శ్రీకాకుళం

నిర్వాసితుల ఇళ్లు కూల్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, సెప్టెంబర్ 22: వంశధార రిజర్వాయర్ మూలంగా ముంపునకు గురైన గ్రామాల్లోని గొట్టా బ్యారేజ్ జంక్షన్ నిర్వాసితుల ఇళ్లను శుక్రవారం కూల్చివేశారు. రిజర్వాయర్ నిర్మాణం గట్టుకు సంబంధించి గొట్టాబ్యారేజ్ జంక్షన్ వద్ద చేపడుతున్న పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం 40 ఇళ్లను కూల్చివేశారు. అలాగే బ్యారేజ్ జంక్షన్‌లో మరో 23 ఇళ్లను జెసిబితో కూల్చివేశారు. అధికారులు ఆదరబాదరగా ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడంతో నిర్వాసితులు నడిరోడ్డుపై పడ్డారు. వసతుల కోసం నిర్వాసితులు పరుగులు తీస్తున్నారు. అధికారులు ఎటువంటి గడువు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేస్తుండడంతో అద్దె ఇళ్లు కూడా జరపకపోవడంతో బంధువులుతదితర ఇళ్లను ఆశ్రయించి తలదాచుకుంటున్నారు. సామాగ్రిని భద్రపర్చడానికి కూడా వీలు లేకుండాపోయింది.
* జాయింట్ కలెక్టర్ పరిశీలన...
గొట్టాబ్యారేజ్ జంక్షన్‌లో కూల్చివేసిన భవనాలను జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు పరిశీలించారు. జంక్షన్‌లోని భవనాలు కూల్చివేసిన వివరాలను సేకరించారు. పనులకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఏబి రహదారి వద్ద డైవర్షన్ పనులు వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. జరుగుతున్న రహదారి పనులను పరిశీలించారు. ఈయనతో పాటు తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ తదితరులున్నారు.

అక్షయపాత్రలో పౌష్టికాహారం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హైజెనిక్ ఫుడ్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ పరిధిలో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అరబిందో ఫార్మాఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న సెంట్రలైడ్జ్ కమ్యూనిటీ వంటశాల నిర్మాణానికి ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ దేశంలో 12 రాష్ట్రాల్లో 29 ప్రదేశాల్లో 16లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారన్నారు. ఇది అతిపెద్ద స్వచ్ఛంద సేవాసంస్థగా పేరుపొందిందన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 60కి.మీ పరిధిలో సుమారు 40వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రెండున్నర ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అత్యంత ఆధునికటెక్నాలజీతో నిర్మాణం జరుగుతుందన్నారు. 4గంటల్లోసుమారు 40వేల మంది విద్యార్థులకు భోజనం అందించే సామర్థ్యంతో నిర్మాణం జరుగుతుందన్నారు. అరబిందో ఫార్మాకంపెనీ సి ఎస్ ఆర్ విభాగం దీని నిర్మాణానికి రూ.6 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు. అంతేకాకుండా అరబిందో ఫార్మా కంపెనీ ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన చోట తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం బెంచీలు, తదితర సామాగ్రి సరఫరా చేస్తుందన్నారు. ఆ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవగా భావించి పేదరికంతో సరైన భోజన సౌకర్యం లేక చదువుకుంటున్న పిల్లలకు ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించడానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ఇది ఎంతో గర్వకారణమన్నారు. వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం చేపడుతుందన్నారు. వీరి ద్వారా పేద విద్యార్థులు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశ్యంతో సి ఎస్ ఆర్ విభాగం నుండి సెంట్రలైడ్జ్ కమ్యూనిటీ వంటశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.6 కోట్లు అందిస్తున్నామన్నారు. ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కిందన భక్తదాస్ మాట్లాడుతూ చదువుకుంటున్న పేద విద్యార్థులు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో స్ర్తిల భక్తి వేదాంతస్వామి ప్రభూ పాదుల వారు ఈ సంస్థను 2000 సంవత్సరంలో స్థాపించినట్లు తెలిపారు. విజయవాడలో 15వేల మందికి విశాఖపట్నం జిల్లాలో 20వేల మందికి కాకినాడలో 15వేల మందికి శ్రీకాకుళం జిల్లాలో 25వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మద పండితదాస విశిష్ఠసేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2015లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాధరావు, తహశీల్దార్ సుధాసాగర్, హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విభేదాలు వీడండి
కోటబొమ్మాళి, సెప్టెంబర్ 22: గ్రామాల్లో వర్గవైషమ్యాలు వీడి గ్రామ సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం ప్రజాసేవ చేయాలని స్థానిక నాయకులకు రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హితవు పలికారు. మండలంలోని రామేశ్వరం గ్రామంలో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో శుక్రవారం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, లేదా ఇంకా ఏమి కావాలో తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో వ్యక్తిగత విభేదాలు వల్ల వర్గాలుగా విడిపోతున్నారని, అలాకాకుండా అభివృద్ధి ధ్యేయంగా అందరూ ఐకమత్యంగా కొనసాగితే గ్రామాలు బాగుపడతాయన్నారు. అక్టోబర్ 2న సామూహిక గృహప్రవేశం జరుగుతుందని, మార్చి 31వ తేదిలోగా మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2019 నాటికి 25 లక్షల కొత్త ఇళ్లు మంజూరుచేసి ప్రారంభించనున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు బకాయిలో వున్న 4 వేల రూపాయలు వారి అకౌంట్స్‌లో రెండు దఫాలుగా చేసి ఇస్తామన్నారు. తెంబూరు ఆశలసాగారానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 2019 నాటికి ఈ పథకం పూర్తి చేసి రైతుల్లో సంతోషం నింపుతామన్నారు. గ్రామాల్లో సిమ్మెంట్ రోడ్లు, గ్రామాగ్రామానికి తారురోడ్లు వేస్తామన్నారు. అనంతరం సుభద్రాపురం గ్రామానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అప్పయ్య, జగ్గారావు, రమేష్, విజయలక్ష్మి, కామేశ్వరరావు, ఎన్.పద్మశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబరానికి సన్నద్ధం!

