శ్రీకాకుళం

జీ ఎం ఆర్ సేవలకు ముగ్దుడైన టాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, డిసెంబర్ 10: రాజాం పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు సారధ్యంలో రాజాం ప్రాంతంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించిన టాటా ట్రస్టు చైర్మన్ రతన్ నేవల్ టాటా మంత్రముగ్దులయ్యారు. జీ ఎం ఆర్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సోమవారం రాజాంకు చేరుకున్న రతన్ టాటాకు జీ ఎం ఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ నిర్వాహకులు, కళాశాలల యాజమాన్య ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో కేర్ ఆసుపత్రి, డీ ఏవీ పాఠశాల, జీ ఎం ఆర్ ఐటీ క్యాంపస్, జీసీ ఎస్ ఆర్ కళాశాలతో పాటు ఫౌండేషన్ కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫౌండేషన్ ద్వారా లబ్ధిపొందుతున్న విద్యార్థులు, ఇతర వర్గాలను కూడా క్షేమ సమాచారం ఆయన అడిగి తెలుసుకున్నారు. సభా కార్యక్రమంలో ఫౌండేషన్ ద్వారా లబ్దిపొందిన విద్యార్థుల అనుభవాలను ఆయన స్వయంగా ఆలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఒరవడిని కొనసాగించి మరింతమంది విద్యార్థులకు సేవలందించాలని నిర్వాహకులను కోరారు. జీ ఎం ఆర్ మారుమూల పట్టణంలో విద్య, ఆరోగ్యం, కనీస వౌళిక సదుపాయాలు కల్పించడంలో మాలాంటి పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా దేశంలోనే అత్యంత సంపన్నులు, పారిశ్రామిక వేత్త అయిన టాటా పర్యటనతో రాజాం ప్రాంతంలో ఒక రకమైన ఉత్సాహం నెలకొంది. ఆయనతో పాటు పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా టాటాకు తెలియజేశారు.
అర్హులందరికి ప్రభుత్వ పథకాలు
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 10: అర్హులందరికి ప్రభుత్వం పథకాలు అందిస్తుందని ఎంపీపీ ఢిల్లీరావు పేర్కొన్నారు. సోమవారం కేశుపురం పంచాయతీలో టీడీపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పింఛన్లు అందని వారికి పింఛన్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో డి.కామేషు, చిన్నారి, శ్యామ్, కె.హేమంత్, ప్రసాద్ పాల్గొన్నారు.
విద్యార్థుల దత్తత
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 10: కవిటి మండలం, దూగానపుట్టుగకు చెందిన ఓంకార్, సంజన అనే ఇద్దరు విద్యార్థులను సోంపేటకు చెందిన వూ ఫర్ యు అనే స్వచ్చందసంస్థతోపాటు చిన్మయమిషన్‌లవారు దత్తత తీసుకొని వారి విద్య కోసం ఖర్చు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. దూగానపుట్టుకు చెందిన నీలవేణి క్యాన్సర్‌తో బాధపడుతుండడంతో ఈ చిన్నారిని ఈ సంస్థ సభ్యులు దర్మారాజు, బాబురావు, కే.మాధవరావు, వేణుగోపాల్‌లు ఈ దత్తత తీసుకున్నారు.

వైసీపీ నాయకుల పర్యటన
ఇచ్ఛాపురం(రూరల్), డిసెంబర్ 10: కవిటి మండలంలో డి.గొనగపుట్టుగ, బైరిపురాల్లో వైసీపీ నాయకులు పర్యటించి, జగన్ రావాలి-జగన్ కావాలి అనే కరపత్రాలను పంపిణీ చేసారు. జగన్ సీ ఎం అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రస్తుతం వున్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న లోపాలు గూర్చి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంపురియా, జయప్రకాశ్, కె.ప్రకాశ్, రజనీకుమార్‌దొళాయి తదితరులు పాల్గొన్నారు.

దగ్గుబాటిని కలిసిన ఉదయ్‌భాస్కర్
టెక్కలి, డిసెంబర్ 10: రాష్టస్థ్రాయిలో బీజేపీ కార్యవర్గసమావేశంలో టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ స్థాయిలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ హాజరైనారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పిలుపు మేరకు గుంటూరులో జరిగిన ఈ సమావేశంలో పాల్గొని బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరీని కలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె టెక్కలి నియోజకవర్గ సమస్యలను మండలవారీగా అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి నందమూరి తారకరామారావును గెలిపించిన నియోజకవర్గ ప్రజలను త్వరలో కలుసుకొని బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

