శ్రీకాకుళం

సహాయచర్యలు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 12: తుఫాన్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా అధికారులు సమిష్టిగా సహాయ చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపాల్ శాఖామంత్రి కె.నారాయణ ఆదేశించారు. సి ఎంతో పాటు పలాస పర్యటనకు శుక్రవారం విచ్చేసిన మంత్రి నారాయణ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇటువంటి విపత్తులు సమయంలో ప్రజల్లో వుండే ఆందోళనలను పోగొట్టేలా అధికార యంత్రాంగా అంకితభావంతో సేవలు అందిస్తే మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రణాళిక బద్దంగా అధికారులు సమన్వయంతో తుఫాన్ బాధిత ప్రాంతాలలో సమగ్ర సమాచారాన్ని రప్పించుకొని సహాయక చర్యలు సకాలంలో అందించాలన్నారు. ముఖ్యంగా బాధితులకు కనీస అవసరాలు తీర్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పలాస మున్సిపాల్టీని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఉన్నతాధికారులంతా ఇక్కడే బస చేసి కృషి చేయాలన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, నిత్యావసర వస్తువులు అందించేందుకు విశాఖపట్నం, శ్రీకాకుళం కార్పొరేషన్‌ల అధికారులు బృందాలను ప్రత్యేకంగా రప్పించామన్నారు. మంచినీటి ట్యాంకులను కూడా ఇతర ప్రాంతాలనుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు దాహార్తిని తీర్చే కార్యక్రమాలను కొనసాగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్, క్లోరినేషన్ వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విపత్తుల అగ్నిమాపక సిబ్బంది సహకారంతో క్రిడికో జయనిర్మల సంస్థలు ఇళ్లు నిర్మిస్తున్నాయని, అక్కడ పనిచేసే సిబ్బందినికూడా ఇక్కడకు తీసుకొచ్చి పట్టణంలో పారిశుద్ధ్య పనులను పూర్తిచేయడం జరుగుతుందని చెప్పారు. ఆయనతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఫైర్ అధికారి శ్రీనివాసరావు తదితరులున్నారు.

విద్యుత్ పునరుద్ధరణపై మంత్రి అచ్చెన్న సమీక్ష
టెక్కలి, అక్టోబర్ 12: తుఫాన్ ప్రభావం వల్ల అంతరాయం ఏర్పడ్డ విద్యుత్ పునరుద్ధరణ పై తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్రవారం రాయివలస సబ్‌స్టేషన్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్‌జైన్‌తో కలిసి విద్యుత్, ఇతర అధికారులతో సమీక్షించారు. పలు ప్రాంతాలను మంత్రి పర్యటించిన అనంతరం ఈ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్దరించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరతగతిన సహాయ చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా గ్రామాలకు పునరుద్దరించాలన్నారు. సుమారు 25వేలు విద్యుత్ స్థంబాలు నష్టానికి గురయ్యాయని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నారని అజయ్‌జైన్ మంత్రి అచ్చెన్నకు వివరించారు. ఇప్పటికే పలు సబ్‌స్టేషన్లు వినియోగంలోకి వచ్చాయని, దీనివల్ల అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించడం వీలవుతుందన్నారు. త్వరలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి టీంలను తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మంత్రి అచ్చెన్న ముందుగా పట్టణాలు విద్యుత్ పునరుద్ధరిస్తే ప్రభుత్వ కార్యాలయాలు ద్వారా సహాయక చర్యలు చేపట్టవచ్చన్నారు. తొలుత మంత్రి అచ్చెన్న తెంబూరు రోడ్డులో గల తిర్లంగి, నీలాపురం, గంగాధరపేట గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని బరోసా ఇచ్చారు. డైరక్టర్ శేషుకుమార్, జనరల్ మేనేజర్ సూర్యప్రకాశ్, మణి, డి ఈ గౌరీశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

అధికారుల తీరుపై గ్రామస్థుల నిరసన
టెక్కలి, అక్టోబర్ 12: మండలంలోని ఆయోథ్యపురం పంచాయతీ పరిథిలో పలు గ్రామాలు మదనగోపాలసాగరం గండిపడటం వల్ల ముంపుకు గురయ్యాయి. వీరికి ఎటువంటి సహాయ చర్యలు అందకపోవడంతో శుక్రవారం గ్రామాన్ని సందర్శించిన తహశీల్దార్ అప్పలరాజు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీశారు. ప్రతీ ఏట పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నప్పటికి అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు అలసత్వం వల్లే గండి ఎప్పుడు ఏర్పడుతుందని వారంతా ఆరోపించారు.