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి కనె్వన్షన్ హాల్‌లో శనివారం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 700మంది విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్శిటీ ఇంఛార్జ్‌వీసి ప్రొ.నాగేశ్వరరావు రిజిస్ట్రార్ జి.తులసీరావు ఆధ్వర్యంలో స్నాతకోత్సవ వేడుక ముస్తాబైంది. 2008లో పోస్టుగ్రాడ్యూయేషన్ సెంటర్‌గా ఉన్న క్యాంపస్ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ఇప్పటివరకు పట్టాల పండగ జరుపుకోలేదు. తొలి పండగ కావడం వలన ఇక్కడ విద్యార్థుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. అంతేకాకుండా పలు విభాగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారుపతకాలు ప్రధానం విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నింపేలా ఉంది. దీనికి తోడు 8మందికి పిహెచ్‌డిలు, ఒకరికి ఎంఫిల్, దరఖాస్తు చేసుకున్న పీజి విద్యార్థులకు ఓడీలు కూడా ఈవేదికలో ప్రధానం చేయనున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రొక్కం రాధాకృష్ణకు డాక్టరేట్ అందివ్వనున్నారు. బెస్ట్ రీసెర్చ్ అవార్డులకు రిజిస్ట్రార్ తులసీరావు, మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జ్యోతిఫెడ్రిక్‌లు ఎంపికయ్యారు. వీరికి కూడా స్నాతకోత్సవంలోనే అవార్డు ప్రధానం చేయనున్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ పర్యటన ఖరారు కాకపోవడంతో చాన్సలర్ హోదాలోనే వైస్‌చాన్సలర్ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు.

