.
ఈ మంచితనాలన్నీ ఒకఎతె్తైతే ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన చోరీ కేసులో పోలీసుల సూపర్ మంచితనం ఇంకో ఎత్తు! సాధారణంగా ఒక ఇంటి ముందు అనుమానాస్పద పరిస్థితుల్లో వ్యక్తి కదలాడుతుంటేనే పట్టుకుని రాత్రంతా స్టేషన్ హౌస్‌లో ఉంచేసిన పోలీసుల ఉద్యోగ ధర్మాలేవీ వైద్యుల విషయంలో వర్తించవన్న మంచి బుద్ధితో ముందు కేసు కట్టమంటూ రెండవ పట్టణ పోలీసుఠాణా అధికారి చెప్పేశారట. తర్వాత రిమ్స్ డైరక్టర్ ఒత్తిడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రస్తుతానికి పక్కనపెట్టేసిన పరిస్థితి. అనుమానాలన్నీ అణిచివేసుకుని రిమ్స్ వైద్యులు వండాన కిరణ్, బొంగు శ్రీనివాస్(ఆ విభాగం ఇన్‌ఛార్జిలు) చెప్పిందే సత్యవాక్కుగా శిరస్సున దాల్చి, చెప్పిందల్లా నమ్మేసి, కనీసం స్టేట్‌మెంటును కూడా తీసుకోకుండా ‘డాక్టర్ల’ను సవినయంగా సాగనంపించిన బహు మంచితనం నగర పోలీసులది! దీనిపై ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి స్పందించకపోగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం దృష్టికి చేరినా వౌనం వహించడం వెనుక అంతరార్థం అర్థం కాకపోగా, జిల్లా మంత్రి అచ్చెన్న, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఎవరికీ పట్టనట్టు వ్యవహారించే ఈ రిమ్స్‌లో దొంగా పోలీసాట కథనం పరిశీలిస్తే...
అత్యంత విలువైన గుండెజబ్బును నిర్ణయించే ‘ఏకో కార్డియోగ్రాం’ యంత్రంలోని ముఖ్యమైన విడిభాగాలు రిమ్స్‌లో మాయమై నెలలు గడుస్తున్నా.. దానిపై పోలీసు కేసు నమోదు చేసినా.. ఇప్పటికీ దర్యాప్తు గాఢనిద్రలోనే ఉంది. దొంగలు పడితే పోలీసులను ఆశ్రయించే వారికి న్యాయం జరగడం లేదంటూ సామాన్య ప్రజలు అప్పుడప్పుడు పోలీసుశాఖ తీరుపై గోల పెడుతుండడం చూస్తుంటాం! కాని - సాక్షాత్ సర్కార్ సొత్తునే దొంగలిస్తే - అటువంటి కేసును ఎంత త్వరగా పరిష్కరిస్తే అన్ని రివార్డులు, అవార్డులు ప్రజాప్రతినిధుల నుంచి పొందే ఛాన్స్ కలిగినా.. అంతకుమించి కొంతమంది డాక్టర్లు కేసును మాఫీ చేసి దొంగను తప్పించేందుకు నజరానాలు ఇస్తే ప్రైవేటైనా, ప్రభుత్వానిదైనా పట్టదన్నది రిమ్స్ కేసుతోనే సుస్పష్టం అవుతుంది. రిమ్స్ ఆసుపత్రిలో పేదప్రజల కోసం సుమారు రూ. 20 లక్షల రూపాయలు విలువైన గుండెజబ్బుల నిర్థారణ చేసే ఏకో కార్డియోగ్రాం యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ యంత్రం పూర్తిగా పనిచేసేందుకు కీలకమైన ‘ప్రోబ్’ అనే విడిభాగాన్ని ఎవరో రిమ్స్‌లో దొంగతనం చేసి పట్టుకుపోయారు. ఈ పరికరం ఆ విభాగంలో పనిచేసే సిబ్బంది కొంత డబ్బులకు ఆశపడి, లేదా గుండెజబ్బులు పరీక్షించే ప్రత్యేక వైద్యులైనా వారి ప్రైవేటు నర్సింగ్‌హోంల్లో అటువంటి యంత్రానికి పాడైపోయిన ‘ప్రోబ్’ భాగాన్ని అమర్చేందుకు అపహరించైనా ఉండాలి. మొత్తం ఏకో కార్డియోగ్రాం విలువ రూ. 20 లక్షలు. అందులో ఈ ప్రోబ్ విలువే రూ. 3.5 లక్షలు ఉంటుందని కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్యనిపుణులు చెప్పే మాట. ఏకో కార్డియోగ్రాం పరీక్షించాలంటే రూ.2000 చెల్లించాల్సిందే. ఇటువంటి యంత్రాలు రిమ్స్‌లో ఒకటైతే, మరొకటి ఒకేఒక ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఉంది. రిమ్స్‌లో కార్డియాలజీకి ప్రత్యేకంగా విభాగం లేదు. గుండెనొప్పితో బాధపడేవారికి గుండెలో రంధ్రాలు, ఇతర లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఏకో పరికరాన్ని రిమ్స్‌లో ఏర్పాటు చేసింది. పెద్దాసుపత్రిలో రెండవ అంతస్తులో ఈ యంత్రాన్ని ఇద్దరు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. రోజుకు 10 - 20 మంది రోగులకు ఇక్కడ ఏకో పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే వారు. కొన్ని నెలలుగా పరీక్షలు నిర్వహించడం మానేయడంతో రిమ్స్‌లో దొంగలుపడి, ఆ యంత్రానికి అవసరమైన ప్రోబ్ పరికరాన్ని అపహరించారన్న విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రిమ్స్ ఉన్నతాధికారులు సాహసిస్తే - పోలీసులు కేసు నమోదు చేసుకోమంటూ కొన్నాళ్ళు చెప్పుకొచ్చి, చివరికి ఎవరి ఉద్యోగాలకు ఈ పరికరం ఉచ్చుగా తయారు అవుతుందోనన్న భయంతో కేసు నమోదు చేయించారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును మాత్రం పడుకోపెట్టారు. డిసెంబరులో ఈ పరికరం దొంగలించబడితే, డిప్యూటీ డైరక్టర్ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కేసులో పురోగతి ఇప్పటికీ లేకపోవడంతో ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ జిల్లా నేతలు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు గురువారం సమాచారం ఇచ్చారు.
ఎస్పీ, కలెక్టర్, మంత్రి, ఎం.పి. ఎమ్మెల్యే ఎవరూ ప్రభుత్వ ఆస్తుల అపహరణపై చర్యలు తీసుకునేందుకు సాహసించక పోవడం, కేసును నీరుగాల్చేలా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నించకపోవడం జిల్లా అభివృద్ధికి ప్రతిబంధకమైన అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదంటూ సీనియర్ సిటిజన్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు!! ఇదిలా ఉండగా, ఈ కేసు అంశాన్ని డాక్టర్ వండాన కిరణ్ వద్ద ‘ఆంధ్రభూమి’ ప్రస్తావించగా, తన పరిధిలో ప్రస్తుతం లేదని, రిమ్స్ డైరక్టర్‌కు వివరాలన్నీ అందచేసినట్టు చెప్పారు.