క్రీడాభూమి

బాంబు శబ్దం వెంటాడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో సెంటినియల్ పార్క్‌లో బాంబు పేలిన సంఘటన తనకు జీవితాంతం గుర్తిండి పోతుందని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాంర్ పేస్ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ జర్నలిస్టులు దిగ్విజయ్ సింగ్ దేవ్, అమిత్ బోస్‌తో కలిసి రాసిన తాజా పుస్తకం ‘మై ఒలింపిక్ జర్నీ’లో పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్ అనుభవాలను ప్రస్తావించాడు. ఆ సంఘటన తనలో పట్టుదలను పెంచిందని, ఆటపై మరింత దృష్టిని కేంద్రీకరించడానికి కారణమైందని పేస్ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొననున్న పేస్ అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి, 1952 తర్వాత భారత్‌కు ఒక ఇండివిజువల్ ఈవెంట్‌లో పతకాన్ని అందించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అతను సెంటినియల్ పార్క్‌కు వెళ్లాడు. ఆ సంఘటనను వివరిస్తూ ‘మేము కూర్చున్న ప్రదేశానికి సుమారు 40 నుంచి 50 అడుగుల దూరంలో బాంబు పేలింది. ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. బాంబు ధాటికి ఆ ప్రాంతమంతా కంపించింది. కుర్చీలు, టేబుళ్లు గాల్లో ఎగిరాయి. బాంబు పేలుడు శబ్దం నా చెవులను బద్ధలు చేశాయి. ఇరవై నాలుగు గంటలపాటు ఆ శబ్దం నన్ను వెంటాడుతునే ఉంది’ అని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులంతా స్వదేశానికి తిరుగు ప్రయాణంకాగా, తాను పార్క్ నుంచి క్రీడా గ్రామానికి వెళ్లానని, అయితే అక్కడి గార్డులు తనను లోనికి అనుమతించలేదని గుర్తుచేసుకున్నాడు. ‘నేను క్రీడా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడి గార్డులు నన్ను అడ్డుకున్నారు. నేను ఒలింపిక్స్‌లో ఆడుతున్నానని, లోనికి వెళ్లాలని వారిని ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తాము ఎవరినీ లోనికి అనుమతించడం లేదని వాళ్లు స్పష్టం చేశారు. అయితే, కొంత దూరంలో ఉన్న మరో గేటు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. నేను వెంటనే రెండో గేటు వద్దకు పరిగెత్తాను. కానీ, అక్కడ కూడా నాకు అదే అనుభవం ఎదురైంది. ఆ విధంగా సుమారు 20 నిమిషాలు నేను ఒక గేట్ నుంచి మరో గేట్‌కు పరుగులు తీస్తునే ఉన్నాను. ఐదో గేటు వద్ద ఉన్న ఓ గార్డు నా బాధను అర్థం చేసుకున్నాడు. నేను ఎంతో ప్రాధేయపడిన తర్వాత అతను లోనికి అనుమతించాడు. ఎంతో కష్టం మీద నేను క్రీడా గ్రామంలోకి వెళ్లగలిగాను’ అంటూ ఆనాటి సంఘటనను పుస్తకంలో వివరించాడు. బాంబు పేలుడు సంఘటనను అత్యంత సమీపం నుంచి చూడడంతో తనలో పట్టుదల పెరిగిందని, ఇంకా ఎక్కువగా ఆటపై దృష్టి కేంద్రీకరించానని తెలిపాడు. సెమీ ఫైనల్‌లో అండ్రీ అగస్సీని ఓడిస్తాననే అనుకున్నానని, కానీ, ఆ మ్యాచ్‌లో ఓటమి ఎదురైందని తెలిపాడు. మూడో స్థానానికి జరిగిన పోరులో బ్రెజిల్ ఆటగాడు ఫెర్నాండో మెలిగెనీని ఓడించినప్పుడు చెప్పలేని గొప్ప అనుభూతికి లోనయ్యానని పేస్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. క్రీడా గ్రామంలో ప్రతి ఒక్కరూ తనను అభినందించారని, తాను సాధించిన కాంస్య పతకాన్ని మెడ నుంచి సుమారు రెండు మూడు రోజులు తీయలేదని గుర్తుచేసుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ పతకం లభిస్తుందని అనుకున్నప్పటికీ, తృటిలో ఆ అవకాశం చేజారిందని తెలిపాడు. రియో ఒలింపిక్స్‌లో రోహన్ బొపన్నతో కలిసి పేస్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో పోటీపడుతున్న విషయం తెలిసిందే.

చిత్రం లియాండర్ పేస్