శ్రీకాకుళం

జల దిగ్భంధంలో జలుమూరు మండలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నీట మునిగిన వందలాది ఎకరాలు
* విద్యుత్‌కు అంతరాయం
* యుద్ధ ప్రాతిపదికన పనులు
* స్థానిక ఎమ్మెల్యే, మండల ప్రత్యేకాధికారి సందర్శన
====================================
జలుమూరు, అక్టోబర్ 12: తుఫాన్ ప్రభావం కారణంగా జలుమూరు మండలంలో పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వీచిన వీదురు గాలులు, ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు అనేక మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ అంతరాయం ఏర్పాడడం, ప్రత్యేక విద్యుత్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. బుధవారం రాత్రి నుండి విద్యుత్ లేకపోవడంతో చాలా మేరకు ఎటువంటి సమాచారం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వంశధార నదికి వరద నీటి ప్రవాహం అధికమవ్వడం, రంగసాగరం ప్రధాన కాలువ నీరు నదిలో ప్రవహించనందున ఇటు వర్షపు నీరు, వరద నీటితో అత్యుతాపురం, కొమనాపల్లి, మర్రివలస, శ్రీముఖలింగం, ఎలమంచిలి, సురవరం, అందవరం, పర్లాం పంచాయతీల్లో వందలాది వరిచేళ్లు నీటిలో మునిగి ఉన్నాయి. కొమనాపల్లి వద్ద ప్రస్తుతం వున్న వరిచేళుకు అడుగు ఎత్తులో వరదనీరు ఉండడం అంతా కుళ్లిపోతుందని రైతులు వాపోతున్నారు. శుక్రవారం ఉదయానికే వంశధార నదిలో లక్షకు పైగా క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున కొమనాపల్లి కాలనీ, ఉరకలపేట గ్రామాలు నీటమునిగాయి. జలుమూరు ప్రధాన రహదారి సింహాద్రిపేట వద్ద నీరు ప్రవహించడంతో రహదారి పూర్తిగా పాడయ్యింది. ఎలమంచిలి, కొమనాపల్లి వద్ద ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో ద్విచక్ర వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా గ్రామాలలో శతాబ్ధాల కాలంనాటి చెట్లు కూడా కూలిపోయాయి. భారీ వాహనాలను తెచ్చి రోడ్లపై పడివున్న చెట్లను నరికివేస్తూ ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మండల ప్రత్యేకాధాకారి, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం నదీ పరివాహక గ్రామాలను శుక్రవారం సందర్శించి అక్కడ రైతులుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చూస్తుందని భరోసా ఇచ్చారు. వరద నీరు అధికంగా ప్రవహిస్తున్నందున తీర ప్రాంతాల ప్రజలు నదివైపు వెళ్లవద్దని వీరు సూచించారు. ప్రతీ గ్రామంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

గుల్లవానిపేటకు చెందిన యువకుడు మృతి
పోలాకి, అక్టోబర్ 12: మండలంలో గల గుల్లవానిపేటకు చెందిన వడగంటి వెంకటరావు(30) అనే వ్యక్తి గురువారం సాయంత్రం జోగంపేటనుండి బయలుదేరి స్వగృహమైన గుల్లవానిపేట గ్రామానికి వస్తుండగా గుల్లగాయి గడ్డ దగ్గర తుఫాన్ ప్రభావం వలన గడ్డలో పడి వుంటాడని గుల్లవానిపేట రేవుకు ఈరోజు ఉదయానికి చేరాడని స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది హెచ్‌సి సత్యన్నారాయణ తెలిపారు. డెడ్ బాడీని నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్ట్‌మార్టం చేసి తండ్రి గురువులుకు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.

నదీ పరివాహక ప్రాంతాలకు
హెలీకాఫ్టర్ ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ
నరసన్నపేట, అక్టోబర్ 12: మండలంలోని వంశధార నదీ పరివాహక గ్రామాలలో నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆహార పొట్లాలను హెలీకాఫ్టర్ ద్వారా అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం నదీపరివాహక ప్రాంతాలలో హెలీకాఫ్టర్ రావడంతో గ్రామస్థులంతా గుమిగూడారు. స్థానిక ప్రాంత వాసులకు ఆహార పొట్లాలను అందజేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుమారు 10వేల పొట్లాలు పంపిణీ చేసినట్లు తెల్సింది.

