శ్రీకాకుళం

సొమ్మెకరిది!...సోకొకరిది!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: వేలాదిమంది ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు సైతం నోరుకుట్టేసుకుని, ప్రత్యక్షరాజకీయాలకు దూరమవుతున్నారు. మంచులా కరిగిపోతున్న దేశం కంచుకోటను రక్షించుకునే కొంతమంది క్రీయాశీలక సభ్యులు సైతం పార్టీలో ఇమడలేక, బయటకు రాలేక స్తబ్థతగా ఉండిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఎక్కడో మారుమూల గ్రామాల్లో కన్పిస్తే సరే..కానీ, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ట్రబుల్‌షూటర్ రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వంటి దిగ్గజాలు కలిగిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే చురుకైన తమ్ముళ్ళు వౌనంగా ఉంటే - దాని ఫలితాలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎంత నష్టం కలిగిస్తాయో...అంటూ క్రమశిక్షణ కలిగిన జిల్లా టీడీపీ కుటుంబ సభ్యులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి నిస్సాయహాత, నిరుత్సాహాం, పనిచేసే కార్యకర్తల్లో వౌనం వెనుక జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయ లోపమే అన్నది సుస్పష్టంగా కన్పిస్తోంది. ఇందుకు తార్కణమే - బుధవారం జిల్లాకు కేంద్ర టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ జిల్లా పర్యటన రద్దు కావడం, కనీసం ఈ నెల 29వ తేదీన జిల్లా ఎన్టీఆర్ ట్రస్ట్భువన్ (పార్టీ కార్యాలయం) పాలుపొంగించేందుకు కూడా లోకేష్ రావల్సివున్నప్పటికీ, వచ్చే పరిస్థితులు కన్పించడం లేదంటూ ఆ పార్టీ నేతలే సుస్పష్టం చేస్తున్నారు. దీనంతటికీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శీరిషా ఇటీవల ముఖ్యమంత్రి చెంతకు చేరి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా పార్టీ పెద్దలుచిన్నలూ అందరూ మోకాలడ్డుతున్నారని, తనపని తనకు చేయినివ్వడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో సి.ఎం. అసలు లోకేష్ పర్యటనే శ్రీకాకుళం జిల్లాలో వద్దంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. అప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు కేంద్రపార్టీ కార్యదర్శి లోకేష్‌తో జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్వాకం అంతా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బలీయమైన మూహూర్తాలు ఉన్నా...జిల్లా టీడీపీ కార్యాలయం పాలుపొంగించేందుకు రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య లుకలుకలు జిల్లా ఎన్టీఆర్ ట్రస్ట్భువన్ ప్రారంభోత్సవాన్ని తాత్కలికంగా నిలిచిపోయేలా చేసింది.
ఈ నేపథ్యంలోనే జిల్లా తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి రూ. 1.65 కోట్లు నిధులు సేకరణకు ప్రధాన సూత్రధారులు అప్పటి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డి చిరంజీవులు అన్న విషయం జగమెరిగిన నిజం. కానీ, జిల్లా పార్టీ కార్యాలయానికి మొత్తం సొమ్ము అంతా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శీరిషాయే టీడీపీకి విరాళం ఇచ్చినట్టు దర్పం చలాయిస్తున్న తీరును తెలుగుతమ్ముళ్ళు తప్పుపడుతున్నారు. మూడున్నర దశాబ్ధాల తర్వాత సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకోగలిగారంటే - 45 సెంట్లు భూమిలో పార్టీకి జిల్లా కార్యాలయం నిర్మించేందుకు అప్పటి నేతలు కింజరాపు ఎర్రన్నాయుడు, తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, వై.వి.సూర్యనారాయణ, రెడ్డి చిరంజీవులు వంటివారంతా నడుంబిగించారు. 2002 నవంబర్ 20న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాజాగా 80 అడుగుల రోడ్డులో కేబినేట్ రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. స్థలం ప్రభుత్వం కేటాయించినప్పటికీ, టీడీపీ కార్యాలయం అక్కడ నిర్మించేందుకు కావల్సిన నిధులు మాత్రం గతంలో పార్టీ అధ్యక్షుడుగా గుండ అప్పలసూర్యనారాయణ, నగర కార్యదర్శిగా రెడ్డి చిరంజీవులు కూడబెట్టి 2002లో కారుచౌకగా సెంటు 15 వేల రూపాయలు చొప్పున్న అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. చిరంజీవులు తండ్రి రెడ్డి శివన్నారాయణ పేరున పార్టీ కార్యాలయం స్థలదాతగా శిలాఫలకం పెట్టిస్తామన్న అప్పటి నేతల వాగ్ధానాల మేరకు మే, 2002లో నారావారికి రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పట్లో రెడ్డి చిరంజీవులకు బాబు చేతులమీదుగా పుష్పగుచ్చాన్ని ఎర్రన్న ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. ఆ భూమే ఇప్పుడు జిల్లా ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మాణానికి పెట్టుబడిగా మంత్రి అచ్చెన్నాయుడు మార్చి రూ. 1.65 కోట్ల రూపాయలకు బలగ రూరల్‌లో అప్పట్లో గుండ, చిరంజీవుల కష్టార్జతంగా చెప్పుకునే స్థలం అమ్మేసారు. ఆ మొత్తంతోనే ఇప్పుడు నిర్మిస్తున్న జిల్లా టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కానీ, అప్పట్లో కష్టపడి సొంత సొమ్ము సైతం బలగ రూరల్‌లో 45 సెంట్లు స్థలానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళను కనీసం పార్టీ అధ్యక్షురాలు గౌరవించకపోయినా ఫర్వాలేదు గానీ, ఆ నిర్మాణానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలే సొమ్ములు ఇచ్చినట్టు దర్పం చలాయించే విధానంపై గుండ అప్పలసూర్యనారాయణ, రెడ్డి చిరంజీవులు మండిపడుతున్నారు. పార్టీ కార్యాలయంలో అక్షయతృతీయ రోజున మంచి మూహూర్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు గమనించి కేంద్ర పార్టీ కార్యదర్శితో పూజ చేయించేందుకు సన్నాహాలు చేసి ఆయన పర్యటనను జిల్లాలో ఈ నెల 18, 19 తేదీల్లో ఖరారు చేయిస్తే, దానిని మోకాలడ్డుకున్న శీరిషా మరో మూహూర్తంగా ఈ నెల 29న. ముఖ్యమంత్రి ముందు పెట్టినప్పటికీ, ఆ మూహూర్తం కూడా ఖరారు కాకపోవచ్చునంటూ తెలుగుతమ్ముళ్ళే ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. ఏదిఏమైనప్పటికీ జిల్లా పార్టీ కార్యాలయం 45 సెంట్లు స్థలం కొనుగోలు, రూ. 1.65 కోట్లు నిధులు సమీకరణ గుండ, రెడ్డి చిరంజీవులది అయితే...జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం, దాని ప్రారంభోత్సవంపై శీరిషా ఒంటెద్దుపోకడి తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది అన్నట్టుగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం, దాని ప్రారంభోత్సవం ఉంది!!