డి ఆర్‌డి ఏ పీడీని అభినందించిన ముఖ్యమంత్రి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, అక్టోబర్ 12: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ డైరక్టర్ డాక్టర్ జిసి కిషోర్‌కుమార్‌కు ఐఏఎస్ కన్ఫర్మేషన్ అయినందున ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కిషోర్‌కుమార్‌ను అభినందించారు.

జ్ఞానభేరికి సన్నాహాలు
* కసరత్తు ఆరంభించిన వీసీ రామ్‌జీ
ఎచ్చెర్ల, అక్టోబర్ 12: జ్ఞానభేరి కార్యక్రమాన్ని అంబేద్కర్ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈనెల 22న నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు కావడంతో వైస్ ఛాన్సలర్ కె.రామ్‌జీ కసరత్తు ఆరంభించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. పదివేల మంది విద్యార్థులతో జ్ఞానభేరి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావులు ప్రారంభించనున్నారు. ఇందుకు విద్యార్థులు సమీకరణ మరింత కీలకం కావడంతో కళాశాలల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించి వారి పర్యవేక్షణలో వివిధ పోటీలను నిర్వహించనున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు కూడా జ్ఞాన భేరి వేదిక గుండా అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి కూడా ఈ కార్యక్రమం కోసం మరింత సుందరంగా తీర్చిదిద్దే పనిలో అధికారులు తీరిక లేకుండా గడుపుతున్నారు. రిజిస్ట్రర్ రఘబాబు, డీన్ కామరాజు, ప్రిన్సిపాల్ సుజాత తదితరులు సమీక్షలో ఉన్నారు.

తుఫాన్ గ్రామాల్లో ఎన్ ఎస్ ఎస్ పీవోలు
ఎచ్చెర్ల, అక్టోబర్ 12: తుఫాన్ బాధిత ఉద్దానం గ్రామాల్లో అంబేద్కర్ వర్శిటీ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అఫీసర్స్ సేవలు అందించేందుకు శుక్రవారం పయనమయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న కళాశాలల ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లతో కలిసి బాధితులకు సాయం అందించేలా ఇక్కడనుండి ప్రోగ్రాం అధికారులు వైస్ ఛాన్సలర్ రామ్‌జీ ఆదేశాల మేరకు పరుగులు తీశారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, టెక్కలి తదితర ప్రాంతాలలో వీరు వలంటీర్లతో కలిసి బాధిత కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపేలా సేవా కార్యక్రమాలు కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రోగ్రాం అధికారులు కె.కృష్ణమూర్తి, రామకృష్ణారావు, రమణమూర్తి, ఉదయ్‌కిరణ్ తదితరులు ఉన్నారు.

శివాని విభాగ అధిపతికి సత్కారం
ఎచ్చెర్ల, అక్టోబర్ 12: మండలంలోని చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివాని ఇంజనీరింగ్ కళాశాల ట్రిపుల్ ఈ విభాగాధిపతి చంద్రశేఖర్ శుక్రవారం ఘనంగా ప్రిన్సిపాల్ బి.మురళీకృష్ణ, మేనేజ్‌మెంట్ సభ్యులు సత్కరించారు. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే అంశంపై ఏఐటియుసి ఆమోదం మేరకు జేఎన్‌టియు హైదరాబాద్ ఆదేశాల ప్రాప్తికి రూపొందించిన పుస్తకం జర్నల్‌లో ఎంపికయ్యింది. దీనిని ప్రోత్సహిస్తూ హెచ్ వోడిని మేనేజ్‌మెంట్ సభ్యులు పి.దుర్గాప్రసాదరాజు, డి.వెంకటరావు, కె.దుర్గా శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, జె.సూర్యచంద్రరావు, సాయినాథరెడ్డి, టీపివో రాజేంద్ర, ఏవో ప్రసాద్‌లు అభినందించిన వారిలో ఉన్నారు.

తీర గ్రామాల్లో జనసేన మంచినీరు సరఫరా
ఎచ్చెర్ల, అక్టోబర్ 12: తుఫాన్ కారణంగా జనజీవనం స్తంభించిపోవడంతో తీర గ్రామాల్లో దాహార్తిని తీర్చేందుకు జనసేన పార్టీ నాయకులు కుశాలపురం మాజీ సర్పంచ్ బాడాన జనార్థనరావు, బాడాన దేవభూషణరావులు ట్యాంకర్లతో తాగునీరును శుక్రవారం సరఫరా చేశారు. డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం, రాళ్లపేట, శివాజీ దిబ్బలపాలెం, గినె్నవానిపేట, మూసవానిపేట, బగీరథపురం గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీరు అందించారు. ఈ కార్యక్రమాన్ని తమ్మినేని శ్రీనివాసరావు, పేడాడ రామ్మోహనరావులు పర్యవేక్షించారు.

