క్రీడాభూమి

రియోకు అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 1: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు రష్యా పోల్‌వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా దరఖాస్తు చేసుకుంది. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదన్న కారణంగా రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆ దేశానికి చెందిన అథ్లెట్లు ఐఒసి పతాకం కింద పోటీపడాల్సి ఉంటుంది. రష్యాపై సస్పెన్షన్ విధించడాన్ని అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో 34 ఏళ్ల ఇసిన్బయేవా ఇప్పటికే సవాలు చేసింది. రష్యా అథ్లెట్లు అందరినీ డోపింగ్ దోషులుగానే చూస్తున్నారని వాపోతున్న ఆమె అది తప్పుడు అభిప్రాయమని స్పష్టం చేయడానికే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ఆమె ఖాతాలో ఒలింపిక్ రికార్డుతోపాటు ప్రపంచ రికార్డు కూడా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఇసిన్బయేవా కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఇలావుంటే, సస్పెన్షన్ కొనసాగుతున్న కారణంగా 67 మంది అథ్లెట్లు వ్యక్తిగత హోదాలో ఐఎఎఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటారని రష్యా క్రీడా శాఖ మంత్రి విటాలీ ముట్కో ప్రకటించాడు.

2024 ఒలింపిక్స్‌లో
క్రికెట్‌కు స్థానం!

ఇటలీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గాంబినో హామీ

ఎడిన్‌బరో, జూలై 1: ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పిస్తామని ఇటలీ క్రికెట్ బోర్డు (ఎఫ్‌సిఐ) అధ్యక్షుడు సిమోన్ గాంబినో హామీ ఇచ్చాడు. 2024లో ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి ఇటలీ పోటీపడుతున్న విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వార్షిక సమావేశంలో పాల్గొన్న అతను గుర్తుచేశాడు. ఒకవేళ రోమ్‌కు ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశం దక్కితే క్రికెట్‌ను ఒక క్రీడాంశంగా చేరుస్తామని అన్నాడు. ఈ విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 2010 ప్రపంచ క్రికెట్ లీగ్ డివిజన్ పోటీల్లో నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బొలోన్గానే ఒలింపిక్స్ క్రికెట్‌కు కూడా వేదికవుతుందని అన్నాడు.
యుఎస్‌ఎసిఎపై సస్పెన్షన్
యుఎస్‌ఎసిఎపై నిషేధాన్ని విధించాలన్న ప్రతిపాదనను ఐసిసి వార్షిక సమావేశం ఆమోదించింది. అదే విధంగా నేపాల్ క్రికెట్ సంఘం (సిఎఎన్)పైనా నిషేధాన్ని కొనసాగించాలని తీర్మానించింది. సస్పెన్షన్‌కు గురైన దేశాల్లో త్వరలోనే ఐసిసి ప్రతినిధి బృందం పర్యటించాలని నిర్ణయించారు. సౌదీ అరేబియాను 39వ అనుబంధ దేశంగా చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను అభివృద్ధి చేయాలని తీర్మానించారు. అందుకు అవసరమైన చర్య లు తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న స భ్యులు అభిప్రాయపడ్డారు. అందరి సహాయసహకారాలతో క్రికెట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయంచారు.

రికార్డు గేమ్‌కు
గుర్‌ప్రీత్ సిద్ధం

యూరోపా లీగ్‌లో మ్యాచ్ ఆడనున్న భారత ఫుట్‌బాలర్

న్యూఢిల్లీ, జూలై 1: భారత ఫుట్‌బాలర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు యూరోపియన్ సాకర్‌లో రికార్డు గేమ్‌కు సిద్ధమవుతున్నాడు. భారత్ తరఫున యూరోప్ ఫుట్‌బాల్‌లో ఒక మ్యాచ్ ఆడిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నాడు. ఆరు అడుగుల, నాలుగు అంగుళాల పొడవుతో ప్రత్యేకంగా కనిపించే భారత జాతీయ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ 2014లోనే యూరోపియన్ సాకర్ క్లబ్ స్టాబెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిరుడు మొదటిసారి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆడాడు. ఆతర్వాత క్లబ్ తరఫున మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైనప్పటికీ చేతి గాయం కారణంగా బరిలోకి దిగలేకపోయాడు. సుమారు ఏడాది పాటు ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది. యూరోపా లీగ్‌లో అతను స్టాబెక్ తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు బయలుదేరి వెళ్లాడు. భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు మహమ్మద్ సలీం, బైచుంగ్ భుటియా, సునీల్ చత్రీ, సుబ్రతా పాల్ గతంలో యూరోప్ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించారు. అయితే, వారిలో ఎవరూ తమతమ క్లబ్‌ల తరఫున మ్యాచ్‌లు ఆడలేదు. మొట్టమొదటిసారి గుర్‌ప్రీత్ యూరోప్‌లో ఒక టోర్నీలో మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. యురో 2016 తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన యూరోపా లీగ్ టోర్నీలో అతను బరిలోకి దిగుతాడు.

హోరాహోరీలో యు ముంబా గెలుపు

జైపూర్, జూలై 1: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై యు ముంబా జట్టు రెండు పాయంట్ల తేడాతో గెలిచింది. ఈ జట్టు 27 పాయంట్లు సాధించగా, ఢిల్లీ 25 పాయంట్లు చేసింది. యు ముంబా తరఫున రిషాంక్ దేవాదిగ ఎనిమిది పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సురేందర్ సింగ్, అ నూప్ కుమార్, రాకేష్ కుమార్, సుశీల్ కుమార్ తలా మూడేసి పాయంట్లు సాధించారు. ఢిల్లీ కెప్టెన్ కషిలింగ్ అడాకే ఏడు పాయంట్లతో రాణించాడు.
జైపూర్ విజయం: బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 36-33 పాయంట్ల తేడాతో విజయం సాధించింది.

ఆరు దేశాల హాకీ
కివీస్ చేతిలో భారత్ ఓటమి

వలెన్షియా, జూలై 1: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 0-1 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ 18వ నిమిషంలో స్టెఫెన్ జెనెస్ చేసిన గోల్‌తో ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్ ఆతర్వాత పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైంది. గోల్స్‌ను సాధించేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వ్యూహాత్మకంగా ఆడిన కివీస్ విజయాన్ని సాధించగా, శనివారం నాటి మ్యాచ్‌లో అర్జెంటీనాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో జర్మనీని ఢీకొన్న భారత్ 0-4 తేడాతో ఓడింది. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌ని చేజార్చుకొని, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.