యుద్ధప్రాతిపదికపై తుఫాన్ పునరావాస పనులు
ఆమదాలవలస, అక్టోబర్ 12: నియోజకవర్గంలో తిత్లీ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలు రహదారులు, నేలకొరిగిన విద్యుత్ స్థంభాలను, టెలీకాం వ్యవస్థను శుక్రవారం సంబంధిత అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికపై పునారావాస పనులు చేపట్టారు. గత రెండురోజులుగా పట్టణంలో, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం, కారుచీకటిగా ఉంటూ శ్మశానాన్ని తలపించాయి. టెలీకాం వ్యవస్థ ఎక్కడికక్కడే పాడైపోవడంతో ప్రజల మద్య సమాచారం లేక నానా ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 48గంటల పాటు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒడిస్సా సరిహద్దుల్లో తుఫాన్ ప్రభావం అధికం కావడంతో రైల్వే ట్రాక్ కింద వరద నీరు చేరడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే శాఖ సుమారు 28 ప్రధాన రైల్లను రద్దుచేసింది. క్రమేణ పునరావాస చర్యల్లో భాగంగా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరామ్మత్తులు చేపట్టడంతో రైలు రాకపోకలను తాపీగా సాగిస్తున్నారు. నియోజక వర్గంలో వందలాది ఎకరాల వరిపంట ఈదురుగాలులు నేలమట్టమయ్యాయి. బూర్జి, సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు మండలాల్లోసుమారు 2000 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలలో గుర్తించారు. ప్రళయం సృష్టించిన తిత్లీ తుఫాన్ ప్రభావాన్ని ముందస్తు హెచ్చరిక జారీ చేయడం వల్ల ప్రజలు అప్రమత్తం కావడం వల్ల ఆర్థిక నష్టం తప్ప ప్రాణ నష్టం జరుగలేదు. వంశధార, నాగావళి నదుల్లు కాలువల్లో నిలకడగా ఉండటంతో తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

అధైర్యపడకండి నేనున్నాను
* పలాసను పునరుద్ధరించాకే వెళ్లేది
* అన్ని విధాల ఆదుకుంటాం
* ముఖ్యమంత్రి చంద్రబాబు
పలాస, అక్టోబర్ 12: తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన పలాస తో పాటు మిగిలిన పది మండలాలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని, బాధితులు అధైర్యపడవద్దని, నేనున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బరోసా ఇచ్చారు. తుఫాన్ కారణంగా పలాస-కాశీబుగ్గ జంట పట్నాలతో పాటు ఉద్ధానం ప్రాంతాన్ని శుక్రవారం సి ఎం చంద్రబాబు పర్యటించి బాధిత కుటుంబాలలో ఆత్మ స్థైర్యం నింపారు. కాశీబుగ్గ చేరుకున్న సి ఎం ప్రత్యేక కాన్వాయ్‌లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నుంచి శ్రీనివాసటాకీస్ మీదుగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించారు. అక్కడ నుండి నేరుగా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి తదితర మండలాల్లో పర్యటించి అక్కడ జరిగిన పంట నష్టాన్ని బాధిత రైతాంగాన్ని అడిగితెలుసుకున్నారు. సి ఎంకు బాధితులు వారు గోడును వెల్లబుచ్చారు. గతంలో ఎన్నడూ ఇటువంటి నష్టం వాటిల్లలేదు, తీవ్రంగా నష్టపోయాం, మీరు ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ సి ఎం ఎదుట కన్నీటి పర్యాంతం అయ్యారు. దీనిపై సి ఎం తీవ్రంగా స్పందించి బాధితులంతా అధైర్యపడవలసిన పనిలేదని, అత్యవసరమైన తాగునీరు, విద్యుత్, నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులును ఆదేశించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన జీడి, కొబ్బరి, వరి పంట తీవ్రంగా దెబ్బ తిందని బాధిత రైతాంగాన్ని పరిహారం అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యవసరసరుకులు అందిస్తామని హామీ ఇచ్చారు. పలాస పట్టణాన్ని పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్దరించి తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ఇక్కడనుండి అమరావతికి బయలు దేరుతానని సి ఎం స్పష్టం చేశారు. తన పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డితో పాటు విద్యుత్ శాఖ సిఎండిలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టి బాధితుల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర మంత్రులు పితాని సత్యన్నారాయణ, నారాయణ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష తదితరులున్నారు.