ఐతమ్‌లో విప్రోడ్రైవ్
టెక్కలి, డిసెంబర్ 10: టెక్కలి ఐతమ్ ఇంజనీరింగ్‌కాలేజిలో విప్రోసాఫ్ట్‌వేర్ కంపెనీ సోమవారం ఉద్యోగాలు కోసం రాతపరీక్షలు నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సహకారంతో నిర్వహించిన ఈ రాతపరీక్షలో జిల్లాలో వున్న డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు 500 మంది వరకు పాల్గొని రాతపరీక్షతోపాటు ఇతర పరీక్షల్లో విజయం సాధించిన వారికి నెలకు 25 వేల రూపాయలు పారితోషికం, అజిత్‌ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా బిట్స్‌ఫిలానీలో ఎంటెక్ కోర్సును ఉచితంగా చదివిస్తామని స్కిల్ డెవెలప్‌మెంట్ జిల్లా మేనేజరు గోవిందరావు తెలిపారు. తమ కాలేజిలో పరీక్షలు నిర్వహించడం ఆనందంగా ఉందని కాలేజి డైరెక్టర్ వివి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్రో ప్రతినిధి అనురాగ్, ప్రిన్సిపాల్ మధుసాహు, బిజినెస్ ప్లేస్‌మెంట్ అధికారి రాజేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నష్టపరిహారం ఇప్పించరూ..
నందిగాం, డిసెంబర్ 10: తిత్లీ తుపాన్‌లో నష్టపోయామని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని మండలంలోని కొంటినూరు, సవరనీలాపురం, సవరకొత్తూరు, వెంకటాపురం, బెల్లుకోల, రథజనబొడ్డపాడు తదితర కొండల ప్రాంతాలకు చెందిన గిరిజనులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాల్లో ఆంధ్రభూమి సందర్శించినప్పుడు గిరిజనులు మొరపెట్టుకున్నారు. తిత్లీ తుపాన్ ధాటికి సర్వస్వం కోల్పోయినప్పటికి ప్రభుత్వం పరిహారం అందించడంలో తమకు అన్యాయం జరిగిందని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించినప్పటికి పరిహారం అందించడంలో న్యాయం జరగలేదన్నారు. పంటలు, పశువులశాలలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికి ప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు చేసి పరిహారం అందివ్వలేదన్నారు. గిరిజనులు బాగోగులు పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులు ఓట్లు కోసం మా వద్దకు వచ్చి అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం తప్ప గిరిజన కుటుంబాలు ఏ విధంగా జీవిస్తున్నారనే పట్టించుకునే నాధుడు కరవయ్యారని మొరపెట్టుకున్నారు. ఉన్నతస్థాయి అధికారులు స్పందించి గిరిజనులు కొరకు ప్రత్యేకించి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

శిథిలావస్థలో బారువ బస్సుషెల్టర్
సోంపేట, డిసెంబర్ 10: మేజర్ పంచాయతీ బారువలో రెండు దశాబ్దాలు క్రితం ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్సుషెల్టర్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బారువలో డిగ్రీ, జూనియర్‌కాలేజిలు, జాతీయబ్యాంకులు, సామాజిక ఆసుపత్రి, పోలీసుస్టేషన్, బీచ్ ఉండడంతో చుట్టుప్రక్కల గ్రామాలతోపాటు ఒడిస్సా నుంచి ప్రయాణీకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సుషెల్టర్‌ను మరమ్మతులు చేపట్టాలని గతంలో అనేకమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీపెద్దలు స్వయంగా కలిసి వినతిపత్రాలు సమర్పించినా నేటికి మోక్షం లభించలేదని బారువ ప్రముఖులు తారకేశ్వరరావు, ఎం.గురుమూర్తి, ఎం.కుమార్, యోగిలు ఆవేదన వ్యక్తం చేసారు. బస్సుషెల్టర్ శిథిలావస్థకు చేరడంతో ఆ ప్రక్కనే ఉన్న హనుమాన్‌మందిరం వద్ద ప్రయాణీకులు బస్సులు కోసం నిరీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఎంతో ప్రాధాన్యత గల బారువలో బస్సుషెల్టర్‌కు మరమ్మతులు చేపట్టాలని బారువతోపాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు కోరుతున్నారు.
చలి గజగజ...ప్రజలు విలవిల
పలాస, డిసెంబర్ 10: గత కొన్ని రోజులు నుంచి చలిపంజా విసురుతుంది. దీనితో ప్రజలు చలితో గజగజలాడుతున్నారు. వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత తగ్గడం లేదు. మళ్లీ సాయంత్రం 4 గంటలకే చలి ప్రారంభమవుతుంది. చిరువ్యాపారులకు, కూలీలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది.

