శ్రీకాకుళం

సమాజంలో అసమానతలు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్స్యకారుల వెంటే మేముంటాం
* మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం, డిసెంబర్ 13: సమాజంలో అసమానతలు తొలగాలని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్రప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి. మత్స్యకార దీక్షలకు బుధవారం ఆయన తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు కొన్ని డిమాండ్ల సాధనలో రిలే నిరాహార దీక్షలు , సమస్యను సాధించాలనే పట్టుదలతో, ఐక్యతతో నిర్వహించడం అభినందనీయమన్నారు. మత్స్యకారులది హేయమైన పరిస్థితి అత్యంత తక్కువ జీవన ప్రమాణాలు గలవారని తెలియజేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఎక్కడా పెరిగినట్లు కనిపించలేదన్నారు. ఇరుకు గదులు, అనారోగ్య పరిస్థితులు, మత్స్యకారుల జీవనాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి తనవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. సునామీ సంభవించిన సమయంలో రాష్ట్రంలో 90వేల ఇళ్లు మత్స్యకారులకు కేటాయిస్తే 40వేలు ఇళ్లు తాను జిల్లాకు మంజూరు చేసినట్లు తెలియజేశారు. మత్స్యకార గ్రామాలకు తన హయాంలోనే తారురోడ్లు ఏర్పాటు చేశామన్నారు. వ్యవస్థపై నిస్పృహ కలగరాదన్నారు. అంబేద్కర్ యూనివర్శిటీకి మొట్టమొదటి వైస్‌చాన్సలర్‌ను మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సుధాకర్‌ను నియమించినట్లు తెలియజేశారు. అలాగే నగరం నడిబొడ్డులో సంఘ భవనం నిర్మించినట్లు తెలిపారు. ఇటీవలె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చి అనేక హామీలను ఇచ్చారని మత్స్యకారులలో ఒకరిని ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నాలుగేళ్లపాలనలో మత్స్యకారులకు ఒక్క ఇళ్లు కూడా నిర్మాణం చేపట్టలేదని పేర్కొన్నారు. నగరంలో నిర్మించిన హుదూద్ ఇళ్లపై పోరాటం చేస్తున్నామన్నారు. 1994 నుండి 2003 మధ్య కాలంలో మత్స్యకారులు వేటకు వెళ్లి మృతిచెందిన వారికి కనీసం ఎక్స్‌గ్రేసియా కూడా ప్రభుత్వం ఇవ్వలేదని తాను అధికారంలోనికి వచ్చాక ఈ మధ్య కాలంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారులకు ఎక్స్‌గ్రేసియా మంజూరు చేసినట్లు తెలిపారు. మత్స్యకారుల శ్రేయోభిలాషిగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది అమలుచేయలేదన్నారు. మత్స్యకారుల సమస్యను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తనవంతుల పల్లకి మోస్తుందని పేర్కొన్నారు. ఈ శిబిరం కొనసాగించాలని తనవంతు సహకారం ఉంటుందని తెలియజేశారు. బుధవారం నిర్వహించిన దీక్షలో గార మండలం పోర్టుకళింగపట్నం మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు. మైలపల్లి లక్ష్మీజనార్ధన్, మైలపల్లి ఎర్రన్న, రామారావు, కె.సురేష్, పప్పు పోలీసు, జంగమయ్య, పప్పు లక్ష్మీ, పి.తేజావతి, మైలపల్లి శంకర్, భగవాన్, మూగి గురుమూర్తి, ఫల్గుణరావు, ప్రసాద్, సూర్యనారాయణ, రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో వైకాపా నేతలు అందవరపు సూరిబాబు, వై.వి సూర్యనారాయణ, డాక్టర్ పైడి మహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, మార్పు ధర్మారావు, మండవిల్లి రవి తదితరులు ఉన్నారు.

