క్రీడాభూమి

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపిన గేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రినిడాడ్, జూలై 5: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో జమైకా తల్లావాస్ జట్టు కెప్టెన్ క్రిస్ గేల్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించి 54 బంతుల్లో అజేయంగా 108 పరుగులు సాధించి టి-20 ఫార్మాట్‌లో 18వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో జమైకా తల్లావాస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన జమైకా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన ట్రిన్బాగో జట్టులో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (52 బంతుల్లో 74 పరుగులు) సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు బ్రెండన్ మెక్‌కలమ్ (18 బంతుల్లో 35), కోలిన్ మన్రో (39 బంతుల్లో 55) చక్కగా రాణించారు. చివర్లో జావోన్ స్కాంటల్బరీ 8 పరగులు సాధించి రనౌట్‌గా నిష్క్రమించగా, కెప్టెన్ డ్వెన్ బ్రావో (8 బంతుల్లో 10 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన జమైకా జట్టులో ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ (19 బంతుల్లో 13)తో పాటు వికెట్ కీపర్ కుమార సంగక్కర (14 బంతుల్లో 20) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేరినప్పటికీ కెప్టెన్ క్రిస్ గేల్ బ్యాట్ ఝళిపించి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఎడాపెడా షాట్లతో తనదైన శైలిలో దూకుడుగా ఆడిన అతను ఆండ్రూ రస్సెల్ (18 బంతుల్లో 24)తో కలసి మూడో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో పాటు రోవ్మన్ పావెల్ (6 బంతుల్లో 12)తో కలసి మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో 18.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించిన జమైకా జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండాగనే 7 వికెట్ల తేడాతో సునాయాసంగా ట్రిన్బాగో జట్టును మట్టికరిపించింది. అజేయ శతకంతో దుమ్ము రేపడంతో పాటు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జమైకా జట్టును గెలిపించిన క్రిస్ గేల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
సంక్షిప్తంగా స్కోర్లు
ట్రిన్బాగో ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 191/4 (హషీమ్ ఆమ్లా 74, బ్రెండన్ మెక్‌కలమ్ 35, కోలిన్ మన్రో 55, డ్వెన్ బ్రావో 10-నాటౌట్, ఇమద్ వాసిం 1/18, డేల్ స్టెయిన్ 1/56, కెస్రిక్ విలియమ్స్ 1/34)
వికెట్ల పతనం: 1-49, 2-152, 3-180, 4-191.
జమైకా ఇన్నింగ్స్: 18.2 ఓవర్లలో 192/3 (క్రిస్ గేల్ 108-నాటౌట్, వాల్టన్ 13, కుమార సంగక్కర 20, ఆండ్రూ రస్సెల్ 24, రోవ్మన్ పావెల్ 12-నాటౌట్, సునీల్ నరైన్ 1/9, డ్వెన్ బ్రావో 1/35). వికెట్ల పతనం: 1-29, 2-69, 3-177.

చిత్రం.. క్రిస్ గేల్ 108-నాటౌట్