మత్స్యకారుల ఐక్కతతోనే హక్కుల సాధన
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 10: మత్స్యకారులంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే హక్కులను సాధించుకోవచ్చునని పలాస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం నువ్వలరేవులో మత్స్యకారుల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు తీరప్రాంత భూములపై కొబ్బరి, జీడి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. సెజ్ పరిధి భూములపై మత్స్యకారులకు హక్కులు కల్పిస్తే భద్రత పెరుగుతుందన్నారు. ఇటీవల తిత్లీ తుపాన్ వల్ల చెట్లు నష్టపోయిన పట్టాలు లేనందున నష్టపరిహారం అందుకోలేకపోయారన్నారు. తీరప్రాంత పరిధిలో ఫిషింగ్‌హార్బర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో గురయ్యనాయుడు, జుత్తు నీలకంఠం, దున్న వీరాస్వామి, దేవరాజు, ధర్మారావు, అంబటి ఆనందరావు, ఎల్.రామలింగం, టి.సరస్వతి పాల్గొన్నారు.
టీడీపీతోనే అభివృద్ధి
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 10: టీడీపీ పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు వంక నాగేశ్వరరావు అన్నారు. సోమవారం నగరంపల్లి పంచాయతీ, రాజపేట గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబుపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు పూర్తిస్తాయిలో అందుతున్నాయన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌సభ్యుడు ఎన్.సూర్యనారాయణ, కో ఆర్డినేటర్ పి.బాలు పాల్గొన్నారు.
గ్రామాల్లో అపారిశుద్ధ్యం లేకుండా చూడాలి
రేగిడి, డిసెంబర్ 10: గ్రామాల్లో అపారిశుద్ధ్యం లేకుండా చూడాలని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీడీవో శంకరరావు అన్నారు. సోమవారం సంకిలి గ్రామంలో చెత్త సంపద కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా స్వచ్ఛందంగా చెత్తను బుట్టల్లో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణకుమారి తదితర అధికారులున్నారు.
కత్తెర పురుగు నివారణపై అవగాహన
వంగర, డిసెంబర్ 10: మొక్కజొన్న పంటకు సోకిన కత్తెర పురుగు నివారణకు రాజాం వ్యవసాయ ఏడీ వెంకటేశ్వరరావు రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం మండలంలోని మగ్గూరు గ్రామంలో రైతులు వేసిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. ఏయే మందు పిచికారీ చేయాలని అనే అంశాలపై రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి బాబ్జీ పాల్గొన్నారు.

మడ్డువలస ప్రాజెక్టు నీరు విడుదల
వంగర, డిసెంబర్ 10: మడ్డువలస ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా సోమవారం ఎంపీపీ ఎలకల అమ్మడమ్మ, జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టు నుంచి నీటిని సోమవారం విడుదల చేశారు. ఈ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువల ద్వారా పది క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వంగర, రేగిడి, జి.సిగడాం, పొందూరు, సంతకవిటి మండలాల రైతుల పంట పొలాలకు నీటిని విడిచిపట్టినట్టు ప్రాజెక్టు ఈ ఈ ప్రదీప్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఈ నర్మదాపట్నాయక్, జి.అప్పలనాయుడు, ఏ ఈలు అరుణకుమారి, సతీష్‌కుమార్, రాజాం వ్యవసాయాధికారి వెంకటరావు, తహశీల్దార్ మంగు తదితరులున్నారు.
భూదార్ సర్వేపై అలసత్వం చేస్తే చర్యలు
కొత్తూరు, డిసెంబర్ 10: గ్రామపంచాయతీ కార్యదర్శులు భూదార్ సర్వేలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవోప్రసాదరావు హెచ్చరించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ అనంతరం పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. కార్యదర్శులు ఈ సర్వేలో వెనుకబడి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లో సర్వే పూర్తిచేయకపోతే మెమోలు జారీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ భూదార్ సర్వేపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులు తదితర అంశాలను ఆన్‌లైన్‌లో ఈ సర్వే ద్వారా నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏ ఈ మల్లిఖార్జునరావు, జే ఈలు దుర్గాప్రసాద్ తదితరులున్నారు.
గర్భిణులకు వైద్య తనిఖీలు
కొత్తూరు, డిసెంబర్ 10: ప్రధాన మంత్రి మాతాశిశు అభియాన్ పథకంలో భాగంగా గర్భిణీలకు కురిగాం పీహెచ్‌సీలో సోమవారం వైద్య తనిఖీలు చేసినట్టు వైద్యాధికారి అసిరినాయుడు తెలిపారు. కురిగాం పీహెచ్‌సీ పరిధిలో ఉన్న 24 మంది గర్భిణీలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈవో బుజ్జిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

స్వైన్‌ఫ్లూపై అవగాహన
కొత్తూరు, డిసెంబర్ 10: విపరీతమైన చలి, మంచు, శీతల వాతావరణం కావడంతో స్వైన్ ఫ్లూ వ్యాధి పలు ప్రాంతాల్లో ఉండడంతో కురిగాం పీహెచ్‌సీ వైద్యాధికారులు సోమవారం వసప గ్రామంలో ఈ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి అసిరినాయుడు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వసప గ్రామానికి వెళ్లి స్వైన్‌ప్లూపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలను తెలియజేశారు.