స్వచ్ఛబారత్‌లో విద్యార్ధుల పాత్ర కీలకం
* కలెక్టర్ ధనంజయరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 13: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో విద్యార్దుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. కేంద్రీయ విద్యాలయ మేనేజింగ్ కమిటీ సమావేశం కేంద్రీయ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. కలెక్టర్‌మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్‌లో విద్యార్దులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా వచ్చేమార్చి నాటికి ప్రకటించేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు ప్రచార సామాగ్రిని చేరవేసి తల్లిదండ్రులలో మార్పు తీసుకవచ్చి మరుగుదొడ్ల నిర్మాణానికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్దుల్లో తరగతుల వారీగా, గ్రామాల వారీగా మరుగుదొడ్లు లేనివారి వివరాలు సేకరించి నిర్మాణాలలో తల్లిదండ్రులను ఒప్పించేందుకు కృషి చేసే విధంగా చైతన్యపరచాలన్నారు. కేంద్రీయ విద్యాలయంలోని 9 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్దులను బృందాలుగా ఏర్పాటు చేసి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. 10,15 రోజులకొకసారి గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడాలని కోరారు. విద్యాలయంలో క్రీడలకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్ధులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారికి అవసరమగు శిక్షణ రోజువారీ లేదా వారాంతంలో కల్పించాలని ఆయన సూచించారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ కె.శంకరయ్య మాట్లాడుతూ విద్యాలయంలో 874మంది విద్యార్దులు ఉన్నారన్నారు. ఆరుగురు చొప్పున స్కౌడ్స్ అండ్ గైడ్స్ రాజ్యపురష్కార్ టెస్టింగ్ క్యాంపు, ముగ్గురు స్కౌడ్స్, ఇద్దరు గైడ్స్ ప్రఖ్యాత రాష్టప్రతి టెస్టింగ్ క్యాంపులో పాల్గొనున్నట్లు వివరించారు. 10,12వ తరగతుల్లో శతశాతంఫలితాలు సాధించామన్నారు. అండర్-19 కబడ్డీబాలుర విభాగంలో విద్యాలయానికి చెందిన విద్యార్ది కేంద్రీయ విద్యాలయాల జాతీయ స్థాయికి ఎంపికయ్యాడన్నారు. విద్యాలయంలో 13 ఇ క్లాస్ రూమ్‌లను నిర్వహిస్తున్నామని, స్మార్ట్‌బోర్డులను మల్టీమీడియా ప్రాజెక్టు, ఐప్యాడ్స్ ఉపయోగిస్తున్నామని వివరించారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, విద్యార్ధి విజ్ఞానమఠం, డిజిటల్ అవేర్నస్ అండ్ సైబర్ వెల్‌నెస్, గ్రీన్ ఒలంపియాడ్స్ , మ్యాథ్స్, సైన్స్ ఒలంపియాడ్స్, నేషనల్ ఫైనాన్స్ లిటరసీ, ఎఫిలియేషన్ టెస్ట్ వంటి పరీక్షల్లో విద్యార్ధులు పాల్గొంటూ బహుమతుల సాధిస్తున్నారని వివరించారు. వచ్చే జనవరి నెలలో స్పోర్ట్స్ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ జరుగుతున్న ప్రసుత్తం ఉన్న ప్రదాన గేటును ఈశాన్య దిశవైపునకు మార్చేందుకు యోచిస్తున్నామని అందుకు సహకరించాలని కోరారు. చిన్న పిల్లల పార్కును పునరుద్దరించేందుకు నిర్ణయించామన్నారు. సమావేశంలో మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు బి.పోలీసు, ఎల్.రమేష్, జగన్నాధరావు, కె.వి ఆదిత్యలక్ష్మీ, పి.శ్రీనివాసరావు, జి.కృష్ణవేణి, ఎం.యుగంధర్, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలి
* ఎమ్మెల్యే రమణమూర్తి
జలుమూరు, డిసెంబర్ 13: గ్రామస్థాయి అధికారులు, సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం ఎంపిపి కొయ్యాన సుశీల అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలోముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వీటిని రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికే ప్రాధాన్యత చూపాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని శతశాతం మరుగుదొడ్లు నిర్మాణ గ్రామాలుగా అన్ని గ్రామాలు మారాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామస్థాయిలో చాలామేరకు పాడై రైతులు నష్టపోయారని వ్యవసాయ సిబ్బంది ఇష్టారాజ్యంగా పంట నష్టం జాబితాను తయారు చేశారని రాణ ఎంపిటీసీ బుక్క లక్ష్మణరావు, అందవరం సర్పంచ్ తివిటినాయుడు ప్రశ్నించారు. వ్యవసాయాధికారి విజయబాస్కర్‌రావు మాట్లాడుతూ నష్టపోయిన ప్రతీ సెంటుకు తాను సిబ్బంది స్వయంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న మూడు నియోజకవర్గాలను గుర్తించి అక్కట పంటలు పోయేవారి జాబితాను అందజేయాలని ప్రత్యేకాదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. ఇందులో ఎవరు రాజకీయం చేసిన వారికి క్షమించమని రైతు కష్టాలను గుర్తించి ప్రభుత్వం పంట నష్టం కోసిచర్యలు చేపడుతుందని ఇందులో అధికారులు, రాజకీయ వేత్తలు రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు అందిస్తున్న పశువులు, ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసి అందిస్తున్నందున ఇక్కడ వాతావరణం పడక మరణిస్తున్నాయని సర్పంచ్ తివిటినాయుడు అన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది ప్రభుత్వ నిర్ణయమని దీనికోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను అర్థం చేసుకోవాలి