ఐక్యతతోనే సొసైటీల అభివృద్ధి
* డిసిసిబి చైర్మన్ డోల జగన్
పోలాకి, సెప్టెంబర్ 22: ప్రాథమిక సహకార బ్యాంకుల్లో గల సభ్యులు, డైరెక్టర్లు సమిష్టిగా ఉన్ననాడే సొసైటీలు అభివృద్ధి చెందుతాయని డిసిసిబి చైర్మన్ డోల జగన్ అన్నారు. శుక్రవారం పోలాకి ప్రాథమిక సహకార సంఘం వద్ద సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ప్రతీ ఒక్క సభ్యుడు బాధ్యతగా ఉన్ననాడు సంస్థ అభివృద్ధి జరుగుతుందని వాటికి వచ్చే లాభాలను రైతులకు రుణాలుగా అందజేస్తామన్నారు. ప్రతీ ఒక్క రైతు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించిననాడు సంస్థ మరికొద్దిగా అభివృద్ధి మార్గంలో వెళ్లడానికి సొసైటీ సిబ్బంది సహకరించాలన్నారు. ప్రతీ ఒక్క రైతు రుణాలు తీసుకున్నప్పుడు సిబ్బందికి ఇచ్చిన వ్యవధిలను పాటించి రుణాలకు సకాలంలో చెల్లించే విధంగా సహకరించాలని కోరారు. అలాగే రైతులకు ఎటువంటి రుణాలు కావాలన్నా ముందుస్తుగా సిబ్బందికి సహకరించి ఆవులు, గేదెలు, ఇతరత్రా సౌకర్యాలు పొందడానికి వీలుగా రుణాలు పొందవచ్చునన్నారు. జెడ్పిటీసీ గొండు రామన్న, ఏ ఎం సి అధ్యక్షులు బైరి భాస్కరరావు, సొసైటీ డైరెక్టర్లు సూరపు కృష్ణారావు, వెంకటరావు, వంశధార ఉపాధ్యక్షులు వెంకటప్పలనాయుడు రైతులు పాల్గొన్నారు.
అమ్మవారికి శ్రీచక్రార్చన

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని గాజులవీధిలో దేవీపీఠం(శ్రీసదన్)లో అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణ అర్చన, రుద్రాభిషేకం, కుంకుమార్చన, సువాసినీపూజలు నిర్వహించారు. శ్రీ విమలానంద నమదేయులు శ్రీ పమ్మిన వెంకటరావుగురువుగారు నేతృత్వంలో లలితాదేవికి కుంకుమ పూజలు జరిపించారు. శ్రీసదన్‌లో జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
25 నుంచి నాక్ బృందం తనిఖీలు
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: ప్రభుత్వ డిగ్రీ పురుషుల నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కమిటీ ఈనెల 25,26వ తేదీల్లో రెండు రోజులపాటు తనిఖీ నిర్వహిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.బాబూరావు తెలిపారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ 2005లో నాక్‌గ్రేడ్‌కు మొదటిసారిగా వెళ్లడం జరిగిందని బి ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చిందని 2011లో బిగ్రేడ్‌కు సమానమైన 2.87గ్రేడ్ పాయింట్‌ను సాధించామని చెప్పారు. ఈ ఏడాది మూడవ సారి వెళ్తున్నట్లు చెప్పారు. బృందం తనిఖీలు నిర్వహించి కళాశాలలో విద్యావిధానం, భోధన, విద్యాభ్యాసన, మూల్యాంకన విధానం పరిశోధన, కన్సల్టెన్సీ , వౌలిక సదుపాయాల వివరాల వంటి అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. కళాశాల 1951లో ఏర్పాటు చేసి అప్పటినుండి దినదినప్రవర్తమానం చెందుతూ ఉత్తమ బోధనతో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. డిగ్రీ కోర్సులను 1954లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 1969లో విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం 2(ఎఫ్), 12(బి) హోదా లభించిందని తెలిపారు. 1963లో సైన్సు కోర్సులు ప్రారంభించారని తెలిపారు. 1996లో జూనియర్, డిగ్రీకళాశాలలుగా విడదీశారని చెప్పారు. 1999లో ప్రత్యేకమైన కోర్సులు ప్రారంభించి ఆ కోర్సుల్లో బాలికలకు ప్రవేశం కల్పించామని తెలిపారు. కళాశాల ఆవరణలో డాక్టర్ దానేటి శ్రీ్ధర్ సౌజన్యంతో అబ్దుల్ కలాం విగ్రహాన్ని సామాజిక కర్త బొడ్డేపల్లి నర్శింహులు సౌజన్యంతో బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ లచ్ఛన్న, నాక్ కన్వీనర్ స్వామి, అధ్యాపకులు పైడితల్లి రాజు, జనార్థననాయుడు, పూర్వ విద్యార్థులు సురంగి మోహన్, నిక్కు అప్పన్న పాల్గొన్నారు.

