స్మృతి లయలు

ఛలో హైదరాబాద్ వయా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1960లోనే ఒకనాడు పిటిఐ టిక్కర్ (టెలి ప్రింటర్) దగ్గర బొమ్మారెడ్డిగారు టెలిగ్రాముల తోరణాన్ని చేతబట్టి బల్ల మీద పెట్టి - ఇత్తడి బద్దతో ఫర్ ఫర్ నరుకుతూ వుండగా చూస్తూ వున్నా. అంతలో రామో నన్ను - తన చిన్ని రూములో నుంచి బయటకొచ్చి ‘ఇలారా’ అని సంకేతించారు. వెళ్లాను. (ముళ్లపూడి) రమణగారొచ్చారు. అదే నేను రమణని చూడటం. ‘ఈ కుర్రవాడు తెలుసుటోయ్? వీరాజీ.. ఒక అప్‌కమింగ్ రైటర్’ అని పరిచయం చేశారు. ‘ఆయ్. తెలుసు సార్- కాగితం మీద చూశా.. నేనొచ్చే ముందే బాపు ట్రైపాడ్‌కి డబుల్ స్ప్రెడ్ కాగితం గుచ్చి పెట్టుకున్నాడు ఈయన కథకి బొమ్మ వెయ్యాలని - ఏదో సత్యం.. కథకి బావి, చుట్టూ లతలూ వగైరా వేస్తున్నాడు. తనకి కథ నచ్చిందా? అట్లా పెట్టి మూడ్ రాగానే.. ఫినిష్ చేస్తాడు అంటూ చెప్పాడు రమణగారు. ఆయన సింప్లిసిటీ - ఆప్యాయత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. సదరు కథ పేరు సావిత్రి గ్రహించిన సత్యం. సెంటర్‌స్ప్రెడ్‌లో ఆంధ్ర పత్రిక వీక్లీలో అది పడ్డప్పుడు - నేల మీద కాస్సేపు నడవలేదు.
హైదరాబాదులో మే నెలలో జరిగిన అఖిల భారత తెలుగు రచయితల సభలు జేగీయమానంగా జరిగినప్పుడు (1960) అక్కడ పుస్తక ప్రదర్శనలో నా అచ్చు అయిన ఇంకా అచ్చు కావాల్సిన ఎదిగీ ఎదగని మనుషులు, విడివీడని చిక్కుల రాతప్రతులు పెట్టారు. ఈ కథ (బాపు బొమ్మ అద్భుతం కదా) పడ్డ వీక్లీ అవీ పెట్టారు. అప్పటికి మద్రాసు పేరు కూడా నా బుర్రలో లేదు. మహీధర వారికీ ఈ సభలను నిర్వహిస్తున్న పోతుకూచి వారు (ఆనక నా ఫ్రెండు హితులు కూడా అయ్యారు) కొన్ని రైల్వే కనె్సషన్ ఫారాలు కూడా పంపుతూ లెటర్ రాశారు. ‘నాతోనే ఉందువులే.. నినె్నవరూ ఎత్తుకుపోరు లేవోయ్.. యూనివర్సిటీ నుంచి యూనివర్స్ చూసేందుకు టైము వచ్చింది నీకు పద’ అని మా అమ్మని ఒప్పించి మరీ తీసుకుపోయారు. అదొక మరపురాని మహత్తర అనుభవం జ్ఞాపకం. ఆయన్ని అన్ని రకాల ‘రంగు’ల రచయితలూ ఎరుగుదురు. ఎనలేని గౌరవం కూడా అందరికీ. మొదట ఆయనతో కూడా వరంగల్‌కి తీసుకెళ్లారు. వాళ్ల చెల్లెలు సూర్యముఖిగారు హనుమకొండలో వున్నారు. అక్కడే బస. రామోహన్‌గారి అమ్మగారు నాన్నగారు కూడా (తండ్రిగారికి ఎనభై ప్లస్) వున్నారు - ఆయన బ్రహ్మ సమాజికుడు. అంచేతనే రామోహన్ జగన్మోహన్ సూర్యమోహన్నళిని మురళి మోహన్ అంటూ వాళ్లందరి పేర్లలోనూ మోహన్ వచ్చింది. వరంగల్ కన్నా ఎక్కువ హనుమకొండదే డామినేషన్. కాళోజీ (నారాయణరావు)గారు ఇవాళ తెలంగాణా ఐకాన్ - నాటికే ఆయన గొడవ (కవిత్వం) ‘పిచ్చి పాపులర్’. నాడు వారింటనే ఒక పుస్తకావిష్కరణకి మహీధర వెళ్తున్నారు. నేను ఆయన వెంట (తోకలాగా ఆలీస్ ఇన్ వండర్ ల్యాండ్లా) ‘మస్టూ’ కదా.. నేనాయన గెస్టుని కూడా. అక్కడ వీధులన్నీ చిన్న సైజు మిద్దెలతో వున్నాయి. ఆ దారంట వెళ్తున్న బైల్గాడి (ఎద్దుబండ్లు)ల చక్రాలు చిన్నవి. ఇది నవాబుల రాజ్యమోయ్.. జనాలు నవాబుగారిని తలెత్తి చూడాలి - నవాబులు తొంగిచూసి సలాములు అందుకోవాలి - ‘పెద్ద’ అన్న విశేషణం పేదజనాలకి లేదు అంతా, నీ బాంచన్ కాల్మొక్తాయే, చెప్పారు ‘ఓనమాల ‘రచయితా రథచక్రాల రామ్మోహన్‌గారు. కాళోజీ గారికి పరిచయం సారీ! నన్ను చూపెట్టారు.. నిన్నటిదాక డెంటు నేడు స్టూడెంటు జీవితానికి పుస్తక రూపమిచ్చిన కుర్రాడు అన్నారు. కాళోజీకి రాతిమేడ (నా నవల) కాపీ ఇచ్చినట్లు గుర్తు. కాళోజీ ఇలా చేరదీసుకుని అక్కున అదుముకొని పట్టుకొనే - అటు తిరిగి రామ్మోహన్ గారిని కుశలప్రశ్నలు వేశారు. బుక్ రిలీజ్ సభలో నన్నూ నిలబడి మాట్లాడమన్నారు. బయట చలిగా వున్నా లోన గొంతు ఎండిపోయింది. ఏదో మాటలు ‘గొణిగాను’. చప్పట్లు కొట్టి కూర్చోబెట్టేశారు. ఇది వీళ్ల విజయ సాహితీ లాంటి సభ అనుకున్నాను. అక్కడ మొదలి నాగభూషణ్ శర్మ - అప్పుడు తెలుగులో నవల మీద థీసిస్ రాస్తున్నారు. పరిచయం చేయబడ్డారు. తన పరిశోధనలో నా పేరు రచనా తీరు కూడా ఆయన చేర్చారు. నా సావిత్రి గ్రహించిన సత్యం కథ వీరాజీకి ఎన్నో లౌకిక సత్యాలు గ్రహించడానికి కొత్త బాటలు పరిచింది. ఊరంతా ఏదో చరిత్రలో నుంచి లేచి పలవరిస్తున్నట్లు నిద్రాణంగా వున్న ‘హనుమకొండ’ ఇమ్పేస్సివ్‌గా ఉంది. మరో మరపురాని అంశం. ఇక్కడ పరిచయం అయిన - మహిళల కాలేజీలో యువ లెక్చరర్‌గా పని చేస్తున్న - కుమారి సత్యవతి కొక్కండ (కరెక్టుగానే రాశానా? పేరు) అప్పటికే ఆమె రాధికాస్వాంతనం మీద పరిశోధనా వ్యాసం సబ్మిట్ చేసి సాహిత్య (ఆంధ్ర) అకాడెమీ అవార్డును మరొకరితో పంచుకున్నట్లు గుర్తు. తన కాలేజీలో మగాళ్లకి - దేవిడీమన్నా వుంది - అయినా రామ్మోహన్ గారన్న మాటలకు నవ్వేము. ‘అప్పుడే ఏం మగాడివోయ్ నువ్వూ? నీ సబ్జెక్టు కాలేజీ లైఫేగా.. పోయిరాండి. నాకు చిన్న పనులు రెండున్నాయి. చక్కబెట్టుకొస్తా.. అంటూ మమ్మల్ని పంపేశారు. ఆ సైడు అన్నీ కోటల్లాగా పెద్ద్భవంతుల్లోనే వుంటాయి కాబోలు - కాలేజీ పెద్ద భవనం. నన్ను వింతగా చూస్తున్నారు. నేనో తొలిమలుపు మహా రచయితని సుమా అన్నట్లు.. నావలిస్టుని సుమా అన్నట్లు, ధీమాగా ప్రతి విషయం తనని అడిగి తెలుసుకుంటూ నడిచా. అప్పటికి జర్నలిజం, పత్రికా వగైరాలేమీ ఈ బుర్రలో లేవు.. ప్రశ్నించి ప్రతీ విషయాన్ని తెలుసుకోవడం - సహజమై పోయింది. వాళ్ల ప్రిన్సిపాలమ్మ (పేరు నా తరం కాదు చెప్పడం) కూడా కవిత్వం రాస్తారు. అవి పత్రికలలో ఎలా పడతాయో చెప్పమంటారామె. వినక తప్పలేదు. యూనివర్సిటీ అమ్మాయిలకి ఈ చిన్న స్టూడెంట్స్‌కి ఎంత తేడా?
రామ్మోహన్‌గారు నేను సత్యవతి గారింట ఆమె ఒక్కరే (కాలేజీ జాబు కోసం వుంటున్నారు) ఆమె అతి కమ్మగా చేసి వండి పెట్టిన అటుకుల ‘పోహా’ మహా ప్రీతిగా తిన్నాం. అదేమిటో - నేనెరుగ - అడిగాను. ‘పోహా’.. అన్నదామె తలంపు పోసుకున్న ముంగురులు పైకెగిరేలాగా త్రోసుకుంటూ గట్టిగా.
ఎంత మాట అమ్మారుూ? ‘పోరా’ అంటావా? నీ వంటకానికి బోల్తా కొట్టిన కుర్రవాడ్ని? అంటూ నవ్వాడు సారూ. తనూ నవ్వేసి - సత్యవతి ‘పెద్దలు మీరు...లొద్దు... రేపటి మహా రచయిత కదా.. నా మీద రాసేస్తారు..’ ‘ఆహా’ అంటానే గాని ‘పో’తర్వాత ‘రా’ అంటానా? ఆడపిల్లలతో మాట్లాడటం కష్టం. ఇప్పటికీ, పోహా తింటూ వుంటే -నాకా సన్నివేశం కంటగడుతుంది. దొడ్డ మనసున్న ‘ఇంతి - ఆమె. (ఇంకా హైదరాబాదు వెళ్లాలి ఉంటా...)
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com