* మాజీ ఎమ్మెల్యే కృష్ణదాస్
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 13: రాష్ట్రంలో పరిపాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలతో కాలం వెల్లగక్కుతుందని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం హుస్సేన్‌పురం తమ్మయ్యపేట, బావాజీపేట పలు గ్రామాల్లో గడపగడపకు వైకాపా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పాటు పడితే ఈ ప్రభుత్వం కార్యకర్తల అభివృద్ధికి పాటు పడుతుందని ప్రజలకు గడిచిన కాలంలో ఏం అభివృద్ధి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి బీదల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రైతాంగం తాగునీరు కోసం భారీ జలాశయాలతోపాటు అనేక మారుమూల ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వాటినే ప్రారంభోత్సవాలు చేయడానికి గ్రామాల్లోకి వస్తున్నారని వారి మాటలకు, చేతలకే చాలా తేడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షులు శ్యామలరావు, మురళీకృష్ణ, పైడి విఠల్‌రావు, మెండ రాంబాబు, కనుసు సీతారాం పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సవరమాలువను ఓడిఎఫ్ గ్రామంగా గుర్తించాలి
* పివో శివశంకర్
సారవకోట, డిసెంబర్ 13: జిల్లాలో గల 1239 గిరిజన గ్రామాలలో సవరమాలువ గ్రామాన్ని మొట్టమొదటి బహిరంగ మలవిసర్జన నిర్మూలన గ్రామంగా గుర్తించాలని ఇందుకోసం స్థానిక ప్రజలతో పాటు అన్ని స్థాయిల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సీతంపేట ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి బుధవారం ఈ గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీతంపేట ప్రాజెక్టు పరిధిలో ఇతర గ్రామాలలో కనిపించని ఉత్సాహం, ఐకమత్యం సవరమాలువ గిరిజన గ్రామంలో కనిపించిందని కితాబులిచ్చారు. ఇదే ఉత్సాహం అభివృద్ధి సాధించడంలో కూడా చూపించాలన్నారు. గిరిజన గ్రామాలాభివృద్ధికి అధనపు నిధులు మంజూరు చేయడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రతీ ఇంటా విధిగా మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించాలని సూచించారు. గిరిజన విద్యార్ధులకు అన్ని విధాల తాము సహకరిస్తున్నామని అదే విధంగా గిరిజన గ్రామాలలో సమాచార వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు. గిరిజనుల్లో అధికంగా ఉన్న రక్తహీనత నివారణకు చర్యలు గైకొంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు ప్రపంచ జ్ఞానం కూడా అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఆరోగ్య కరమైన సమాజం నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. బహిరంగ మలవిసర్జన వలన మహిళలు గర్భకోశ వ్యాధులు, కేన్సర్ వ్యాధికి గురి అవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పరిశోధనల నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర గ్రామాలకు సవరమాలువ గిరిజన గ్రామం ఆదర్శవంతంగా నిలవాలన్నారు. ఈ గ్రామంలో ఒకే పర్యాయం 64 కుటుంబాల వారు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. పంచాయతీలో గల 304 కుటుంబాలు కూడా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక మండల పరిషత్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కోటేశ్వరరావుమాట్లాడుతూ స్ర్తిల ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మరుగుదొడ్ల నిర్మాణం అనివార్యమన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ నక్క నాగమణి మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో గల సవరమాలువ, కోలనీ మాలువ గ్రామాలకు లింకురోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మాలువ నుండి సవరమాలువ గ్రామం వరకు పక్కా రహదారి నిర్మాణం వరకు అవసరమైన నిధులు మంజూరు చేయాలన్నారు.