..........

ఆదుకుంటాం అధైర్యపడవద్దు
సారవకోట, అక్టోబర్ 12: మండలంలో తుఫాన్ వలన నష్టపోయిన ప్రతీ ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ, ఎంపీడీవో జగదీశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సాధుచిన్నికృష్ణమనాయుడు, మూకళ్ల చిన్నయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. సారవకోట మండలాన్ని తుఫాన్ ప్రభావిత మండలాల జాబితాలో చేర్చకపోవడం పట్ల రైతులు, యువకులు నిరసన తెలియజేసిన నేపథ్యంలో శుక్రవారం రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వీరు మాట్లాడారు. పంట నష్ట అంచానాలు కూలిపోయిన గృహాల జాబితాలు, రహదారుల దుస్థితిపై క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వే చేస్తున్నారని, గ్రామాల్లో ప్రజలు ఈ బృందాలకు సహకరించాలని వీరు విజ్ఞప్తి చేశారు. మండలంలో నెలకొన్న పరిస్థితులను జిల్లా మంత్రులకు, కలెక్టర్‌కు తెలియజేసి తుఫాన్ ప్రభావిత మండలాల జాబితాల్లో సారవకోటను చేర్చే విధంగా కృషి చేస్తామని వీరు హామీ ఇచ్చారు.

.
పదిహేను వేల ఎకరాలలో పంట నష్టం
* కుప్పకూలిన 1500 విద్యుత్ స్తంభాలు
* చీకటిలో సారవకోట
సారవకోట, అక్టోబర్ 12: తిత్లీ తుఫాన్ ప్రభావం వలన మండలంలో 15వేల ఎకరాలలో ఖరీఫ్ వరి నీట మునిగిందని వ్యవసాయశాఖ అధికారి ఎల్.మురళీధర్ తెలిపారు. ఇందు 11వేల ఎకరాలలో వరిచేను పూర్తిగా నీట మునిగి ఉండగా 4వేల ఎకరాలలో వరిచేను పూర్తిగా పాడయ్యిందన్నారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల పరిథిలో సుమారు 1500 విద్యుత్ స్థంబాలు పూర్తిగా నేలకొరిగాయి. టెక్కలి నుండి గాని, పాతపట్నం నుండి గాని సారవకోట విద్యుత్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా జరిగే పరిస్థితి కానరాలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వలన పునరుద్ధించే కార్యక్రమం జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా వుండగా జిల్లా యంత్రాంగం సారవకోట మండలం తుఫాన్ భీభత్సం నష్టాల గురించి తక్కువ అంచనా వేయడం వలన విద్యుత్ పునరుద్ధరణకు కేవలం 50 మందికూళీలను మాత్రమే తూర్పుగోదావరి జిల్లానుండి పంపించారు. విద్యుత్ స్తంభాలుకూడా తగినంతగా సరఫరా చేయాలేదు. ఈ కారణంగా మండల కేంద్రానికి పదిరోజులు వరకు విద్యుత్ సౌకర్యం పునరుద్దించే అవకాశం లేదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. నవతల జంక్షన్‌నుండి అటు పాతపట్నం, ఇటు హిరమండలం వెళ్లే రహదారులు జలదిగ్భందంలో ఉన్నాయి. ఈ రహదారులు శుక్రవారం సాయంత్రం సర్కి సుమారు 5 అడుగులు ఎత్తులో నీరు ప్రవహిస్తుండడం వలన ఆర్టీసీ బస్సులు రాకపోకలను సారవకోట వరకు పరిమితం చేశారు. భారీ వృక్షాలు నేలకొరగడం వలన పలు గ్రామాలకు పూర్తిగా రహదారి సౌకర్యం కొరవడింది. ఈ చెట్లను తొలిగించే నాధుడు కొరవయ్యాడు. ఏది ఏమైనప్పటికి జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర మంత్రులు సారవకోట వైపు దృష్టిసారించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తుఫాన్ బాధితులకు అవసరమైన పరిహారాన్ని చెల్లించాలని పలువురు కోరుతున్నారు. స్థానిక మండలాధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చిన్నాల వెంకటసత్యన్నారాయణ శుక్రవారం పలు గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.