స్పాట్ లైట్

నువ్వా..నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్ రాజకీయాల్లో ఇదో చారిత్రక ఘటం. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికారు. తొలి రౌండ్‌లో విజేతలుగా నిలిచిన ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్, ఇమిగ్రేషన్ వ్యతిరేక లీపెన్‌లు మే 7న తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరిదీ భిన్నమైన ఆలోచనలు, విధానాలే!లీ పెన్ గెలిస్తే మరో లేడీ ట్రంప్‌కు ఫ్రాన్స్ పగ్గాలు అప్పగించినట్టే అవుతుందన్న భావన ఇప్పటికే బలంగా ఉంది. అలాగే ఇప్పటికే అనేక రకాలుగా సవాళ్లను ఎదుర్కొన్న ఐరోపా యూనియన్‌కు ఇది మరో విఘాతమే అవుతుందన్న భయమూ ఉంది. అందుకే ఇతర పార్టీలన్నీ మాక్రన్‌కు వంత పాడుతున్నాయి. తన పార్టీ విధానాల విషయంలో ఉన్న అపోహలను తొలగించేందుకు లీ పెన్ ‘తాత్కాలిక’సెలవు తీసుకోవడం కూడా ఆమె విజయావకాశాలను పెంచుకునే ప్రయత్నమే! ఇద్దరిలో ఎవరు విజయం సాధించినా ఇది ఫ్రాన్స్ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు సంకేతమే అవుతుంది.

ఫ్రాన్స్ రాజకీయాల్లో మార్పుల కెరటాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. తాజా అధ్యక్ష ఎన్నికల తీరు ఇందుకు అనేక కోణాల్లో అద్దం పడుతోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు ఐరోపా యూనియన్ భవితకు సవాలుగా పరిణమిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికిన ఫ్రాన్స్ ఓటర్లు తమదైన రీతిలోనే అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్‌లో ఫలితాన్నిచ్చారు. ఐరోపా యూనియన్ భవితవ్యం ఏమిటన్న పరిస్థితుల నేపథ్యంలో భిన్నమైన ఫలితానే్న కనబరిచారు. ఐరోపా యూనియన్‌కు అనుకూలంగా ఉన్న ఎమాన్యుయెల్ మాక్రన్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఫ్రంట్ నేషనల్ పార్టీ నాయకురాలు లీపెన్‌కు కొద్ది తేడాతో రెండోస్థానాన్ని కట్టబెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల్లో జరుగనున్న తుది అధ్యక్ష ఎన్నికల పోరులో వీరిద్దరూ ముఖాముఖీ తలపడబోతున్నారు. తాజా తీర్పు ద్వారా ఫ్రాన్స్ ప్రజలు సంప్రదాయ రాజకీయ పార్టీలను చావుదెబ్బతీశారు. దశాబ్దాలుగా అధికాకారాన్ని పంచుకుంటూ వచ్చిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మొదటి రౌండ్‌లోనే చెల్లాచెదురు కావడం అన్నది గత ఆరు దశాబ్దాల్లో చోటుచేసుకున్న తొలి పరిణామం. 1958 నుంచీ ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ రకమైన పరిస్థితి తలెత్తలేదు. తొలి ఎన్నికలో మొదటి స్థానాన్ని గెలుచుకున్న మాక్రన్‌కు క్రమంగా బలం పెరుగుతోంది. దేశ మాజీ అధ్యక్షుడు హోలాండో కూడా ఆయనే్న బలపరచడంతో లీపెన్‌కు తుది విజయం అంత తేలిగ్గా దక్కే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద ఫ్రాన్స్‌ను ఇనే్నళ్లుగా శాసించిన సంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా ప్రజలు అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్‌లో ఇచ్చిన తీర్పు రానున్న రోజుల్లో చోటుచేసుకోబోతున్న విస్తృత రాజకీయ, పాలనాపరమైన మార్పులకు సంకేతమే! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద విధానాలను తెరపైకి తెచ్చి జనం మద్దతు పొంది శే్వత సౌధాన్ని సొంతం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ తరహాలోనే లీ పెన్ తన ఆలోచనలను, విధానాలను ఆవిష్కరించారు. ఇప్పుడు దేశాధ్యక్ష పదవి ఆమెనే వరిస్తే ఫ్రాన్స్‌లో కల్లోల పరిస్థితులు తలెత్తడం ఖాయం. ఇప్పటికే ఫ్రంట్ నేషనల్ పార్టీ నుంచి తాత్కాలిక సెలవు తీసుకున్న పెన్ తన విధానాలను మరింతగా ప్రచారంలోకి తేవడానికి సిద్ధమవుతున్నారు. అంటే తొలిరౌండ్‌లో తనకు రెండో స్థానం దక్కింది అతి స్వల్ప తేడాతోనే కాబట్టి జనంలోకి వెళితే అధ్యక్ష పదవి తనదేనన్న ధీమా లీ పెన్‌లో కనిపిస్తోంది. అందుకే ఫ్రంట్ నేషనల్ పార్టీ నుంచి ఆమె వ్యూహాత్మకంగా తప్పుకుని తన వ్యక్తిగత ఆలోచనలు, విధానాలతోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీపై ప్రజల్లో ఉన్న ప్రతికూల భావనలను తొలగించేందుకు ఇప్పటికే గట్టి ప్రయత్నం చేసిన లీ పెన్ ఆ విధంగా కొంత మేర సానుకూల ఓటును సంపాదించుకోగలిగారు. పైగా, దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రంట్ నేషనల్ పార్టీకి రెండో స్థానం దక్కడం అన్నది కూడా చారిత్రక పరిణామమే.మరి మాక్రన్ ఏ వ్యూహంతో ముందుకెళతారు..ఐరోపా యూనియన్ అనుకూల విధానాలతో ప్రజలను ఏ విధంగా తనవైపు తిప్పుకుంటారన్నది కూడా ఉత్కంఠ రేకెత్తించేదే! తన వ్యక్తిగత విధానాల బలంతోనే ఫ్రాన్స్ ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న లీపెన్ ఇటీవలి కాలంలో జరిగిన ఉగ్రవాద సంఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో మాక్రన్‌ది మెతక వైఖరి అని, ఆయన అధ్యక్ష పదవిని చేపడితే ఫ్రాన్స్ మరింత బలహీన పడుతుందన్న లీపెన్ వాదనను దేశ ప్రజలు ఎంత మేరకు అంగీకరిస్తారన్నది రానున్న ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ముఖ్యంగా నిఘా వర్గాలు దృష్టి పెట్టిన విదేశీయులందరినీ దేశం నుంచి పంపేస్తానని, కొన్ని వివాదాస్పద ఐరోపా యూనియన్ ఒప్పందాల్నీ నిలిపివేస్తానన్న లీపెన్ వాదన ఇతర పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. అందుకే ఆమెకు అధ్యక్ష పీఠం దక్కకుండా అన్ని పార్టీలు చేతులు కలుపుతున్నాయి. మే 7న జరిగే తుది రౌండ్ ఫ్రాన్స్ రాజకీయాల స్వభావానే్న మార్చేస్తుందా లేక మాక్రన్‌కే పట్టం కట్టడం ద్వారా యథాతధ స్థితిని కొనసాగిస్తుందా అన్నది కూడా ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

-బి.రాజేశ్వరప్రసాద్