చెత్తనుండి సంపద కేంద్రాన్ని పరిశీలించిన రిసోర్స్ బృందం
లావేరు, డిసెంబర్ 13: మండలంలో తాళ్లవలస గ్రామంలో చెత్తనుండి సంపద తయారీ కేంద్రాన్ని రిసోర్స్ బృందం బుధవారం పరిశీలించింది. జిల్లా రిసోర్స్ హేమసుందర్ ఆధ్వర్యంలో బృందం ఈ కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం నిర్వహణ విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. వ్యర్దాల నుండి సంపద సృష్టించేందుకు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా గ్రామస్థాయిలో వ్యర్ధపదార్ధాలతో అనారోగ్యం పాలు కాకుండా ఉండేలా పంచాయితీ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఈ కేంద్రాన్ని పరిశీలించిన వారిలో మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు ముప్పిడి సురేష్, ఏ ఎం సి చైర్మన్ తోటన్నదొర, ఎంపిడివో కిరణ్‌కుమార్, పంచాయతీ విస్తరణాధికారి శ్యామలాదేవి, సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ గౌరీశంకర్, పంచాయతీ కార్యదర్శి జగదాంబ తదితరులు ఉన్నారు.

నిర్వాసితుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలి
* జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 13: నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, జిల్లా నీటి యాజమాన్యసంస్థ అధికారులను కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఆదేశించారు. జలవనరుల ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వంశదార ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాలను వదిలి పునరావాస కాలనీలకు వెళ్లడం జరిగిందన్నారు. నిర్వాసితులు 12 కాలనీల్లో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారని వారందరికీ త్వరితగతిన ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు రవాణా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటును వెలుగు అధికారులు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయం, అనుబంద రంగాలలో అవసరాన్ని గుర్తించి మంజూరు చేయాలన్నారు. నిర్వాసితులు పశుసంపదకు అవసరమగు దానా అవసరం ఉంటుందని, అందుకు గాను సైలేజ్, దానా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైలేజ్‌ను 75శాతం రాయితీతో అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆదాయ మార్గాలను అనే్వషించాలని సూచించారు. కాలనీలలో అందుబాటు ప్రాంతంలో గోపాలమిత్రలను ఏర్పాటు చేయాలని, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం.వెంకటేశ్వర్లను ఆదేశించారు. మత్స్యరంగంలో అవకాశాలు కల్పించాలన్నారు. ఎస్సీ, బీసీ , కాపు, మైనార్టీ, ట్రైకార్ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయ పథకాలను మంజూరు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో బృందాలు ఏర్పడి కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించి అనుమతులు పొందాలని ఆదేశించారు. చంద్రన్న సంచార చికిత్స వాహనాలు పునరావాస కాలనీల్లో తరచూ సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావును ఆదేశించారు. ప్రజల ఆరోగ్యవిషయాలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. దోమ తెరల పంపిణీ అవకాశాలను పరిశీలించాలని, ఏ ఎన్ ఎంలు కాలనీలను సందర్శించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాల పని ప్రారంభం కావాలని ఆదేశించారు. దాదాపుఅన్ని పునరావాస కేంద్రాల్లో అంగన్వాడీ భవనాలు ఉన్నాయని ఆయన అన్నారు. పాఠశాలలను సైతం పునరావాస కాలనీలకు అందుబాటులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులు, మద్యం దుకాణాలు పునరావాస కాలనీల్లో కనిపించరాదని, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు ఆదేశించారు.
* గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి
తరలిన గ్రామాలు, గ్రామ పంచాయితీలను డీనోటిఫై చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెసి చక్రధరబాబు, జెసి-2 పి.రజనీకాంతారావు, డి ఆర్ డి ఏ పిడి కిశోర్‌కుమార్, వ్యవసాయ శాఖ జెడి రామారావు, పశుసంవర్థక శాఖ ఎం.వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ ఏడి ఎం ఏ రహీమ్, ఏపి ఎం ఐ పి పిడి ఏ పి ఎస్ జమదగ్ని, సెరీ కల్చర్ ఏడి సత్యారావు, మత్స్యశాఖ డి డి బి.వి కృష్ణమూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు రవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆదిత్యుని కళ్యాణం
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 13: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం బుధవారంనిర్వహించారు. మార్గశిర బహుళ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో స్వామివారి కళ్యాణం జరిపారు. ఈ కళ్యాణ ఉత్సవంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇప్పిలి శంకరశర్మ తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 13: రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ పరంగా రాయితీ, నిత్యవసర వస్తువులు సరఫరా చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారిందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిశాంతి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో నిత్యవసర వస్తువులు సరఫరాతో కళకళలాడిన రేషన్ డిపోలు ప్రస్తుతం బియ్యం పంపిణీకే పరిమితమైందన్నారు. జిల్లాలో సుమారు 2056 రేషన్‌షాపులు కొనసాగుతున్నాయని వీటిలో 7,2,175 తెలుపుకార్డులు, 58,409 పింక్ కార్డులు, 52,881 అంత్యోదయ కార్డులు, 1379 అన్నపూర్ణ కార్డులు ఉన్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం బియ్యంతోపాటు పంచదార, కిరోసిన్, కందిపప్పు, నూనె తదితర వస్తువులు ప్రతీనెల అందుకునే ప్రజలకు చంద్రబాబునాయుడు చుక్కలు చూపిస్తున్నారని పేర్కొన్నారు. బయోమెట్రిక్, జియోట్యాగింగ్, వేలిముద్రల పేరుతో బ్యాంకు పాస్ పుస్తకాల్లో బ్యాలెన్స్ ఉండాలంటూ రైతు కూలీలు, కూలీల కడుపు నింపేందుకు కూలీ పనులకు వెళ్తేగాని కడుపునిండని కుటుంబాలకు మొండిచేయి చూపించారని పేర్కొన్నారు. రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తామనడం పూర్తిగా ప్రజా పంపిణీ విధానానికి మంగళం పాడినట్లవుతుందన్నారు. ఈ వ్యవస్థను బడా కంపెనీలకు దారాదత్తం చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

23న రూట్ టు రూట్స్ చిత్రలేఖనం పోటీలు
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 13: శ్రీకాకుళం జిల్లాలో సంస్కృతీ, సాంప్రదాయాల ఇతివృత్తంగా రూట్ టు రూట్స్ చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్న ఇంటాక్ ప్రతినిధులు కె.వి.జె రాధాప్రసాద్, నటుకుల మోహన్‌లు తెలియజేశారు. ఈనెల 23న శ్రీ అక్షర స్కూల్స్‌లో నిర్వహించే పోటీల్లో 6,7,8,9వ తరగతుల విద్యార్ధినీ, విద్యార్దులు పాల్గొనుటకు అర్హత కలిగి ఉన్నారని జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు ప్రాంతీయ, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలియజేశారు. కెవిజె రాధాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన బేనర్‌ను విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతీ, సాంప్రదాయాల విలువలను అందరికీ తెలియజేసేందుకు గాను ఇంటాక్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో అక్షర స్కూల్ డైరెక్టర్ మైలపల్లి నారాయణస్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