ప్రతి కుటుంబాని వందరోజుల పని

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: ప్రతీ కుటుంబానికి వంద రోజులు పని కల్పించే పనిలో క్షేత్ర సహాయకులు భాగస్వామ్యులు కావాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు పేర్కొన్నారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పాలకొండ డివిజన్‌కు సంబంధించిన క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్లు, జూనియర్ మేట్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 2018-19 సంవత్సరానికి వార్షిక ప్రణాళిక, వేతనదారులకు వంద రోజులు పనికల్పన క్షేత్ర సహాయకులు విధులు,బాధ్యతలు, రికార్డుల నిర్వహణ, సోషల్ ఆడిట్, వెబ్‌మోనటరింగ్, వేతనదారులకు కల్పించిన హక్కులు కన్వర్జెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పథక సంచాలకులు మాట్లాడుతూ అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 21 వరకు 100 రోజుల పనులను గుర్తించాలని తెలిపారు. పనులను సకాలంలో కల్పించాలని రోజువారీ రూ.197ను పొందే విధంగా పనులను గుర్తించాలన్నారు. ప్రతీ కుటుంబానికి వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా జిల్లాలో 52 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నామన్నారు. కావునా గ్రామాల్లో పని అడిగిన ప్రతీ ఒక్కరికీ జాబ్‌కార్డులు అందజేయాలన్నారు. జిల్లాలో 7.25లక్షల మందికి గాను 3.45లక్షల మందికి పనికల్పించామన్నారు. ప్రతీ రోజూ ఆకలిబాధతో 3వేల మంది పిల్లలు మరణిస్తున్నారని తెలిపారు. ఏ ఒక్కరూ ఆకలితో మరణించరాదనే ఉద్దేశ్యంతోనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.. మస్టర్లు సరిగ్గా వేయడం, మొబైల్ ద్వారా సమాచారాన్ని పంపడంతోపాటు టీరర్‌మేనేజ్‌మెంట్‌తో నిపుణిత కలిగి ఉండటం, ఆశావాహ దృక్పధాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. గ్రామస్థాయిలో సహజవనరులైన నీరు,నేల ద్వారా ఉపాధి కల్పించాలన్నారు. భూగర్భజలాల పెంపుదల, రహదారుల నిర్మాణం తదితర అంశాలతోపాటు గ్రామ అవసరాలను తెలుసుకుని దానికి అనుగుణంగా పనులను కల్పించాలని తెలిపారు. అనంతరం శిక్షకులు సత్యమూర్తి మాట్లాడుతూ ఉపాధి హామీ కార్యక్రమానికి పునాది క్షేత్ర సహాయకులేనన్నారు. ముఖ్యంగా జాబ్‌కార్డులను అందజేయడం, శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేయడం, పనుల దరఖాస్తులను స్వీకరించి పనులను కల్పించడం , గరిష్ట వేతనం పొందే విధంగా పనులను మార్కింగ్ చేయడం, పనిచేసే సమయంలో వేతన దారులకు మంచినీరు ఫస్టైడ్, నీడ కల్పించడం, వారాంతపు సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం, చేసిన పనిని వెబ్‌ల్యాండ్‌లో పొందుపరచడం వంటి కార్యక్రమాలను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విజిలెన్స్ అధికారి ఆర్.వెంకటరామన్, మోనటరింగ్ అండ్ ఎవెల్యూషన్ అధికారి అప్పలనాయుడు, ట్రైనింగ్ ఏపిడి ఎల్.రామారావు, పాలకొండ డివిజన్‌కు సంబంధించి క్షేత్ర సహాయకులు సీనియర్, జూనియర్ మేట్లు హాజరయ్యారు.

సేవా దృక్పథం అలవర్చుకోండి

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యేలా విద్యార్థులంతా సేవాధృక్పదాన్ని అలవర్చుకోవాలని అంబేద్కర్ వర్శిటీ ఇంఛార్జ్ వీసి జి.నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వర్శిటీ మొదటి స్నాతకోత్సవాన్ని పురష్కరించుకొని క్యాంపస్‌లో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇంఛార్జ్ వీసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రక్తదానం వంటి సేవా కార్యక్రమం తోటివారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. రక్తదానం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకావన్న విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి శిబిరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 102మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వీరందరినీ వీసి ప్రత్యేకించి అభినందించారు. రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపల్ పి.చిరంజీవులు, ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు, చీఫ్ వార్డెన్ అడ్డయ్య, పాలకమండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, ఎన్.జయరామ్‌లు పాల్గొన్నారు. ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కో ఆర్డినేటర్ అనూరాధ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సంధ్యారాణి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, పెంకి చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌క్లాస్‌రూమ్, జిమ్ రూమ్‌లను వీసి నాగేశ్వరరావు ప్రారంభించి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.