హిందువులు తమ సింహపరాక్రమాన్ని గుర్తెరగాలి
* అవధాన సరస్వతి గరికపాటి
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 13: ప్రతీ హిందువు వ్యక్తినిష్టను దాటి సమిష్టిగా అందరినీ కలుపుకొని ఈశ్వరారాధనను చేయమని చెప్పిన జగద్గురు ఆదిశంకరాచార్యుల మాటలను నేటి హిందూ సమాజం ధ్యేయంగా స్వీకరించాలని అవధాన సరస్వతి గరికపాటి నరసింహారావు అన్నారు. స్థానిక ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తి సామాజిక కార్యకర్తగా మారాలంటే తప్పనిసరిగా ప్రతీ రోజూ రెండు భగవద్గీత శ్లోకాలను, వాటి అర్ధాలను అవగతం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా వివేకానంద స్వామి కంప్లీట్ వర్క్స్ అనే పుస్తకాన్ని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చదవాలన్నారు. నేడు అంతరించిపోతున్న అనేక కలలను నేటికీ బడుగు బలహీనవర్గాల వారే కాపాడుతున్నారన్నారు. గుఱ్ఱంజాషువా ఏ ఒక్క కులానికి చెందిన కవి కాదని ఆయన మహాకవి మనవకి అని జాషువా జీవిత విశేషాలను గరికపాటి వివరించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలోనిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో నగరంలోని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన బాధ్యులు, మహిళా కార్యకర్తలు జిల్లా సంఘ చాలకులు మజ్జి నర్శింహం, పెంట హాటకేశం, రమణమూర్తి, బజరంగదల్ రాజశేఖర్, డాక్టర్ అమ్మన్నాయుడులు పాల్గొనగా ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గుంపా శివప్రసాద్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల మోహనరావు కార్యక్రమ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం
శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 13: ఫోరం ఆఫ్ బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్స్ అసోసియేషన్ ఆలిండియా ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె విజయవంతం అయిందని ఫోరం కన్వీనర్ మాతల గోవర్ధనరావు అన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల కోసం , వారి సమస్యల పరిష్కారానికై దేశ వ్యాప్తంగా గత రెండు రోజులుగా బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా రెండవ రోజు సమ్మెను ఉద్దేశించి ఫోరం నాయకులు మాట్లాడుతూ రోజురోజుకూ నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతుంటే బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల వేతనాలు పడి పోతున్నాయని ఈ పరిస్థితిలో 15శాతం జీతాలను పెంచాలని డిమాండ్ చేయగా దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి 1-1-2017 నుండి 15శాతం ఫిట్‌మెంట్‌తో బి ఎస్ ఎన్ ఎన్ ఎల్ ఉద్యోగులకు మూడవ వేతన సవరణ అమలు చేయాలని ప్రత్యేక సెల్‌టవర్స్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాధనలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే సంవత్సరం జనవరి నెలలో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు నిరవదిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలియజేశారు. రెండవ రోజుసు సమ్మెకు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి.వెంకటరావు, చరణ్, ఎన్.గోవర్ధనరావు, ఎన్ ఎఫ్‌టి ఇ నాయకులు వెంకటేశ్వరరావు, హెచ్ పాపన్న, ఎస్ ఎన్ ఇ ఏ నాయకులు రాజశేఖర్, రాంబాబు, ఏ ఐ బి ఎస్ ఎన్ ఎల్ ఇ ఏ నాయకులు ఎం.రమేష్, కిరణ్, శేవా నాయకులు రాములు, ఎఫ్ ఎన్ టి ఈవో నాయకులు జగన్నాధరావు, లోకేశ్వర పట్నాయక్, బి టి ఇ ఏ నాయకులు పి.శ్రీరాములు నాయకత్వం వహించారు.